పచ్చా పొంగలి... పాలా పొంగలి... పొంగలో పొంగలి! | pongal special articles | Sakshi
Sakshi News home page

పచ్చా పొంగలి... పాలా పొంగలి... పొంగలో పొంగలి!

Published Mon, Jan 15 2024 8:52 AM | Last Updated on Mon, Jan 15 2024 1:17 PM

pongal special articles  - Sakshi

గొబ్బియాళ్లో గొబ్బియని పాడారమ్మ 
కంచి వరదరాజులే గొబ్బియాళో
గొబ్బియాళో పతిని పార్వతినీ దలసి
పరమ గొబ్బి తట్టారే గొబ్బియాళో
గొబ్బియల్లో భామలందరు గూడి భజన
గొబ్బి తట్టరే గొబ్బియల్లో
గొబ్బియల్లో భామలందరూ గూడి
బాయినీళ్ళకు పోయిరే గొబ్బియల్లో 
గొబ్బియల్లో గొబ్బియని పాడారమ్మ
కంచి వరదరాజులే గొబ్బియల్లో

డిసెంబరు 15 లేదా 16 మొదలు జనవరి 14 లేదా 15 వరకుఉండే నెల తిరుపతి ప్రాంతంలో పండగ నెల. ధనుర్మాసం, మార్గళి మాసం అని కూడా అంటారు. ఈ మాసం చాలా పవిత్రమైంది. ఈ నెల మొత్తం పొద్దున్నే ఇంటి ముందర కళ్లాపి చల్లి ముగ్గు వేసి పేడతో చిన్న చిన్న ముద్దలు చేసి, గుమ్మడి పువ్వు పెట్టి గొబ్బెమ్మలు బేసిసంఖ్యలో పెడతారు. ఈ గొబ్బెమ్మల్ని తర్వాత గోడమీదనో లేక కాలు తగలడానికి అవకాశం లేని చోటో పిడకలు తట్టి ఎండ బెడతారు. 

ప్రతిరోజు ఆడవారు రాత్రి పూట గాని లేదా వీలు చూసుకొని పగటి పూట గాని గొబ్బి తట్టుతూ గొబ్బి పాటలు పాడుకుంటారు. ఒకపుడు పెండ్లి కావలసిన వారు మాత్రమే పాడేవారని అంటారు కాని ఇపుడు అందరూ పాడుతున్నారు. గొబ్బి పాటల్లో గొబ్బెమ్మను మేల్కొల్పి, నిద్రబుచ్చే పాటలు ఉండేవి. గొబ్బియాళ్లో, గొబ్బియల్లో అని పాట పాదానికి ముందు చివర, లేదా పాదాంతంలో లేదా ఆ పదమేలేకుండా పాడే గొబ్బిపాటలు మార్గళి మాసంలో మార్మోగుతుండేవి. వందలకొద్దీ ఉండిన ఈ పాటలు కనుమరుగవుతున్నాయి.  

ఈ నెలలో ఆడవారు పోటీలు పడి ముగ్గుపిండి ముగ్గులు, రుబ్బిన బియ్యపు పిండితో వేసే ముగ్గులు పెట్టేవారు. చుక్కల ముగ్గులు, గీతల ముగ్గులు కూడా ఉంటాయి.  ముగ్గులతో పాటు ఎర్రమట్టి (కాషాయ రంగు) పట్టీలు గీసేవారు. సంక్రాంతి నాలుగు రోజుల పండగ– భోగి, పెద్ద పండగ, పశువుల పండగ, కనుమ పండగ (ఊరిని బట్టి పండగ పేర్లు, రోజులు మారవచ్చు). తెల్లవారు జామున వేసే భోగి మంటల్లో పాత లేదా పనికిరాని పనిముట్లు, గంపలు, చేటలు, చింకి చాపలు, ఒక నెల ముందు నుంచి సేకరించి భద్రపర్చిన తుట్లు లేదా కంపతో పాటు వేస్తారు. పొద్దున్నే భోగిలోనే అండాలు పెట్టి నీళ్లు కాచి, ఆ నీళ్లతో తలంటు స్నానాలు చేసేవారు. ఇంటిలోని నులక మంచాలు, పనిముట్లు ఆ వేడి నీళ్లతోనే కడిగేవారు. ఇది మాంసాహారం (తినేవారికి) తప్పనిసరి. 

రెండో రోజు పెద్దపండగ. పూర్తిగా శాకాహారం (కొన్ని కులాల్లో మద్యం, మాంసాహారం కూడా) ఉంటుంది. ఇల్లంతా అలికి పిండి ముగ్గులు వేసి, ఎర్రమట్టి పట్టీలు గీసి, రంగులద్ది, గుమ్మాలకు మామిడాకు తోరణాలు కట్టి అలంకరించుకొనేవారు. ఒకనాడు పడమటింటిలో నైరుతి మూల గోడకు చిన్న చతురస్రాకారంలో ఆకులు నలిపి పచ్చగా రుద్ది దానిమీద పసుపుబొట్లు పెట్టేవారు. ఇది పేరంటాలుకీ, పెద్దలకూ పెట్టుకొనే స్థలం. అదే ఇంటిలో వాయవ్య మూల దేవుళ్ల పటాలు ఉండేవి. 

చనిపోయిన వారికి బట్టలు పెట్టి, మూడు తరాల వారికి తర్పణాలు వదిలి, బేసి సంఖ్యలో అరటి విస్తర్లు వేసి, పలురకాల వంటలతో, అవిశాకు, గుమ్మడి పొరుటు తప్పనిసరిగా వడ్డించి, నైవేద్యం ఇచ్చి కొనియాడే పండగ ఈ పెద్దపండగ. పెద్దపండగ రోజు అన్నం కన్నా కూరలు ఎక్కువ తినాలన్న నమ్మకం ఉంది. రాత్రి మిగిలిన కూరలన్నింటిని రాత్రి కుంపటి మీద ఉంచి ఆ కలగూర మర్నాడు కూరగా వాడుకునేవారు. గొబ్బి తట్టుతూ పాడే పాటలతో (బాణీ, పాటల్లో కూడా బతుకమ్మ పాట లతో సామ్యం చూడవచ్చు) ఊరు సంగీతాత్మక లోకంగా మారి పొయ్యేది. గొబ్బిపాటలు పాడడానికి ఇదే చివరి రోజు.

మర్నాడు పశువుల పండగ. తెల్లవారు జామున పొద్దు మొలవ డానికి ముందే తూర్పు దిక్కున పడమటి ముఖంగా కొత్త పొయ్యి పెట్టి మూడు పొంగళ్లు – పెద్ద పొంగలి, సూర్య పొంగలి, గొబ్బి పొంగలి – పెట్టేవారు. పొంగు వచ్చేటపుడు ‘పచ్చా పొంగలి పాలా పొంగలి పొంగలో పొంగలి’ అంటారు. తూర్పు లేదా ఉత్తరం వైపు పొంగితే మంచిదన్న నమ్మకం. తెల్లవారేటప్పటికి ఎద్దుల్ని కడిగి, కొమ్ములకు రంగులు పూసి నల్లేరు, తంగేడు ఆకులు పూలతోదండలు కట్టి అలంకరిస్తారు. 

ఆ రోజు దొడ్డిలోని పేడనంతా ఒక కువ్వగ పోసి దాని మీద నల్లేరు, తంగేడు వేసి సింగారిస్తారు. పెద్ద పొంగలిలోని అన్నాన్ని విస్తరిలో, పొంగిన నీటిని చెంబులో పేడ కువ్వ ముందర పెట్టి పూజిస్తారు. ఆ విస్తరిలోని అన్నంలో పసుపు కుంకుమ (ఒకప్పుడు పసుపు సున్నం) కల్పి దాన్ని ఇంటి పైన, దొడ్డిలో, ఇంకా పొలంలో కూడా ‘పొలో పొలో’ అంటూ పొలి చల్లు తారు. ఇంకొకరు పొంగటి నీటిని అదే సమయంలో ‘పొంగలో పొంగలి’ అంటూ అనుసరిస్తారు. సూర్యపొంగలి పెట్టి సూర్యుడికి నైవేద్యం, గొబ్బి పొంగటి కూడు పెట్టి గొబ్బెమ్మను పూజిస్తారు. గొబ్బెమ్మకు ఇది చివరి రోజు. నాలుగో రోజు గ్రామదేవతకు పొంగళ్లు పెడతారు. రాత్రి ‘ఊరు మెరవణి’ ఉంటుంది (ఇది కొన్ని ఊర్లలో మాత్రమే).

ఈ నెల మొత్తం పవిత్రం కనుక శుచీ శుభ్రతకు పెద్ద పీట.పండగకు ఇంటిల్లిపాదికీ, పెద్దలకూ, కొత్త అల్లుళ్లకు కూడా కొత్త బట్టలు. మొత్తం మీద ఈ నెల అంతా సంక్లిష్టంగా, భిన్న అంశాలతో కూడుకొని ఉంటుందని చెప్పవచ్చు.ఇదే నెలలో ఉత్తర కేరళ ప్రాంతంలో ‘ధనుర్మాసత్తిల్‌ తిరువాదిర ... తిరువాదిర’ అంటూ ధనుర్మాసంలోని ఆరుద్ర నక్షత్రం రోజున తెల్లవారు జామునే నదికి వెళ్లి స్నానం చేసి ఉపవాసాలతో పూజలతో తమ భర్త చిరాయువుగా ఉండాలని కోరుకొంటూ ఆచరించే వ్రతం ఒకటి ఉంది. తెల్లవారు జామున చేసే స్నానం ఒక వారం ముందు నుంచే ప్రారంభిస్తారు. చాలా సాంగ్యాలున్నాయి. తిరువా దిర సమ యంలో ప్రతి ఇంటిలోనూ ఉయ్యాలలు కట్టి ఊగడం కూడా ఒక ఆచారం. అలాగే కొంతమంది సర్ప కావు – పాముల పొదల్లకు కూడా పోతారు. ఆ రోజున తమ భర్త చిరాయువుగా ఉండాలని 108 తమలపాకుల తాంబూలం కూడా సేవిస్తారు. 

ఆడి (ఆషాఢం) మాసంలో భార్యాభర్తలు కలిస్తే ఎండాకాలంలో, పండగ నెలలో కలిస్తే వర్షాకాలంలో ప్రసవం ఉండడానికి అవకాశం ఉంది. ఆ రెండు కాలాలు కూడా పుట్టిన బిడ్డకు – బహుశా వాతావరణ మార్పు వల్ల – మంచిది కాదన్న సందేశం పండగనెల పీడనెల అనీ, ధనుర్మాసం శూన్యమాసం అనీ, ఈ నెలలో ఏ పనీ చేయరాదని, ప్రతీకాత్మకంగా దానికి సంబంధించిన అంశాల్ని ప్రత్య క్షంగా, పరోక్షంగా ప్రచారంలో పెట్టారని అన్పిస్తుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement