సంక్రాంతి సంబరాలతో పల్లెసీమలు | Sankranti Festivities Begin On A Grand Note In AP | Sakshi
Sakshi News home page

సంబరాల సంక్రాంతి

Published Thu, Jan 14 2021 3:17 AM | Last Updated on Thu, Jan 14 2021 8:00 AM

Sankranti Festivities Begin On A Grand Note In AP - Sakshi

విజయనగరం పట్టణంలో భోగి మంట చుట్టూ మహిళల సందడి

ఎన్నాళ్లకెన్నాళ్లకో అచ్చమైన సంక్రాంతి సంబరాలతో పల్లెసీమలు కళకళలాడుతున్నాయి. పంటల దిగుబడి ఆశాజనకంగా ఉండటంతో అన్నదాతలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా చేతికి సొమ్ము అందడంతో పేదలు, లావాదేవీలు జోరందుకోవడంతో వ్యాపారులు.. వెరసి అన్ని వర్గాల ప్రజల్లో కొంగొత్త సం‘క్రాంతి’ కనిపిస్తోంది. ఉద్యోగ, వ్యాపారాల కోసం పట్టణాలు, నగరాలకు వెళ్లి స్థిరపడిన వారంతా అయినవారి మధ్య పండుగ జరుపుకోవడం కోసం స్వగ్రామాలకు తరలిరావడంతో పల్లెల్లో సందడి నెలకొంది. 
ఏలూరులో గంగిరెద్దును ఆడిస్తున్న దృశ్యం 

సాక్షి, అమరావతి: నగర, పట్నవాసులు పల్లెబాట పట్టారు. అల్లుళ్లు, ఆడపడుచులు, బంధుమిత్రుల రాకతో పల్లెల్లో కొంగొత్త సంక్రాంతి కళ సంతరించుకుంది. ఉద్యోగాలు, వ్యాపారాల కోసం పట్నాలు, నగరాలకు వెళ్లి స్థిరపడిన వారంతా అయిన వారందరితో ఆనందంగా పండుగ జరుపుకోవడం కోసం స్వగ్రామాలకు చేరుకున్నారు. ప్రతి ఇంటి ముంగిటా సస్తవర్ణశోభితమైన రంగవల్లులు భోగి పండుగకు స్వాగతం పలికాయి. కొక్కొరోకో అంటూ... తొలి కోడి కూయగానే పల్లెల్లో నువ్వు ముందా.. నేను ముందా.. అని పోటీ పడిన చందంగా భోగి మంటలు వెలిగించారు. చలి వాతావరణంలో భోగి మంటల వద్ద ఆనందంగా గడిపారు. సూర్యోదయానికి ముందే మహిళలు ఇళ్ల ముందు కల్లాపు చల్లి ముత్యాల ముగ్గులు వేసి రంగులద్దారు. రంగవల్లుల మధ్యలో గోవు పేడతో చేసిన గొబ్బమ్మలను ఉంచి పుష్పాలతో అలంకరించారు. మకర సంక్రాంతికి స్వాగతం పలుకుతూ పక్షం రోజులుగా డూడూ బసవన్నలు (గంగిరెద్దులు) పల్లెల్లో సందడి చేస్తున్నాయి. ధనుర్మాసం కావడంతో ఉదయమే నుదుట నామాలు ధరించిన హరిదాసుల సంకీర్తనలు వీనుల విందు గొలుపుతున్నాయి. పట్టణాలు, నగరాల నుంచి కుటుంబ సమేతంగా వచ్చిన వారితో పల్లెల్లో కార్ల సందడి నెలకొంది. 

నవరత్నాల ప్రభావం
వైఎస్‌ జగన్‌ సర్కారు అమలు చేస్తున్న ‘నవరత్నాలు’ ప్రభావం సంక్రాంతిపై స్పష్టంగా కనిపిస్తోంది. నవరత్నాల్లో భాగంగా అమలు చేస్తున్న వినూత్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వల్ల అల్పాదాయ వర్గాలకు లబ్ధి కలగడంతో పండుగకు కొత్త కళ వచ్చింది. వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఏటా ప్రతి రైతు కుటుంబానికి రూ.13,500 పెట్టుబడి సాయం, అమ్మ ఒడి పథకం కింద ప్రతి విద్యార్థి తల్లి బ్యాంకు అకౌంట్‌లో ఏటా రూ.15,000 జమ చేస్తుండటం గమనార్హం. తాజాగా ఈనెల 11న 44.48 లక్షల మంది తల్లుల ఖాతాల్లో అమ్మ ఒడి కింద ప్రభుత్వం రూ.6,673 కోట్లు జమ చేసింది. డ్వాక్రా మహిళలకు, రైతులకు వడ్డీలేని రుణాలు అందించింది. వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత లాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.2,250 పింఛను అందిస్తోంది. 30.76 లక్షల మందికి నివాస స్థల పట్టాలు ఇచ్చి, 28 లక్షల మందికి ఇళ్లు కట్టించే బృహత్తర కార్యక్రమానికి గత నెల 25న శ్రీకారం చుట్టింది. పట్టాల పంపిణీతో ఈ ఏడాది పల్లెల్లో ముందే సంక్రాంతి కళ సంతరించుకుంది. వర్షాలు పడటంతో పంటలు బాగా పండుతున్నాయి. కూలీలకు చేతి నిండా పని లభిస్తోంది. డబ్బు చేతికి అందినందున ప్రతి కుటుంబం ఉన్నంతలో ఆనందంగా సంక్రాంతి జరుపుకుంటోంది. 
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సూర్యారావుపేటలో భోగి మంట వద్ద యువతుల సందడి   

భోగి మంటలతో కొత్త వెలుగులు
పెద్దల పండుగ, కనుమ నేపథ్యంలో రంగవల్లులతో ఇళ్లు నూతన శోభ సంతరించుకున్నాయి. భోగభాగ్యాలు పంచే భోగి పండుగ సందర్భంగా తెల్లవారుజామునే ప్రతి గడప ముంగిటా భోగి మంటలు వేయడంతో పల్లెల్లో మబ్బులోనే వెలుగులు చిమ్మాయి. పిల్లల తలపై రేగి పండ్లు, చిల్లర నాణేలను పోసి ముత్తయిదువులు దీవించారు.  ఈ ఏడాది ఉద్యోగులకు సంక్రాంతి భాగా కలిసొచ్చింది. దాదాపు వారం రోజులు సెలవు లభించినట్లయింది.   

ఇంటింటా ఘుమఘుమలు
గ్రామ వీధుల్లో పిండి వంటలు ఘుమఘుమలు వెదజల్లుతున్నాయి. అరిసెలు, లడ్డూ, కర్జికాయలు, గారెలు,  సున్నుండలు, బొబ్బట్లు, కాజాలు, పూతరేకులు, లడ్డూ,  లాంటి రకరకాల పిండి వంటలు సిద్ధం చేస్తున్నారు.  

వ్యాపారుల మోముల్లో సంక్రాంతి జోష్‌
వస్త్ర, కిరాణా దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. తెలుగువారికి ఇదే పెద్దపండుగ కావడంతో ఆడపడుచులకు, అల్లుళ్లకు దుస్తులు పెట్టి సత్కరించే సంప్రదాయం ఉంది.  దీంతో ఈ ఏడాది ఊహించిన దానికంటే రెట్టింపు వ్యాపారం జరుగుతుండటం పట్ల వస్త్ర వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం
సంక్రాంతి పర్వదినం సందర్భంగా గురువారం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే దీనిని  మకర సంక్రాంతి అని అంటారు. అనగా సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే శుభప్రదమైన రోజని అర్థం. ఈ సందర్భంగా పెద్దలకు దుస్తులు పెట్టుకుని తర్పణాలు వదిలేందుకు పల్లె జనం సంప్రదాయబద్ధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. 

ఊరూరా సందడే సందడి 
► రాష్ట్రంలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. ఇంటింటా బంధు మిత్రుల కోలాహలం కనిపిస్తోంది. దేవతా మూర్తుల ఊరేగింపులు, ముగ్గుల పోటీలు, కోలాటాలు, ఆటల పోటీలతో ఎటు చూసినా సందడి  నెలకొంది. గుంటూరు రూరల్‌ మండలంలోని చల్లావారిపాలెంలో హోమాలు, ప్రత్యేక పూజల మధ్య పుట్టలమ్మతల్లి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 
► పెదకూరపాడు మండలం బలుసుపాడులో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆధ్వర్యంలో మన ఊరు–మన సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు తరలివచ్చారు. నెహ్రూనగర్‌లో కర్రసాము, కోలాటం, గంగిరెద్దుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  
► ‘ఓలేటి’ ఇంటి పేరు ఉన్న 30 మంది కుటుంబ సభ్యులు గుంటూరు పోస్టల్‌కాలనీలో ఓలేటి పున్నమ్మ–అప్పయ్య చారిటబుల్‌ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం భోగి, సంక్రాంతి సంబరాలను జరుపుకొన్నారు.
► రాయలసీమ జిల్లాలు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు గ్రామాల్లో బండలాగుడు, ఎడ్ల బండ్ల పందేలు నిర్వహించారు. కలర్లు, రంగు పేపర్లు, బెలూన్లు, మెడ గంటలు, ప్రభలతో అలంకరించి మెరవణి (ఊరేగింపు)కి సిద్ధమయ్యారు. చిత్తూరు జిల్లాలో పొంగళ్ల నైవేద్యం సమర్పించారు. విశాఖ జిల్లాలో ఈ ఏడాది గిరిజనులు పెద్ద సంఖ్యలో సంక్రాంతిని జరుపుకుంటున్నారు. నెల్లూరులో పెన్నానది తీరంలో గొబ్బెమ్మల నిమజ్జనానికి మహిళలు సిద్ధమవుతున్నారు.


గోదావరి జిల్లాల్లో పందేల జోరు  
► తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి అంగరంగ వైభవంగా సాగుతోంది. ఆట పాటలతో గ్రామాల్లో సంబరాలు జరుపుకుంటున్నారు. కోడి పందేలను చూసేందుకు వివిధ నగరాల్లో స్థిరపడిన వారు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులూ పాల్గొన్నారు. బరుల వద్ద వాహనాలు పెద్ద సంఖ్యలో క్యూ కట్టాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని మహంకాళీ ఆలయాల్లో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అత్తిలిలో కావిడి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. లక్షలాది మంది రైతులు చేతికందిన పంటను ఒబ్బిడి చేసుకుని సంప్రదాయబద్ధంగా కనుమ పండుగ జరుపుకొనేందుకు సిద్ధమవుతున్నారు. 

స్వీట్స్‌ ఆర్డర్లు బాగా పెరిగాయి 
సంక్రాంతి నేపథ్యంలో స్వీట్స్‌ విక్రయాలు భారీగా పెరిగాయి. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, వైజాగ్, గుంటూరు, చెన్నై, బెంగళూరు ప్రాంతాల నుంచి పెద్ద పెద్ద సంస్థలతో పాటు వ్యక్తిగత ఆర్డర్లు బాగా వచ్చాయి. ఇళ్లలో చేసుకునే తీరిక లేనివారు, అలాగే పట్టణాల నుంచి వచ్చే బంధువుల కోసం సంప్రదాయ పిండి వంటలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. 
– పోలిశెట్టి మల్లిబాబు, సురుచి ఫుడ్స్‌ అధినేత, తాపేశ్వరం, తూర్పుగోదావరి జిల్లా 

వ్యాపారాలకు సంక్రాంతి శోభ
వస్త్ర వ్యాపారాన్ని కరోనా ఈ ఏడాది దారుణంగా దెబ్బతీసింది. చాలా రోజుల తర్వాత సంక్రాంతి రూపంలో  కొత్త శోభ చేకూరింది. ఈ సంక్రాంతి పండుగ కొనుగోళ్లతో మా వస్త్ర వ్యాపారులకు ఊరట లభించింది. పెళ్లి ముహూర్తాలు ముగిసిన తర్వాత రావడంతో భారీగా కాకపోయినా ఆశించిన స్థాయిలో వ్యాపారం సాగింది. మొత్తం మీద మా వస్త్ర వ్యాపారులకు ఈ పండుగ కొంచెం ఊపిరి పీల్చుకునేలా చేసింది. 
– బచ్చు వెంకట ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, ఏపీ టెక్స్‌టైల్‌ ఫెడరేషన్, పోకూరి గంగా ఎస్‌ వెంకట రమేష్, విజయవాడ వస్త్రలత వ్యాపారుల సంఘం 

ఇది జగనన్న సంక్రాంతి
కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన మా కుటుంబం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. ఈ క్రమంలో అమ్మఒడి డబ్బులు అందడం కొండంత సంబరం నింపింది. స్కూల్‌ ఫీజుకు సగం డబ్బులు పోగా, మిగతా సొమ్ముతో కొత్త దుస్తులు కొనుక్కున్నాం. అందరి లాగే స్వీట్లు చేసుకుని పండుగ జరుపుకుంటున్నాం.  ముఖ్యమంత్రి జగనన్న వల్లే మాకు ఈ ఆనందం కలుగుతోంది. అందువల్ల ఈ పండుగను జగనన్న సంక్రాంతిగా జరుపుకుంటున్నాం.
– ఈటీ గజలక్ష్మి, తిరుపతి, చిత్తూరు జిల్లా 

ఆనందకర సంక్రాంతి
ప్రతి కుటుంబానికి నాలుగైదు ప్రభుత్వ పథకాలు అందడం వల్ల ఈ ఏడాది మాతోపాటు అందరూ సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకుంటున్నారు. నాకు వృద్ధాప్య పింఛను వస్తోంది. వైఎస్సార్‌ రైతు భరోసా కింద డబ్బు అందింది. నా భార్య లక్ష్మికి వైఎస్సార్‌ చేయూత కింద సాయం అందింది. మా ఇద్దరు కుమారుల్లో ఒకరికి ఇంటి స్థలం వచ్చింది. నా భార్యతోపాటు కోడళ్లకు డ్వాక్రా ద్వారా రుణ మాఫీ ప్రయోజనం లభించింది. ఈ ఆనందకర సంక్రాంతికి మనసున్న ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి ఉండటమే కారణం. 
– పూడి అప్పారావు, మాకవరపాలెం మండలం, విశాఖపట్నం జిల్లా.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement