ఆశలు మూటలు నెత్తిన మోస్తూ గతంలో తాము నడిచివెళ్లిన బాటల్లో ఆనందపు అడుగులను వెతుక్కుంటూ భాగ్యవంతులు వస్తున్నారు. ఇంకో వారంపదిరోజుల్లో హైదరాబాద్, బెజవాడ..గుంటూరు..నెల్లూరు..నల్గొండ.. ఈస్ట్..వెస్ట్.. జిల్లాలనుంచి వేలమందిని మోసుకుంటూ రైళ్లు బస్సులు మన్యం జిల్లాకు వస్తుంటాయి. వాళ్లంతా వలసకూలీలని సామాజికవేత్తలు అంటుంటారు కానీ నాలాంటి అల్ప సంతోషులు మాత్రం వాళ్ళను భాగ్యవంతులు అంటారు. వాళ్లంతా ఇక్కడ బతకలేని పేదలని మేధావులు అంటారు.
నాలాంటి సామాన్యులు మాత్రం వాళ్లంతా తమ బతుకులు బాగుచేసుకునేందుకు జిల్లాల హద్దులు దాటిన శ్రమజీవులని అంటాం భోగి ముందురోజు రాత్రి ఐడ్రా బాడ్ నుంచొచ్చిన అప్పలనాయుడు, లక్ష్మీ, నాయుడి వీరకాడు నారాయణ, ఇరుగుపొరుగు వట్టిగడ్డి కుప్పేసి దమట ముట్టించి సుట్టూ కూకుని కవుర్లు మొదలెట్టారు.. మరేటిబావా ఐడ్రాబాడ్లో అంతా బాగున్నట్టేనా అన్న నారాయణ ప్రశ్న పూర్తి కాకుండానే లక్ష్మీ అందుకుని.. పర్లేదన్నియ్యా ఇద్దరం డూటీకి వెళ్తాం..మాతోబాటే మా మహేసూ వస్తాడు.. ముగ్గురికి బాగానే వస్తాది
అదోరం సెలవు.. ఒకలి జీతం అద్దికి.. ఖర్చులకు పోయినా రెండు జీతాలు మిగుల్తాయి.. మరి దాంతోటే కదా ఈ ఇల్లు పునాదులు రేకులు వెయ్యడం.. పెద్దదాని పెళ్లి అప్పు లచ్చన్నర తీర్చడం..చిన్నదాన్ని నర్స్ ట్రైనింగ్.. అంతా దాన్లోంచే అంటున్నప్పుడు ఒకనాడు వంద నోటును అబ్బురంగా చూసిన పేదరికాన్ని కష్టంతో దాటుకొచ్చాము అంటున్న లక్ష్మీ ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. అంతలోనే లక్ష్మీ మళ్ళీ అందుకుని తిండికి.. గుడ్డకు లోటు లేదన్నియ్యా.. మీ బావకు మాత్రం వారానికి మూడ్రోజులు కౌసు ఉండాలి అంటున్నప్పుడు ఆరేడేళ్ళు క్రితం ఇదేఊళ్ళో అడ్డిడు బియ్యం.. తవ్విడు నూకలికి ఇల్లిల్లూ తిరిగిన జ్ఞాపకాన్ని మర్చిపోలేదు అంటూనే ఇప్పుడు మేం అలా లేం.
మేం కష్టంతో స్థాయిని పెంచుకున్నాం అంటుంది.. పోన్లేర్రా ఊళ్ళో అయినోళ్ళ ముందు చెడి .. చెయ్యిచాచి బతకడం కన్నా ఊరుదాటి బాగుపడడం మేలని నారాయణ చెబుతుండగా పక్కింది వదిన చేటలో చెత్త పెంటమీద పారేస్తూ దమటకాడికి వస్తూనే ఏటీ నచ్చిమొదినా చెవులోవి కొత్తవా ఏటీ అన్నాది. వెంటనే లక్ష్మీ మొహాన్ని సంతోషం కమ్మేయగా..అవును మంగొదినా ఇన్నాళ్లకు ఆర్తులం సెయిను, ఆర్తులం జూకాలూ చేయించాడు మీ అన్నియ్య అని చెబుతూ భర్తను మురిపెంగా చూస్తుంటే దమట వెలుగులో జూకాలు మరింత మెరుస్తూ కనిపించాయి.
ఇదిగో ఈ సీర్లన్నీ సీఎమ్మారులో కొనేసామ్ ఒకేసారి అంటున్నప్పుడు అప్పట్లో పాతచీరలకోసం తెలిసినవాళ్లను అడిగిన లక్ష్మీ గొంతులో మాకిప్పుడా అవసరం లేదన్న భరోసా వినిపించింది.. మొన్నామధ్య యాదగిరి వెళ్ళాము. తిరప్తి కన్నా పెద్దది తెలుసా.. ఇంతంత కాదని చెబుతున్నపుడు మేం విహారయాత్రలకూ వెళ్తాం..మేం అప్పట్లా లేం.. అనే ధీమా ముప్పిరిగొంటుంది.
పాత్రల పేర్లు మారతాయేమో కానీ పార్వతీపురం డివిజన్‌లోని ప్రతిగ్రామంలోనూ ఇలాంటి కుటుంబాలు ఉన్నాయి. ఆరేడేళ్ళ క్రిందట పూటపుటనూ లెక్కించుకుని జీవించే వందలాది కుటుంబాలు.. కాలాన్ని నిందించలేదు. ప్రభుత్వాలను తిట్టలేదు. కష్టాన్ని నమ్ముకుని ట్రైన్..బస్సు ఎక్కి.. ఆ జిల్లాలకు వెళ్లాయి. రైస్ మిల్లులు..నూలు మిల్లులు..టాబ్లెట్స్.. ప్లాస్టిక్ కంపెనీలు..చేపలు..రొయ్యల చెరువులు..ఫామ్ హవుసులు.. కోళ్లఫారాలు..డైరీ ఫారాలు.. ఎక్కడ పనిదొరికితే అక్కడ చేరిపోయారు.. పాపం అమాయకులు..నిజాయితీగా ఒళ్ళోంచి పనిచేస్తారు.. అందుకేనేమో కొద్దిరోజుల్లోనే యజమానులకు ఇష్టులైపోయారు.
చాలామందికి..చిన్నపాటి షెడ్.. ఇల్లు..రేషన్ కూడా యజమానులే ఇస్తారు..ఇక ఖర్చేముంది.. మూణ్ణాలుగేళ్ళు తిరిగేసరికి తమ జీవితం మారుతుందన్న.. మారిందన్న తేడా వాళ్ళకే స్పష్టంగా కనిపిస్తోంది. కోట్లు లేకపోవచ్చు..లక్షలూ అక్కర్లేదు. శ్రమే పెట్టుబడి.. మూడేళ్లు తిరిగేసరికి మెల్లగా చేతిలో డబ్బు కనిపిస్తుంది..తమ అభివృద్ధి తమకే తెలుస్తోంది. ఓపికున్నన్నాళ్లు చేద్దాం..ఊళ్ళోకొచ్చి మాత్రం చేసేదేముందన్న ధీమా.. కష్టంలోనే ఆనందం.. వచ్చే జీతంలోనే సంతోషం ..ఆ పక్కనే సంబరం.. ఇంతకన్నా భాగ్యవంతులెవరు.. డబ్బుమాత్రమే ఉన్నోళ్లు ధనవంతులు అవుతారు.
జీవితంలో అన్నీ కోణాలూ..అన్ని భావాలూ.. అన్ని ఎత్తుపల్లాలూ చూసి తమను తాము గెలిచినవాళ్ళు భాగ్యవంతులే... ఓ రాసీరాయని పెన్నుతో వీళ్ళ జీవనరేఖలను బ్రహ్మ తన ఇష్టానుసారం రాసేస్తుంటే బ్రహ్మచేతిని ఒడిసిపట్టుకుని అలాక్కాడు.. మా రాత మేం రాసుకుంటాం.. నువ్ పక్కకేళ్లు సామీ అని గదమాయించి తమ రేఖలను భాగ్యరేఖలుగా మార్చుకున్న కుటుంబాలు కోకొల్లలు... వీళ్ళెవరూ పేదలు కారు...అవును పేదలు కారు...అక్షరాలా శ్రామికులు.. కార్మికులు... కృషి..శ్రమ ఉన్నచోట పేదరికం ఉండదు. దానికి వీళ్లంటే భయమెక్కువ.. పారిపోతుంది.. ఎక్కడికి..ఇంకెక్కడికి.. సోమరిపోతుల దగ్గరకు... శ్రమయేవ జయతే కృషితో నాస్తి దుర్భిక్షం.
గాంధీ... విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment