Sankranti Festival 2023: Kanuma Festival Significance History Poli Custom - Sakshi
Sakshi News home page

కనుమ పండగ .. “అన్నదాతల పండుగ".. పోలో పొలి అని చల్లే ఆ పొలి ఏంటంటే?

Published Mon, Jan 16 2023 7:56 AM | Last Updated on Mon, Jan 16 2023 10:39 AM

Sankranti 2023 Kanuma Festival Significance History Poli Custom - Sakshi

కనుమను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశుపక్షాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పని చేసిన ఆవులను , ఎద్దులను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వ్రేలాడ దీస్తారు.

పశువుల పండుగ
ముఖ్యంగా చిత్తూరుజిల్లా , అందులో పాకాల మండలంలోని వల్లివేడు గ్రామ పరిసర అన్ని పల్లెల్లో ఈ పండగ జరుపుకోవటంలో ఒక ప్రత్యేకత వున్నది.  ఆ ప్రత్యేకత ఏమిటంటే ? ఆ రోజు ఇంటికి ఒకరు చొప్పున తెల్లవారక ముందే ఒక కత్తి , ఒక సంచి తీసుకొని సమీపంలో ఉన్న అడవికి బయలు దేరుతారు. అక్కడ దొరికే వన మూలికలు , ఔషద మొక్కలు సేకరిస్తారు. కొన్ని చెట్లఆకులు , కొన్ని చెట్ల బెరుడులు , కొన్ని చెట్ల పూలు , వేర్లు , కాండాలు , గడ్డలు , ఇలా చాల సేకరిస్తారు.

కొన్ని నిర్దిష్టమైన చెట్ల భాగాలను మాత్రమే సెకరించాలి. అంటే ... మద్ది మాను , నేరేడు మానుచెక్క , మోదుగ పూలు , నల్లేరు , మారేడు కాయ ఇలా అనేక మూలికలను సేకరించి ఇంటికి తీసుకొచ్చి వాటిని కత్తితో చిన్న ముక్కలుగా చేసి , ఆ తర్వాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో వేసి బాగా దంచుతారు. అదంతా మెత్తటి పొడిలాగ అవుతుంది. దీన్ని "ఉప్పు చెక్క'' అంటారు. ఇది అత్యంత ఘాటైన మధురమైన వాసనతో వుంటుంది.

దీన్ని పశువులకు తిని పించాలి. ఇదొక పెద్ద ప్రహసనం. అవి దీన్ని తినవు. అంచేత ఒక్కొక్క దాన్ని పట్టుకొని దాని నోరు తెరిచి అందులో ఈ ఉప్పు చెక్కను చారెడు పోసి దాని నోరు మూస్తారు. అప్పుడు ఆ పశువు దాన్ని మీంగుతుంది.. ఇలా ఒక్కదానికి సుమారు రెండు మూడు దోసిళ్ళ ఉప్పు చెక్కను తినిపిస్తారు. గొర్రెలు మేకలు ఐతే కొన్ని వాటంతట అవే తింటాయి. లేకుంటే వాటిక్కూడ తినిపిస్తారు. ఏడాదికి ఒకసారి ఈ ఉప్పుచెక్కను తినిపిస్తే అది పశువులకు సర్వరోగ నివారణి అని వీరి నమ్మకం. ఎందుకంటే అందులో వున్నవన్నీ ఔషధాలు , వన మూలికలే గదా.

ఆ తర్వాత పశువులన్నింటిని పొలాల్లోని బావుల వద్దకు గాని , చెరువుల వద్దకు గాని తోలుకెళ్ళి స్నానం చేయించి , లేదా ఈత కొట్టించి , ఇంటికి తోలుకొస్తారు. ఆ తర్వాత వాటి కొమ్ములను , పదునయిన కత్తితో బాగా చెలిగి వాటికి రంగులు పూస్తారు. మంచి కోడెలున్న వారు వాటి కొమ్ములకు ఇత్తడి కుప్పెలు తొడిగి , మెడలో మువ్వల పట్టీలు , మూతికి మూజంబరాలు అలంకరిస్తారు. అన్నింటికీ కొత్త పగ్గాలు వేస్తారు. ఈ సమయంలో చేలన్నీ పరిగిలి పోయి వున్నందున పశువులన్నింటిని వదిలేస్తారు.

సాయంకాలం ఊరు ముందున్న కాటమరాజును పునఃప్రతిష్టించి ఊరిలో ప్రతి ఇంటి నుండి ఆడవారు కాటమరాజు ముందు పొంగలి పెడ్తారు. పొంగలి అంటే కొత్త కుండలో , కొత్త బియ్యం , కొత్త బెల్లం వేసి అన్నం వండడం. ఒక నెల ముందు నుండే కాటమరాజు ముందు ఆ దారిన వచ్చిపోయే ఊరివారు రోజుకొక కంపో , కర్రో తెచ్చి అక్కడ కుప్పగా వేస్తారు. కనుమ రోజుకు అది ఒకపెద్ద కుప్పగా తయారయ ఉంటుంది. దాన్ని "చిట్లా కుప్ప" అంటారు. చీకటి పడే సమయానికి పొంగళ్లు తయారయి ఉంటాయి. ఊరి చాకలి కాటమరాజు పూజ కార్యక్రమం ప్రారంబించి దేవుని ముందు పెద్ద తళిగ వేస్తారు. అంటే ప్రతి పొంగలి నుండి కొంత తీసి అక్కడ ఆకులో కుప్పగా పెడతారు , పూజానంతరం మొక్కున్న వారు , చాకిలి చేత కోళ్ళను కోయించుకుంటారు.

అప్పటికి బాగా చీకటి పడి వుంటుంది. అప్పటికి పశుకాపరులు అందరూ ఊరి పశువులన్నింటిని అక్కడికి తోలుకొని వస్తారు. పూజారి అయిన చాకలి తళిగలోని పొంగలిని తీసి ఒక పెద్దముద్దగా చేసి అందులో సగం పోలిగాని కిచ్చి (పశువుల కాపరి) తినమని చెప్పి , తర్వాత అక్కడున్న చిట్లాకుప్పకు నిప్పు పెడతారు. పెద్ద మంట పైకి లేవగా పోలిగాడు పశువులన్నింటిని బెదరగొట్టి , చెదరకొడతాడు.

అవి బెదిరి పొలాల వెంబడి పరుగులు తీస్తాయి. ఆ సమయంలో పశువులను బెదర గొడుతున్న పోలిగాని వీపున చాకలి తనచేతిలో వున్న మిగిలిన సగం పొంగలి ముద్దను అతని వీపు మీద కొడతాడు. దానిని పిడుగు ముద్ద అంటారు. వాడు పరిగెడుతాడు. ఆ తర్వాత అందరూ అక్కడ మిగిలిన తళిగలోని ప్రసాదాన్ని తిని మొక్కులు తీర్చుకొని చిట్లకుప్ప మంట వెలుగులో తమ కోళ్ళను కోసుకొని పొంగళ్లను తీసుకొని తాపీగా ఇళ్ళకి వెళతారు.

పొలి అంటే?
ఈ సందర్భంగా పెద్ద మొక్కున్న వారు పొటేళ్ళను కూడ బలి ఇస్తారు. దాని రక్తాన్ని ఆన్నంలో కలిపి ఒక కుప్ప పెడతారు. దాన్ని ''పొలి'' అంటారు. ఆ "పొలి" ని తోటకాపరి గాని, నీరు కట్టేవాడు గాని తీసుకొని వెళ్ళి అందరి పొలాల్లో , చెరువుల్లో , బావుల్లో "పొలో.... పొలి" అని అరుస్తూ చల్లుతాడు. అప్పడే కొత్త మొక్కులు కూడ మొక్కు కుంటారు. అంటే , తమ పశుమందలు అభివృద్ది చెందితే రాబోయే పండక్కి పొట్టేలును , కోడిని ఇస్తామని కాటమ రాజుకు మొక్కు కుంటారు. అప్పటికప్పుడే ఒక పొటెలుపిల్లను ఎంపిక చేస్తారు. ఆ విధంగా పశువుల పండగ పరిసమాప్తి అవుతుంది.

ఈ నెలరోజులు వాకిట్లో అందమైన ముగ్గులతో అలంకరిస్తాము. కానీ ఈ కనుమ రోజున మాత్రం రధం ముగ్గువేసి ఆ రథాన్ని వీధిచివర వరకూ లాగినట్టుగా ముగ్గువేస్తారు. దీని అర్థం సూర్యుడు తన దిశను మార్చుకున్న మొదటిరోజు అని తెలుస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement