ఎడారి గోసకు.. ఏదీ భరోసా! | New Migration From Telangana To Gulf | Sakshi
Sakshi News home page

ఎడారి గోసకు.. ఏదీ భరోసా!

Published Mon, Nov 14 2022 1:23 AM | Last Updated on Mon, Nov 14 2022 10:08 AM

New Migration From Telangana To Gulf - Sakshi

సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్‌: ఎడారి దేశాలకు వలసవెళ్లే కార్మికులకు భరో­సా కరువైంది. గల్ఫ్‌ దేశాలకు వెళ్లి జేబు నిండా డ­బ్బుల­తో తిరిగి వద్దామనుకున్న వారిని అనుకోని అ­వాం­తరాలు చుట్టుముడుతున్నాయి. తెలంగాణ నుం­చి ఇప్పటికే దాదాపు పదిహేను లక్షల మంది గల్ఫ్‌ దేశాల (సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతా­ర్, బహ్రేయిన్, ఒమన్‌)కు వెళ్లగా, తాజాగా కొత్తత­రం కూడా ఎడారి దేశాల బాటపడుతోంది.

ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని వారే ఆయా దే­శా­లకు వెళుతుండటంతో వారంతా భవన నిర్మాణం, వ్యవసాయం వంటి కఠినమైన పనుల్లో కుదురుతున్నా­రు. అక్కడి వాతావరణం, ఆహారం, తదితర పరిస్థితుల కారణంగా మానసిక ఒత్తిడితో అనారో­గ్యం, ఆపై మృత్యువాత పడుతున్నవారు కొందరైతే.. క్షణికావేశాలతో చేసే నేరాలతో జైళ్ల పాలవుతున్న వారు మరికొందరు. దీంతో వారి కుటుంబాలకు తీరని శోకం మిగులుతోంది. ఇలా గడిచిన ఎనిమిదిన్నరేళ్లలో 1,612 మంది గల్ఫ్‌ దేశాల్లో మృతి చెందారు. 

ఇంకా కూలీలుగానే 
తెలంగాణ ఏర్పాటు అనంతరం కూడా గల్ఫ్‌కు వెళ్లే వారి కోసం ప్రత్యేక సాంకేతిక శిక్షణ లేకపోవడంతో అక్కడకు వెళుతున్న వారిలో 90 శాతం కూలీలుగా­నే పనిచేస్తున్నారు. నిరక్షరాస్యత, ఎడారి దేశాల్లో వ్యవహరించే తీరుపై ముందస్తు అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే పని ప్రదేశంలో ప్రమాదాలు – వివాదాలు, రోడ్డు ప్ర­మా­దాల్లో మరణిస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దుబాయ్‌ బాధలుండవని నాయకులు హామీ ఇచ్చినా పే­ద కార్మికులకు భరోసా విషయంలో కార్యాచరణ ఇంకా కార్యరూపం దాల్చలేదు. 2016లో ఎన్నారై పాలసీపై ప్రత్యేక సమావేశం నిర్వహించి, 2018 –19 బడ్జెట్‌లో ఎన్నారైల కోసం రూ.100 కోట్లను కేటా­యించినా.. పూర్తిస్థాయి విధి విధానాలు ప్రకటించ­కపోవడంతో వాటి వల్ల ఎవరికీ లబ్ధి చేకూరలేదు.  

రెండు రోజులకో మృతదేహం.. 
గల్ఫ్‌ దేశాల నుంచి రెండు రోజులకొక మృతదేహం తెలంగాణకు చేరుతోంది. 2014 నుంచి ఇప్పటి వరకు 1,612 మృతదేహాలు వచ్చాయి. ఇందులో 25 నుంచి 50 ఏళ్ల లోపు వారే అత్యధికం. అక్కడి వాతావరణం, ఆహారం కారణంగా మానసిక ఒత్తిడితో గుండె, మెదడు సంబంధిత వ్యాధుల భారిన పడి మరణిస్తున్నట్లు భారత దౌత్య కార్యాలయం ఇటీవల వెల్లడించింది. 

కేరళ రాష్ట్రంలో భేష్‌  
గల్ఫ్‌ దేశాల్లో అత్యధిక ప్రవాసీలున్న రాష్ట్రం కేరళ. ఆ రాష్ట్రం వలస కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. గల్ఫ్‌కు వెళ్లే వారికి ముందస్తుగా నైపుణ్య శిక్షణ ఇస్తుండటంతో వాళ్లు వైట్‌ కాలర్‌ ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. అలాగే స్వదేశానికి తిరిగి వచ్చిన వారికోసం విస్తృత స్థాయిలో పునరావాస కార్యక్రమాలు చేపడుతున్నారు. రిక్రూటింగ్‌ ఏజెన్సీల నియంత్రణ, కేసుల్లో ఉన్న వారికి న్యాయ సహాయం, వైద్య సహాయం అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎన్నార్‌టీఎస్‌ ఆధ్వర్యంలో ఎన్నారైల కోసం 24 గంటల హెల్ప్‌లైన్‌తోపాటు ప్రవాసాంధ్ర భరోసా పేరుతో రూ.10 లక్షల బీమా (18–60 ఏళ్లు)తో పాటు రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తున్నారు.  

ఇవీ కార్మికుల డిమాండ్లు.. 
►గల్ఫ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు, వార్షిక బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించాలి.  

►గల్ఫ్‌ మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, జీవిత, ప్రమాదబీమా, పెన్షన్‌లతో కూడిన సమగ్రమైన సాంఘిక భద్రత పథకం అమలు చేయాలి.  

►గల్ఫ్‌ జైళ్లలో చిక్కుకున్న వారికి మెరుగైన న్యాయ సహాయం అందించాలి. 

►శిక్షపడ్డ ఖైదీలకు ఇప్పటికే ఒప్పందం చేసుకున్న దేశాల నుంచి ఖైదీల మార్పిడి వెంటనే చేయాలి. 

►కేంద్రం తరఫున వెంటనే హైదరాబాద్‌లో సౌదీ, యూఏఈ, కువైట్‌ కాన్సులేట్లను ఏర్పాటు చేయాలి.  

►ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన తరహాలో గల్ఫ్‌లో మృతి చెందిన వారి కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.  

►ప్రవాసి భారతీయ బీమా యోజన కింద రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమా పథకంలో సహజ మరణాన్ని కూడా చేర్చాలి. రూ.325 చెల్లిస్తే రెండేళ్ల కాలపరిమితితో ఇన్సూరెన్స్‌ అమలు చేయాలి. 

తక్షణ కార్యాచరణ చేపట్టాలి  
తెలంగాణ వస్తే దుబాయ్‌ బాధలు తప్పుతాయనుకున్నం. కొత్త వలసలు మళ్లీ మొదలయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కార్మికుల సంక్షేమానికి తక్షణ కార్యాచరణను అమలు చేయాలి. 
–మంద భీంరెడ్డి, గల్ఫ్‌ వలస వ్యవహారాల విశ్లేషకుడు 

కాన్సులేట్లు ఏర్పాటు చేయాలి 
దేశంలో కేరళ తర్వాత తెలంగాణ నుంచే అత్యధిక కార్మికులు గల్ఫ్‌లో పనిచేస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్లినవారు మరణాలు, జైలు పాలవుతున్న తీరు ఆందోళనకరంగా ఉంతోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే చొరవ చూపి, హైదరాబాద్‌లో సౌదీ, ఇతర ముఖ్య దేశాల కాన్సులేట్లను ఏర్పాటు చేస్తే పలు సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. 
– పి.బసంత్‌రెడ్డి, గల్ఫ్‌ సోషల్‌ వర్కర్‌ 

కన్న బిడ్డల కోసం.. కన్నులు కాయలు కాచేలా 
సిరిసిల్ల జిల్లా పెద్దూరుకు చెందిన శివరాత్రి మల్లేశం, రవి అనే అన్నదమ్ములిద్దరూ 2004లో దుబాయ్‌ వె­ళ్లా­రు. పని ప్రదేశంలో నేపాల్‌కు చెందిన దిల్‌ బహుదూర్‌ అనే గార్డు హత్యకు కారమణంటూ వీరి­తో పాటు మరో పదిమందిని అరెస్ట్‌ చేసి జైల్లో వేశా­రు. అక్కడి చట్టాల మేరకు బాధితుని కుటుంబ స­భ్యు­­లు పరిహారం తీసుకుని క్షమాభిక్ష పత్రాన్ని స­మ­ర్పిస్తే శిక్షను తగ్గించటం లేదా రద్దు చేయటం సు­లువు.

ఈ మేరకు మల్లేశం, రవి తల్లి గంగవ్వ 2012­లో పరిహారం సొమ్ము కోసం తన కిడ్నీలు అమ్ముకునేందుకు అనుమతివ్వాల్సిందిగా హెచ్‌ఆర్‌సీని కోరి­న అంశం అప్పటి ఎమ్మెల్యే కేటీఆర్‌ దృష్టి వచ్చింది. దీంతో ఆయనే స్వయంగా రంగంలోకి దిగి రూ.15 లక్షలను నేపాల్‌ వెళ్లి బాధిత కుటుంబానికి అందించి క్షమాభిక్షపత్రాన్ని తీసుకొచ్చారు. నేర తీ­వ్రత, చేసిన తీరు ఘోరంగా ఉందంటూ అక్కడి హై­కో­ర్టు యావజ్జీవ శిక్ష(25ఏళ్లు)గా మార్చింది. ఈ వి­ష­యంలో భారత ప్రభుత్వం చొరవ తీసుకుంటే కా­నీ వారు బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 

మీరైనా.. జాడ చెప్పండి 
‘గల్ఫ్‌కు పోయివస్తే కష్టాలన్నీ తీరుతయన్న డు. పోయినోడు మళ్లీ రాక.. మేము దినదిన నరకం అనుభవిస్తున్నం. మా కొడుకు ఎక్కడున్నడో..ఏం చేస్తున్నడో ఎవరూ చెప్పడం లేదు’ అంటూ జగిత్యాల జిల్లా మన్నెగూడేనికి చెందిన శ్రీరాముల రాజేశ్వరి, రాజేశం తమకు ఎదురైన వారందరినీ అడుగుతున్న తీరు కంటతడి పెట్టిస్తోంది. శ్రీరాముల ప్రసాద్‌ (42) రెండేళ్ల క్రితం గల్ఫ్‌ లోని క్యాంప్‌కు చేరినట్లు ఫోన్‌ చేశాడు. ‘వారానికి ఒకసారైనా ఫోన్‌ చేసేవాడు. ఏడాదిగా అది కూడా లేదు. మీరై నా నా కొడుకు జాడ చెప్పాలె’ అంటూ రాజేశం వేడుకుంటున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement