
ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, రాయగడ ప్రజల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న మజ్జిగౌరి అమ్మవారి వార్షిక చైత్రోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని వారు పేర్కొన్నారు.
జంఝావతి నది జలాలు
అమ్మవారి చైత్రోత్సవాల ప్రారంభానికి ఒక రోజు ముందు సమీపంలో గల జంఝావతి నది నుంచి జలాలను తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో ఉంచి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. నది వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించిన పురోహితులు పూజా కార్యక్రమాల అనంతరం జలాలను కలశాలతో తీసుకువచ్చి అమ్మవారిని అదేవిధంగా అమ్మవారి గర్భగుడిని శుద్ధి చేస్తారు. అదేరోజు రాత్రి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఆలయ ప్రధాన పూజారి చంద్రశేఖర్ బెరుకొ, బాబుల బెరుకొలు అమ్మవారిని సింధూరంతో అలంకరిస్తారు.
సునా భెషొలో అమ్మవారు
అమ్మవారి చైత్రోత్సవాల సందర్భంగా ఉత్సవాల ఐదు రోజుల పాటుగా అమ్మవారిని బంగారు నగలతో అలంకరిస్తారు. సునా భెషొను తిలకించి భక్తులు మురిసిపోతారు.
ఆంధ్ర భక్తుల తాకిడి
ఉత్కళాంధ్ర ప్రజల ఆరాధ్య దైవంగా గుర్తింపు పొందిన మజ్జిగౌరి అమ్మవారిని దర్శించుకునేందుకు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లా పార్వతీపురం, విశాఖపట్నంతో పాటు తెలంగాణ, అటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు.
ప్రతీ ఆది, మంగళ ,బుధవారాల్లో వీరి తాకిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి సెపె్టంబరు నెల వరకు పొరుగు రాష్ట్రాల భక్తులతో మందిరం కిటకిటలాడుతుంది. భక్తుల తాకిడిని ఉద్దేశించి వారికి సౌకర్యం కల్పించే విధంగా ప్రత్యేక దర్శనాలను ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. అందుకు 300 రూపాయల టిక్కెట్లను విక్రయిస్తుంది.
స్థల చరిత్ర
క్రీస్తుపూర్వం 16 వ శతాబ్దంలో నందపూర్ రాజ వం«శస్తులకు చెందిన విశ్వనాథ్ దేవ్ గజపతి అనే రాజు రాజ్యాలను విస్తరించే దిశలో రాయగడలోనికి అడుగుపెట్టారు. రాయగడలో రాజ్యాన్ని స్థాపించిన ఆయన మజ్జిగౌరి దేవిని ఇష్టాదేవిగా పూజిస్తుండేవారు. ఈ నేపథ్యంలో అమ్మవారిని కోట మధ్యలో స్థాపించి పూజించేవారు. కోట మధ్యలో కొలువుదీరడంతొ అమ్మవారిని మొఝిఘోరియాణిగా పిలుస్తారు. తెలుగులో మజ్జిగౌరిగా ఒడియాలొ మోఝిఘొరియాణిగా ప్రతీతి.
108 మంది రాణుల సతీసహగమనం
రాయగడ రాజ్యాన్ని పాలిస్తుండే విశ్వనాథ్ దేవ్ మహారాజుకు 108 మంది రాణులు ఉండేవారు. గోల్కొండను పాలించే ఇబ్రహిం కుతుబ్‌షా సేనతో రాయగడపై దండెత్తారు. ఈ పోరాటంలో విశ్వనాథ్ దేవ్ హతమవుతారు. దీంతో ఆయన 108 మంది రాణులు అగ్నిలొకి దూకి ఆత్మార్పణం చేసుకుంటారు. ఈ స్థలాన్ని సతీకుండంగా పిలుస్తారు. ప్రస్తుతం అమ్మవారి మందిరానికి పక్కనే ఈ సతీకుండం ఉంది. మందిర కమిటీ దీని ప్రాధాన్యతను గుర్తించి అభివృద్ధి చేసింది. అయితే కోట కూలిపొవడం అంతా శిథిలమవ్వడంతొ అమ్మవారి మందిరం కూడా శిథిలమవుతోంది.
బ్రిటీష్ వారి ఆగమనంతో..
1936 వ సంవత్సరంలొ బ్రిటీష్ వారు విజయనగరం నుంచి రాయిపూర్ వరకు రైల్వే పనులు ప్రారంభించించే సమయంలో జంఝావతి నదిపై వంతెన నిర్మాణం పనులు ప్రారంభిచారు. ఈ క్రమంలో వంతెన నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టర్ వంతెన పనులను ప్రారంభిస్తారు. వంతెన నిర్మాణం జరగడం అదేవిధంగా కూలిపోవడం క్రమేపీ చోటు చేసుకుంటాయి.
దీంతో ఒక రోజు కాంట్రాక్టరు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అమ్మవారు కాంట్రాక్టర్ కలలో కనిపించి తాను ఇక్కడే ఉన్నానని, తనకు చిన్న గుడి ఏర్పాటు చేసి నిత్యపూజా కార్యక్రమాలు జరిపిస్తే జంఝావతి నదిపై తలపెట్టిన వంతెన పనులు పూర్తవుతాయని చెబుతుంది. దీంతో కలలో కనిపించిన అమ్మవారి మాటలు ప్రకారం వెతిక చూడగా ఒక శిథిలమైన మందిరంలో అమ్మవారి విగ్రహం ఉంటుంది. అయితే అప్పటికి అమ్మవారి తల భాగమే కనిపిస్తుంది.
దీంతో కాంట్రాక్టరు మందిరాన్ని నిర్మించి అమ్మవారి ముఖభాగమే ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు చేపడతాడు. అనంతరం వంతెన పనులు చకచక పూర్తవుతాయి. ఇప్పటికీ ఈ వంతెన అమ్మవారి మందిరానికి సమీపంలో ఉంది. అప్పటి నుంచి అమ్మవారి ముఖభాగమే భక్తులకు దర్శనం ఇస్తుండటం ఇక్కడి విశేషం. ఇదిలాఉండగా అమ్మవారికి సమీపంలో అమ్మవారి పాదాల గుడి కూడా ఉంది. అదేవిధంగా నడుం భాగం మందిరానికి కొద్ది దూరంలో ఉంది. దీనినే జెన్నా బౌలిగా కొలుస్తుంటారు.
రూ.15లక్షలతో ఉత్సవాలు
అమ్మవారి చైత్రోత్సవాలకు ఈ ఏడాది రూ.15 లక్షలు వెచ్చించనున్నారు. ఏటా లాగానే గంజాం జిల్లా కవిసూర్యనగర్‌కు చెందిన జ్యొతిష్య పండితులు నీలమాధవ త్రిపాఠి శర్మ బృందంతో పూజా కార్యక్రమాలను నిర్వహించనుంది. చండీ హోమం, సూర్యపూజ, నిత్య ఆరాధన వంటి పూజలు ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
రూ.30 కోట్లతో అభివృద్ధి
అమ్మవారి మందిరంతో పాటు పరిసర ప్రాంతాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కలి్పంచేందుకు ప్రభుత్వం రూ.30 కోట్ల నిధులను కేటాయించింది. అందుకు పనులు ప్రారంభించేందుకు ఇప్పటికే టెండర్లను ఆహా్వనించింది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ పనులు పూర్తయితే అమ్మవారి మందిరం రూపురేఖలే మారనున్నాయి.