రామలక్ష్మి సిగ్గుపడింది.. ఎందుకో? | Pongal 2024 special story by writer Gandhi on Sankranthi festival | Sakshi
Sakshi News home page

Pongal 2024: రామలక్ష్మి సిగ్గుపడింది, ఎందుకో?

Published Thu, Jan 11 2024 3:27 PM | Last Updated on Sun, Jan 14 2024 9:57 AM

Pongal 2024 special story by writer Gandhi on Sankranthi festival - Sakshi

పండక్కి తాతగారి ఊరికొచ్చిన రామలక్ష్మి పెరట్లో ఒక్కో పువ్వూ తెంచి వోనీలో వేసుకుంటోంది.  చూడమ్మీ ముల్లు గుచ్ఛీగలవు అన్నాడు అప్పుడే వచ్చిన నాగరాజు. మీ ఊళ్ళో మందారాలకు కూడా ముళ్లుంతా యేటి అంది కొంటెగా చూస్తూ... చెస్.. గుంటకు పోత్రం తగ్గలేదు అని మనసులో అనుకుంటూనే ఎప్పుడొచ్చినారు... ఏటి సేత్తన్నావు అన్నాడు. బీఎస్సి నర్సింగ్ అయింది.. ఎసోదాలో చేస్తన్నా అంది.. మరి నన్నేం అడగవా అన్నాడు నాగరాజు.. అడగక్కర్లే మందారాలకు ముల్లుంతాయని అన్నావంతే నువ్వు బీకామ్ ఫిజిక్స్ అని అర్థమైంది అంది మళ్ళీ ... దీనికి ఐడ్రాబాడ్ ఎళ్ళింతర్వాత తెలివెక్కువైంది అనుకుంటుండగానే ఎవుల్తోనే మాటలూ అంటూ తల్లి నాగమణి వచ్చింది.

ఎవులో తెలీదే అమ్మా అంది రామలక్ష్మి.. అంతలోనే నాగరాజును చూస్తూ... ఒరే నువ్వా నాగీ ఎలాగున్నావు.. యేటి సేత్తన్నావు అంది... దీంతో వీడికి కాస్త మద్దతు దొరికినట్లై.. బాప్పా బాగున్నా.. మొన్నే వచ్చినాం.. ఇజివాడలో ఉంతన్నాం ... నన్ను బీకామ్ సేసి రొయ్యల కంపినీలో మేనేజరుగా చేస్తన్ను అన్నాడు గర్వంగా.. ఇంతలో రామలక్ష్మి వచ్చి... అమ్మా ఎవరి అంది కళ్ళతోనే... చిన్నప్పుడు గొర్రిపిల్ల తగిలికొస్తే కోలగూట్లో దాగుందామని దూరిపోయి అందులో ఉన్న పిల్లల బేపికి దొరికిపోనాడని అప్పుడు చెప్పినాను కదా... ఆడే ఈడు అంది నాగమణి..

పాపం నాగరాజు మళ్ళీ దెబ్బతినేశాడు.. సెండాలం.. ఇంత సెండాలం ఇంట్రడక్షన్ ఏందీ అనుకుంటూనే రామలక్ష్మిని చూశాడు.. కళ్ళతోనే నవ్వింది.. సరే బాప్పా వెళ్తాను అని కదిలి ఆరేడు అడుగులు వేయగానే నాగీ అని పిలిచింది నాగమణి ... బప్పా అంటూ వెనక్కి తిరిగాడు వాడి చూపులు ఆవిడ భుజాలను దాటుకుంటూ వెనకాల నిలబడిన రామలక్ష్మిని చేరుకున్నాయి.. ఈలోపే.. నాగీ రేపు బోగీ నాడు అమ్మను నాన్నను రమ్మను మాట్లాడాలి అంది... సరే బాప్పా అంటూ వాడు కదిలాడు.. వాడి వెనకాలే రామలక్ష్మి చూపులు.. కూడా ఫాలో అయ్యాయి.. 

మర్నాడు నాగరాజు నాన్న నారాయణ తల్లి రాజ్యం వచ్చారు.. వస్తూనే... పలకరింపులు అయ్యాక నాగమణి మొదలెట్టింది.. మరేట్రా అన్నియ్యా మన  రామలక్ష్మికి నాగరాజుకు సేసిద్ధుమా .. ఎలాగూ సిన్నప్పుటునుంచి ఒనేసిన సంబంధమే కదా.. కొత్తగా అనుకునేది ఏముందీ అంది..  నారాయణ అలాగేలేవే మణీ చూద్దుము అన్నాడు... రాజ్యం కాస్త మాటకారి.. ఎక్కడా మాటపడనివ్వదు .... తన భర్త నారాయణ అమాయకుడని.. ఆయన్ను ఎవరైనా మోసం చేసేయగలరని.. తానూ అలాకాదని.. బాగా తెలివైనదాన్నని,.. ఇంట్లో తనదే పెద్దరికం ఉండాలని కోరుకునే తత్త్వం.. అందుకే నారాయణ చూద్దుము లేవే అనగానే ఏటీ సూసేది... అప్పుడెప్పుడో అనుకున్నాం కదాని ఇప్పుడు సేసెత్తమా... మంచీ సెడ్డా ఉండవా అంది... నేను దిగితే సీన్ మొత్తం మారిపోద్ది అనే కమాండింగ్ ఆమె మాటల్లో స్పష్టమైంది. ఉంటాయుంటాయి ఎందుకుండవు వదినా  మూడు లచ్చల కట్నం.. వీరో వోండా ఇస్తాం.. పిల్లడికి ఒక తులం సైను ... ఇక పెళ్లయ్యాక సారి సీరెలు ఉండనే ఉంతాయి కదా అంది నాగమణి.. ఉంటాయమ్మా ఎందుకుండవు.. అందరికీ ఉంటాయి.. ఎవరిళ్ళలో లేవూ అంటూ రాజ్యం మళ్ళీ లైన్లోకి వచ్చింది.. అమ్మ వాలకం చూస్తుంటే రామలక్ష్మిని మిస్సైపోతానేమోనని ఓ వైపు నాగరాజు కళ్ళలో చిన్న భయం.. 

మా అన్న కూతురు మంగ కూడా బీటెక్ చేసింది.. కట్నం ఐదు లచ్చలు ఇస్తామని కూడా వదిన మాట్లాడింది అంటూ రాజ్యం తమవాడి మార్కెట్ రేటు బయటపెట్టింది.. ఆమ్మో.. అంత ఇవ్వకపోతే రామలక్ష్మి దక్కదేమో అని నాగరాజు అందోళన... ఈలోపే రామలక్ష్మి వచ్చి.. పోన్లేమ్మా నా  జీతం డబ్బులున్నాయి కదా కొంత సర్దుబాటు చేద్దాం అని చెప్పడం ద్వారా నాగరాజును మిస్ చేసుకునే ఉద్దేశ్యం లేదని తేల్చేసింది..  అమ్మనీ గుంటా తెలివైందే... . అని మనసులో అనుకుంటూనే కళ్ళతోనే రామలక్ష్మి కళ్ళకు దండం పెట్టేశాడు.. సరే ఐతే రేపిల్లుండి మంచిరోజు చూసి మాటనుకుందాం అన్నది రాజ్యం ధీమాగా .. మరి పండక్కి కొత్తకోడలికి కోక గట్రా పెడితే ....  అంది నాగమణి కాస్త సందేహిస్తూ... ఆ చూద్దాంలే అని రాజ్యం అంటుండగానే అమ్మా నేను నీకు తెచ్చిన మూడు చీరల్లో ఆ అరిటాకు రంగు చీర  ఇచ్చేయ్... రాముకు బావుంటుంది అనేశాడు ఆగలేక నాగరాజు..  బయటకు చెప్పకపోయినా రామలక్ష్మి మనసులోనే నాగరాజును వాటేసుకుని సిగ్గులమొగ్గయింది.. అమ్మనీ గుంటడా అప్పుడే ఇలా తయారయ్యావా అంది రాజ్యం.. పోన్లే వదినా .. పిల్లలకు ఇష్టమే కదా.. మరెందుకు మాటలూ అనేసింది.. నాగమణి..  

మొత్తానికి పండక్కి వచ్చిన రెండు కుటుంబాలు ఇలా సంబంధం కుదుర్చుకున్నాయి.. ఇలాంటి సంఘటనలు.. సన్నివేశాలు.. ఎన్నో.. ఎన్నెన్నో.. వాటన్నిటికీ సంక్రాంతి ఒక వేదిక.. మధ్యతరగతి వాళ్లకు సంక్రాంతి ఒక వేడుక.

-గాంధీ, విజయనగరం


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement