
పొట్ట చేతబట్టుకుని గల్ఫ్ దేశాలకు వలసపోయే కార్మికుల విషాద గాథలు మనకు కొత్తగాదు. జీవితాలు సవ్యంగా వెళ్తే సరేగానీ... ఒకసారంటూ సమస్యల్లో చిక్కుకుంటే అక్కడ నరకం చవి చూడక తప్పదని తరచు వెల్లడయ్యే ఘోర ఉదంతాలు చెబుతాయి. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబూధాబీలో చేయని నేరానికి ఉరికంబం ఎక్కిన ఉత్తరప్రదేశ్ యువతి షెహజాదీ ఉదంతం మరింత దారుణమైనది.
నాలుగు నెలల శిశువును హత్య చేసిందని ఆరోపిస్తూ మోపిన కేసులో ఆమె వాదనలన్నీ అరణ్య రోదనలు కాగా చివరకు గత నెల 15న అక్కడి ప్రభుత్వం ఆ యువతి ఉసురు తీసింది. జవాబుదారీతనం ఏమాత్రం లేని వ్యవస్థలతో నిండిన యూఏఈలో వలస కార్మికులకు వీసమెత్తు విలువుండదు. వారి ప్రాణాలకు పూచీ ఉండదు.
కానీ మన దేశం నుంచి వలసపోయే వారిలో అత్యధికులు ఎంచుకునేది యూఏఈనే. ఒక లెక్క ప్రకారం అక్కడ 35 లక్షలకు పైగా భారతీయ వలస కార్మికులున్నారు. ఆ దేశ జనాభాలో వీరి వాటా దాదాపు 33 శాతం. ఈ కార్మికుల్లో అత్యధికులు నివసించేది అబూధాబీలోనే.
వలస కార్మికుల రక్షణ కోసం మన దేశం చర్యలు తీసుకుంటున్న మాట వాస్తవమే అయినా అవి చాలినంతగా లేవు. మనకు యూఏఈతో ద్వైపాక్షిక కార్మిక ఒప్పందాలున్నాయి. ప్రవాసీ బీమా యోజన కింద తప్పనిసరి ఇన్సూరెన్స్ పథకం ఉంది. కార్మికుల హక్కులు కాపాడటానికీ, వలసల క్రమబద్ధీకరణకూ ఈ–మైగ్రేట్ వ్యవస్థ ఉంది. కానీ ఇవేవీ షెహజాదీని కాపాడలేకపోయాయి.
చిన్ననాడు ముఖంపై కాలిన గాయాలవల్ల ఏర్పడ్డ మచ్చలను తొలగించుకోవాలని ఆరాటపడి ఆమె ఒక మాయగాడి వలలో చిక్కుకుంది. యూఏఈలో ఉన్న తన బంధువుల ద్వారా అక్కడ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవచ్చని అతగాడు నమ్మించి షెహజాదీ నుంచి రూ. 3 లక్షలు, బంగారు నగలు తీసుకుని ఆమెను 2021 చివరిలో అబూధాబీకి పంపాడు. శస్త్రచికిత్స మాట వదిలి ఒక ఇంట్లో పని మనిషిగా చేర్చాడు.
ఆ ఇంటి యజమాని భార్య ఒక శిశువుకు జన్మనిచ్చాక అదనంగా శిశు సంరక్షణ భారం కూడా పడింది. నాలుగు నెలలున్న శిశువు వ్యాక్సిన్ వికటించి మరణిస్తే షెహజాదీపై హత్యా నేరం మోపారు. 2022 డిసెంబర్‌లో ఈ ఘటన జరిగిన నాటి నుంచీ దర్యాప్తు పేరుతో ఆమెను జైలు పాలు చేసిన పోలీసులు 2023 ఫిబ్రవరిలో లాంఛనంగా అరెస్టు చేశారు.
కోర్టులో విచారణ తంతు నడిపించి ఆమెను దోషిగా తేల్చారు. ఈ క్రమమంతా మన ప్రభుత్వ యంత్రాంగం, యూఏఈలోని మన రాయబార కార్యాలయం ఏం చేశాయన్నదే ప్రశ్న. శిశు మరణానికి కారణం స్పష్టంగా కనబడు తోంది. ఒక్కోసారి వ్యాక్సిన్లు శిశువులకు ప్రాణాంతకం కావటం అసాధారణమేమీ కాదు. ఆ మరణం వ్యాక్సిన్ వల్ల జరిగిందా లేక షెహజాదీయే శిశువుకు హాని తలపెట్టిందా అన్నది పోస్టు మార్టం జరిపితే వెల్లడయ్యేది.
కానీ ఆ శిశువు తండ్రి అందుకు ఒప్పుకోలేదట. కనుక షెహజాదీని కోర్టులు దోషిగా నిర్ధారించాయి! సరైన ప్రయత్నాలు జరిపివుంటే న్యాయం జరిగేదేమో! రాష్ట్రపతి, ప్రధాని మొదలుకొని అన్ని స్థాయుల్లోనూ మొరపెట్టుకుంటూనే ఉన్నామని, వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నామని కానీ సరైన స్పందన లేదని షెహజాదీ తండ్రి షబ్బీర్ ఖాన్ అంటున్నారు. ఆఖరికి తమ కుమార్తె బతికుందో లేదో చెప్పమని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆమె తండ్రి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తే తప్ప నిజమేమిటో వెల్లడి కాలేదు.
శస్త్ర చికిత్స కోసం వెళ్లిన యువతిని బలవంతంగా పనికి కుదుర్చుకోవటమేగాక ఆమెపై హత్యా నేరం మోపటం, కింది కోర్టు విధించిన శిక్షను ఉన్నత న్యాయస్థానం కనీస ఆలోచన లేకుండా ఖరారు చేయటం అమానవీయం. ప్రభుత్వం అంతకన్నా బాధ్యతారహితంగా వ్యవహరించింది.
గత నెల 15న మరణశిక్ష అమలు చేయగా, 17న రివ్యూ పిటిషన్ దాఖలైనప్పుడు సైతం కేసును పరిశీ లిస్తున్నామన్న జవాబే ఇచ్చింది. మరణశిక్ష అమలైనట్టు 28నగానీ మన రాయబార కార్యాలయానికి చెప్పలేదు. కేసు విషయంలో చేయగలిగిందంతా చేశామని మన విదేశాంగ శాఖ వివరిస్తోంది. ఆమె తరఫున క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయించామని, చట్టాలు కఠినంగా ఉండటంతో కాపాడలేక పోయామని అంటున్నది.
కానీ రెండేళ్లుగా నలుగుతున్న ఈ కేసు ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం, ఇతరత్రా హక్కుల సంఘాల దృష్టికి వెళ్లిందో లేదో తెలియదు. ఉసురు తీసేముందు చివరి కోరికగా తల్లిదండ్రులతో మాట్లాడించినా అది రెండు నిమిషాల ముచ్చటే అయింది.
సంపన్నవంతమైన దేశంలో కాయకష్టం చేస్తే మంచి సంపాదన ఉంటుందని భావించి చాలా మంది అక్కడికి వెళ్తుంటారు. కానీ 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో అత్యంత దారుణమైన పరి స్థితుల్లో పనిచేయాలని, అక్కడ అమల్లోవున్న కఫాలా వ్యవస్థ ప్రకారం వారి వీసాలు యజమానులకు అనుసంధానించి వస్తాయని, దిగినవెంటనే వారు పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకుంటారని, అందువల్ల మరోచోట పని వెదుక్కోవటం అసాధ్యమని చాలామందికి తెలియదు.
అధిక గంటలు పనిచేయించుకోవటం, వేతనాలు ఎగ్గొట్టడం, సామాజిక భద్రత పథకాలు లేకపోవటం వలస కార్మి కుల బతుకును దుర్భరం చేస్తోంది. ఈ విషయంలో యూఏఈతో మాట్లాడి తగిన చట్టాలు అమలయ్యేలా చూడటం, అక్కడ క్రిమినల్ కేసుల్లో చిక్కుకున్న మన కార్మికుల వివరాలు ఎప్పటికప్పుడు అందించే వ్యవస్థ అందుబాటులోకి తీసుకురావటం అవసరమని చెప్పాలి.
వలసపోయే కార్మికులకు అక్కడ పొంచివుండే ప్రమాదాల గురించి అవగాహన పెంచాలి. షెహజాదీని కాపాడుకోలేక పోయినా, ఆ స్థితి మరెవరికీ రాకుండా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment