సాక్షి, అమరావతి/హైదరాబాద్: సకల భోగభాగ్యాలను పంచే సంక్రాంతి వచ్చేసింది. రాష్ట్రంలో పల్లెలు, పట్నాలు భోగి మంటల వేడితో పండుగకు ఆహ్వానం పలుకుతున్నాయి. అహం కాలిపోయి, ఆత్మశుద్ధి కావాలని, చలి ఆగిపోయి ఆనందం వెల్లివిరియాలని కోరుతూ ప్రజలు వేకువజామున భోగి మంటలు వేశారు. యువత కేరింతలు కొడుతూ సందడి చేశారు. తమ కష్టాలు, బాధల్ని అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ సుఖసంతోషాలు ఇమ్మంటూ భోగి మంటల చుట్టూ తిరుగుతూ తమ ఆనందాల్ని పంచుకుంటున్నారు తెలుగు ప్రజలు.
సూర్యుడు దక్షిణాయానంలో ఉండే చివరి రోజు భోగి. ఈ రోజు చలి తారస్థాయిలో ఉంటుంది. అందుకే భోగిమంటలు వేసుకోమని పెద్దలు సూచించారు. భోగిపండుగ రోజు పొద్దున్నే ఇంట్లోనూ, చుట్టుపక్కలా ఉన్న పనికిరాని, విరిగిపోయిన కలప వస్తువులన్నిటినీ మంటల్లో వేసి, వెచ్చగా చలిమంట వేసుకుంటారు. దీంతో వాతావరణంలో అధిక చలిమూలంగా ప్రబలి ఉండే పురుగూపుట్రా ఆ మంటల వేడికి నశించిపోతాయి. భోగిమంటలకు ఆవుపేడతో చేసిన పిడకలను, ఆ మంటలను బాగా రగిలించేందుకు ఆవునేతిని వాడటం ఉత్తమం. అలా చేయడం వల్ల వాతావరణంలోని కాలుష్యం తొలగి, గాలి శుభ్రపడుతుందని పెద్దల నమ్మకం. తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ వైభవంగా జరుపుకుంటున్నారు. పట్టణాలు, గ్రామాలు తేడా లేకుండా భోగిమంటలలో, రంగురంగుల ముగ్గులతో కళకళలాడుతున్నాయి. తెల్లవారుజామునే పిల్లలు, పెద్దలు, మహిళలు వీధుల్లోకి వచ్చి భోగిమంటలు వేసి వేడుక చేసుకున్నారు.
చిత్తూరు జిల్లా నగిరిలో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా కుటుంబసభ్యులతో కలసి తన నివాసంలో భోగి మంటలు వేశారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతి సంక్రాంతి శోభను సంతరించుకుంది. తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా భోగి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కాకినాడ, రాజమండ్రి, అమలాపురంలో తెల్లవారుజామునే వీధుల్లో భోగిమంటలు వేసి సంబరాలు చేసుకున్నారు. కులమతాలకు అతీతంగా అందరూ కలసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. అందరి కష్టాలు భోగిమంటల్లో కాలిపోయి, సుఖశాంతులు చేకూరాలని కోరుకున్నారు. అందమైన ముగ్గులతో వీధులు కళకళలాడాయి. పిల్లలకు భోగిపళ్లు పోసి సకల ఆరోగ్యసౌభాగ్యాలు కలగాలని ఆక్షాంచించారు.
కుల,మతాలకు అతీతంగా..
కుల,మతాలకు అతీతంగా రాజమండ్రి పట్టణంలో భోగి సంబరాలు జరిగాయి. అజాద్ చౌక్ లో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వేసి సందడి చేశారు కాలనీ వాసులు . తెలుగు సంస్కృతిలో భాగంగా జరుపుకునే భోగి పండుగలో పాల్గొనడం..చాలా ఆనందాన్ని ఇచ్చిందంటున్నారు ముస్లిం సోదరులు. పశ్చిమగోదావరి జిల్లాలో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏలూరు, భీమవరం ప్రాంతాలతో పాటు గ్రామాల్లోనూ తెల్లవారు జామునే భోగిమంటలు వేశారు. రంగురంగుల ముగ్గులతో వీధులన్నీ అందంగా ముస్తాబయ్యాయి. ఏలూరులో భోగి సందర్భంగా మహిళలు కోలాటాలు, గంగిరెద్దుల ఆటలతో సందడి సందడిగా మారింది. సంక్రాంతి పండుగ ఉద్దేశాన్ని అందరికీ వివరించేలా పాడిపంటలు, గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. పాయకరావు పేటలో తెల్లవారుజామున భోగిమంటలు వేశారు. వీధులన్నీ భోగిమంటలతో కళకళలాడాయి. విశాఖ నగరంలో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భోగిమంటలు వేసి సంబరాలు చేసుకున్నారు.
తెలంగాణలోనూ..
తెలంగాణలో భోగి సంబరాలు సందడిగా సాగుతున్నాయి. హైదరాబాద్‌లో తెల్లవారు జామున భోగిమంటలు వేసి సందడి చేశారు నగరవాసులు. పాతవస్తువులను భోగిమంటల్లో వేసి కష్టాలు కూడా ఆ మంటల్లో కాలిపోవాలని , అన్నీ శుభాలే కలగాలని ఆకాంక్షించారు. గ్రామాల్లోనూ భోగి శోభ సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment