తెల్లవారు జామునే పొలానికి వెళ్లే అలవాటున్న రైతు ఆ రోజు కూడా ఐదు గంటలకు తన పొలం చేరుకునేసరికి, అక్కడ నిండుగా అలంకరించుకుని ఉన్న ముగ్గురు యువతులు కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. వారిని చూస్తూనే ‘ఈ ముగ్గురూ అచ్చంగా మహాలక్ష్మికి ప్రతిరూపంలా ఉన్నారు. వీరెవరో, వీరి కబుర్లేమిటో వినాల్సిందే అనుకున్నాడు. అయితే తను కనిపిస్తే వారు వెళ్లిపోతారేమోనని ఒక చెట్టుచాటున కూర్చున్నాడు.
‘‘అక్కా! భోగి లక్ష్మి! నీకు భోగాలు ఎక్కువ. అందుకే భోగినాడు తలంటు పోస్తారు, భోగి పండ్లు పోస్తారు, భోగి మంటలు వేస్తారు, అన్ని బాల భోగాలు చేస్తారు. పొంగలి వండుతారు. ఎంతైనా పెద్దదానివి కదా! అందుకే నీకు సకల భోగాలు జరుగుతాయి.. అన్నారు చెల్లెళ్లు మకర లక్ష్మి, కనుమ లక్ష్మి.
‘‘అలా అంటావేంటే మకరలక్ష్మీ! నువ్వు వచ్చిన రోజునే కదా పెద్ద పండుగ అంటారు. అసలు ఈ పండుగనే నీ పేరుతో మకర సంక్రాంతి అని పిలుస్తారు. సూర్యభగవానుడు నీ రాశిలో ప్రవేశించినందుకేగా ఈ పండుగ చేసుకునేది. ఉద్యోగస్థులకు సెలవు ప్రకటించేది కూడా నీ పండుగకే కదా. కొత్త బట్టలు కట్టుకునేది కూడా నీ పండుగకే కదా.. అంది కనుమ లక్ష్మి.
ఇద్దరి మాటలు విన్న భోగి లక్ష్మి, ‘‘మీరిద్దరూ నాకు చెల్లెళ్లు, నా పండుగ రోజున ఏదైనా చీడ ఉండే అది పోగొట్టడానికి భోగి మంట వేసి, మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను కదా నేను. అంతేనా, నాతో పాటు మీరు కూడా ఉంటేనే కదా ఈ పండుగ. మకర లక్ష్మి వచ్చిందంటూ నీ కోసమే కదా బొబ్బట్లు, పులిహోర... వంటి పెద్ద పెద్ద పిండి వంటలు వండుతారు. పిల్లలు గాలిపటాలు ఎగురవేస్తారు. పెద్దలకు నైవేద్యాలు పెడతారు. మీమీ ప్రాధాన్యత మీకు ఎప్పుడూ ఉంటుంది’’ అంటూ చెల్లెళ్లను ఆప్యాయంగా మందలించింది భోగి లక్ష్మి.
‘‘నిజమే అక్కా! ఏదో సరదాగా అన్నాం. నీ మాటే నిజం. ఎవరి ప్రాధాన్యత వారికి ఉంటుంది. కనుమనాడు మినుము కొరకాలంటూ రకరకాల గారెలు వేస్తారు. మాంసాహారులు కడుపునిండుగా ఆ రోజున మాంసమే తింటారు. కార్మికులకు సెలవు ప్రకటిస్తారు. భోగిలక్ష్మి వచ్చిన నాడు ఎవ్వరికీ సెలవు ఉండదు. అందరూ ఎవరి పనులు వారు చేసుకోవలసిందే’’
ఇలా ముగ్గురు లక్ష్ములు ఒకరినొకరు పొగుడుకుంటున్నారో, నిందాస్తుతులో తెలియకుండా సంభాషణ సాగుతోందనిపించింది రైతుకి.
‘‘అక్కా భోగిలక్ష్మి, మన మాటలను పక్కన పెడితే, నాకు మాత్రం ఒకటి అర్థమవుతోంది. మనం ముగ్గురం కలిసి వస్తేనే ఈ పండుగ. ఇదే పెద్ద పండుగ... అని కనుమ లక్ష్మి అంటుంటే...
అవును నిజమే... మన ముగ్గురం కలిసి వస్తున్నందుకే బొమ్మలు కొలువు పెట్టుకుంటున్నారు, మనం రావడానికి నెల రోజులు ముందు నుంచి ముగ్గులు వేసుకుంటున్నారు, గొబ్బెమ్మలు పెట్టుకుంటున్నారు, తిరుప్పావై చదువుకుంటున్నారు..’’ అంది భోగి లక్ష్మి.
‘‘అంతేనా, అక్క ఎప్పుడెప్పుడు వస్తుందా గోదా కల్యాణం, ఎప్పుడెప్పుడు చేసుకుందామా అని ఎదురు చూస్తుంటారు.. ’’అంది మకర లక్ష్మి.
‘‘మనం అసలు విషయం మర్చిపోయాం. ఈ నెలనాళ్లు హరిదాసుల హరినామ సంకీర్తనలతో తెలుగు లోగిళ్లు మారుమోగుతుంటాయి. గంగిరెద్దుల వారు ప్రతి ఇంటిముందు నిలబడి, అమ్మగారికి దండం పెట్టు.. అంటూ వృషభరాజం చేత నమస్కరింపచేస్తారు. వారికీ, వీరికీ కూడా సంవత్సరానికి సరిపడా సంభారాలు సమకూరతాయి..’’ అంది కనుమలక్ష్మి.
‘‘అవును అసలు వీరి వల్లే కదా, ఈ మాసమంతా పండుగ కళ సంతరించుకుంటుంది. ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు... పుడమితల్లికే కొత్త అందాన్ని తీసుకువస్తాయి..’’ అంది మకరలక్ష్మి.
‘ఇలా వారు మాట్లాడుకుంటూంటే పరవశంగా వింటున్న ఆ రైతు ఇక మనసు ఉండబట్టుకోలేక, వారి దగ్గరకు వచ్చి, ముగురమ్మలకు పాద నమస్కారం చేసి, ‘‘అమ్మా, మీ ముగ్గురు లచ్చిందేవులూ ఈ రోజు నా పొలానికి వచ్చి, మాట్లాడుకోవటం నాకు ఎంత ఆనందంగా ఉందో! మీరు వస్తున్నారనే కదా, మా ఆడబిడ్డలు అల్లుళ్లతో, మనుమలతో కలిసి పుట్టింటికి వస్తున్నారు. మా రైతుల ఇళ్లన్నీ మీకు పుట్టింటితో సమానమే. మీరు వస్తున్నందుకే కదా అందరికీ చేతినిండా పని.. మా పంటలు పండిన సంబరంతో మీకు నైవేద్యాలు పెట్టాలి. అప్పుడే మా కడుపు చల్లగా ఉంటుంది. మా కుటుంబాలు చల్లగా ఉంటాయి. మీరు ఎప్పటికీ మమ్మల్ని ఇలాగే చల్లగా చూడాలి తల్లీ’’ అంటూ వారిని తన ఇంటికి సాదరంగా ఆహ్వానించాడు. ముగ్గురూ ఎంతో ఆనందంగా వచ్చారు. ఆ రైతు ముగ్గురు బంగారు తల్లులకీ భోగి పళ్లు పోశాడు, పిండి వంటలు తయారు చేశాడు, కనుమ నాడు వారిని రథం మీద గుండె తడితో వారి ఇళ్లకు సాగనంపాడు. మరు సంవత్సరం కోసం ఆ రోజు నుంచే కళ్లల్లో ఆశలు పెట్టుకుని ఎదురుచూడసాగాడు.
సృజన: వైజయంతి పురాణపండ
Comments
Please login to add a commentAdd a comment