మసక చీకటిలో భోగి మంటలు ఇంటి ముంగిటిలో వెలుతురును తెస్తాయి. పాత వస్తువులను దగ్ధం చేసి కొత్త ఉత్సాహంలోకి అడుగు పడేలా చేస్తాయి. జనులెల్లా భోగభాగ్యాలతో విలసిల్లాలని కోరే పండగ భోగి. తెల్లవారుజాము తలంట్లూ దోసెలూ మసాలా కూరలూ చంటిపిల్లల భోగిపండ్లూ మూడు రోజుల సంక్రాంతి సంబరాలకు బోణి–భోగి. మనిషిని భోగంతో బతకండి అంటుంది ఈ పండగ.
సంతోషాన్ని, సంతృప్తిని కనుగొనడంలోనే భోగం ఉందని చెబుతుంది ఈ పండగ. చలి వంటి జడత్వాన్ని ఉష్ణమనే చైతన్యంతో పారద్రోలి మనిషిని కర్తవ్యోన్ముఖుణ్ణి చేసేది భోగి. పరిశ్రమే భోగమూ భాగ్యమూ అని చెప్పేదే భోగి.
భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో
భోగిమంటల భోగుల్లో
తెల్లారకుండానే పల్లెపల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో...
చీకటిని తనకు తానుగా తరిమికొట్టడానికి వెలుతురు మంటను ఇంటి ఇంటి ముంగిటకు, వీధి వీధిలోనా, ప్రతి కూడలిలో మనిషి రాజేసే ఇలాంటి పండగ మరొకటి లేదు. అంత ఉదయాన లేచి పాతవన్నీ పనికి మాలినవన్నీ దగ్ధం చేసి నవీనతలోకి అడుగుపెడదామని మనిషి అనుకునే పండగ కూడా ఇలాంటిది వేరొకటి లేదు. తెల్లారకుండానే పల్లె లేస్తుంది. మనిషీ లేస్తాడు. ఎర్రటి నాల్కులు సాచుతూ మొద్దు చలిని, మంచు మందాన్ని కోస్తూ మంటా పైకి లేస్తుంది.
‘రేపటి నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి వస్తాడు. కాంతి ప్రకాశవంతం అవుతుంది. జీవితాన్ని ప్రకాశవంతం చేసుకోవడానికి సిద్ధపడు’ అని ఇవాళ మనిషిని సిద్ధం చేయడానికి వస్తుంది భోగి. ఎల్లవేళలా శుభ్రంగా స్నానం చేసి, మంచి బట్టలు కట్టుకుని, నచ్చింది తినడానికి మించిన భోగం లేదు. అందుకే భోగినాడు తలంట్లు తెలుగునాట ఫేమస్. భోగిమంటలు కాగానే స్త్రీలు కాగుల్లో, గంగాళాలలో వేడినీళ్లు సిద్ధం చేస్తారు.
ఇంటి పిల్లలు, మగవాళ్లు నలుగు పెట్టుకుని ఒంటిని తోముకోవాలనే ఆనవాయితీ. ఆ తర్వాత తలంట్లు. కొత్త బట్టలు. కొత్తబియ్యం పాయసం. ఒళ్లు, ఇల్లు, పరిసరాలు శుభ్రంగా ఉండటం, శుభ్రమైన పరిసరాల్లో సుఖవంతంగా జీవించడం భోగం. అందుకే భోగి శుభ్రతను సూచిస్తుంది. శుభ్రత అంటే బయట శుభ్రత మాత్రమే కాదు... ఆత్మిక, ఆధ్యాత్మిక శుభ్రత కూడా. జ్ఞాన శుభ్రత కూడా. వివేచనా శుభ్రత. అజ్ఞానాన్ని మించిన అంధకారం లేదు.
సరైన ‘చదువు’, దృక్పథం మనిషికి ఉండాలి. మూకలు చెప్పినట్టు చేయరాదు. అలాంటి అజ్ఞాన అంధకారాన్ని మంటల్లో వేసి మాడ్చి మసి చేయమని చెబుతుంది భోగి. నీలోని కల్మషాన్ని, కసిని, పగని, ద్వేషాన్ని, చెడుని తగులబెట్టు అని చెబుతుంది భోగి. మనలో మంచితనం నిండటమే భోగం. మంచివాడిగా బతకడం, అగ్నిలా స్వచ్ఛంగా ఉండటం భోగం. అగ్నికి చీడ అంటదు. అలాంటి జీవితం జీవించగలగాలని సూచన. భోగం అంటే కేవలం ఐశ్వర్యం అనే అర్థం చూడరాదు. అన్నివేళలా చెరగని చిర్నవ్వును ధరించి ఉండగలగడం కూడా భోగమే.
భోగిపళ్లు
రేగిపండ్లు సూర్యుడి నుంచి ఎక్కువ శక్తిని గ్రహించి దాచుకుంటాయట. ఎటువంటి జటిల వాతావరణం లోనైనా, ఉష్ణోగ్రతలో అయినా ఎదురు తిరిగి బతికి రేగుచెట్లు నిలబడతాయట. చంటి పిల్లలు కూడా అలాంటి శక్తితో అలాంటి ఆయుష్షుతో దిష్టి గిష్టి వదిలించుకుని ఈ కొత్తకాలంలోకి ప్రవేశించాలని భోగినాటి సాయంత్రం భోగిపళ్ల పేరంటం పెడతారు. రేగుపండ్లు, తలంబ్రాలు, రాగి నాణేలు, చిల్లర పైసలు, పూల రెక్కలు కలిపి పిల్లల నెత్తిన పోసి, దిగవిడిచి దిష్టి తీస్తారు.
చిట్టి చిట్టి రేగుపళ్ళు
చిట్టి తలపై భోగిపళ్ళు
ఎంతో చక్కని భోగిపళ్ళు
ఎర్ర ఎర్రని రేగుపళ్ళు....
అని పాటలు పాడతారు. ఆయుష్షుతో ఉండటం భోగం. అందుకు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం భోగం. పరిస్థితులను ఎదుర్కొనే గుండె దిటవును కలిగి ఉండటం భోగం.
బొమ్మల కొలువులు... గొబ్బి పాటలు
భోగినాడు బొమ్మల కొలువు పెడతారు కొంతమంది. చిన్నపిల్లలు తమ బొమ్మలు, సేకరించిన బొమ్మలు తీర్చిదిద్ది సంబరపడతారు. ఇక భోగితో మొదలెట్టి పండగ మూడు రోజులూ సాయంత్రం సందె గొబ్బెమ్మలను పెడతారు. వాటి చుట్టూ ఆడవారందరూ చేరి గొబ్బిళ్ళ పాటలు పాడుతూ గొబ్బెమ్మల చుట్టూ ఆడతారు.
‘గొబ్బియళ్ళో సఖియా వినవె
చిన్ని కృష్ణుని చరితము గనవె
చిన్ని కృష్ణుని మహిమను గనవె ..... ‘
‘సుబ్బీ సుబ్బమ్మ శుభము నీయవె
తామర పువ్వంటి తమ్ముణ్ణీయవె
చామంతి పువ్వంటి చెల్లెల్నీయవె’ లాంటి పాటలు పాడతారు.
పెళ్ళి కాని అమ్మాయిలు ‘మొగలి పువ్వంటి మొగుణ్ణీయవె’ అని కలుపుతారు.
పండగ అంటే అందరికి సంతోషాన్ని ఇచ్చేది. అందరి శుభాన్ని కోరడం భోగం. ఈ భోగి సకల శుభాలను తేవాలని కోరుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment