సాక్షి, సిటీబ్యూరో: పతంగులు అంటే సంక్రాంతి. సంక్రాంతి అంటే పతంగులు అన్నట్టుగా నగర జీవితం ముడిపడి ఉంది. తరతరాలుగా హైదరాబాద్ నగరంలో పతంగుల(గాలిపటాటు) తయారీ...పతంగులు ఎగురవేయడం ఇక్కడ ప్రత్యేకతగా చెప్పొచ్చు.
ప్రాచీన సంప్రదాయం...
హైదరాబాద్ నగరం ఏర్పడినప్పటి నుంచే(400 ఏళ్ల క్రితం) ఇక్కడ పతంగులు ఎగురవేసే సంస్కృతి ఉన్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. కుతుబ్ షాహీల కాలం నుంచి ప్రతి ఏటా హేమంత రుతువులో నగరంలో పతంగుల పండుగ కొనసాగుతుంది. ఇబ్రాహీం కులీకుతుబ్ షా హయాంలో గోల్కొండ కోటలో పతంగుల పండుగ అధికారికంగా జరిగేదట. ఆ రోజుల్లో కాగితాలతో చేసిన పతంగులు, మూలికలతో చేసిన మాంజాతో పోటీలు కూడా జరిగేవని చరిత్రకారులు తమ పుస్తకాల్లో రాశారు. కుతుబ్ షాహీల అనంతరం అసఫ్ జాహీల పాలనా కాలంలో హైదరాబాద్ ( పాతబస్తీలోని) మైదానాల్లో పతంగుల పండుగ ఘనంగా నిర్వహించే వారు. ఇక అరవ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ పాలనా కాలంలో పతంగుల పండుగకు మరింత గుర్తింపు వచ్చింది. మైదానాల్లో పతంగుల పోటీలు నిర్వహించి ఎక్కువ పతంగులను పడగొట్టిన వారికి బహుమతులు కూడా ఇచ్చేవారు. 1985 వరకు పాతబస్తీలో ప్రతి ఏటా పతంగుల పోటీలు నిర్వహించారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పోటీలు జరుగుతున్నాయి..
తగ్గుతున్న సందడి
గత 10 ఏళ్లుగా పతంగుల హడావుడి తగ్గుతోంది. ఆధునిక పోకడలతో పిల్లల్లో పతంగులపై ఆసక్తి తగ్గింది. వీడియో గేమ్స్, కంప్యూటర్ గేమ్స్, నగరంలో మైదానాలు లేకపోవడం, పతంగులు ఎగురవేసే పద్ధతులు నేర్పించే వారు తక్కువవడం తదితర కారణాల చేత పిల్లలు ఆసక్తి చూపడంలేదు. ఎదో పండుగ రోజు కాసేపు పతంగులు ఎగుర వేసి మళ్లీ స్మార్ట్ గేమ్స్‌లో మునిగిపోతున్నారు. దీంతో తరతరాలుగా పతంగులు తయారు చేస్తున్న కుటుంబాలు చితికిపోతున్నాయి. సరైన ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నాయి. పతంగుల తయారీలో ఎక్కువ శాతం మహిళలు ఉండడంతో వారికి కూలీ కూడా పడడంలేదు. గతంలో సంక్రాంతి సీజన్‌లోనే కాకుండా వేసవి సెలవులు, ఇతర సీజన్‌లలో పతంగుల విక్రయాలు జోరుగా ఉండేవి. ప్రస్తుతం సంక్రాంతి సీజన్‌లో కూడా అమ్మకాలు లేక ఇబ్బందులు ఎదర్కొంటున్నామని తయారీదారులు వాపోయారు.
నాలుగు తరాలుగా ఇదే వృత్తి
నాలుగు తరాలుగా ఇదే వ్యాపారంలో ఉన్నాం. అప్పటి నుంచి మా కుటుంబం పతంగుల తయారీపైనే ఆధారపడి ఉంది. ప్రసుత్తం పతంగుల వ్యాపారానికి ఆదరణ లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. గతంలో వందల సంఖ్యలో ఉన్న కుటుంబాలు నేడు పదుల సంఖ్యకు చేరుకున్నాయి. నెలల కొద్దీ చేసే పని ఇప్పుడు వారాల్లోకి వచ్చింది.– ముహ్మద్ సాబేర్, డబీర్‌పుర, పతంగుల తయారీదారు
నాలుగు నెలల ముందు నుంచే తయారీ
నిజాం కాలం నుంచి పతంగుల పండుగ ఉంది. సంక్రాంతికి నాలుగు నెలల ముందే పతంగుల తయారీ జరిగేది. యావత్తు తెలంగాణ జిల్లాలకు ఇక్కడి నుంచే సరఫరా అయ్యేవి. సంక్రాంతి సీజన్‌లో అప్పట్లో లక్షల్లో తయారు అయ్యేవి. ఇప్పుడు రానురాను ఆదరణ తగ్గుతోంది. తయారీ..వ్యాపారం కూడా బాగా పడిపోయింది.– భగవాన్ దాస్ బజాజ్, కాలికమాన్
Comments
Please login to add a commentAdd a comment