'ఊరికి బంధువులొస్తున్నారు'.. కానుకలతో కాచుకోండి..! | Sankranti Is A Colorful Festival Of Joy | Sakshi
Sakshi News home page

'ఊరికి బంధువులొస్తున్నారు'.. కానుకలతో కాచుకోండి..!

Published Sat, Jan 13 2024 1:34 PM | Last Updated on Sat, Jan 13 2024 2:03 PM

Sankranti Is A Colorful Festival Of Joy - Sakshi

'సంక్రాంతి పండగ వస్తే ఊర్లోకి పాత బంధువులొస్తారు. పండిన పంట నుంచి హక్కుగా తమ భాగం తీసుకుపోతారు. హరిదాసులు, గంగిరెద్దుల వారు, కొమ్మదాసరులు, జంగం దేవరలు, పిట్టల దొరలు, గారడీ వాళ్లు.. వీరందరికీ సంక్రాంతి వస్తే సంవత్సరానికి సరిపడా సాయం. సాటివారికి సాయం చేయడమే సంక్రాంతి'.

సంక్రాంతి అనగానే ఊళ్లోకి బంధువులే కాదు డూడూ బసవన్నలు కూడా వస్తారు. సంక్రాంతి అంటే తిని, తేన్చి, సంబరాలు చేసుకునే పండగ మాత్రమే కాదు... రైతు సౌభాగ్యానికీ పల్లె సౌభాగ్యానికీ సహకారం అందించిన అన్ని వర్గాల వారికీ పంపకాలు చేసే పండగ కూడా. సంక్రాంతి పండగ సమయంలో ఇంటికి పుట్ల కొద్దీ చేరిన ధాన్యం నుంచి రైతు తనకు సేవ చేసిన, సాయం చేసిన వర్గాల వారికి భాగం ఇస్తాడు. ‘మేర’ పంచుతాడు. పాలేర్లకి, సేద్యగాళ్లకి. పనివాళ్లకి వడ్లు పోస్తాడు. కొందరికి కొత్తబట్టలు పెడతాడు. అయితే వీరు కాకుండా ఊరి మీద హక్కుగా తమ వాటా కోసం వచ్చే సంప్రదాయ వృత్తికళకారులు వచ్చి ఊరిలో ఆడి, పాడి వినోదం పంచి తమ వడ్లు మూట గట్టుకుని పోతారు.

శ్రీమద్రమా రమణ...
‘సద్గురుని కృపచే తారతమ్యము తరచి గనుమన్నా.. ధరణి లోపల మూఢమతులకు దొరుకుటకు బహు దుర్లభమ్మిది’.. అని పాడుతూ గురు కటాక్షం వలనే భక్తిని, ముక్తిని చేరుకోవాలని బోధిస్తూ వీధివీధిన తిరుగుతూ సంక్రాంతి శోభను తెస్తాడు హరిదాసు. పండగ రోజుల్లో దానికి ముందు ధనుర్మాసంలో హరిదాసు తిరగని ఊరు, వీధి ఎంతో బోసిపోతాయి. నెత్తిన అక్షయపాత్ర, భుజాన తంబూర, చేతిలో చిడతలతో ‘శ్రీమద్రమా రమణ గోవిందా’ అంటూ భిక్ష స్వీకరించా ‘కృష్ణార్పణం’ అంటూ మనం సంపాదించిన దానిలో కొంత పేదలకు అర్పణం చేయడం ద్వారా దేవునికి సమర్పణం చేసిన పుణ్యం పొందాలని సూచిస్తాడు హరిదాసు. ఒకప్పుడు పల్లెల్లో ప్రతి వీధి వాకిట్లో హరిదాసు కోసం గృహిణులు కాచుకుని ఉండేవారు. ఇప్పుడు పై అంతస్తుల్లో, అపార్ట్‌మెంట్‌ బాల్కనీల్లో నుంచి చూస్తూ కిందకు దిగడానికి బద్దకిస్తున్నారు. హరిదాసు అక్షయ΄ాత్రలో జారవిడిచే కాసిన్ని బియ్యం మన ఇంటి సంపదను అక్షయపాత్రగా మారుస్తాయి.

డూడూ బసవన్నలు
‘గంగిరెద్దులా తల ఊపకు’ అని అంటారు గాని దైవచిత్తానికి తల ఊపుతూ భారం అంతా నీదే అనుకోవడానికి మించిన వేరే సుఖం ఏముంటుంది? డూడూలు కొట్టే బసవన్నను యజమాని ముద్దుగా చూసుకున్నట్టే జీవుణ్ణి దేవుడు ముద్దుగా చూసుకుంటారు. గంగిరెద్దులు ఇంటి ముందుకొచ్చి సన్నాయి పాట వినిపిస్తే ఆ కళే వేరు. రంగు రంగుల పాతబట్టలు ఇస్తే అవి బసవడి మూపురం మీదకు చేరుతాయి. కాసులిస్తే గంగిరెద్దులవాడి నల్లకోటు జేబులో చేరుతాయి. కాసిన్ని డబ్బులు ఎక్కువిస్తే గంగిరెద్దులు విన్యాసం చేస్తాయి. యజమాని ఛాతీ మీద సుతారంగా గిట్టలు ఆడిస్తాయి.

బుడబుడలు... కొమ్మదాసరులు
‘అంబ పలుకు జగదంబ పలుకు’ అంటూ డమరుకం వాయిస్తూ బుడబుక్కల వాళ్ళు వస్తారు సంక్రాంతికి. తలపాగా, కోటు, గొడుగు చేతబూని శుభాల భవిష్యత్తును చెబుతూ భిక్ష స్వీకరిస్తారు. వారు వేగంగా వాయించే డమరుకం గొప్ప శబ్ద విన్యాసం సృష్టిస్తుంది. వీరికి డబ్బు. వడ్లు, పాతబట్టలు ఇవ్వాల్సిందే. ఇక ఊరికి ఒకప్పుడు కొమ్మదాసరులు వచ్చేవారు. వీరు ఊరి మధ్యలోని చెట్టు కొమ్మెక్కి కూచుని కింద గుడ్డ పరిచి వచ్చేపోయేవారి మీద వ్యాఖ్యానం వినిపిస్తుండేవారు. తగిన సొమ్ము ముట్టజెప్తేనే దిగేవారు. కొయ్య తుపాకీతో పిట్టల దొరలు వస్తారు పెద్ద పెద్ద వాళ్లతో కలిసి తిరగాలనుకునే సామాన్యుడి కలలకు మాటల మలాం పూస్తారు.

‘మేము స్నానం చేసిన సబ్బు నీళ్లతో పేద దేశాల వాళ్లు డ్యాములు కట్టుకున్నారు’ అంటారు. ‘మా ఇంట్లో కేజీ బంగారం కుక్క నాకిందని చెత్తకుప్పలో పడేశాం’ అంటారు. ‘మోదీ గారు పిలిచి పాకిస్తాన్‌ మీద యుద్ధానికి పొమ్మని ఆర్రూపాయలు అడ్మాన్సు ఇచ్చారు’ అంటారు. దుబాయ్‌ షేకుతో టిఫిని తిని అమెరికా ప్రెసిడెంట్‌తో లంచ్‌కు కూచోపోబోతున్నాం అంటారు. తర్వాత శంఖం ఊదుతూ జంగం దేవరలు వస్తారు. గారడీ వాళ్లు, కనికట్టు ప్రదర్శించేవాళ్లు.. వరుస కడతారు. రైతు ఎవరినీ కాదనడు. అందరినీ ఆదరిస్తాడు.

ఇక సాయంత్రమైతే ఊళ్లో పాట కచేరీలు, డాన్సు ప్రోగ్రాములు ఉంటాయి. రకరకాల కళాకారులు దిగుతారు. సినిమా నాటకాలు ఒకప్పుడు వేసేవారు. సినిమాలు కూడా వేసేవారు. సంక్రాంతి సందేశం... సామూహిక ఉత్సవం. జీవితం సాటి మనుషులతో కలిసి మెలిసి సాగాలని చెప్తుంది. ఉన్నది పంచుకుని తినాలని చెప్తుంది. శ్రమ చేసి సమృద్ధితో జీవించమని చెబుతుంది. నలుగురూ కలిసి ప్రకృతి వనరులను ఫలవంతం చేసుకుని నలుగురూ వృద్ధి కావాలని కోరడమే సంక్రాంతి.
 

ఇవి చదవండి: Makar Sankranti 2024: పతంగులు ఎందుకు ఎగురవేస్తారో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement