వలస గోస | Migrant Workers Returning To Their Native Places From Cities | Sakshi
Sakshi News home page

వలస గోస

Published Fri, May 1 2020 3:04 AM | Last Updated on Fri, May 1 2020 3:04 AM

Migrant Workers Returning To Their Native Places From Cities - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వలస కార్మికులు సొంత రాష్ట్రాల బాటపట్టారు. కరోనా నియంత్రణకు అమలుచేస్తున్న లాక్‌డౌన్‌తో జీవనోపాధి కోల్పోయి, వేతనాలందక.. దొరికిన పూట తిం టూ.. లేనినాడు పస్తులుంటూ అష్టకష్టాలు పడుతున్న శ్రమజీవులు సొంతూళ్లకు తరలిపోతున్నారు. ఊళ్లలో అయినవారెలా ఉన్నారోననే ఆందోళన.. కరోనాతో మరణిస్తే అనాథ శవంగా మిగిలిపోతామనే భయం.. వెరసి ఎలాగో వెళ్లిపోతే ఉపాధి హామీ పనులైనా చేసుకుని బతకొచ్చనే భావనతో భారంగా కదిలిపోతున్నారు. వందలు, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భార్యాపిల్లలు, ముసలి తల్లిదండ్రులను చేరుకోవడానికి ఆరాటపడుతున్నారు.

మూటాముల్లె నెత్తిన పెట్టుకుని మండుటెండల్లో కాలినడకన సుదూర గమ్యంవైపు సాగిపోతున్నారు. లాక్‌డౌన్‌తో బస్సులు, రైళ్లవంటి ప్రజారవాణా సదుపాయా ల్లేక కాళ్లనే నమ్ముకున్నారు. లాక్‌డౌన్‌తో చిక్కుకుపోయిన వల స కూలీలు, విద్యార్థులు, భక్తులు, టూరిస్టులను సొంత ప్రాం తాలకు పంపించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బుధవా రం అనుమతిచ్చింది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తమ రాష్ట్ర ప్రజలను రప్పించుకోవడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే బస్సులు ఏర్పాటు చేయాలని సూచించింది. అయితే, బస్సుల ఏర్పాటుపై నమ్మకం లేకనో లేదా ఇళ్లకు తొందరగా చేరుకోవాలనే ఆత్రుతతోనో వేలసంఖ్యలో కార్మికులు రాష్ట్రంలోని హైవేలపై కాలినడకన వెళ్తూ కనిపిస్తున్నారు.

ఆగని పయనం.. 
రాష్ట్రంలోని భవన నిర్మాణరంగ ప్రాజెక్టుల్లో 4లక్షల మంది వలస కార్మికులు పనిచేస్తుండగా, లాక్‌డౌన్‌ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సగం మంది సొంతూళ్లకు వెళ్లిపోయారని బిల్డ ర్లు చెబుతున్నారు. ఇప్పటికే 40రోజుల సుదీర్ఘ లాక్‌డౌన్‌ను ఓపిగ్గా భరించిన మిగిలిన సగం మంది సైతం స్వగ్రామాలపై బెంగపెట్టుకున్నారు. మళ్లీ లాక్‌డౌన్‌ను పొడిగిస్తారని భావి స్తూ సుదీర్ఘ పయనానికి సిద్ధమవుతున్నారు. కాగా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకు న్న చర్యలు కొంత ఊరట కలిగించాయి.

రాష్ట్రవ్యాప్తంగా 948 ప్రాంతాల్లో జరుగుతున్న భవన నిర్మాణరంగ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న 95,859 మంది వలస కార్మికుల కోసం 285 లేబర్‌ క్యాంపులను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ప్రధానంగా ఇవన్నీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. లేబర్‌ క్యాంపుల్లో వసతి, ఆహారం, పారిశుధ్య సదుపాయాల్ని ఏర్పాటుచేసింది. ప్రస్తుతం ఈ క్యాంపు ల నుంచి కూడా రోజూ వేల మంది కార్మికులు కాలినడకన స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు.

నిర్మాణ రంగం కుదేలు..
రాష్ట్ర నిర్మాణంలో కీలకపాత్రధారులైన వలస కార్మికులు సొం త ప్రాంతాలకు వెళ్లిపోతే నడుస్తున్న ప్రాజెక్టుల పనులన్నీ కొ న్ని నెలల పాటు స్తంభించిపోతాయి. త్వరలో లాక్‌డౌన్‌ ఎత్తేసి నా లేక నిర్మాణరంగ పనులు చేసుకోవడానికి ప్రభుత్వం సడ లింపులిచ్చినా.. కార్మికుల కొరతతో ప నులు పునరుద్ధరించడం సాధ్యం కాద ని బిల్డర్లు, కాంట్రాక్టర్లు అంటున్నారు.  లాక్‌డౌన్‌తో రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులు మినహా ఇతర అన్ని రం గాల్లో పనులు నిలిచిపోయాయి. వీటిని తిరిగి పునరుద్ధరించాలంటే ఊళ్లకు వెళ్లిపోయిన లక్షల మంది కార్మికులను తిరిగి రాష్ట్రా నికి రప్పించాలి. ఒకసారి కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోతే మరో రెండు మూడు నెలల తర్వాతే తిరిగివస్తారు.

ఒకవేళ లాక్‌డౌన్‌ ఎత్తేసినా.. రాష్ట్రంలో నిర్మాణరంగ పనులు పూర్తిస్థాయి లో ప్రారంభం కావడానికి కనీసం 3 నెలలు పట్టొచ్చని అంచ నా. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.5 వేల కోట్ల అంచనా వ్యయంతో కోటి చదరపు అడుగుల విస్తీర్ణంలో కమర్షియల్‌ భవనాలు, రూ.6వేల కోట్ల అంచనా వ్యయంతో 2కోట్ల చ.అ. విస్తీర్ణంలో గృహనిర్మాణ పనులు జరుగుతున్నాయి. 40 రోజులుగా ఈ పనులన్నీ నిలిచిపోవడంతో బిల్డర్లు భారీగా నష్టపోయారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం చేసిన రుణాలపై వడ్డీలు పెరిగిపోయి నష్టాల్లో కూరుకుపోతామని బిల్డర్లు అంటున్నారు.

వలస వచ్చిన నైపుణ్యం 
వలస కార్మికులు వెనక్కి వెళ్లిపోతే వారి స్థానాన్ని భర్తీ చేసేందుకు రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన కార్మికులు లేరు. భవన ని ర్మాణ రంగంలో పనిచేసే వలస కార్మికులను పరిశీలిస్తే.. ఏపీ, తెలంగాణతో పాటు బిహార్‌ నుంచి తాపీమేస్త్రీలు, ఛత్తీస్‌గఢ్, యూపీ, మధ్యప్రదేశ్‌ నుంచి సెంట్రింగ్‌ వర్కర్లు, ఒడిశాలోని భైరాంపూర్‌ నుంచి ప్లంబింగ్, రాజస్తాన్‌ నుంచి కార్పెంటర్, యూపీ, బిహార్, రాజస్తాన్‌ నుంచి మార్బుల్, టైల్స్‌ఫ్లోరింగ్, ఫాల్‌సీలింగ్, పె యింటింగ్‌ వర్కర్లు, పశ్చిమబెంగాల్‌ నుంచి ఎలివేషన్‌ వర్కర్లు ఉంటారు. స్థా నిక కార్మికులతో పో లిస్తే తక్కువ వేత నాలకే వీరు పనిచేస్తారు. స్థానికం గా ఉన్న నిరుద్యో గులతో వీరి స్థానాన్ని భర్తీ చేసే అవకాశమున్నా, వలస కార్మికులతో పోలిస్తే వీరికి అధిక మొత్తంలో వేతనాలు చెల్లించాల్సి ఉంటుందని యాజమాన్యాలు ఇష్టపడవు.

ప్రత్యామ్నాయం లేదు 
నగరాలకు వలస కార్మికులు కావాలి. వాళ్లు లేకపోతే నగరాల్లో ఇన్ని నిర్మాణాలు లేవు. వారు ఒకసారి సొంతూళ్లకు వెళ్తే తిరిగి రావడానికి 3 నెలలు పడుతుంది. స్థానికంగా నైపుణ్యమున్న కార్మికులు దొరకరు. లాక్‌డౌన్‌ ఎత్తేసినా వందశాతం బదులు 30శాతం పనే జరుగుతుంది. వీరి సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వలస కార్మికుల విధానం తీసుకురావాలి. లేబర్‌ క్యాంప్స్‌లో కనీస సదుపాయాలు, టాయిలెట్లు, వైద్య పరీక్షలు, పిల్లలకు విద్య వంటి చర్యలు తీసుకోవాలి. లాక్‌డౌన్‌తో భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. నిర్మాణాల పూర్తికి గడువును మరో 6 నెలల పాటు ప్రభుత్వం పొడిగించాలి.
– జీవీ రావు, తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement