native places
-
Pongal: భాగ్యవంతులొస్తున్నారు..
ఆశలు మూటలు నెత్తిన మోస్తూ గతంలో తాము నడిచివెళ్లిన బాటల్లో ఆనందపు అడుగులను వెతుక్కుంటూ భాగ్యవంతులు వస్తున్నారు. ఇంకో వారంపదిరోజుల్లో హైదరాబాద్, బెజవాడ..గుంటూరు..నెల్లూరు..నల్గొండ.. ఈస్ట్..వెస్ట్.. జిల్లాలనుంచి వేలమందిని మోసుకుంటూ రైళ్లు బస్సులు మన్యం జిల్లాకు వస్తుంటాయి. వాళ్లంతా వలసకూలీలని సామాజికవేత్తలు అంటుంటారు కానీ నాలాంటి అల్ప సంతోషులు మాత్రం వాళ్ళను భాగ్యవంతులు అంటారు. వాళ్లంతా ఇక్కడ బతకలేని పేదలని మేధావులు అంటారు. నాలాంటి సామాన్యులు మాత్రం వాళ్లంతా తమ బతుకులు బాగుచేసుకునేందుకు జిల్లాల హద్దులు దాటిన శ్రమజీవులని అంటాం భోగి ముందురోజు రాత్రి ఐడ్రా బాడ్ నుంచొచ్చిన అప్పలనాయుడు, లక్ష్మీ, నాయుడి వీరకాడు నారాయణ, ఇరుగుపొరుగు వట్టిగడ్డి కుప్పేసి దమట ముట్టించి సుట్టూ కూకుని కవుర్లు మొదలెట్టారు.. మరేటిబావా ఐడ్రాబాడ్లో అంతా బాగున్నట్టేనా అన్న నారాయణ ప్రశ్న పూర్తి కాకుండానే లక్ష్మీ అందుకుని.. పర్లేదన్నియ్యా ఇద్దరం డూటీకి వెళ్తాం..మాతోబాటే మా మహేసూ వస్తాడు.. ముగ్గురికి బాగానే వస్తాది అదోరం సెలవు.. ఒకలి జీతం అద్దికి.. ఖర్చులకు పోయినా రెండు జీతాలు మిగుల్తాయి.. మరి దాంతోటే కదా ఈ ఇల్లు పునాదులు రేకులు వెయ్యడం.. పెద్దదాని పెళ్లి అప్పు లచ్చన్నర తీర్చడం..చిన్నదాన్ని నర్స్ ట్రైనింగ్.. అంతా దాన్లోంచే అంటున్నప్పుడు ఒకనాడు వంద నోటును అబ్బురంగా చూసిన పేదరికాన్ని కష్టంతో దాటుకొచ్చాము అంటున్న లక్ష్మీ ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. అంతలోనే లక్ష్మీ మళ్ళీ అందుకుని తిండికి.. గుడ్డకు లోటు లేదన్నియ్యా.. మీ బావకు మాత్రం వారానికి మూడ్రోజులు కౌసు ఉండాలి అంటున్నప్పుడు ఆరేడేళ్ళు క్రితం ఇదేఊళ్ళో అడ్డిడు బియ్యం.. తవ్విడు నూకలికి ఇల్లిల్లూ తిరిగిన జ్ఞాపకాన్ని మర్చిపోలేదు అంటూనే ఇప్పుడు మేం అలా లేం. మేం కష్టంతో స్థాయిని పెంచుకున్నాం అంటుంది.. పోన్లేర్రా ఊళ్ళో అయినోళ్ళ ముందు చెడి .. చెయ్యిచాచి బతకడం కన్నా ఊరుదాటి బాగుపడడం మేలని నారాయణ చెబుతుండగా పక్కింది వదిన చేటలో చెత్త పెంటమీద పారేస్తూ దమటకాడికి వస్తూనే ఏటీ నచ్చిమొదినా చెవులోవి కొత్తవా ఏటీ అన్నాది. వెంటనే లక్ష్మీ మొహాన్ని సంతోషం కమ్మేయగా..అవును మంగొదినా ఇన్నాళ్లకు ఆర్తులం సెయిను, ఆర్తులం జూకాలూ చేయించాడు మీ అన్నియ్య అని చెబుతూ భర్తను మురిపెంగా చూస్తుంటే దమట వెలుగులో జూకాలు మరింత మెరుస్తూ కనిపించాయి. ఇదిగో ఈ సీర్లన్నీ సీఎమ్మారులో కొనేసామ్ ఒకేసారి అంటున్నప్పుడు అప్పట్లో పాతచీరలకోసం తెలిసినవాళ్లను అడిగిన లక్ష్మీ గొంతులో మాకిప్పుడా అవసరం లేదన్న భరోసా వినిపించింది.. మొన్నామధ్య యాదగిరి వెళ్ళాము. తిరప్తి కన్నా పెద్దది తెలుసా.. ఇంతంత కాదని చెబుతున్నపుడు మేం విహారయాత్రలకూ వెళ్తాం..మేం అప్పట్లా లేం.. అనే ధీమా ముప్పిరిగొంటుంది. పాత్రల పేర్లు మారతాయేమో కానీ పార్వతీపురం డివిజన్లోని ప్రతిగ్రామంలోనూ ఇలాంటి కుటుంబాలు ఉన్నాయి. ఆరేడేళ్ళ క్రిందట పూటపుటనూ లెక్కించుకుని జీవించే వందలాది కుటుంబాలు.. కాలాన్ని నిందించలేదు. ప్రభుత్వాలను తిట్టలేదు. కష్టాన్ని నమ్ముకుని ట్రైన్..బస్సు ఎక్కి.. ఆ జిల్లాలకు వెళ్లాయి. రైస్ మిల్లులు..నూలు మిల్లులు..టాబ్లెట్స్.. ప్లాస్టిక్ కంపెనీలు..చేపలు..రొయ్యల చెరువులు..ఫామ్ హవుసులు.. కోళ్లఫారాలు..డైరీ ఫారాలు.. ఎక్కడ పనిదొరికితే అక్కడ చేరిపోయారు.. పాపం అమాయకులు..నిజాయితీగా ఒళ్ళోంచి పనిచేస్తారు.. అందుకేనేమో కొద్దిరోజుల్లోనే యజమానులకు ఇష్టులైపోయారు. చాలామందికి..చిన్నపాటి షెడ్.. ఇల్లు..రేషన్ కూడా యజమానులే ఇస్తారు..ఇక ఖర్చేముంది.. మూణ్ణాలుగేళ్ళు తిరిగేసరికి తమ జీవితం మారుతుందన్న.. మారిందన్న తేడా వాళ్ళకే స్పష్టంగా కనిపిస్తోంది. కోట్లు లేకపోవచ్చు..లక్షలూ అక్కర్లేదు. శ్రమే పెట్టుబడి.. మూడేళ్లు తిరిగేసరికి మెల్లగా చేతిలో డబ్బు కనిపిస్తుంది..తమ అభివృద్ధి తమకే తెలుస్తోంది. ఓపికున్నన్నాళ్లు చేద్దాం..ఊళ్ళోకొచ్చి మాత్రం చేసేదేముందన్న ధీమా.. కష్టంలోనే ఆనందం.. వచ్చే జీతంలోనే సంతోషం ..ఆ పక్కనే సంబరం.. ఇంతకన్నా భాగ్యవంతులెవరు.. డబ్బుమాత్రమే ఉన్నోళ్లు ధనవంతులు అవుతారు. జీవితంలో అన్నీ కోణాలూ..అన్ని భావాలూ.. అన్ని ఎత్తుపల్లాలూ చూసి తమను తాము గెలిచినవాళ్ళు భాగ్యవంతులే... ఓ రాసీరాయని పెన్నుతో వీళ్ళ జీవనరేఖలను బ్రహ్మ తన ఇష్టానుసారం రాసేస్తుంటే బ్రహ్మచేతిని ఒడిసిపట్టుకుని అలాక్కాడు.. మా రాత మేం రాసుకుంటాం.. నువ్ పక్కకేళ్లు సామీ అని గదమాయించి తమ రేఖలను భాగ్యరేఖలుగా మార్చుకున్న కుటుంబాలు కోకొల్లలు... వీళ్ళెవరూ పేదలు కారు...అవును పేదలు కారు...అక్షరాలా శ్రామికులు.. కార్మికులు... కృషి..శ్రమ ఉన్నచోట పేదరికం ఉండదు. దానికి వీళ్లంటే భయమెక్కువ.. పారిపోతుంది.. ఎక్కడికి..ఇంకెక్కడికి.. సోమరిపోతుల దగ్గరకు... శ్రమయేవ జయతే కృషితో నాస్తి దుర్భిక్షం. గాంధీ... విజయనగరం -
Hyderabad: పండగ ప్రయాణాలపై పోలీసుల అలర్ట్.. సోషల్ పోస్టులొద్దు!
సాక్షి, హైదరాబాద్: ‘దసరా పండగకు సొంతూరికి వెళ్తున్నామని, ఫ్యామిలీతో లాంగ్ టూర్లో ఉన్నామని..ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకండి. ఎందుకంటే మీరు తిరిగొచ్చేసరికి మీ ఇల్లు గుల్లయ్యే ప్రమాదముంది.’ అంటూ పోలీసులు నగర పౌరులను హెచ్చరిస్తున్నారు. ఇటీవల నేరస్తులు సైతం తెలివిమీరి సోషల్ మీడియాను ఫాలో అవుతూ ఊరెళ్లిన వారి ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పలు సూచనలు చేశారు. ► మీరు ఊరెళుతున్న విషయాన్ని స్థానిక పోలీసుస్టేషన్లో సమాచారం ఇవ్వాలి. ► ఇంటి లోపల సీసీ కెమెరాలు అమర్చుకొని, వాటి డీవీఆర్లు బయటికి కనిపించకుండా రహస్య ప్రదేశంలో ఉంచాలి. ► సీసీ కెమెరాలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ► బంగారు, వెండి ఆభరణాలు, నగదును బ్యాంకులో భద్రపర్చుకోండి. లేదా ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోండి. ► ఇంటికి సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సార్లను ఏర్పాటు చేసుకోవాలి. ► కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా 9490617444 వాట్సాప్ నంబరులో సమాచారం ఇవ్వాలి. -
Photo Feature: పల్లెకు ‘సిటీ’జనులు
చౌటుప్పల్ రూరల్: సంక్రాంతి పండుగకు పట్నం జనం పల్లెబాట పడుతున్నారు. హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఆంధ్రప్రదేశ్ వాసులతోపాటు తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల వాసులు స్వస్థలాలకు వెళ్తున్నారు. శనివారం నుంచే విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో హైదరాబాద్–విజయవాడ హైవేపై వాహనాల రద్దీ నెలకొంది. టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా అదనంగా టోల్ వేలను తెరిచారు. 16 టోల్ వేలు ఉండగా, విజయవాడ వైపు 10, హైదరాబాద్ వైపు 6 మార్గాలను కేటాయించారు. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద క్యూ కట్టిన వాహనాలు సై.. సై.. జోడెడ్లా బండి రాజానగరం: తూర్పు గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. రాజానగరం మండలం వెలుగుబంద గ్రామంలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి ఎడ్ల బండ్ల పోటీలు ఉర్రూతలూగించాయి. 1,500 మీటర్లు, 1,000 మీటర్ల నిడివిలో సీనియర్స్, జూనియర్స్ విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 63 జతల ఎద్దులు పాల్గొన్నాయి. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఈ పోటీలను ప్రారంభించగా, విజేతలకు రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్ బహుమతులు ప్రదానం చేశారు. -
వేలాదిగా కశ్మీర్‌ను వీడుతున్న వలసకూలీలు
జమ్మూ: ఉగ్రమూకలు లక్ష్యంగా చేసుకోవడంతో కశ్మీర్‌లోని వలసకూలీలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని స్వస్థలాలకు పరుగులు తీస్తున్నారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో టిక్కెట్ కౌంటర్ల వద్ద పడిగాపులు పడుతున్నారు. ఉగ్రవాదులు మైనారిటీలను, వలస కూలీలను లక్ష్యంగా చేసుకొని వ్యూహాత్మకంగా దాడులు కొనసాగిస్తుండటంతో ఈనెలలో ఇప్పటిదాకా అమాయకులైన 11 మంది పౌరులు మృతి చెందారు. ఇది భయోత్పాత వాతావరణాన్ని సృష్టించింది. వలసకూలీలు మంగళవారం వేలాదిగా జమ్మూలోని రైల్వేస్టేషన్లకు తరలివచ్చారు. జమ్మూ, ఉదంపూర్‌లలో ముందు జాగ్రత్తగా రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల వద్ద భద్రతను పెంచారు. ప్రతియేటా మూడు నుంచి నాలుగు లక్షల మంది వలస కూలీలు పనిని వెతుక్కుంటూ కశ్మీర్ లోయకు వస్తారు. మార్చిలో వచ్చి నవంబర్‌లో శీతాకాలం ఆరంభంలో వెళ్లిపోతారు. రాతిపని, వడ్రంగి, వెల్డింగ్, వ్యవసాయ కూలీలుగా వీరు పనిచేస్తారు. ఆదివారం కూల్గామ్ జిల్లాలో వలస కూలీల శిబిరాల్లోకి వచ్చి ఉగ్రవాదులు ఇద్దరు కార్మికులను కాల్చి చంపడంతో... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు భీతిల్లిపోయారు. ఇక్కడుంటే ఏ క్షణం ఎటువైపు నుంచి కాల్పులు జరుగుతాయో, ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తోందోననే భయంతో నిర్ణీత సమయానికి కంటే ముందే కశ్మీర్‌ను వదిలి స్వస్థలాలకు వెళ్లి పోతున్నారు. పరిస్థితిని ప్రధానికి వివరించిన అమిత్ షా న్యూఢిల్లీ: కశ్మీర్లో తాజా పరిస్థితులను వివరించడానికి హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. భద్రతను మెరుగుపర్చడానికి కశ్మీర్ అధికార యంత్రాంగం, కేంద్ర హోంశాఖ తీసుకున్న చర్యలను వివరించారు. కశ్మీర్లో ఉగ్రమూకలు సృష్టిస్తున్న భయోత్పాత వాతావరణం, ఫలితంగా కూలీలు పెద్దసంఖ్యలో స్వస్థలాలకు వెళ్లిపోతుండటం వంటి అంశాలను ప్రధాని దృష్టికి తెచ్చారు. కాగా ఈనెల 23 నుంచి 25 వరకు అమిత్ షా జమ్మూ కశ్మీర్లో పర్యటించనున్నారు. భద్రతపై సమీక్షిస్తారు. చదవండి: ఉత్తరాఖండ్‌లో జలవిలయం -
వలస గోస
సాక్షి, హైదరాబాద్: వలస కార్మికులు సొంత రాష్ట్రాల బాటపట్టారు. కరోనా నియంత్రణకు అమలుచేస్తున్న లాక్‌డౌన్‌తో జీవనోపాధి కోల్పోయి, వేతనాలందక.. దొరికిన పూట తిం టూ.. లేనినాడు పస్తులుంటూ అష్టకష్టాలు పడుతున్న శ్రమజీవులు సొంతూళ్లకు తరలిపోతున్నారు. ఊళ్లలో అయినవారెలా ఉన్నారోననే ఆందోళన.. కరోనాతో మరణిస్తే అనాథ శవంగా మిగిలిపోతామనే భయం.. వెరసి ఎలాగో వెళ్లిపోతే ఉపాధి హామీ పనులైనా చేసుకుని బతకొచ్చనే భావనతో భారంగా కదిలిపోతున్నారు. వందలు, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భార్యాపిల్లలు, ముసలి తల్లిదండ్రులను చేరుకోవడానికి ఆరాటపడుతున్నారు. మూటాముల్లె నెత్తిన పెట్టుకుని మండుటెండల్లో కాలినడకన సుదూర గమ్యంవైపు సాగిపోతున్నారు. లాక్‌డౌన్‌తో బస్సులు, రైళ్లవంటి ప్రజారవాణా సదుపాయా ల్లేక కాళ్లనే నమ్ముకున్నారు. లాక్‌డౌన్‌తో చిక్కుకుపోయిన వల స కూలీలు, విద్యార్థులు, భక్తులు, టూరిస్టులను సొంత ప్రాం తాలకు పంపించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బుధవా రం అనుమతిచ్చింది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తమ రాష్ట్ర ప్రజలను రప్పించుకోవడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే బస్సులు ఏర్పాటు చేయాలని సూచించింది. అయితే, బస్సుల ఏర్పాటుపై నమ్మకం లేకనో లేదా ఇళ్లకు తొందరగా చేరుకోవాలనే ఆత్రుతతోనో వేలసంఖ్యలో కార్మికులు రాష్ట్రంలోని హైవేలపై కాలినడకన వెళ్తూ కనిపిస్తున్నారు. ఆగని పయనం.. రాష్ట్రంలోని భవన నిర్మాణరంగ ప్రాజెక్టుల్లో 4లక్షల మంది వలస కార్మికులు పనిచేస్తుండగా, లాక్డౌన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సగం మంది సొంతూళ్లకు వెళ్లిపోయారని బిల్డ ర్లు చెబుతున్నారు. ఇప్పటికే 40రోజుల సుదీర్ఘ లాక్‌డౌన్‌ను ఓపిగ్గా భరించిన మిగిలిన సగం మంది సైతం స్వగ్రామాలపై బెంగపెట్టుకున్నారు. మళ్లీ లాక్‌డౌన్‌ను పొడిగిస్తారని భావి స్తూ సుదీర్ఘ పయనానికి సిద్ధమవుతున్నారు. కాగా, లాక్డౌన్ నేపథ్యంలో వలస కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకు న్న చర్యలు కొంత ఊరట కలిగించాయి. రాష్ట్రవ్యాప్తంగా 948 ప్రాంతాల్లో జరుగుతున్న భవన నిర్మాణరంగ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న 95,859 మంది వలస కార్మికుల కోసం 285 లేబర్ క్యాంపులను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ప్రధానంగా ఇవన్నీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. లేబర్ క్యాంపుల్లో వసతి, ఆహారం, పారిశుధ్య సదుపాయాల్ని ఏర్పాటుచేసింది. ప్రస్తుతం ఈ క్యాంపు ల నుంచి కూడా రోజూ వేల మంది కార్మికులు కాలినడకన స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. నిర్మాణ రంగం కుదేలు.. రాష్ట్ర నిర్మాణంలో కీలకపాత్రధారులైన వలస కార్మికులు సొం త ప్రాంతాలకు వెళ్లిపోతే నడుస్తున్న ప్రాజెక్టుల పనులన్నీ కొ న్ని నెలల పాటు స్తంభించిపోతాయి. త్వరలో లాక్డౌన్ ఎత్తేసి నా లేక నిర్మాణరంగ పనులు చేసుకోవడానికి ప్రభుత్వం సడ లింపులిచ్చినా.. కార్మికుల కొరతతో ప నులు పునరుద్ధరించడం సాధ్యం కాద ని బిల్డర్లు, కాంట్రాక్టర్లు అంటున్నారు. లాక్‌డౌన్‌తో రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులు మినహా ఇతర అన్ని రం గాల్లో పనులు నిలిచిపోయాయి. వీటిని తిరిగి పునరుద్ధరించాలంటే ఊళ్లకు వెళ్లిపోయిన లక్షల మంది కార్మికులను తిరిగి రాష్ట్రా నికి రప్పించాలి. ఒకసారి కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోతే మరో రెండు మూడు నెలల తర్వాతే తిరిగివస్తారు. ఒకవేళ లాక్డౌన్ ఎత్తేసినా.. రాష్ట్రంలో నిర్మాణరంగ పనులు పూర్తిస్థాయి లో ప్రారంభం కావడానికి కనీసం 3 నెలలు పట్టొచ్చని అంచ నా. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.5 వేల కోట్ల అంచనా వ్యయంతో కోటి చదరపు అడుగుల విస్తీర్ణంలో కమర్షియల్ భవనాలు, రూ.6వేల కోట్ల అంచనా వ్యయంతో 2కోట్ల చ.అ. విస్తీర్ణంలో గృహనిర్మాణ పనులు జరుగుతున్నాయి. 40 రోజులుగా ఈ పనులన్నీ నిలిచిపోవడంతో బిల్డర్లు భారీగా నష్టపోయారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం చేసిన రుణాలపై వడ్డీలు పెరిగిపోయి నష్టాల్లో కూరుకుపోతామని బిల్డర్లు అంటున్నారు. వలస వచ్చిన నైపుణ్యం వలస కార్మికులు వెనక్కి వెళ్లిపోతే వారి స్థానాన్ని భర్తీ చేసేందుకు రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన కార్మికులు లేరు. భవన ని ర్మాణ రంగంలో పనిచేసే వలస కార్మికులను పరిశీలిస్తే.. ఏపీ, తెలంగాణతో పాటు బిహార్ నుంచి తాపీమేస్త్రీలు, ఛత్తీస్‌గఢ్, యూపీ, మధ్యప్రదేశ్ నుంచి సెంట్రింగ్ వర్కర్లు, ఒడిశాలోని భైరాంపూర్ నుంచి ప్లంబింగ్, రాజస్తాన్ నుంచి కార్పెంటర్, యూపీ, బిహార్, రాజస్తాన్ నుంచి మార్బుల్, టైల్స్ఫ్లోరింగ్, ఫాల్‌సీలింగ్, పె యింటింగ్ వర్కర్లు, పశ్చిమబెంగాల్ నుంచి ఎలివేషన్ వర్కర్లు ఉంటారు. స్థా నిక కార్మికులతో పో లిస్తే తక్కువ వేత నాలకే వీరు పనిచేస్తారు. స్థానికం గా ఉన్న నిరుద్యో గులతో వీరి స్థానాన్ని భర్తీ చేసే అవకాశమున్నా, వలస కార్మికులతో పోలిస్తే వీరికి అధిక మొత్తంలో వేతనాలు చెల్లించాల్సి ఉంటుందని యాజమాన్యాలు ఇష్టపడవు. ప్రత్యామ్నాయం లేదు నగరాలకు వలస కార్మికులు కావాలి. వాళ్లు లేకపోతే నగరాల్లో ఇన్ని నిర్మాణాలు లేవు. వారు ఒకసారి సొంతూళ్లకు వెళ్తే తిరిగి రావడానికి 3 నెలలు పడుతుంది. స్థానికంగా నైపుణ్యమున్న కార్మికులు దొరకరు. లాక్డౌన్ ఎత్తేసినా వందశాతం బదులు 30శాతం పనే జరుగుతుంది. వీరి సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వలస కార్మికుల విధానం తీసుకురావాలి. లేబర్ క్యాంప్స్లో కనీస సదుపాయాలు, టాయిలెట్లు, వైద్య పరీక్షలు, పిల్లలకు విద్య వంటి చర్యలు తీసుకోవాలి. లాక్‌డౌన్‌తో భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. నిర్మాణాల పూర్తికి గడువును మరో 6 నెలల పాటు ప్రభుత్వం పొడిగించాలి. – జీవీ రావు, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
స్వస్థలాలకు బాలకార్మికులు
హైదరాబాద్: గాజుల బట్టీల్లో ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య పనిచేస్తూ పోలీసుల కార్డన్‌సెర్చ్ ఆపరేషన్‌లో దొరికిన చిన్నారులను వారి స్వస్థలాలకు పంపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం రామంతాపూర్‌లోని డాన్‌బాస్కో స్నేహసదన్తో పాటు, మరి కొన్ని చోట్ల ఆ బాలకార్మికులకు ప్రభుత్వం తాత్కాలికంగా ఆశ్రయం కల్పించింది. అయితే, ఆ చిన్నారుల్లో 14 మంది చికెన్‌ఫాక్స్, జ్వరం తదితర అనారోగ్య సమస్యలతో నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కమిటీ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పోలీస్, కార్మిక, శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం ఆయన రామంతాపూర్‌లోని డాన్‌బాస్కో స్నేహ సదన్‌లో బాల కార్మికులను కలసి వారి యోగాక్షేమాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాల కార్మికులను వారి స్వస్థలాలకు పంపేందుకు రైల్వే అధికారులను సంప్రదించగా రోజుకు ఒక ప్రత్యేక బోగీ కేటాయించేందుకు వారు అంగీకరించినట్లు తెలిపారు. మంగళవారం 75 మంది బాల కార్మికులను వారి స్వరాష్ట్రాలకు తరలించి తల్లిదండ్రులకు అప్పగిస్తామని చెప్పారు. చిన్నారులతో వెట్టిచాకిరి చేయిస్తున్న మాఫియాపై ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటుందన్నారు.