
పచ్చని తోరణాలు.. షడ్రుచుల ఆస్వాదన.. సంప్రదాయ వస్త్రధారణ ఉగాదికి స్వాగతం పలుకుతూ కొత్త ఉత్సాహాన్ని మదికి మోసుకువస్తాయి. చేనేత చీరలు, ఎంబ్రాయిడరీ సొగసులు వాటి రంగుల హంగులు ప్రకృతి పరవశించేలా పండగకు మరింత శోభను తీసుకువస్తాయి. ముఖ్యంగా పసుపు, ఆరెంజ్, ఆకుపచ్చ, ఎరుపు రంగులు పండగ కళను రెట్టింపుగా మన కళ్లకు కడతాయి.
చేనేత కళ
పండగ నాడు కళను రెట్టింపు చేసే అలంకరణకు ప్రాముఖ్యత ఇస్తుంటారు. అయితే, అందుకు పెద్ద హడావిడి లేకుండా మనవైన చేనేతలలో కాంతిమంతమైన రంగులున్న చీరలను ఎంపిక చేసుకోవచ్చు. వీటిలో కంచిపట్టు చీరల నుంచి కలనేత వరకు అన్నీ పండగను వెలిగించేవే.
సహజమైన రంగులు
ప్రకృతి నేపధ్యంగా ఉగాది జరుపుకుంటారు కాబట్టి పసుపు, ఆకుపచ్చ, నారింజ, ఎరుపు రంగుల కాటన్, తెలుపు, ఎరుపు కాంబినేషన్, పింక్ కలర్ టస్సర్, సిల్క్ చీరలు ప్రత్యేక ఆకర్షణతో ఆకట్టుకుంటాయి.
డిజైన్లు
చెక్స్, లైన్స్‌తో ఉన్న డిజైన్లు, మెరుపులు లేకుండా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్, సహజంగా అనిపించే పెయింటింగ్స్ ఈ పండగకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
ఇతర అలంకరణలు..
చీరలకు లాంగ్ స్లీవ్స్ బ్లౌజులు, టెంపుల్ జ్యువెలరీ లేదా థ్రెడ్, టెర్రకోట జ్యువెలరీ బాగుంటాయి.
పసుపు, ఎరుపు కాంబినేషన్ ప్లెయిన్ గాజులు, సహజంగా అనిపించేలా తక్కువ మేకప్ ప్రత్యేకతను చూపుతుంది.
శిరోజాల అలంకరణలో జడ, కొప్పులు, పువ్వులకు ప్రాధాన్యమిస్తే పండగ ప్రకృతి కళతో ఆకట్టుకుంటుంది.