సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ సెలవులను పురస్కరించుకొని సొంత ప్రాంతాలకు వెళ్లే ఆయా కాలనీ, అపార్టుమెంట్ వాసులు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. గతంలో సంక్రాంతి సెలవుల్లో జరిగిన దొంగతనాలను పరిగణలోకి తీసుకొని ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. సొంత గ్రామాలకు వెళ్లే వారు ఇళ్లల్లో బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, డబ్బులు ఉంచవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో గానీ, లాకర్లు లేని వారు వాటిని తమ బంధువుల ఇళ్ళలో భద్రపరుచుకోవాలి. అదే విధంగా ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులందరూ ఊరికి ప్రయాణం కట్టిన పరిస్థితుల్లో తెలిసిన వారిని తమ ఇళ్లల్లో రాత్రివేళ పడుకునేలా చర్యలు తీసుకోవాలి.
చదవండి: నుమాయిష్‌కు వైరస్ దెబ్బ.. ‘ఏం చేయాలో తోచడం లేదు’
ఊరికి వెళుతున్న విషయాన్ని ప్రచారం చేసుకోకుండా ఉండటం మంచిది. కొందరు తమ వెంట బ్యాగుల్లో బంగారు ఆభరణాలతో బస్సుల్లో ప్రయాణం తలపెడతారు అటువంటి సమయంలో బస్సుల్లో కూడా దొంగతనాలు జరిగే అవకాశం సంఘటనలు ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఊరికి వెళ్లే ముందు కిటికీలు, తలుపుల బోల్ట్‌లు, తాళాలు సరిగా వేసింది లేనిది మహిళలు ఒకటికి రెండు సార్లు పరిశీలించుకుంటే మంచిది. ఆర్ధిక స్థోమత ఉన్న వారు అలారం ఏర్పాటు చేసుకోవటంతో పాటు సెంట్రల్ లాక్ సిస్టమ్ అమర్చుకుంటే మంచిది. సీసీ కెమెరాలు ఉన్నవారు ఆన్‌చేసి వెళ్లాలి.
ఆయా కాలనీల సంక్షేమ సంఘాలు ఈ పండుగ సెలవులు ముగిసే వరకు కొందరు యువకులతో రాత్రి సమయాల్లో గస్తీ ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలు అరికట్టవచ్చు. అపార్ట్‌మెంట్‌ల్లో సెక్యురిటీని పెంచుకోవాలి. వాటిలోకి వచ్చి పోయే వారి పేర్లు తప్పనిసరిగా నమోదు చేసే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.. ఎలక్ట్రిషియన్‌లు, ప్లంబర్‌లు, కార్పెంటర్‌లు, గ్యాస్ స్టవ్ రిపేర్ పేరిట అపార్ట్‌మెంట్‌లకు వచ్చే కొత్త వ్యక్తులను అనుమతించ కూడదు. ఇళ్ళకు తాళాలు వేసి వెళ్లే వారు పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందజేస్తే దొంగతనాలు జరగకుండా ఆయా గల్లీల్లో పోలీసులు పెట్రోలింగ్ చేపట్టి గట్టి నిఘా ఏర్పాటు చేస్తారు. ప్రధానంగా ఈ సూచనలు, సలహాలను సంక్రాంతి పండుగకు తమ స్వంత ఊరుకు వెళ్లే ప్రతి ఒక్కరు పాటిస్తే మంచిది.
►ఊరు వెళ్లాల్సివస్తే విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోండి.
►సెలవుల్లో బయటకు వెళుతున్నప్పుడు సెక్యూరిటీ, అలారం మోషన్ సెన్సార్‌ను ఏర్పాటు చేసుకోవటం మంచిది.
►తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వండి.
►కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతూ వుంటే పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి. లేదా 100 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి.
►వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేసుకోవాలి. ద్విచక్రవాహనాలకు తాళాలు వేయటంతో పాటు వీలైతే చక్రాలకు కూడా చైన్స్‌తో కూడిన తాళం వేయటం మర్చిపోవద్దు.
►ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాల ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి.
►సంక్రాంతి సెలవుల్లో ఊరుకు వెళుతున్న వారు ఇంటి బయట, ఇంటిలో కనీసం 1, 2 లైట్లు వేసి వుంటే మంచిది.
►ఇంటికి ఇరువైపులా నమ్మకమైన వారు ఉంటే మీరు ఇంట్లో లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తూ ఉండమని చెప్పి వెళ్లటం మంచిది.
జాగ్రత్తలు పాటించాలి
సంక్రాంతి సెలవుల్లో తమ స్వంత ఊరుకు వెళ్లే వారు ఇంటి విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా ఇంట్లో ఉన్న విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలి. ఇరుగు పొరుగు వారికి తమ ఇంటిపై ఓ కన్నేసి ఎప్పటికప్పుడు పరిశీలించేలా చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా దొంగతనాలను అరికట్టేందుకు ఆటోల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. కరపత్రాలను పంపిణీ చేయటంతో పాటు కాలనీ అసోసియేషన్ సంక్షేమ సంఘాల వారితో సమావేశాలు ఏర్పాటు చేసి జాగ్రత్తలపై పలు సూచనలు చేస్తున్నాం.
–కూకట్‌పల్లి సీఐ నర్సింగ్‌రావు
Comments
Please login to add a commentAdd a comment