మోర్తాడ్(బాల్కొండ): గల్ఫ్ దేశాల్లో పనిచేసే వలసకార్మికులు ఇప్పుడు పరేషాన్‌లో పడ్డారు. రేషన్‌కార్డుల్లో పేరు ఉన్న ప్రతి ఒక్కరు ఈ–కేవైసీ పూర్తి చేయించుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ సూచించిన విషయం తెలిసిందే. రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ యంత్రంపై రేషన్ వినియోగదారులు వేలిముద్ర వేసి తమ ధృవీకరణ పూర్తి చేయాలి. రాష్ట్రంలోని వినియోగదారులు ఏ ప్రాంతంలో ఉన్నాసరే సొంతూరుకు వెళ్లకుండానే ఈకేవైసీ పూర్తి చేసే వెసులుబాటు కల్పించారు. పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నవారు మాత్రం స్వరాష్ట్రానికి వచ్చి ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఈ–కేవైసీ ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది. అయితే దీనికి నిర్ణీత గడువు తేదీని మాత్రం ప్రభుత్వం నిర్ణయించలేదు. వీలైనంత త్వరగా రేషన్‌కార్డుల్లో పేర్లు ఉన్నవారితో ఈకేవైసీ పూర్తి చేయించాలని అధికారులు రేషన్‌డీలర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఒక కుటుంబంలోని సభ్యులు వేర్వేరు చోట్ల ఈకేవైసీ పూర్తి చేయించుకోవడానికి అవకాశముంది. ఈ విధానంతో పట్టణాలకు ఉన్నత చదువులకు వెళ్లినవారు, ఉపాధి పొందుతున్న వారు తాము ఉంటున్న పరిసరాల్లోనే ఈకేవైసీ పూర్తి చేయించుకోవచ్చు. కానీ గల్ఫ్‌తోపాటు ఇతర దేశాలకు వలస వెళ్లిన వారు ఇప్పట్లో వచ్చే అవకాశం లేకపోవడంతో వారి ఈకేవైసీ ఎలా అనే సంశయం నెలకొంది.
పౌరసరఫరాల శాఖ నిబంధనల ప్రకారం ఈకేవైసీ చేయించుకోని వారి పేర్లు రేషన్‌కార్డుల నుంచి తొలగించే ప్రమాదముంది. విదేశాలకు వెళ్లినవారు సంవత్సరాల తరబడి స్వదేశానికి దూరంగానే ఉంటున్నారు. వారు వచ్చిన తర్వాతైనా ఈకేవైసీ చేయించుకోవచ్చా? అనే విషయంపై స్పష్టత లేకపోవడమే ఈ గందరగోళానికి కారణం. స్థానికంగా నివాసం ఉండనందుకు రేషన్‌బియ్యం కోటా తమకు దక్కకపోయినా ఇబ్బంది లేదని, రేషన్‌కార్డుల నుంచి పేర్లు తొలగించవద్దని అని వలస కార్మికులు వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఏ సంక్షేమపథకం అమలు చేసినా రేషన్‌కార్డు ప్రామాణికంగా తీసుకుంటుంది.
ఇలాంటి తరుణంలో తాము ఉపాధి కోసం సొంతూరిని విడచి వేరే ప్రాంతానికి వెళ్లామని, రేషన్‌కార్డుల నుంచి పేర్లు తొలగిస్తే ఎలా అని వలస కార్మికులు ప్రశి్నస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న తెలంగాణవాసుల సంఖ్య 15లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈకేవైసీ నిబంధనతో వలస కార్మికులు అధిక సంఖ్యలో నష్టపోయే ప్రమాదం ఉంది. వలస కార్మికుల అంశంపై తమకు ఎలాంటి స్పష్టత లేదని నిజామాబాద్ పౌరసరఫరాలశాఖ అధికారి చంద్రప్రకాశ్ ‘సాక్షి’తో చెప్పారు. ఈకేవైసీ గడువు మూడు నెలల పాటు పొడిగించే అవకాశం ఉందన్నారు.
పేర్లు తొలగించకుండా స్టార్‌మార్క్ చేయాలి
ఈకేవైసీ పూర్తి చేయని వలస కార్మికుల పేర్లు రేషన్‌కార్డుల నుంచి తొలగించకుండా స్టార్‌మార్క్ చేయాలి. వారు సొంతూరికి వచి్చన తర్వాత ఈకేవైసీ అవకాశం కల్పించాలి. వలస కార్మికుల పేర్లు రేషన్‌కార్డుల నుంచి తొలగిస్తే వారు ఏ ప్రభుత్వ పథకానికి అర్హులు కాకుండా పోతారు. ప్రభుత్వం పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. – మంద భీంరెడ్డి, గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకుడు
Comments
Please login to add a commentAdd a comment