సంక్రాంతి వస్తోందంటే వాకిట రంగవల్లులు, తెల్లవారు జామున హరిదాసులు, తెల్లవారిన తర్వాత గొబ్బియల్లో పాటలు, మధ్యాహ్నానికి పతంగులు గాల్లో ఎగురుతాయి. ఇవన్నీ పండుగ రాకను సూచించే ఉల్లాసాలు. సంక్రాంతి పండుగకు ఇంతే ఉల్లాసంగా ఉత్సవాలు కూడా జరుపుకుంటాం. సంక్రాంతి పండుగకు మనదేశంలో, గుజరాత్‌లో జరిగే పతంగుల ఉత్సవం అంటే విదేశాల నుంచి కూడా పర్యాటకులు ఉరకలు వేస్తూ వస్తారు. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ వేడుకలకు నవంబర్ నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి. నగరం డిసెంబర్ నాటికే పూర్తి స్థాయిలో ముస్తాబవుతుంది.
తోకలేని గాలిపటాలు
అహ్మదాబాద్‌లో ‘ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ 2025’ను ఈ నెల 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అహ్మదాబాద్‌లో ప్రారంభమవుతుంది. కేవాడియా, రాజ్‌కోట్, వడోదరా, శివరాజ్ పూర్, ధోర్డో, సూరత్‌లలో కూడా వేడుకలు నిర్వహిస్తారు. గాలిపటం అంటే తోక ప్రధానం, కానీ తోకలేని గాలిపటాలు కూడా ఈ వేడుకల్లో కనిపిస్తాయి. నక్షత్ర పతంగులు, చేపలు, పులుల ఆకారంలో ప్రత్యేకమైన కాన్సెప్ట్‌లతో రూపొందిన గాలిపటాలను చూడవచ్చు. దేశవిదేశాల నుంచి పర్యాటకులు ఈ ఫెస్టివల్‌కి వస్తారు.
అహ్మదాబాద్, కచ్, సూరత్, సాఉతారా, రాజ్‌కోట్, పోర్‌బందర్, గాంధీధామ్, అమ్రేలి, భావ్‌నగర్‌లలో గతంలో నిర్వహించిన ఫెస్టివల్‌లో పాల్గొన్న గాలిపటాల ఫొటో గ్యాలరీ స్టాల్ కూడా ఉంటుంది. ఏకకాలంలో ఐదు వందల పతంగులు గాల్లో ఎగురుతుంటే చూడడానికి రెండు కళ్లు చాలవనే మాట చాలా చిన్నది. అహ్మదాబాద్ లో1989 నుంచి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ జరుగుతోంది.
సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయంలో ముందు ఒకటి రెండు రోజుల నుంచి తర్వాత మరో రోజు వరకు మొత్తం నాలుగు రోజులు నిర్వహిస్తారు. ఈ ఫెస్టివల్‌కి పతంగి తయారీదారులు ప్రత్యేకంగా నెల రోజుల ముందు నుంచే చేరుకుంటారు. మలేషియా, ఇండోనేషియా, యూఎస్, జ΄ాన్, చైనా, ఇటలీ వంటి అనేక దేశాల నుంచి పతంగులు చేసే నిపుణులు, పతంగులను ఎగురవేసే ఉత్సాహవంతులు నగరానికి చేరుకుంటారు. ప్రత్యేకమైన పతంగులను తయారు చేసే పెద్ద పెద్ద కంపెనీలు కూడా వేడుకలో పాల్గొంటాయి.
కాంతులీనే పతంగులు
రంగురంగుల పతంగులను పగలంతా ఎగురవేస్తారు. వెలుగులు విరజిమ్మే తెల్లటి పతంగులను రాత్రి పూట ఎగురవేస్తారు. అవి ఆకాశంలో చంద్రుడికి పోటీగా విహరిస్తుంటాయి. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్‌ని సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్నప్పటికీ ఇందులో మతపరమైన ధార్మిక నియమాలేవీ ఉండవు. వేడుకలో అన్ని మతాల వాళ్లూ సంతోషంగా పాల్గొంటారు. బంధువులు, స్నేహితులు కుటుంబాలతోపాటుగా కలిసి వేడుకలకు హాజరవుతుంటారు.
ఇది ఊరంతా కలిసి నిర్వహించుకునే వేడుకన్నమాట. రంజాన్ సమయంలో చార్మినార్ నైట్ బజార్‌లాగ అహ్మదాబాద్ నగరంలోని పతంగిబజార్ డిసెంబర్ మూడోవారం నుంచి జనవరి రెండు వారాల వరకు మొత్తం నెలరోజుల పాటు రోజూ 24 గంటలూ తెరిచే ఉంటుంది. ఎన్నివేల పతంగులు అమ్ముడవుతాయో లెక్క అందదు. మాంజాకు గాజు పొడి అద్దే దుష్టసంప్రదాయాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ నియమాన్ని కచ్చితంగా పాటించేటట్లు గట్టి నిఘా కూడా ఉంటుంది.
పెద్దల కేరింతలు
మన తెలుగువాళ్లు సంక్రాంతికి ప్రతి ఇంట్లో పతంగులు ఎగురవేస్తారు. హైదరాబాద్ ఆకాశం కూడా పతంగులతో కనువిందు చేస్తుంది. కానీ ఇక్కడ పిల్లలు పతంగులతో ఆనందిస్తుంటే పెద్దవాళ్లు పిల్లలను చూసి ఆనందిస్తుంటారు. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్‌లో పెద్దవాళ్లు చిన్న పిల్లలైపోతారు. పరుగులు తీస్తూ మాంజాను జాడిస్తూ పతంగి పైకి ఎగిరే కొద్దీ కెవ్వున కేరింతలు కొడుతూ ఉంటే వాళ్లను చూసి పిల్లలు చప్పట్లు కొడుతూ ఈ వేడుకను ఎంజాయ్ చేస్తారు.
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment