Bhogi Mantalu
-
విశాఖలో ఉక్కు కార్మికుల వినూత్న నిరసన
-
పచ్చా పొంగలి... పాలా పొంగలి... పొంగలో పొంగలి!
గొబ్బియాళ్లో గొబ్బియని పాడారమ్మ కంచి వరదరాజులే గొబ్బియాళో గొబ్బియాళో పతిని పార్వతినీ దలసి పరమ గొబ్బి తట్టారే గొబ్బియాళో గొబ్బియల్లో భామలందరు గూడి భజన గొబ్బి తట్టరే గొబ్బియల్లో గొబ్బియల్లో భామలందరూ గూడి బాయినీళ్ళకు పోయిరే గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బియని పాడారమ్మ కంచి వరదరాజులే గొబ్బియల్లో డిసెంబరు 15 లేదా 16 మొదలు జనవరి 14 లేదా 15 వరకుఉండే నెల తిరుపతి ప్రాంతంలో పండగ నెల. ధనుర్మాసం, మార్గళి మాసం అని కూడా అంటారు. ఈ మాసం చాలా పవిత్రమైంది. ఈ నెల మొత్తం పొద్దున్నే ఇంటి ముందర కళ్లాపి చల్లి ముగ్గు వేసి పేడతో చిన్న చిన్న ముద్దలు చేసి, గుమ్మడి పువ్వు పెట్టి గొబ్బెమ్మలు బేసిసంఖ్యలో పెడతారు. ఈ గొబ్బెమ్మల్ని తర్వాత గోడమీదనో లేక కాలు తగలడానికి అవకాశం లేని చోటో పిడకలు తట్టి ఎండ బెడతారు. ప్రతిరోజు ఆడవారు రాత్రి పూట గాని లేదా వీలు చూసుకొని పగటి పూట గాని గొబ్బి తట్టుతూ గొబ్బి పాటలు పాడుకుంటారు. ఒకపుడు పెండ్లి కావలసిన వారు మాత్రమే పాడేవారని అంటారు కాని ఇపుడు అందరూ పాడుతున్నారు. గొబ్బి పాటల్లో గొబ్బెమ్మను మేల్కొల్పి, నిద్రబుచ్చే పాటలు ఉండేవి. గొబ్బియాళ్లో, గొబ్బియల్లో అని పాట పాదానికి ముందు చివర, లేదా పాదాంతంలో లేదా ఆ పదమేలేకుండా పాడే గొబ్బిపాటలు మార్గళి మాసంలో మార్మోగుతుండేవి. వందలకొద్దీ ఉండిన ఈ పాటలు కనుమరుగవుతున్నాయి. ఈ నెలలో ఆడవారు పోటీలు పడి ముగ్గుపిండి ముగ్గులు, రుబ్బిన బియ్యపు పిండితో వేసే ముగ్గులు పెట్టేవారు. చుక్కల ముగ్గులు, గీతల ముగ్గులు కూడా ఉంటాయి. ముగ్గులతో పాటు ఎర్రమట్టి (కాషాయ రంగు) పట్టీలు గీసేవారు. సంక్రాంతి నాలుగు రోజుల పండగ– భోగి, పెద్ద పండగ, పశువుల పండగ, కనుమ పండగ (ఊరిని బట్టి పండగ పేర్లు, రోజులు మారవచ్చు). తెల్లవారు జామున వేసే భోగి మంటల్లో పాత లేదా పనికిరాని పనిముట్లు, గంపలు, చేటలు, చింకి చాపలు, ఒక నెల ముందు నుంచి సేకరించి భద్రపర్చిన తుట్లు లేదా కంపతో పాటు వేస్తారు. పొద్దున్నే భోగిలోనే అండాలు పెట్టి నీళ్లు కాచి, ఆ నీళ్లతో తలంటు స్నానాలు చేసేవారు. ఇంటిలోని నులక మంచాలు, పనిముట్లు ఆ వేడి నీళ్లతోనే కడిగేవారు. ఇది మాంసాహారం (తినేవారికి) తప్పనిసరి. రెండో రోజు పెద్దపండగ. పూర్తిగా శాకాహారం (కొన్ని కులాల్లో మద్యం, మాంసాహారం కూడా) ఉంటుంది. ఇల్లంతా అలికి పిండి ముగ్గులు వేసి, ఎర్రమట్టి పట్టీలు గీసి, రంగులద్ది, గుమ్మాలకు మామిడాకు తోరణాలు కట్టి అలంకరించుకొనేవారు. ఒకనాడు పడమటింటిలో నైరుతి మూల గోడకు చిన్న చతురస్రాకారంలో ఆకులు నలిపి పచ్చగా రుద్ది దానిమీద పసుపుబొట్లు పెట్టేవారు. ఇది పేరంటాలుకీ, పెద్దలకూ పెట్టుకొనే స్థలం. అదే ఇంటిలో వాయవ్య మూల దేవుళ్ల పటాలు ఉండేవి. చనిపోయిన వారికి బట్టలు పెట్టి, మూడు తరాల వారికి తర్పణాలు వదిలి, బేసి సంఖ్యలో అరటి విస్తర్లు వేసి, పలురకాల వంటలతో, అవిశాకు, గుమ్మడి పొరుటు తప్పనిసరిగా వడ్డించి, నైవేద్యం ఇచ్చి కొనియాడే పండగ ఈ పెద్దపండగ. పెద్దపండగ రోజు అన్నం కన్నా కూరలు ఎక్కువ తినాలన్న నమ్మకం ఉంది. రాత్రి మిగిలిన కూరలన్నింటిని రాత్రి కుంపటి మీద ఉంచి ఆ కలగూర మర్నాడు కూరగా వాడుకునేవారు. గొబ్బి తట్టుతూ పాడే పాటలతో (బాణీ, పాటల్లో కూడా బతుకమ్మ పాట లతో సామ్యం చూడవచ్చు) ఊరు సంగీతాత్మక లోకంగా మారి పొయ్యేది. గొబ్బిపాటలు పాడడానికి ఇదే చివరి రోజు. మర్నాడు పశువుల పండగ. తెల్లవారు జామున పొద్దు మొలవ డానికి ముందే తూర్పు దిక్కున పడమటి ముఖంగా కొత్త పొయ్యి పెట్టి మూడు పొంగళ్లు – పెద్ద పొంగలి, సూర్య పొంగలి, గొబ్బి పొంగలి – పెట్టేవారు. పొంగు వచ్చేటపుడు ‘పచ్చా పొంగలి పాలా పొంగలి పొంగలో పొంగలి’ అంటారు. తూర్పు లేదా ఉత్తరం వైపు పొంగితే మంచిదన్న నమ్మకం. తెల్లవారేటప్పటికి ఎద్దుల్ని కడిగి, కొమ్ములకు రంగులు పూసి నల్లేరు, తంగేడు ఆకులు పూలతోదండలు కట్టి అలంకరిస్తారు. ఆ రోజు దొడ్డిలోని పేడనంతా ఒక కువ్వగ పోసి దాని మీద నల్లేరు, తంగేడు వేసి సింగారిస్తారు. పెద్ద పొంగలిలోని అన్నాన్ని విస్తరిలో, పొంగిన నీటిని చెంబులో పేడ కువ్వ ముందర పెట్టి పూజిస్తారు. ఆ విస్తరిలోని అన్నంలో పసుపు కుంకుమ (ఒకప్పుడు పసుపు సున్నం) కల్పి దాన్ని ఇంటి పైన, దొడ్డిలో, ఇంకా పొలంలో కూడా ‘పొలో పొలో’ అంటూ పొలి చల్లు తారు. ఇంకొకరు పొంగటి నీటిని అదే సమయంలో ‘పొంగలో పొంగలి’ అంటూ అనుసరిస్తారు. సూర్యపొంగలి పెట్టి సూర్యుడికి నైవేద్యం, గొబ్బి పొంగటి కూడు పెట్టి గొబ్బెమ్మను పూజిస్తారు. గొబ్బెమ్మకు ఇది చివరి రోజు. నాలుగో రోజు గ్రామదేవతకు పొంగళ్లు పెడతారు. రాత్రి ‘ఊరు మెరవణి’ ఉంటుంది (ఇది కొన్ని ఊర్లలో మాత్రమే). ఈ నెల మొత్తం పవిత్రం కనుక శుచీ శుభ్రతకు పెద్ద పీట.పండగకు ఇంటిల్లిపాదికీ, పెద్దలకూ, కొత్త అల్లుళ్లకు కూడా కొత్త బట్టలు. మొత్తం మీద ఈ నెల అంతా సంక్లిష్టంగా, భిన్న అంశాలతో కూడుకొని ఉంటుందని చెప్పవచ్చు.ఇదే నెలలో ఉత్తర కేరళ ప్రాంతంలో ‘ధనుర్మాసత్తిల్ తిరువాదిర ... తిరువాదిర’ అంటూ ధనుర్మాసంలోని ఆరుద్ర నక్షత్రం రోజున తెల్లవారు జామునే నదికి వెళ్లి స్నానం చేసి ఉపవాసాలతో పూజలతో తమ భర్త చిరాయువుగా ఉండాలని కోరుకొంటూ ఆచరించే వ్రతం ఒకటి ఉంది. తెల్లవారు జామున చేసే స్నానం ఒక వారం ముందు నుంచే ప్రారంభిస్తారు. చాలా సాంగ్యాలున్నాయి. తిరువా దిర సమ యంలో ప్రతి ఇంటిలోనూ ఉయ్యాలలు కట్టి ఊగడం కూడా ఒక ఆచారం. అలాగే కొంతమంది సర్ప కావు – పాముల పొదల్లకు కూడా పోతారు. ఆ రోజున తమ భర్త చిరాయువుగా ఉండాలని 108 తమలపాకుల తాంబూలం కూడా సేవిస్తారు. ఆడి (ఆషాఢం) మాసంలో భార్యాభర్తలు కలిస్తే ఎండాకాలంలో, పండగ నెలలో కలిస్తే వర్షాకాలంలో ప్రసవం ఉండడానికి అవకాశం ఉంది. ఆ రెండు కాలాలు కూడా పుట్టిన బిడ్డకు – బహుశా వాతావరణ మార్పు వల్ల – మంచిది కాదన్న సందేశం పండగనెల పీడనెల అనీ, ధనుర్మాసం శూన్యమాసం అనీ, ఈ నెలలో ఏ పనీ చేయరాదని, ప్రతీకాత్మకంగా దానికి సంబంధించిన అంశాల్ని ప్రత్య క్షంగా, పరోక్షంగా ప్రచారంలో పెట్టారని అన్పిస్తుంది. -
Bhogi 2023: భోగి వచ్చిందోచ్
మసక చీకటిలో భోగి మంటలు ఇంటి ముంగిటిలో వెలుతురును తెస్తాయి. పాత వస్తువులను దగ్ధం చేసి కొత్త ఉత్సాహంలోకి అడుగు పడేలా చేస్తాయి. జనులెల్లా భోగభాగ్యాలతో విలసిల్లాలని కోరే పండగ భోగి. తెల్లవారుజాము తలంట్లూ దోసెలూ మసాలా కూరలూ చంటిపిల్లల భోగిపండ్లూ మూడు రోజుల సంక్రాంతి సంబరాలకు బోణి–భోగి. మనిషిని భోగంతో బతకండి అంటుంది ఈ పండగ. సంతోషాన్ని, సంతృప్తిని కనుగొనడంలోనే భోగం ఉందని చెబుతుంది ఈ పండగ. చలి వంటి జడత్వాన్ని ఉష్ణమనే చైతన్యంతో పారద్రోలి మనిషిని కర్తవ్యోన్ముఖుణ్ణి చేసేది భోగి. పరిశ్రమే భోగమూ భాగ్యమూ అని చెప్పేదే భోగి. భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో భోగిమంటల భోగుల్లో తెల్లారకుండానే పల్లెపల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో... చీకటిని తనకు తానుగా తరిమికొట్టడానికి వెలుతురు మంటను ఇంటి ఇంటి ముంగిటకు, వీధి వీధిలోనా, ప్రతి కూడలిలో మనిషి రాజేసే ఇలాంటి పండగ మరొకటి లేదు. అంత ఉదయాన లేచి పాతవన్నీ పనికి మాలినవన్నీ దగ్ధం చేసి నవీనతలోకి అడుగుపెడదామని మనిషి అనుకునే పండగ కూడా ఇలాంటిది వేరొకటి లేదు. తెల్లారకుండానే పల్లె లేస్తుంది. మనిషీ లేస్తాడు. ఎర్రటి నాల్కులు సాచుతూ మొద్దు చలిని, మంచు మందాన్ని కోస్తూ మంటా పైకి లేస్తుంది. ‘రేపటి నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి వస్తాడు. కాంతి ప్రకాశవంతం అవుతుంది. జీవితాన్ని ప్రకాశవంతం చేసుకోవడానికి సిద్ధపడు’ అని ఇవాళ మనిషిని సిద్ధం చేయడానికి వస్తుంది భోగి. ఎల్లవేళలా శుభ్రంగా స్నానం చేసి, మంచి బట్టలు కట్టుకుని, నచ్చింది తినడానికి మించిన భోగం లేదు. అందుకే భోగినాడు తలంట్లు తెలుగునాట ఫేమస్. భోగిమంటలు కాగానే స్త్రీలు కాగుల్లో, గంగాళాలలో వేడినీళ్లు సిద్ధం చేస్తారు. ఇంటి పిల్లలు, మగవాళ్లు నలుగు పెట్టుకుని ఒంటిని తోముకోవాలనే ఆనవాయితీ. ఆ తర్వాత తలంట్లు. కొత్త బట్టలు. కొత్తబియ్యం పాయసం. ఒళ్లు, ఇల్లు, పరిసరాలు శుభ్రంగా ఉండటం, శుభ్రమైన పరిసరాల్లో సుఖవంతంగా జీవించడం భోగం. అందుకే భోగి శుభ్రతను సూచిస్తుంది. శుభ్రత అంటే బయట శుభ్రత మాత్రమే కాదు... ఆత్మిక, ఆధ్యాత్మిక శుభ్రత కూడా. జ్ఞాన శుభ్రత కూడా. వివేచనా శుభ్రత. అజ్ఞానాన్ని మించిన అంధకారం లేదు. సరైన ‘చదువు’, దృక్పథం మనిషికి ఉండాలి. మూకలు చెప్పినట్టు చేయరాదు. అలాంటి అజ్ఞాన అంధకారాన్ని మంటల్లో వేసి మాడ్చి మసి చేయమని చెబుతుంది భోగి. నీలోని కల్మషాన్ని, కసిని, పగని, ద్వేషాన్ని, చెడుని తగులబెట్టు అని చెబుతుంది భోగి. మనలో మంచితనం నిండటమే భోగం. మంచివాడిగా బతకడం, అగ్నిలా స్వచ్ఛంగా ఉండటం భోగం. అగ్నికి చీడ అంటదు. అలాంటి జీవితం జీవించగలగాలని సూచన. భోగం అంటే కేవలం ఐశ్వర్యం అనే అర్థం చూడరాదు. అన్నివేళలా చెరగని చిర్నవ్వును ధరించి ఉండగలగడం కూడా భోగమే. భోగిపళ్లు రేగిపండ్లు సూర్యుడి నుంచి ఎక్కువ శక్తిని గ్రహించి దాచుకుంటాయట. ఎటువంటి జటిల వాతావరణం లోనైనా, ఉష్ణోగ్రతలో అయినా ఎదురు తిరిగి బతికి రేగుచెట్లు నిలబడతాయట. చంటి పిల్లలు కూడా అలాంటి శక్తితో అలాంటి ఆయుష్షుతో దిష్టి గిష్టి వదిలించుకుని ఈ కొత్తకాలంలోకి ప్రవేశించాలని భోగినాటి సాయంత్రం భోగిపళ్ల పేరంటం పెడతారు. రేగుపండ్లు, తలంబ్రాలు, రాగి నాణేలు, చిల్లర పైసలు, పూల రెక్కలు కలిపి పిల్లల నెత్తిన పోసి, దిగవిడిచి దిష్టి తీస్తారు. చిట్టి చిట్టి రేగుపళ్ళు చిట్టి తలపై భోగిపళ్ళు ఎంతో చక్కని భోగిపళ్ళు ఎర్ర ఎర్రని రేగుపళ్ళు.... అని పాటలు పాడతారు. ఆయుష్షుతో ఉండటం భోగం. అందుకు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం భోగం. పరిస్థితులను ఎదుర్కొనే గుండె దిటవును కలిగి ఉండటం భోగం. బొమ్మల కొలువులు... గొబ్బి పాటలు భోగినాడు బొమ్మల కొలువు పెడతారు కొంతమంది. చిన్నపిల్లలు తమ బొమ్మలు, సేకరించిన బొమ్మలు తీర్చిదిద్ది సంబరపడతారు. ఇక భోగితో మొదలెట్టి పండగ మూడు రోజులూ సాయంత్రం సందె గొబ్బెమ్మలను పెడతారు. వాటి చుట్టూ ఆడవారందరూ చేరి గొబ్బిళ్ళ పాటలు పాడుతూ గొబ్బెమ్మల చుట్టూ ఆడతారు. ‘గొబ్బియళ్ళో సఖియా వినవె చిన్ని కృష్ణుని చరితము గనవె చిన్ని కృష్ణుని మహిమను గనవె ..... ‘ ‘సుబ్బీ సుబ్బమ్మ శుభము నీయవె తామర పువ్వంటి తమ్ముణ్ణీయవె చామంతి పువ్వంటి చెల్లెల్నీయవె’ లాంటి పాటలు పాడతారు. పెళ్ళి కాని అమ్మాయిలు ‘మొగలి పువ్వంటి మొగుణ్ణీయవె’ అని కలుపుతారు. పండగ అంటే అందరికి సంతోషాన్ని ఇచ్చేది. అందరి శుభాన్ని కోరడం భోగం. ఈ భోగి సకల శుభాలను తేవాలని కోరుకుందాం. -
Bhogi Festival: భోగం వైభోగం.. భోగి పళ్లు ఎందుకు?
Bhogi 2022: మన మహర్షులు కాలంలో జరిగే మార్పులను గమనించి, ఖగోళంలో జరిగే మార్పులను తెలుసుకుని, ఆయా సమయాల్లో మనం ఏ విధంగా ప్రవర్తించాలో, దైవాన్ని ఎలా ఆరాధించాలో, ఏమేమి చెయ్యాలో తెలియజేస్తూ మనకు అనేక పండుగలను, పర్వదినాలను ఏర్పరిచారు. ఈ సంక్రాంతి పండుగ గోవులకు, ప్రకృతికి, పరమాత్మకు, పల్లెలకు, పొలాలకు, పంటలకు, మానవులకు సంబంధించిన పండుగ. మన సంస్కృతికి సంప్రదాయాలకు, ప్రకృతి ఆరాధనకు, కృతజ్ఞతా ప్రకటనకు సంబంధించిన పండుగ. మనది – వ్యవసాయ ప్రధానమైన దేశం. పంటలు చేతికొచ్చి, ఫలసాయం అందినందువల్ల దానిని పది మందికీ పంచుతూ అలా పంచటంలోని ఆనందాన్ని అనుభవించటం భారతీయులందరికీ ఆచారం. ప్రకృతిలో జరిగే గొప్ప మార్పు సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించటం. దీనినే మకర సంక్రమణం, ’మకర సంక్రాంతి’ పండుగ అంటాము. ఈ మకర సంక్రమణం ముఖ్యంగా పితృదేవతలకు తర్పణాలను సమర్పిస్తూ కృతజ్ఞతలు ప్రకటించ వలసిన ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన రోజు. దైవారాధన – సూర్యారాధన చెయ్యవలసిన రోజు. దీనికి ముందురోజు భోగి పండగ జరుపుకుంటాం. భోగి అంటే భోగం, సౌఖ్యం. భోగాన్ని అనుభవించేవాడు భోగి. అతను మహా యోగి, ఇతను మహా భోగి అంటుండటం వాడుకలో గమనిస్తాము. భోగాలను అనుభవించమని ప్రబోధించే పండుగ భోగి పండుగ. ఈ పండుగలో ఏ రోజు విశిష్టత ఆ రోజుదే అయినా, భోగి పండుగ నాడు మనమందరమూ ఆచరించే విశేషమైన అంశాలెన్నో ఉన్నాయి. భోగి పండుగ మానవులందరినీ భోగము ననుభవించమని, ఆనందంగా ఉండమనీ చెప్తోంది. పరమాత్మ పంచభూతాత్మకమైన, భోగ స్వరూపమైన ప్రకృతిని సృష్టించి, ఆ సృష్టిలోని భోగాలను ఎలా అనుభవించాలో ఆ జ్ఞానాన్ని విధి నిషేధ రూపమైన వేద విజ్ఞానరూపంగా అనుగ్రహించాడు. మనం ఆ నియమాలను పాటిస్తూ భోగాలననుభవించాలి. భోగి పండుగనాడు సూర్యోదయానికంటే ముందే ఇంటిల్లిపాదీ నిద్ర లేచి, ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కుని, అందరూ కలిసి ఆరుబైటకు చేరి, భక్తితో భోగిమంటలు వెయ్యటం అన్నది మనకి అనాదిగా వస్తున్న సంప్రదాయం. భోగిమంటల కోసం దైవ నామ స్మరణ చేస్తూ, ఆవుపేడ పిడకలను, సమిధలను పెట్టి, కర్పూరంతో అగ్నిని రగిలిస్తారు. అగ్నిదేవుని ప్రార్ధిస్తారు. ఆ మంటలు కాస్త పెరిగాక, ఇంట్లో ఉన్న పాత సామాన్లను, అక్కర్లేని చెక్కముక్కలను అన్నింటినీ ఆ మంటల్లో వేస్తారు. అంటే అక్కర్లేని చెత్తను వదిలించుకుని కొత్తదనాన్ని కోరటం కనిపిస్తుంది. భోగిమంటల వల్ల మనకు కలిగే మరొక లాభమేమిటంటే, ఈ భోగి మంటలలో ఆవుపేడ పిడకలను, సమిథలను వెయ్యటం వలన అవి కాలుతున్నప్పుడు వచ్చే ధూమం వాతావరణాన్ని శుభ్రపరుస్తుంది. పిల్లలందరూ ఈ భోగి మంటలను ఉత్సాహంగా చేస్తారు, ఎంతో ఆనందిస్తారు. భోగి మంటలలోని అంతరార్ధం ఏమిటంటే, బాధ కలిగించే అక్కర్లేని ఆలోచనలను, రాగద్వేషాది దుర్గుణాలను, కోపతాపాలను అగ్నిలో దగ్ధం చెయ్యాలి అంటే రాగద్వేషాలను వదిలెయ్యాలి అని గ్రహించటం. అందరితో సౌమనస్యంతో ఉండాలని నిర్ణయించుకోవటం. భోగి పండుగ నాడు శ్రీ సూర్యనారాయణ స్వామిని, కుల దైవాన్ని, ఇష్టదైవాన్ని, శ్రీ కృష్ణ పరమాత్మను, త్రిలోకాధిపతియై, సకల భోగాలను అనుభవిస్తున్న దేవేంద్రుని ఆరాధించి, కొత్త బియ్యంతో వండిన పొంగలి, పరమాన్నాలను దేవతలకు నివేదించి, ఆ ప్రసాదాన్ని మనం తినాలి. భోగి పళ్లు ఎందుకు? రేగు పళ్ళనే భోగిపళ్ళు అంటాము. భోగిపళ్ళు పొయ్యటానికి రేగుపళ్ళు, చెరుకు ముక్కలు, పచ్చదనాన్ని కోరుతూ పచ్చి శనగలను అంటే హరిబూట్ గింజలను, గురు గ్రహ అనుగ్రహం కోసం నానబెట్టిన శనగలను, దిష్టిని పోగొట్టే కొన్ని ద్రవ్యాలను, వక్కల లాంటి నల్లని గింజలను కలిపి, శుభాన్ని కలిగించే చామంతి, గులాబీ, బంతిపూల వంటి పూరేకలను, అక్షతలను, రాగి నాణాలను లేక చిల్లర నాణాలను అన్నింటినీ కలిపి రెండు చేతులతో తీసుకుని, పిల్లలను తూర్పుముఖంగా కూర్చోబెట్టి వారికి పైనుంచి కిందికి దిగతుడిచి, తరువాత గుండ్రంగా సవ్యంగా, అపసవ్యంగా పిల్లల చుట్టూ మూడు సార్లు తిప్పుతూ ‘ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అయిన వాళ్ళ దిష్టి, కాని వాళ్ళ దిష్టి, మంచివాళ్ళ దిష్టి, చెడ్డవాళ్ళ దిష్టి, ఎంత అందంగా ఉన్నారనే వాళ్ళ దిష్టి అందరి దిష్టి పోవాలి‘ అంటూ వారి తల మీద పొయ్యాలి. అలా దిగ తుడవటం వల్ల పిల్లలకు ఏదైనా దిష్టి తగిలితే, అది తొలగిపోతుంది. కాలమంతా దైవ స్వరూపమే అయినా, ఏ మంచి సమయంలో ఎటువంటి మంచి పనులను చేస్తే, అఖండమైన మంచి జరుగుతుందో మన మహర్షులు చెప్పారు. దానిని ఆచరిస్తూ మనమందరమూ సమస్త సన్మంగళములను పొందుదుము గాక !! ఆ మంటల అంతరార్థం మనం అగ్ని ఆరాధకులం. కనుక మాకు అసలైన భోగాన్ని కలిగించమనీ, అమంగళాలను తొలగించమనీ ప్రార్ధిస్తూ అగ్నిహోత్రుని రగులుస్తాము. గతించిన కాలంలోని అమంగళాలను, చేదు అనుభవాలేమైనా ఉంటే వాటిని, మనసులోని చెడు గుణాలను, అజ్ఞానాన్ని అన్నింటినీ అత్యంత పవిత్రమైన అగ్నిలో – అజ్ఞానాన్ని వేసి దగ్ధం చేసుకోవటం, భోగాన్ని, మంగళాలను, జ్ఞానాన్ని పొందాలనే కోరికతో అగ్నిహోత్రుని పరబ్రహ్మ స్వరూపంగా భావించి పూజించటమే భోగి మంటల వెనక ఉన్న అంతరార్థం. కాస్త జ్ఞానం కలవారు, ఈ రోజుతో చలి వెళ్ళి పోతోంది. సూర్యభగవానునిలోని తేజస్సు పెరగబోతోంది, వృద్ధి అవుతుంది అనే భావనతో భోగి మంటలు వేస్తారు. గోదాదేవిని ఆండాళ్ తల్లి అంటారు. ఈమె శ్రీ రంగనాథ స్వామిని భర్తగా పొంద గోరింది. ఇందుకోసం ఆ కాలంలో కాత్యాయనీ వ్రతాన్నాచరించిన గోపికలను ఆదర్శంగా తీసుకుంది. తాను ధనుర్మాసం నెలరోజులు మార్గళీ వ్రతాన్నాచరించి, తిరుప్పావై పాశురాలతో స్వామిని కీర్తించి, పరమాత్మ అనుగ్రహం పొందింది. మహా పర్వదినమైన భోగినాడు శ్రీరంగనాథ స్వామిని వివాహం చేసుకుని, పరమమైన భోగాన్ని పొందింది. మనం భోగి పండుగనాడు శ్రీ గోదా రంగనాథ స్వామి కల్యాణం జరిపించి, దర్శించి ఆనందిస్తాము. భోగి పండుగ నాటి విశేషం పిల్లలకు భోగి పళ్ళు పొయ్యటం. భోగి పండుగ నాడు ముత్తైదువులను ఇంటికి పిలిచి, ఇంటి పెద్దలందరూ కలిసి ఇంట్లో ఉన్న ఐదారు సంవత్సరాల లోపు పిల్లలకు దృష్టి దోషం తగలకుండా దిష్టి తీస్తూ, భోగిపళ్ళు పోసి, సకల శుభాలు కలగాలని ఆశీర్వదిస్తారు. మంగళ హారతినిస్తారు. ఇది మన సంప్రదాయం. కనుక భోగిపళ్ళు పొయ్యటం వెనక అంతరార్థం దృష్టి దోషం పరిహరించటం, చెడు సోకకూడదని కోరుకోవటం, శుభం కలగాలని ఆశీర్వదించటం. ఇదే వేదంలో చెప్పిన ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం. దీనిని పసితనం నుంచే పిల్లలకు నేర్పిస్తున్నామన్నమాట. – సోమంచి రాధాకృష్ణ -
రైతులతో చర్చలు కొనసాగుతాయ్
న్యూఢిల్లీ: కేవలం చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందని తాను నమ్ముతున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పరిషోత్తం రూపాల చెప్పారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలు కొనసాగించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని అన్నారు. 15వ తేదీన 9వ దఫా చర్చలు నిర్వహించాలని ప్రభుత్వం ఇంతకుముందే నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. వివాదాస్పదంగా మారిన మూడు నూతన వ్యవసాయ చట్టాల ప్రతులను రైతులు లోహ్రీ(భోగీ) మంటల్లో దహనం చేశారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివారులో రైతన్నలు ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సింఘు బోర్డర్ వద్ద బుధవారం లక్ష ప్రతులను దహనం చేసినట్లు సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధి పరమ్‌జిత్‌సింగ్ చెప్పారు. పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో లోహ్రీ పంటల పండుగ. మూడు కొత్త చట్టాలను కేంద్ర సర్కారు రద్దు చేసిన రోజే తాము పండుగ జరుపుకుంటామని హరియాణా రైతు గురుప్రీత్‌సింగ్ పేర్కొన్నారు. ఢిల్లీ–హరియాణా రహదారిపై పలుచోట్ల నిరసనకారులు లోహ్రీ మంటలు వెలిగించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 26న కిసాన్ పరేడ్ 26న వేల ట్రాక్టర్లతో ఢిల్లీ శివార్లలో పరేడ్ నిర్వహిస్తామని ఆలిండియా కిసాన్ సంఘర్‡్ష కో–ఆర్డినేషన్ కమిటీ ప్రకటించింది. ఢిల్లీకి చుట్టూ 300 కిలోమీటర్లలోపు ఉన్న అన్ని జిల్లాల ప్రజలు ఒకరోజు ముందే నగర శివార్లకు చేరుకోవాలని పిలుపునిచ్చింది. -
తెలుగు లోగిళ్లలో వైభవంగా భోగి పండుగ
సాక్షి, అమరావతి/హైదరాబాద్: సకల భోగభాగ్యాలను పంచే సంక్రాంతి వచ్చేసింది. రాష్ట్రంలో పల్లెలు, పట్నాలు భోగి మంటల వేడితో పండుగకు ఆహ్వానం పలుకుతున్నాయి. అహం కాలిపోయి, ఆత్మశుద్ధి కావాలని, చలి ఆగిపోయి ఆనందం వెల్లివిరియాలని కోరుతూ ప్రజలు వేకువజామున భోగి మంటలు వేశారు. యువత కేరింతలు కొడుతూ సందడి చేశారు. తమ కష్టాలు, బాధల్ని అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ సుఖసంతోషాలు ఇమ్మంటూ భోగి మంటల చుట్టూ తిరుగుతూ తమ ఆనందాల్ని పంచుకుంటున్నారు తెలుగు ప్రజలు. సూర్యుడు దక్షిణాయానంలో ఉండే చివరి రోజు భోగి. ఈ రోజు చలి తారస్థాయిలో ఉంటుంది. అందుకే భోగిమంటలు వేసుకోమని పెద్దలు సూచించారు. భోగిపండుగ రోజు పొద్దున్నే ఇంట్లోనూ, చుట్టుపక్కలా ఉన్న పనికిరాని, విరిగిపోయిన కలప వస్తువులన్నిటినీ మంటల్లో వేసి, వెచ్చగా చలిమంట వేసుకుంటారు. దీంతో వాతావరణంలో అధిక చలిమూలంగా ప్రబలి ఉండే పురుగూపుట్రా ఆ మంటల వేడికి నశించిపోతాయి. భోగిమంటలకు ఆవుపేడతో చేసిన పిడకలను, ఆ మంటలను బాగా రగిలించేందుకు ఆవునేతిని వాడటం ఉత్తమం. అలా చేయడం వల్ల వాతావరణంలోని కాలుష్యం తొలగి, గాలి శుభ్రపడుతుందని పెద్దల నమ్మకం. తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ వైభవంగా జరుపుకుంటున్నారు. పట్టణాలు, గ్రామాలు తేడా లేకుండా భోగిమంటలలో, రంగురంగుల ముగ్గులతో కళకళలాడుతున్నాయి. తెల్లవారుజామునే పిల్లలు, పెద్దలు, మహిళలు వీధుల్లోకి వచ్చి భోగిమంటలు వేసి వేడుక చేసుకున్నారు. చిత్తూరు జిల్లా నగిరిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా కుటుంబసభ్యులతో కలసి తన నివాసంలో భోగి మంటలు వేశారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతి సంక్రాంతి శోభను సంతరించుకుంది. తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా భోగి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కాకినాడ, రాజమండ్రి, అమలాపురంలో తెల్లవారుజామునే వీధుల్లో భోగిమంటలు వేసి సంబరాలు చేసుకున్నారు. కులమతాలకు అతీతంగా అందరూ కలసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. అందరి కష్టాలు భోగిమంటల్లో కాలిపోయి, సుఖశాంతులు చేకూరాలని కోరుకున్నారు. అందమైన ముగ్గులతో వీధులు కళకళలాడాయి. పిల్లలకు భోగిపళ్లు పోసి సకల ఆరోగ్యసౌభాగ్యాలు కలగాలని ఆక్షాంచించారు. కుల,మతాలకు అతీతంగా.. కుల,మతాలకు అతీతంగా రాజమండ్రి పట్టణంలో భోగి సంబరాలు జరిగాయి. అజాద్ చౌక్ లో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వేసి సందడి చేశారు కాలనీ వాసులు . తెలుగు సంస్కృతిలో భాగంగా జరుపుకునే భోగి పండుగలో పాల్గొనడం..చాలా ఆనందాన్ని ఇచ్చిందంటున్నారు ముస్లిం సోదరులు. పశ్చిమగోదావరి జిల్లాలో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏలూరు, భీమవరం ప్రాంతాలతో పాటు గ్రామాల్లోనూ తెల్లవారు జామునే భోగిమంటలు వేశారు. రంగురంగుల ముగ్గులతో వీధులన్నీ అందంగా ముస్తాబయ్యాయి. ఏలూరులో భోగి సందర్భంగా మహిళలు కోలాటాలు, గంగిరెద్దుల ఆటలతో సందడి సందడిగా మారింది. సంక్రాంతి పండుగ ఉద్దేశాన్ని అందరికీ వివరించేలా పాడిపంటలు, గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. పాయకరావు పేటలో తెల్లవారుజామున భోగిమంటలు వేశారు. వీధులన్నీ భోగిమంటలతో కళకళలాడాయి. విశాఖ నగరంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భోగిమంటలు వేసి సంబరాలు చేసుకున్నారు. తెలంగాణలోనూ.. తెలంగాణలో భోగి సంబరాలు సందడిగా సాగుతున్నాయి. హైదరాబాద్‌లో తెల్లవారు జామున భోగిమంటలు వేసి సందడి చేశారు నగరవాసులు. పాతవస్తువులను భోగిమంటల్లో వేసి కష్టాలు కూడా ఆ మంటల్లో కాలిపోవాలని , అన్నీ శుభాలే కలగాలని ఆకాంక్షించారు. గ్రామాల్లోనూ భోగి శోభ సంతరించుకుంది. -
స్ఫూర్తిజ్వాల
బద్దకాన్ని కాచి ఉత్తేజంగా మారుస్తున్నట్టు.. జీవిత లక్ష్యాన్ని రగులుస్తున్న భావన! భోగి మంట చుట్టూ ఉన్న అక్క, అన్న, తమ్ముడు, చెల్లి.. అందరం ఉత్సాహంగా.. ఉత్తేజంగా! ఇంకా సూర్యుడు పలకరించని ఉదయం.. అయినా ఇంట్లో వాళ్లంతా లేచారు.. నువ్వుల నూనె మస్సాజ్ వాసన.. కాగులో వేడినీళ్లు మరుగుతున్న చప్పుడు.. వాకిట్లో భోగిమంటకు సిద్ధం చేస్తున్న సందడి.. నిద్రను సాగనంపాలని చూస్తున్నా.. వణికించే చలి.. నిద్రను దుప్పట్లో దూర్చి జోగొట్టే ప్రయత్నం చేస్తోంది. అందుకే కళ్లు తెరిచి చూసి అటు తిరిగి ఏ డిస్ట్రబెన్స్‌ను చెవిన పడనివ్వకుండా దిండును చెవులకు అడ్డం పెట్టుకొని మళ్లీ కళ్లు మూసుకుంటుంటే.. నానమ్మ ఊరుకోలేదు. సర్రున దుప్పటి లాగేసింది. అత్తొచ్చి అమాంతం ఎత్తుకొని తీసుకెళ్లి వాకిట్లో కూర్చోబెట్టింది. అమ్మ వచ్చేసి తలకు కొబ్బరి నూనె రాసింది. పిన్ని నువ్వుల నూనె పట్టించడానికి సన్నద్ధమైంది. అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, బాబాయ్‌లు, నాన్న, తాతయ్య ఒకటే హడావిడి. ‘‘నాన్నమ్మా.. నిన్న నేను ఏరి తెచ్చిన రేగు కంప కనపడట్లేదే?’’ ఏడుపు గొంతుతో అన్న. ‘‘అక్కడే ఉంటుంది నాన్నా.. సరిగ్గా చూ..’’ నాన్నమ్మ పూర్తి చేసేలోపే ‘‘ఆ.. దొరికింది దొరికింది’’ అంటూ దాన్ని లాక్కొచ్చే అన్నయ్య. రెండు చేతులను చాపి వాటి మీద చిన్న చిన్న కర్రపుల్లల్ని మోసుకొస్తున్న తమ్ముడు.‘‘అమ్మడూ.. ఆ పిడకల దొంత తీసుకురా...’’ అక్కకు అత్త పురమాయింపు. లోపలి నుంచి కాళ్లు విరిగిపోయిన కుర్చీని తీసుకొస్తూ ఆయాసపడుతున్న తాతను చూసి ‘‘ఏమండీ.. మామగారి చేతుల్లోంచి ఆ కుర్చీని లాక్కోండి’’ నాన్నకు అమ్మ అప్పగించిన బాధ్యత. ‘‘రంగమ్మా.. ఇద్దరం తీసుకెళ్దాం గొబ్బెమ్మలను’’ చెల్లి (బాబాయ్ కూతురు) రిక్వెస్ట్.. మా ఇంట్లో పనులకు సహాయంగా ఉన్న రంగమ్మత్తతో .. పిడకలుగా మారిన గొబ్బెమ్మల గురించి. ఎవరూ ఖాళీగా లేరు. అందరూ కలిసి చేస్తున్న పని. సహాయం. భోగి మంట రాజుకుంది. అంతెత్తున లేచింది. అప్పటిదాకా ఒంట్లో ముసుగేసుకున్న చలి పారిపోయింది. భోగి మంట రిఫ్లెక్షన్లో అందరి మొహాలు వెలుగుతున్నాయి. ఆ ఫ్లేమ్నే తదేకంగా చూస్తుంటే.. నాలోనూ ఏదో ఉత్సాహం.. నాలో ఉన్న బద్దకాన్ని కాచి ఉత్తేజంగా మారుస్తున్నట్టు.. జీవిత లక్ష్యాన్ని రగులుస్తున్న భావన! భోగి మంట చుట్టూ ఉన్న అక్క, అన్న, తమ్ముడు, చెల్లి.. అందరినీ చూశా. అందరూ నాలాగే ఉన్నారు. ఉత్సాహంగా.. ఉత్తేజంగా!భోగి అనగానే ఇదే సీన్ రిపీట్ అవుతూ వస్తోంది కొన్నేళ్లుగా. ఇప్పుడు అందరం పెద్దవాళ్లమయ్యాం. ఒకరి మీద ఆధారపడకుండా.. ఇంకొకరికి సాయపడేంత! అన్నట్టు మేమంతా చిన్నప్పుడు పెట్టుకున్న గోల్స్‌ని రీచ్ అయ్యాం. అయినా ప్రతి భోగి కొత్త లక్ష్యాన్ని నిర్దేశిస్తూనే ఉంది. సమష్టి కృషిని బోధిస్తూనే ఉంది. ఇంకా ఏదో సాధించాలన్న తపనను రగిలిస్తూనే ఉంది. ఎక్కడున్నా ప్రతి సంక్రాంతికి ఊరెళ్తాం. నానమ్మ, తాతల ఆశీస్సుల కోసం.. ఆ వాకిట్లో భోగిజ్వాల పంచే స్ఫూర్తి కోసం! – సరస్వతి రమ -
టి బిల్లు ప్రతులను భోగిమంటల్లో తగలబెట్టిన బాలినేని
-
భోగిమంటల్లో తెలంగాణ బిల్లు దహనం.
-
భోగిమంటల్లో తెలంగాణ బిల్లు దహనం
-
భోగిమంటల్లో తెలంగాణ బిల్లు దహనం
రాష్ట్ర విభజన సెగను సీమాంధ్రులు భోగి మంటల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చూపించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తెలంగాణ బిల్లు ప్రతులను భోగి మంటల్లో దహనం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పీపీఆర్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన భోగి మంటల్లో రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఆధ్వర్యంలో టీ.బిల్లును దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో నేతలు బషీర్, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ, టీడీపీ నేత కరణం బలరాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీఎన్జీవో నేతలు మాట్లాడుతూ దేశంలోనే తొలి భాష ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా విభజించిందన్నారు. సీమాంధ్రకు చెందిన ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుండా విభజించిందని మండిపడ్డారు. ఇక సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఇచ్చిన పిలుపు మేరకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా సంక్రాంతి సంబరాల్లో భాగంగా తెలంగాణ బిల్లు ప్రతులను భోగి మంటల్లో వేసి తగలబెట్టారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడలో భోగి మంటలలో బిల్లు ప్రతులను తగలబెట్టారు. గుంటూరులో టీడీపీ నాయకులు కూడా ఇలాంటి నిరసనే తెలియజేశారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో కూడా సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు టీ బిల్లును తగలబెట్టారు. -
భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో...
సంక్రాంతి అంటేనే పందేల పండుగ. పది రోజుల ముందే పండుగ హడావిడి మొదలైనా... ఆ శోభకు శ్రీకారం జరిగేది మాత్రం ‘భోగి’ నుంచే. భోగిమంటలతో పోటీల పర్వం మొదలవుతుంది. ఇక ముగ్గుల పందేలతో ఆడవాళ్లు... కోడి పందేలతో మగాళ్లు... గాలిపటాల పందేలతో పిల్లలు... ఇలా చెప్పుకుంటూ పోతే... సర్వం పందేల మయం. వీటి మధ్య సినిమాల పందేలు. అప్పుడే బాక్సాఫీస్ దగ్గర వేడి మొదలైంది. మహేష్ ‘1’, చరణ్ ‘ఎవడు’ రిలీజులు ఇప్పటికే జరిగిపోయాయి. కనుమ దాటి ముక్కనుమకు చేరేసరికి విజయం ఎవరి సొంతమో తేలిపోతుంది. ఈ లోపు సరదాగా ‘భోగి స్పెషల్ సాంగ్స్’ని కాసేపు నెమరు వేసుకుందాం. భోగి పండుగ భోగం ఏ స్థాయిలో ఉంటుందో తెలిపే ఈ పాటలు నిజంగా తెలుగు దనానికి ప్రతికలే. భోగిమంటలు(1981) భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో... భోగిమంటల భోగుల్లో... తెల్లారకుండానే పల్లెపల్లంతాను ఎర్రని కాంతుల భోగుల్లో తెల్లారకుండానే పల్లెపల్లంతాను ఎర్రని కాంతుల భోగుల్లో... ఆచార్య ఆత్రేయ రాసిన ఈ పాట ఏ రోజు విన్నా... ఆ రోజే భోగి పండుగలా అనిపిస్తుంది. ఇక రమేశ్‌నాయుడు స్వరరచన తెలుగుదనానికి అద్దం పట్టిందనే చెప్పాలి. దీనికి తోడు కృష్ణ, రతి అగ్నిహోత్రిల అభినయం, విజయనిర్మల టేకింగ్ ఈ పాటకు హైలైట్స్. ‘భోగిమంటలు’ సినిమా వచ్చి 33 ఏళ్లు అవుతున్నా... ఇంకా ఈ పాట శ్రోతల్ని అలరిస్తూనే ఉంది. బాలు, సుశీల, బృందం ఈ పాటను ఆలపించారు. దళపతి (1992) సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంటా పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగ జీవితాలే సాగాలంటా ఆడాలి ఈనాడు.. ఊరంతటా... రాగాల దీపాలటా.. నీకోసం.. వెలిగేనటా.. ఉల్లాసం.. నీవేనటా.. హోయ్ ఈ పాటను అనువాద గీతమంటే ఎవరైనా నమ్ముతారా? అంతగొప్పగా రాశారు రాజశ్రీ. ‘వద్దంటానే పాతదనాన్ని ముద్దంటానే కొత్తదనాన్ని.. కొత్తగ ఇపుడే పుట్టావనీ అనుకోమంటారా హోయ్. మూలబడివున్నా.. బుట్టా తట్టా తీసి.. భోగిమంటల్లోన నీవే వెయ్యరా..’ అంటూ.. భోగి పండుగ పరమార్థాన్ని రెండే ముక్కల్లో చెప్పారాయన. రాజశ్రీ అక్షరాలకు ఇళయరాజా స్వరరచన తోడైతే.. ఇక చెప్పేదేముంది! శ్రోతలు పులకించక ఏంచేస్తారు? నిజంగానే అంతగా ఆకట్టుకుందీ పాట. పైగా ఈ పాట పాడింది ఎవరనుకున్నారు.. కె.జె.ఏసుదాస్, ఎస్పీబాలు. ఇద్దరూ అగ్రగణ్యులే. పాటకు పట్టాభిషేకం చేసినవారే. ఇక చేసింది తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి. తీసింది మణిరత్నం. ఇంతమంది ఘనాపాటీలు కలిశారు కాబట్టే రెండు దశాబ్దాలు దాటినా ఇంకా ఈ పాటను జనాలు ఇష్టపడుతూనే ఉన్నారు. రాముడొచ్చాడు (1996) మా పల్లే రేపల్లెంటా... ఈ పిల్లే రాధమ్మంటా... రేగుతుంటే భోగిమంట.. రేగుపళ్ల విందులంటా రేతిరంతా కోడిపుంజు కొక్కోక్కో మంచుపూల జల్లులంటా మంచెకాడ గిల్లుడంటా మంచమేస్తే సంకురాత్రి తిరునాళ్ళో పల్లె పచ్చగా పిల్ల వెచ్చగా ఉంటే పండగ. భోగి పండుగ శోభ అంతా ఈ పాటలోనే కనిపిస్తుంది కదూ! మరి వేటూరా మజాకా. సిటీల్లో పరిస్థితి ఎలా ఉన్నా... పల్లెల్లో యువతరానికి సంక్రాంతి అంటే నిజంగా పెద్ద సంబరమే. పట్టు పరికిణీల్లో అమ్మాయిలూ, టిప్పుటాప్పుగా అబ్బాయిలూ... అలకలు, అల్లర్లు, సరదాలు, సరాగాలు అన్నింటికీ వేదిక సంక్రాంతి. ‘రేగుతుంటే భోగిమంట...రేగుపళ్ల విందులంటా... రేతిరంతా కోడిపుంజు కొక్కోక్కో...’ అని వేటూరి రాసింది అందుకే. ఎస్పీబాలు, చిత్ర, బృందం ఆలపించిన ఈ పాటకు స్వరరచన చేసింది రాజ్. ఆయన సంగీతం సమకూర్చిన హిట్ సాంగ్స్‌లో ఇదీ ఒకటి. ఇక నాగార్జున, సౌందర్యల అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పాలా! సిందూరం (1997) ఏడుమల్లెలెత్తు సుకుమారికి ఎంత కష్టమొచ్చింది నాయనో.. భోగిపళ్లు పోయాలి బేబికి.. ఏమి దిష్టి కొట్టింది నాయనో.. ముగ్గులెట్టు ముచ్చట్లలో ముచ్చెమట్లు పట్టాయిరో... మంచు బొట్లు ఆ బుగ్గలో అగ్గిచుక్కలైనాయిరో... పల్లెల అందాలు ఏ తీరుగా ఉంటాయో ఈ పాట చూస్తే అర్థమైపోతుంది. అలముకున్న మంచు పొరల మాటున పరుచుకున్న పచ్చదనం, భగభగ మండుతున్న భోగి మంటలు, పాలపుంతల్ని తలపించే సంక్రాంతి ముగ్గులు. వీటికి దీటుగా అందమైన అమ్మాయిలు. వాళ్లనే టార్గెట్ చేస్తూ సిరివెన్నెల కలం కదిపారు. ఆ అక్షరాలను స్వరబద్ధం చేసే బాధ్యతను సంగీత దర్శకుడు ‘శ్రీ’ తలకెత్తుకున్నాడు. తండ్రి చక్రవర్తిని తలపించాడు కూడా. కృష్ణవంశీకి తెలుగుదనంపై ఉన్న మమకారం మొత్తం ఈ పాటలో కనిపిస్తుంది. ఇక పరికిణీలో సంఘవి అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగమ్మాయి కాకపోయినా.. బాపు బొమ్మనే గుర్తుచేసింది. ఇక రవితేజ గురించి తెలిసిందేగా! ఓవరాల్‌గా అందర్నీ రంజింపజేసేసిందీ పాట. సంక్రాంతి పండుగ నేపథ్యంలో చాలా పాటలొచ్చాయి కానీ, భోగి పాటలు మాత్రం తక్కువే. అయినా... వచ్చిన ప్రతిపాట అందర్నీ అలరించి, మన సంప్రదాయ విలువలకు అద్దం పట్టింది. కొన్నేళ్లుగా ఇలా పండుగల్ని ప్రతిబింబించే పాటలు సినిమాల్లో కరువయ్యాయి. ‘ట్రెండ్’ అంటూ... క్లబ్బుల చుట్టూ, పబ్బుల చుట్టూ, విదేశాల చుట్టూ సినిమా పాట తిరుగుతోంది. మన ‘సోల్’ ఏంటో మనం మరిచిపోతున్న పరిస్థితి ప్రస్తుతం సినిమాల్లో నెలకొని ఉంది. పాశ్చాత్య పోకడలను ప్రతిబింబించే ఈ విధానాలను భోగిమంటల్లో ఆహుతి చేస్తూ... మన సంస్కృతిని ప్రతిబింబించే కొత్తదనాన్ని తెలుగు సినిమా ఆహ్వానించాలని ఆశిద్దాం.