
శరవేగంగా పరుగులు తీసే గుర్రాలను అధిరోహించి, ఒకరిపై మరొకరు ఈటెలతో కలబడే ఆ దృశ్యాన్ని చూస్తే, అక్కడేదో యుద్ధం జరుగుతోందని ఎవరైనా పొరబడతారు. నిజానికి అది యుద్ధంకాదు, అక్కడి ప్రజలు జరుపుకొనే సంప్రదాయ పర్వదినం. ఇండోనేసియా తూర్పు ప్రాంతంలోని సుంబా దీవిలో జరిగే ఈ పండుగ పేరు ‘పసోలా’. ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ పండుగను పంటకాలానికి ప్రారంభ సూచికగా జరుపుకొంటారు.
పూర్వీకుల ఆత్మశాంతి కోసం, కుటుంబాల మధ్య అనుబంధాలను బలపరచుకోవడానికి, మూలాలను కాపాడుకోవడానికి ఈ పండుగ ఒక మార్గమని స్థానికులు చెబుతారు. ఈ పండుగలో ముఖ్యమైన ఘట్టం ఈటెల పోటీ. సత్తా ఉన్నవారంతా బరిలోకి దిగి, గుర్రాల మీద స్వారీ చేస్తూ, ప్రత్యర్థులతో కలబడతారు. ఎదురుగా దూసుకొచ్చే ఈటెలను తప్పుకోవడం ఒక ఎత్తయితే, గురిచూసి ఎదుటివారిని దెబ్బతీయడం మరో ఎత్తు. యుద్ధాన్ని తలపించే ఈ పోటీల్లో చాలామందికి గాయాలవుతుంటాయి.
పసోలా అనే పదానికి సుంబా స్థానిక భాషల్లో ‘ఈటె విసరడం’ అని అర్థం. ఈ పోటీల్లో వినియోగించే ఈటెలను ‘హోలా’ అని పిలుస్తారు. ఈ పండుగ వెనుక పురాతన చరిత్ర ఉంది. స్థానిక పురాణాల ప్రకారం, పసోలా పండుగ ఆకాశంలో ఒకరితో ఒకరు పోరాడిన రెండు శక్తిమంతమైన ఆత్మల కథ నుంచి మొదలైందట! ఆ ఆత్మల సంఘర్షణ ఫలితంగా భూమిపై ఈటెల వర్షం కురిసిందట!.
ఈ పౌరాణిక గాథ ప్రేరణతోనే ఈ పండుగ ప్రారంభమైంది. ఈ వేడుక కోసం గుర్రాలను పెంచడాన్ని గౌరవంగా, హోదాచిహ్నంగా భావిస్తుంటారు. పనికట్టుకుని ఈ పోటీలో పాల్గొనే పోటీదారులు తమ గుర్రాలను తామే పెంచుకుని, రోజుల తరబడి సాధన చేసి మరీ బరిలోకి దిగుతుంటారు. ఈ పోటీని చూడటానికి పెద్దసంఖ్యలో పర్యటకులు కూడా పోటెత్తుతారు.
అడుగుపెడితే శిలైపోతారు
భూమిపై ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఉత్తర టాంజానియాలో ఉండే నాట్రాన్ సరస్సు ఒకటి. ఇందులోని నీరు నెత్తుటిలా ఎర్రగా ఉంటుంది. సరస్సంతా నెత్తుటి మడుగులా కనిపిస్తుంది. ఈ సరస్సును దయ్యాలు సృష్టించాయని, ఆ సరస్సులోకి మనుషులు గాని, జంతువులు గాని దిగితే, రాళ్లుగా మారిపోతారని స్థానికులు చెబుతుంటారు.
అందుకే, సూర్యాస్తమయం తర్వాత ఎవరూ అక్కడ తిరగడానికి సాహసించరు. శాస్త్రవేత్తలు ఈ సరస్సును పరిశీలించి, ఈ సరస్సు నీటిలో సోడియం కార్బొనేట్, నైట్రో కార్బొనేట్ ఎక్కువగా ఉండటంతో, ఇందులోని నీరు ప్రాణాంతకంగా మారిందని తేల్చారు. ఈ సరస్సులోకి మనుషులు సహా ప్రాణులేవైనా వెళ్తే, ఇలా రాళ్లలా గడ్డకట్టిపోవడానికి గల కారణాలను మాత్రం శాస్త్రవేత్తలు ఇంకా కనిపెట్టలేకపోయారు.
(చదవండి: గిన్నిస్‌కెక్కిన మహిళల వేడుక..!)
Comments
Please login to add a commentAdd a comment