రామవ్వ నోటి నుండి మొదటిసారి ఆ పేరు విన్నంతనే శంకరంలో ఏదో అలజడి మొదలయ్యింది. ఆ ఒక్క పేరు అతడిలో రేకెత్తించిన కలవరం బహుశా ఏ అమ్మాయి పేరూ కలిగించి ఉండదు. శంకరం ఇంతకు ముందు ఆ అమ్మాయిని చూడకపోయినా ఆ పేరు చాలా ఆత్మీయంగా అనిపించింది. రామవ్వ నెలకు రెండు మూడు పేర్లను కొడుకుతో ప్రస్తావిస్తూనే ఉంది. ‘కానీ.. చూద్దాం’ అని ఆమె మాటను తోసిపుచ్చుతున్నాడే తప్ప ఆమె వెదుకుతున్న పెళ్ళికూతుళ్ళ సంగతిని తలకెక్కించుకోలేదు. ఉబలాటానికైనా వారిని చూసిరావడానికి వెళ్ళలేదు. కానీ సంక్రాంతి విషయంలో ఎందుకో అలా ఉండటం అతనికి అసాధ్యంగా అనిపించింది.
చిత్తడి నేలలో పడ్డ బీజం మొలకెత్తినట్లు అతని మనసులో పడిన సంక్రాంతి అనే పేరు పాతుకుపోయి ఇక ఉండబట్టలేక ‘అమ్మా.. నేను ఆ అమ్మాయిని చూసివస్తాను’ అన్నప్పుడు రామవ్వ ముఖం వికసించింది. ‘సంతోషం బిడ్డా.. ఈ సంబంధం కలిసిరానీ’ అని తన ఆనందాన్ని ప్రకటించింది. దాంతో మరింత ఉత్సాహాన్ని పొందిన శంకరం తనకు వీలుగా ఉన్న ఒక తేదీని ఎన్నుకుని ఆ రోజు అమ్మాయిని చూడడానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. అయినా కుతూహలం చంపుకోలేక సామాజిక మాధ్యమాల్లో ఆమె గురించిన సమాచారానికై వెదికాడు. ఏమీ దొరకక నిరాశ చెందాడు. ఇంతలో శంకరం ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. రామవ్వను పిలిచాడు. ఆమె అతనితో రావడానికి ఒప్పుకోని కారణంగా తనొక్కడే ప్రయాణానికి సిద్ధమయ్యాడు. కారులో కూర్చుని అమ్మవైపు చూశాడు. ఆమె ముఖంలో సంతోషాన్ని నింపుకుని వాకిట్లో నిలబడి ఉంది. ఆమెను కదిలిస్తే ఆనందాశ్రువులు చిప్పిల్లేలా ఉన్నాయి ఆమె కళ్లు. వెళ్ళివస్తానని కనుకొనల నుండి సైగ చేశాడు. అలాగే కానీ అని ఆమె తలవూపాక శంకరం బయలుదేరాడు.
తుమకూరు నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉండే సంక్రాంతి ఊరైన నిడసాలకు శంకరం వెళ్ళాల్సి ఉంది. ఆ ఊరేమీ అతనికి అపరిచితమైనది కాదు. అలా అని అంతగా పరిచితమైనది కూడా కాదు. రామవ్వ పుట్టిన హిత్తలపుర పక్కనే ఉన్న ఊరు. పుట్టిన ఊరులోనే తెలిసినతడిని పెండ్లి చేసుకున్న రామవ్వ, శంకరం పుట్టిన నాలుగేళ్ళకు వైధవ్యాన్ని పొందింది. వివాహేతర సంబంధపు ఆరోపణలను ఎదుర్కొన్నది. బంధువులు చేస్తున్న అవమానాలను తట్టుకోలేక శంకరాన్ని తీసుకుని తుమకూరు వచ్చేసింది. మళ్ళీ తన ఊరివైపు చూడలేదు. ఇళ్ళల్లో పనిచేస్తూ కొడుకును చదివించుకోవడంలో నిమగ్నమయ్యింది. అప్పుడప్పుడూ తన ఊరి గురించి సమాచారం తెలిసినా ఎప్పుడూ ఆ ఊరికి వెళ్ళాలని రామవ్వకు మనస్కరించలేదు. ఆమెకు కొడుకే లోకం అయ్యాడు. తల్లి కష్టాన్ని అర్థం చేసుకున్న శంకరం ఆమెకే బాధా కలగకుండా చూసుకుంటున్నాడు. ఆమె ఇష్టప్రకారమే బాగా చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకున్నాడు. తలచెడి తెలియని ప్రాంతానికి వచ్చిన రామవ్వ ఇప్పుడు పెద్ద ఇంటికి యజమానురాలు. ఈ మధ్యే.. శంకరానికొక జోడీ కుదర్చాలని వధువును వెదికేపనిలో పడింది. ఓటమినీ చవిచూసింది. చివరకు ఆమె వెదికిన, అతడిని ఆకట్టుకున్న అమ్మాయి ఎవరంటే సంక్రాంతి.
ఎందుకో ఆ అమ్మాయిని చూడకుండానే అతని మనసు సంక్రాంతిని కోరుకుంటోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఇంక రెండు నెలలలో పెళ్ళి. ఏడాది తిరగకుండానే పిల్లాడు.. తన ఆలోచనలకు తానే నవ్వుకున్నాడు. దారిపొడుగునా సంక్రాంతి ఆలోచనే వెంటాడసాగింది. ఇంకొక కిలోమీటరు దూరం ఉందనగా కారు వేగం తగ్గించి, కిటికీ నుండి బయటకి దృష్టి సారించాడు. చెరువు సౌందర్యానికి ఆకర్షితుడై రోడ్డు పక్కగా కారును ఆపి చెరువుకట్టపైకి చేరుకున్నాడు. గట్టు మీద కూర్చున్న ఒక యువకుడు చెరువు నీటిపై రాళ్ళను రువ్వుతున్నాడు. ఆ రాళ్ళు సృష్టించిన అలల వలయాలను కాసేపు చూసిన శంకరం అతని దృష్టిలో పడటానికి ‘హలో’ అన్నాడు. తిరిగి చూసిన ఆ యువకుడు మళ్ళీ రాళ్ళు విసరడంలో నిమగ్నమయ్యాడు. చూడటానికి స్థితిమంతుడిలానే కనిపిస్తున్నాడు. అయితే అతని ముఖం వాడిపోయి ఉంది. అతడిని మళ్ళీ పలకరించడానికి మనసురాక శంకరం తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఊరి మొదట్లో కారు నిలిపి, కిటికీ నుండి తల బయటకుపెట్టి గడ్డిమోపుతో వెళుతున్న వ్యక్తిని అడిగాడు.
‘అన్నా.. సంక్రాంతి ఇల్లెక్కడ?’
‘ఓ.. అమ్మాయిని చూడటానికి వచ్చినారా? అదిగో అక్కడ కనిపిస్తున్నాయి కదా పారిజాతం, సంపంగి చెట్లు.. ఆ ఇల్లే!’
‘సరే’ అని ఆ వ్యక్తి నుండి వీడ్కోలు తీసుకుని సంక్రాంతి ఇంటికి చేరాడు శంకరం. ఆ ఇంటి ముందు కారు ఆపాడు. పారిజాతాల పరిమళం అతని ముక్కుకు తాకి హాయిగా అనిపించింది. శంకరం అరుగు వద్దకు వెళ్లగానే ఒక అవ్వ కళ్ళు విప్పుకుని చూస్తూ ‘ఎవరూ?’ అంది.
‘నేను శంకరం. సంక్రాంతిని చూడటానికి వచ్చాను’ చెప్పాడు కాస్త సంకోచంతో.
‘మా రామి కొడుకువా?’
‘మా అమ్మ తెలుసా మీకు?’
‘నా బిడ్డ రత్న స్నేహితురాలే కదా మీ అమ్మ? దాని కూతురే కదయ్యా సంక్రాంతి. ఏం తలరాతో ఇద్దరిదీ!’
తన తల్లి ప్రస్తావన రాగానే శంకరం చిన్నగా నవ్వాడు.
‘పోయిన వారం నుండి నీకోసం కాచుకున్నాం. రా.. రా..’ అని అతన్ని నట్టింటిలోకి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టింది. కూర్చోగానే ఇంటిని పరిశీలనగా చూశాడు. పాత ఇల్లే అయినా కంటికి ఇంపుగా కనిపించింది. ఇంటి మధ్యలో వేలాడుతున్న ఉయ్యాల బల్ల అతనికి బాగా నచ్చింది. సూర్యకిరణాలు నేల మీద కట్టిపడేసినట్టున్నాయి. ఏనుగు కళ్ళలా చిన్నగా ఉన్న కిటికీల వైపు నిండిన చెరువులోని చేపపిల్లలా అతని కళ్ళు పారాడటం చూసి ‘సంక్రాంతి ఇంట్లో లేదు బిడ్డా..’ అంది శివజ్జి.
‘ఔనా?’ నిరాశతో అన్నాడు.
‘ఆమె మద్దూరులో చదువుకొంటోంది. విషయం తెలిపాను. ఇంకేం వచ్చేస్తూ ఉంటుంది.’
శంకరం కోపాన్ని దిగమింగుకుని మౌనంగా ఉన్నాడు.
‘నీ కోపం అర్థమవుతోంది నాయనా. ముందు తిండి తిను’ అని శివజ్జి.. తిండి తెచ్చి ముందుపెట్టింది.
‘అది కాదు అవ్వా.. నేను నా పనులన్నీ వదులుకుని వచ్చాను. ఫోను చేసినప్పుడే ఈ రోజు కుదరదని చెప్పివుంటే మరొక రోజు వచ్చేవాణ్ణి కదా’ అనే మాటలు నోటివరకూ వచ్చి ఆగిపోయాయి. మౌనంగా ఫలహారం ముగించిన శంకరం.. సంక్రాంతి కోసం నిరీక్షించసాగాడు. శివజ్జి మాట్లాడుతోనే ఉంది. ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేకపోయాడు. చివరకు అక్కడ కూర్చోవడం విసుగనిపించి ‘అవ్వా.. కొంచెంసేపు అలా బయట తిరిగివస్తాను’ అన్నాడు.
‘సరే! నంజన్నను కూడా తీసుకువెళ్ళు. నీకు ఊరు తెలియదు కదా..’ అని, ‘ఏయ్ నంజన్నా’ అంటూ కేకేసింది.
‘వస్తున్నానమ్మా’ పెరటి నుండి పరిగెత్తుకొచ్చాడు నంజన్న. పశువులకు గడ్డి పెడుతున్నాడో ఏమో వాడి తలపై గడ్డిపరకలు చిక్కుకుని ఉన్నాయి. శంకరం వస్తున్న నవ్వును అదిమిపెట్టుకున్నాడు.
‘వీరిని తోట దగ్గరికి తీసుకెళ్ళు..’
‘అలాగే అమ్మా’ అని చెప్పి, ‘రండి సామీ’ అంటూ శంకరానికి దారి చూపించాడు.
ముందు నడుస్తున్న వాడిని అనుసరించాడు శంకరం. పాదాల పరుగులో ఊరు వెనుకపడింది. నంజన్న ఒక్క మాటా పలకలేదు. వాడి ముఖం బిగుసుకున్నట్టు ఉంది. ఇద్దరూ కొబ్బరితోట చేరుకున్నారు. నంజన్న సరసరా చెట్టెక్కి కొబ్బరి బోండాన్ని తెంపాడు. పొదలో దాచిన మచ్చుకత్తిని తీసుకుని అతను వస్తున్న తీరు శంకరాన్ని భయపెట్టింది. కొబ్బరికాయ తలనరికి రంధ్రం చేసి శంకరం చేతిలోపెట్టి తాను దూరంగా కూర్చున్నాడు. తోటను దుక్కి దున్నిన కారణంగా మట్టి పాంటుకు అంటుకుంటుందని శంకరం కింద కూర్చోవడానికి సందేహించాడు. దీనిని గమనించిన నంజన్న లేచి కొబ్బరిమట్టను కత్తిరించి తెచ్చి కిందపరిచాడు. దానిమీద శంకరం నిశ్చింతగా కూర్చున్నాడు.
‘నువ్వు కొబ్బరినీళ్ళు తాగవా?’
‘ఊహూ.. మాకేం కొబ్బరినీళ్ళకు కరువా? మీరు తాగండి సామీ’ జవాబిచ్చాడు నంజన్న.
కొబ్బరినీళ్ళు తాగుతూ శంకరం వాడిని గమనించాడు. నంజన్న కాళ్ళు మడుచుకుని తల మోకాళ్ళకు ఆనించుకుని కూర్చున్నాడు. అతని నిక్కరు మోకాళ్ళను పూర్తిగా కప్పివుంది. చూడటానికి కాస్త నలుపుగా ఉన్నా లక్షణంగా ఉన్నాడు. శరీరం దృఢంగా ఉంది. చేతిలోని మచ్చుతో నేలమీద ఉన్న కొబ్బరాకులను గెలుకుతూ కూర్చున్నాడు. ఆమె గురించి తెలుసుకోవడానికి సరైన సమయం ఇదే అని భావించిన శంకరం ‘సంక్రాంతి నీకు తెలుసా?’ అని అడిగాడు.
‘తెలియకపోవడం ఏమి?’
‘ఏం తెలుసు?’
‘అంతా తెలుసు. ఆమెను ఎత్తుకుని ఆడించింది నేనే. చివరకు నాకు చాలా నొప్పి కలిగించింది..’
‘ఏం చేసింది?’
‘మీరు ఇక్కడే మరిచిపోతాను అంటే మీకొక విషయం చెప్పనా?’
‘హూ..’‘సంక్రాంతిని నేను ప్రాణంకన్నా ఎక్కువగా చూసుకున్నాను. చిన్నప్పుడు నన్నే పెళ్ళి చేసుకుంటాననేది. నన్ను విడిచి ఒక్కరోజూ ఉండేది కాదు. పెద్దయ్యాక అంతా మరిచిపోయింది. పెళ్ళి విషయం ఎత్తితే కయ్యిమనేది. తరువాత ఆమె దక్కదు అని తెలిసి నేనూ మరిచిపోయాను. ఇప్పుడేమీ విచారం లేదు. మా అమ్మ చందుళ్ళిలో ఒక అమ్మాయిని చూసింది. వచ్చే నెలలోనే నా పెళ్ళి’ బాధతో మొదలైన అతని మాటలు దరహాసంతో ముగిశాయి.
‘మా సంక్రాంతి పసిపాపలాంటిది. అయినా లోకాన్ని అంతే బాగా తెలుసుకుంది.’
‘ఔనా? అయితే నువ్వు పేదవాడివని నిన్ను విడిచిపెట్టి ఉండాలి..’ అన్నాడు శంకరం.
‘ఉండాలి కాదు విడిచిపెట్టింది అనండి సామీ..! నిరంజన్ తెలుసా?’
‘లేదు.’
‘మా ఊరికంతా పెద్ద ధనికుడు. అతనూ ఈమె మీద ప్రేమను పెంచుకున్నాడు. ఇద్దరూ బాగానే ఉండేవారు. తరువాత ఏమయ్యిందో?’
‘ఇప్పుడతను ఏం చేస్తున్నాడు?’
‘చెరువులో రాళ్ళు విసురుతూ కూర్చున్నాడు.’
‘పాపం.. ఆ పిల్లోడినే అనుకుంటా నేనీ రోజు చెరువు దగ్గర చూసింది’ శంకరం తాను చూసిన వ్యక్తిని గుర్తుచేసుకున్నాడు.
‘పాపమేమీ కాదు సామీ.. అతనికీ అతడి అత్త కూతురితో పెళ్ళి కుదిరింది. కొద్ది రోజుల్లోనే పెళ్ళి!’
‘అయితే సంక్రాంతి..’ ఇంకేదో అనబోయాడు.
‘ఇంకొక కొబ్బరి బోండాం తాగుతారా?’
‘వద్దు.’
‘అయితే మీరిక్కడే కూర్చోండి.. నేను పశువులకు పచ్చిగడ్డి కోసుకొస్తాను.’
‘లేదు నేను ఇంటికి వెళ్తాను.’
‘దారి తెలుస్తుందా?’
‘హూ..’
శంకరం ఊరి ముఖంగా నడిచాడు. ఎందుకో అతనికి సంక్రాంతి పట్ల మొదట ఉన్న ఉత్సాహం ఇప్పుడు ఉన్నట్లు లేదు. విసుగుతోనే ఇంటికి చేరాడు. వెంటనే ఇంట్లోకి వెళ్ళకుండా క్షణకాలం ఆలోచించి కారును నీడలో నిలపడానికి ముందుకుసాగాడు.
‘బిడ్డా.. రా.. రా.. తోట చూశావా? నంజన్న ఎక్కడ?’
‘వస్తున్నాడు.’
వెళ్ళాలో, వద్దో అని సంశయిస్తూనే అవ్వ వెనుకే వెళ్ళి మళ్ళీ నట్టింట్లోకి వెళ్లి కూర్చున్నాడు.
‘చూడు బిడ్డా.. నా కూతురు రత్నకు ఇష్టం లేకుండానే పెళ్ళి చేశాను. అల్లుడు ఎవతినో ఉంచుకున్నాడంట. నా కూతురు ఈ పిల్ల పుట్టే వరకూ ప్రాణాన్ని చేతుల్లో పెట్టుకుని, బావిలో దూకి చచ్చిపోయింది. వాడు పెళ్ళాం చచ్చిన మూడు నెలలు నిండేలోపలే ఇంకో పెళ్ళి చేసుకున్నాడు. నా కూతురు పోయింది. కనీసం మనవరాలైనా బాగుండాలి! అందుకే అది ఒప్పుకున్న వాడితోనే పెళ్ళిచేస్తాను’ అంటూ శివజ్జి మళ్ళీ కథను మొదలుపెట్టాక శంకరానికి కంపరం అనిపించింది. తానిప్పుడు లేచి వెళ్ళిపోతే జీవితాంతం ఆమె కేవలం ఒక ప్రశ్నలాగే మిగిలిపోతుంది. అలా కావడం ఇష్టంలేక అక్కడే ఆగిపోయాడు.
ఇంతలో ఘల్.. ఘల్.. ఘల్.. అంటూ గజ్జెల శబ్దం వినిపించింది. మల్లెపూల ఘుమఘుమలు చుట్టుపక్కల వ్యాపించాయి. సంక్రాంతి నట్టింట్లోకి ప్రవేశించింది. శంకరం కళ్ళు విప్పారాయి. ఆమె విశేషంగా అలంకరించుకుంది. ముదురుగోధుమ వర్ణపు చాయ కలిగిన ఆ పడతిని శంకరం కళ్ళార్పకుండా చూడసాగాడు.
‘ఎందుకే ఇంత ఆలస్యం చేశావు?’ శివజ్జి గదిరించింది. బదులివ్వకుండా నవ్వి శంకరం వైపు తిరిగి,
‘వేచి ఉండేలా చేసినందుకు కోపంగా ఉందా?’ అంది.
ఈ ప్రశ్నను ఊహించని శంకరం తబ్బిబ్బవుతూ ‘ఏం లేదు’ అని బదులిచ్చాడు.
‘అవ్వా.. తాగడానికేమైనా పెట్టావా?’
‘హూ..’
వంటగదిలోకి నడిచిన సంక్రాంతి పానకం గ్లాసులతో బయటకు వచ్చింది.
‘వెళదామా?’ ఖాళీ గ్లాసును కిందపెడుతూ ఆమె శంకరాన్ని అడిగినప్పుడు ‘ఎక్కడికి?’ అన్నాడు.
‘నా గురించి ఏమీ తెలుసుకోరా?’
‘సరే పదండి..’
‘మీ కారులోనే వెళదామా?’ అన్నప్పుడు శంకరం అంగీకారంగా తలవూపాడు. కారు ఊరి నుండి ఒక మైలు దూరం సాగాక ఆపమని అడిగింది. కారు నుండి దిగిన ఆమెను అనుసరించాడు శంకరం. కొంతసేపు మౌనం తరువాత ఆమే మాట్లాడటం ప్రారంభించింది.
‘నేను కన్నడ ఎం.ఎ. చేస్తున్నాను. నాకు అమ్మ లేదు. నాన్న ఉన్నా లేనట్లే. అవ్వే నా సర్వస్వం.’
‘హూ.. తెలుసు!’
‘అయితే తెలియని విషయాన్ని చెబుతాను’ అని కొంత సమయం తీసుకుని మాట్లాడసాగింది.
‘పెళ్ళి విషయంలో నానొక నిర్దిష్టమైన వైఖరి ఉంది. బొమ్మలాడుకొనే వయసులో నంజన్ననే పెళ్ళి చేసుకోవాలి అనుకున్నాను. ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంటుంది. ఆ తరువాత నిరంజన్. నాకు జ్ఞానం పెరిగాక అతనూ సరైన ఎంపిక కాదని తెలిసింది!’
‘అయితే మీరు వాళ్ళను ప్రేమించింది నిజమేనా?’
‘అవును నిజమే. ఎప్పుడో వాళ్ళ మీద ప్రేమ ఉందనే కారణంతో ఇప్పుడు పెళ్ళి చేసుకోవడం కుదురుతుందా? నేను ఎంత ఎత్తులో నిలబడి చూసినా నాముందు మరుగుజ్జు అనిపించని వ్యక్తినే నేను పెళ్ళి చేసుకునేది’ అంటూ పెద్దగా నవ్వుతున్న ఆమెను చూసి శంకరం లోలోపలే మండిపడ్డాడు.
‘హూ.. హిమాలయం ఎక్కి నిలబడ్డా ఎత్తుగా అనిపించే ఒక వ్యక్తి ఉన్నాడు!’
‘ఎవరతను?’
‘ఆకాశం! మీరు అతడినే పెళ్ళి చేసుకోండి’ అని నవ్వి శంకరం ‘నమస్కారం! నేను ఇక వెళ్ళివస్తాను’ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
‘శంకరా.. చూడు సంక్రాంతికి పెళ్ళంట. లగ్నపత్రిక పంపించారు. నేనెంత చెప్పినా వినకపోతివి. వాళ్ళ నాన్నను మనసులో పెట్టుకుని తన జీవితం అమ్మలాగా కాకూడదని కావచ్చు నీకేదో కథ చెప్పి ఉంటుంది. నువ్వు దాన్నే పెద్దగా చూసి వద్దన్నావు. ఆమె అపురూపమైన పిల్ల బిడ్డా. నేను పెళ్ళికైనా వెళ్ళివస్తాను’ అంటూ రామవ్వ లగ్నపత్రికను అక్కడ పెట్టి వంటింట్లోకి వెళ్ళింది.
కుతూహలంతో శంకరం లగ్నపత్రికలో వరుడి పేరు మీద దృష్టి నిలిపాడు.
‘ఆకాశ్’
మళ్ళీ మళ్ళీ పేరు చదువుకున్న శంకరం నవ్వలేదు.
– కన్నడ మూలం : విద్యా అరమనె
– తెలుగు అనువాదం: కోడీహళ్ళి మురళీమోహన్
Comments
Please login to add a commentAdd a comment