
సంక్రాంతి పండుగకు పట్నం జనం పల్లెబాట పడుతున్నారు. హైదరాబాద్–విజయవాడ హైవేపై వాహనాల రద్దీ నెలకొంది.
చౌటుప్పల్ రూరల్: సంక్రాంతి పండుగకు పట్నం జనం పల్లెబాట పడుతున్నారు. హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఆంధ్రప్రదేశ్ వాసులతోపాటు తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల వాసులు స్వస్థలాలకు వెళ్తున్నారు. శనివారం నుంచే విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో హైదరాబాద్–విజయవాడ హైవేపై వాహనాల రద్దీ నెలకొంది. టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా అదనంగా టోల్ వేలను తెరిచారు. 16 టోల్ వేలు ఉండగా, విజయవాడ వైపు 10, హైదరాబాద్ వైపు 6 మార్గాలను కేటాయించారు.
చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద క్యూ కట్టిన వాహనాలు
సై.. సై.. జోడెడ్లా బండి
రాజానగరం: తూర్పు గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. రాజానగరం మండలం వెలుగుబంద గ్రామంలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి ఎడ్ల బండ్ల పోటీలు ఉర్రూతలూగించాయి. 1,500 మీటర్లు, 1,000 మీటర్ల నిడివిలో సీనియర్స్, జూనియర్స్ విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 63 జతల ఎద్దులు పాల్గొన్నాయి. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఈ పోటీలను ప్రారంభించగా, విజేతలకు రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్ బహుమతులు ప్రదానం చేశారు.