sankranti festival 2023
-
సింగపూర్ యూనివర్సిటీ అఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్‌లో సంక్రాంతి సంబరాలు
సింగపూర్: భావితరాలకు తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, విలువలు, పండుగల ప్రాశస్త్యం గురించి తెలియచేయాలనే ఉద్దేశ్యంతో సొంత నేలకు దూరంగా సింగపూర్‌లో ఉంటున్న కాకతీయ సాంస్కృతిక పరివారం సభ్యులందరూ కలిసి సింగపూరు యూనివర్సిటీ అఫ్ టెక్నాలజీ & డిజైన్ (SUTD) నందు ఆదివారం (29-01-2023) ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 6:30 వరకూ సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. దాదాపు 550కి పైగా కాకతీయ సాంస్కృతిక పరివారం సభ్యులు హాజరైప ఈ కార్యక్రమంలో పిల్లల, పెద్దల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సంక్రాంతి పండుగ విశిష్టతతో పాటు ఆ 4 రోజులూ జరుపుకునే పండుగ సాంప్రదాయాల వెనుక దాగిఉన్న విషయాలను అతి చక్కగా పిల్లలకు వివరించారు. సంస్థ అధ్యక్షులు రాంబాబు పాతూరి మాట్లాడుతూ సంస్థ స్థాపించబడి 3 సంవత్సరాలు అయిందని, కోవిడ్ తదనంతరం తమ సంస్థ ఇంత మంది తెలుగు వారితోకలిపి జరుపుకుంటున్న 2వ అతి పెద్ద పండుగ ఇది అని వివరించారు. ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరుపుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమమం ద్వారా మరింత మంది సాటి తెలుగు వారు సన్నిహుతులు అయ్యారని అలాగే విభిన్న ఆటలద్వారా ఒకరితో ఒకరికి పరిచయాలు పెంచుకునేలా రూపొందించిన కార్యక్రమ రూపకల్పన చక్కగా ఉంది అని పలువురు ప్రశంసించారు. -
వాసవి క్లబ్ మెర్లయన్ ఆధ్వర్యంలో సింగపూర్‌లో సంక్రాంతి సంబరాలు
వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ వారి ఆధ్వర్యంలో, సంక్రాంతి సంబరాల వేడుకను పొంగోల్ పార్క్ లో ఘనంగా జరిగాయి. తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలు ఉట్టి పడేలా, పిల్లలకు భోగి పళ్ళ దీవెనలతో ప్రారంభమైన ఈ వేడుకలు, గొబ్బెమ్మలు, మహిళల రంగు రంగుల రంగవల్లికల పోటీలు, పిల్లల పతంగుల తయారీ వంటి కార్యక్రమాలతో ఉత్సాహంగా జరిగాయి. చిన్నారులు సంప్రదాయ దుస్తులలో పోటీపడి మరీ తమ శ్రావ్యమైన గొంతులతో శ్లోకాలు, పాటలతో మురిపించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక సంక్రాతి థీమ్ కి సంబంధించిన తెర ఏర్పాటులో సౌజి డేకర్స్ సంస్థ సభ్యులు సహకరించారు. ఫణీష్ ఆత్మురి ‘సంక్రాతి శోభ’ ప్రసంగం ఆహుతులని ఆకట్టుకొంది. పసందై సాంప్రదాయిక విందు భోజనంతో పాటు, రోజంతా సాగిన ఈ వేడుకలలో పిల్లలు, పెద్దలూ, దంపతులూ అనేక విన్నూత్నమైన ఆట పాటలలో అత్యంత ఉత్సాహంగా పాల్గొని ఆద్యంతమూ ఉల్లాసంగా గడిపారు. సుమారు 190 మంది పెద్దలు, 50 మంది పిల్లలు పాల్గొని విజయవంతం చేసిన ఈ సంబరాలు, వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ దశమ వార్షికోత్సవంలోనికి అడుగిడుతున్న శుభ తరుణంలో జరగడం విశేషం. సింగపూర్‌లోని ఆర్యవైశ్యులందరూ సంఘీభావంతో ఈ వేడుకలలో పాల్గొనడం శ్లాఘనీయమని, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ అరుణ్ గోట్ల పేర్కొన్నారు. క్లబ్ సెక్రటరీ నరేంద్ర కుమార్ నారంశెట్టి వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సంక్రాతి సంబరాలు ఎంతో గొప్పగా నిర్వహించారని, వైశ్యులు ఎప్పుడు ఇలానే ధర్మసంబంధమైన,సాంప్రదాయ సంబంధమైన విషయాల్లో సమిష్టిగా ఇలా విజయవంతంగా మరిన్ని కార్యక్రమాలు జరుపుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి తోడ్పడిన తోటి కార్య నిర్వాహక బృంద సభ్యులకు, సేవా దళానివారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సింగపూర్ ఆర్యవైశ్యులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఈ వేడుకలు, భవిష్యత్తుకు ప్రేరణనివ్వడమేగాక, మన భావితరానికి మన సంప్రదాయాలను, కుటుంబ విలువలను పరిచయం చేయడానికి ఒక చక్కని వేదికలా నిలిచాయని, ఈ కార్యక్రమ విజయంలో ప్రముఖ పాత్ర వహించిన సీనియర్ సభ్యుడు ముక్కా కిశోర్ తెలియ చేశారు, వర్షాన్ని కూడా లెక్కచేయకుండా అందరు చిన్నపిల్లల్లా ఆటపాటల్లో మునిగితేలారరని కార్యక్రమ నిర్వాహక కర్త రాయల సుమన్, దివ్య సంతోసం వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా విచ్చేసిన జానపద కోకిల, డాక్టర్ అరుణ సుబ్బారావు ప్రత్యేక ప్రదర్శనలతో, పాటలతో ఆద్యంతం అందరిని ఆనందంలో ముంచెత్తింది. కార్యక్రమం విజయవంతమవ్వడంలో సంస్థ సభ్యులు సరిత, రాజా విశ్వనాథుల, రాఘవ, ఆనంద్, కిశోర్, శ్రీధర్ మంచికంటి, వాసవి సేవ సభ్యులైన శివ కిషన్, మార్తాండ్, చైతన్య, అవినాష్, చలం, గోపి కిషోర్, ప్రసాద్ బచ్చు, యదా నరేష్, పురుషోత్తం, సందీప్, సతీష్ వుద్దగిరి, సంతోష్ మాదారపు, మనోహర్, సత్య, దివ్య గాజులపల్లి తదితరులు ఎంతో ఉత్సాహంగా కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు. -
ఏపీఎస్ ఆర్టీసీకి లాభాలు తెచ్చిన సంక్రాంతి
విజయవాడ: ఈ సంక్రాంతి ఏపీఎస్ ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెట్టింది. ఈ ఏడాది సంక్రాంతికి ఏపీఎస్ ఆర్టీసీకి రూ. 141 కోట్ల ఆదాయం వచ్చింది. సంక్రాంతికి ప్రత్యేక సర్వీసులను ప్రయాణిలు విశేషంగా ఆదరించడంతో భారీగా ఆదాయం వచ్చినట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరమలరావు తెలిపారు. తిరుగు ప్రయాణానికి కూడా తగినన్ని బస్సులు వేయడంతో విశేష ఆదరణ లభించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి 1,483 ప్రత్యేక బస్సులు నడిపడమే కాకుండా, జనవరి 6వ తేదీ నుండి 14వరకూ రికార్డు స్థాయిలో 3,392 బస్సులు నడిపినట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ పేర్కొన్నారు. కాగా, సాధారణ ఛార్జీలకే తగిన సంఖ్యలో బస్సులు అందుబాటులో ఉండటంతో ఏపీఎస్ ఆర్టీసి బస్సులకే అధిక ప్రాధానిమచ్చారు. రాను-పోను టికెట్లపై బుక్ చేసుకున్న వారికి టిక్కెట్ చార్జీపై 10 శాతం రాయితీ ఇవ్వడం కూడా ఏపీఎస్ ఆర్టీసీ భారీ ఆదాయానికి కారణమైంది. -
సంబరంగా సంక్రాంతి.. ఆ ఉమ్మడి జిల్లాలో వందల కోట్ల ఖర్చు
విజయనగరం: సంక్రాంతి వచ్చింది.. ఇంటింటా సరాదాలు తెచ్చింది... కరోనా ప్రభావంతో గత రెండేళ్లు ఆంక్షలు నడుమ చేసుకున్న తెలుగింట పండగను ఈ ఏడాది మూడురోజులపాటు వైభంగా జరుపుకున్నారు. ఇళ్ల అలంకరణ, నూతన వస్త్రాలు, ప్రత్యేక వంటకాలతో పల్లెల్లో కొత్త సందడి కనిపించింది. సామాన్యుడు, సంపన్నుడనే తారతమ్యం లేకుండా ఎవరి స్థాయిలో వారు పండగను ఆస్వాదించారు. ఏడాదిలో మొదటిగా జరుపుకునే పండగకు ప్రత్యేక స్థానం కల్పిస్తూనే ఖర్చులోనూ అదే ప్రాధాన్యమిచ్చారు. ఈ మూడు రోజుల కోసం విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలు కోట్లలో ఖర్చు చేశారంటే పండగ సందడి అర్థం చేసుకోవచ్చు. నూతన వస్త్రాల కోసం రూ.250 కోట్ల పైమాటే... సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు వస్త్ర దుకాణాలకు పెద్ద పండగ వచ్చినట్టే. ఏడాదిలో చేసే వ్యాపారం ఈ ఒక్క నెలలోనే సాగుతుంది. కుటుంబంలో ప్రతి ఒక్కరికీ నూతన వస్త్రాలు కొనుగోలు చేయడం ఆనవాయితీ. దీంతో వీటి వ్యాపారానికి గిరాకీ పెరుగుతుంది. విజయనగరం పట్టణంలో ‘బాలాజీ టెక్స్టైల్ మార్కెట్’లో జోరుగానే విక్రయాలు సాగాయి. సుమారు 250 వరకు బ్రాండెడ్, సాధారణ దుకాణాలుండగా.. ప్రధానంగా పిల్లల రెడీమేడ్ దుస్తులు, మహిళల చీరలు అమ్మకాలు అధికంగా సాగాయి. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి, సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, ఒడిస్సా, మధ్యప్రదేశ్ ప్రాంతాలను నుంచి రిటైల్ వ్యాపారులు ఈ మార్కెట్‌కి వచ్చి నిత్యం విక్రయాలు చేస్తుంటారు. రిటైల్ వ్యాపారంతో బిజీగా ఉన్న దుకాణ యాజమాన్యులు సాధారణ వినియోగదారుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఒక అడుగు ముందుకువేసి షాపు ముందే ఆరుబయట తాత్కాలిక అమ్మకాలు చేశారు. పట్టణంలోని కన్యకాపమేశ్వరి ఆలయం కూడలిలోని ఉల్లి వీధి, గంటస్తంభం జంక్షన్, మెయిన్‌రోడ్డు ప్రాంతాల్లోని ప్రధాన షాపుల్లో కూడా వస్త్రవిక్రయాలు జోరుగా సాగాయి. మొత్తంగా జిల్లాలో ఈ ఏడాది రూ.250 కోట్ల వరకు వస్త్ర వ్యాపారం సాగినట్టు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. విందు.. వినోదాల కోసం.. కొత్త అల్లుళ్లకు మర్యాదలు, ప్రతి ఇంటా పిండి వంటలు ఘుమఘుమలతో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు సందడిగా మారాయి. పండగ మూడు రోజుల పాటు మాంసాహారానికి, పిండివంటకాలు, వినోద ఖర్చుల కోసం రూ.50 కోట్లు ఖర్చు చేయగా అందులో కేవలం మాంసాహారానికి రూ.20 కోట్ల వరకు ఖర్చు చేశారు. కిలో మటన్ ధర రూ.800 పలికింది. గతేడాది రూ.700 ఉన్న ధర ఈ ఏడాది రూ.100 పెరిగింది. అలాగే, చికెన్ పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది స్కిన్‌తో కలిపి రూ.180, గ్రామీణ ప్రాంతాల్లో రూ.190 నుంచి రూ.200 వరకు పలికింది. ఇతర సరదాల కోసం రూ.5 కోట్ల వరకు ఖర్చు చేశారని అంచనా. పెరుగుతున్న ఖర్చు... తెలుగువారింట ఎంతో ఆడంబరంగా జరుపుకొనే సంక్రాంతి పండగ ఖర్చు ఏటేటా పెరుగుతోంది. శుభకృతనామ సంవత్సరంలో జనవరి 14, 15, 16 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా జరుపుకున్న పండగ కోసం రూ.కోట్లలో ఖర్చయినట్లు వ్యాపార వర్గాలు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల పరిధిలో 166 మద్యం దుకాణాలు ఉండగా... బార్లు 31 వరకు ఉన్నాయి. వీటి ద్వారా గడిచిన పక్షం రోజుల్లో సుమారు రూ.25 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరిగాయి. విలాసాలు, ఆడంబరాలకు జనం వెనుకాడకుండా మరో రూ.20కోట్లు వరకు ఖర్చుచేసినట్టు అంచనా. ప్రయాణ ఖర్చు రూ.4 కోట్ల పైమాటే.. వివిధ ప్రాంతాల నుంచి పండగకు పల్లెలకు చేరుకున్న వారు గతవారం రోజుల్లో సుమారు రూ.4 కోట్లు వరకు ఖర్చు చేశారు. విజయనగరం, సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం, ఎస్.కోట డిపోల్లో సుమారు 560 ఆర్టీసీ సర్వీసులు నడుస్తుండగా... సాధారణ రోజుల్లో రూ.40 లక్షలు వరకు ఆదాయం వస్తుంది. కేవలం విజయనగరం జిల్లా కేంద్రం నుంచి విజయవాడ, హైదరాబాద్‌కు 14 సర్వీసులు నిర్వహించగా... సాధారణంగా నడిపే 111 సర్వీసుల నుంచి ççపండగ నేపథ్యంలో రూ.2 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని అంచనా. వ్యక్తిగత వాహనాలపై రాకపోకలకు మరో రూ.2 కోట్ల వరకు ఖర్చు చేశారని అంచనా. భక్తజన జాతర.. వేపాడ: విజయనగరం జిల్లాలో సంక్రాంతి, కనుమ పండగలు వైభవంగా జరిగాయి. కనుమ పండగను పురస్కరించుకుని సోమవారం పలు గ్రామాల్లో నిర్వహించే తీర్థాలకు జనం పోటెత్తా రు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. వేపాడ మండలం కొండగుళ్లు బ్రహ్మాలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన జాతర జనసంద్రాన్ని తలపించింది. జాతరలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులను అలరించాయి. -
కోలాటం ఆడి సందడి చేసిన మంత్రి రోజా (ఫొటోలు)
-
సంక్రాంతి అంటే కోహ్లికి పూనకాలే.. పండగ రోజు కింగ్ ఎన్ని శతకాలు కొట్టాడంటే..?
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో విధ్వంసకర శతకంతో చెలరేగిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (110 బంతుల్లో 166 నాటౌట్; 13 ఫోర్లు, 8 సిక్సర్లు) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడంతో పాటు పలు అరుదైన రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. కింగ్ బద్దలు కొట్టిన అరుదైన రికార్డుల జాబితాలో ఓ అసాధారణ రికార్డు దాగి ఉందన్న విషయం మనలో చాలామంది గమనించి ఉండరు. Virat Kohli on 15th January:- In 2017 - 122(102) vs ENG in ODIs. In 2018 - 153(217) vs SA in Tests. In 2019 - 104(112) vs AUS in ODIs. In 2023 - 166*(110) vs SL in ODIs. pic.twitter.com/1e9qG6KoYW — CricketMAN2 (@ImTanujSingh) January 15, 2023 అదేంటంటే.. కింగ్ కోహ్లికి సంక్రాంతి పండుగ వచ్చిందంటే పూనకం వస్తుంది. ఈ పర్వదినాన (జనవరి 15) కోహ్లి ఏకంగా 4 సెంచరీలు బాదాడు. 2017 సంక్రాంతి రోజున ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో 102 బంతుల్లో 122 పరుగులు చేసిన కోహ్లి.. 2018 సంక్రాంతికి సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్‌లో 217 బంతుల్లో 153 పరుగులు చేశాడు. Declare 15th January as "Virat Kohli Day"@imVkohli pic.twitter.com/DVHA476m5E — Pratham. (@75thHundredWhen) January 15, 2023 2019 సంక్రాంతికి ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో 112 బంతుల్లో 104 పరుగులు చేసిన కింగ్.. మూడేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ 2023 సంక్రాంతికి సెంచరీ బాది సంక్రాంతి తనకెంత అచ్చొచ్చిన పండగో మరోసారి చాటాడు. యాదృచ్చికంగా చోటు చేసుకున్న ఈ పరిమాణాలను ఓ అభిమాని సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరలవుతోంది. A good day on the field and it was wonderful to watch @ShubmanGill & @imVkohli bhai bat today. Congratulations on your 100s and thanks to the almighty for giving me this opportunity to contribute in team’s biggest win. Shukar 🙏🇮🇳 @BCCI pic.twitter.com/ZDAVMRL250 — Mohammed Siraj (@mdsirajofficial) January 15, 2023 సంక్రాంతి రోజు కోహ్లి శతక్కొట్టుడు గణాంకాలను చూసిన అభిమానులు జనవరి 15ను 'విరాట్ కోహ్లి డే' గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. వేదిక ఏదైనా.. ప్రత్యర్ధి ఎవరైనా.. సంక్రాంతి రోజు మ్యాచ్ ఉందంటే కింగ్‌కు పూనకం వస్తుంది.. ఈ రోజు ప్రత్యర్ధులు ఎంతటి వారైనా జాగ్రత్తగా ఉండాలని కోహ్లి ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. Milestone of Virat Kohli today: 46th ODI Hundreds. 74th International Hundred. Most Hundreds in 2023. His 2nd highest score in ODIs. 10th ODI Hundred vs SL, first ever. Highest ever score in Greenfield. Most Sixes in an innings in his ODI career. 2nd Hundred in this series. pic.twitter.com/mES2axrI9N — CricketMAN2 (@ImTanujSingh) January 15, 2023 కాగా, లంకపై సూపర్ సెంచరీతో పలు రికార్డులను బద్దలు కొట్టిన కోహ్లి.. కెరీర్లో 46వ వన్డే శతకాన్ని, ఓవరాల్‌గా 74వ అంతర్జాతీయ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అలాగే ఈ సెంచరీతో శ్రీలంకపై 10వ వన్డే సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి.. ఓ ప్రత్యర్ధిపై అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. కోహ్లి ఈ సెంచరీ సాధించే క్రమంలో వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్దనే(12,650)ను వెనక్కు నెట్టి ఐదో స్థానానికి ఎగబాకాడు. ఇదిలా ఉంటే, లంకతో మూడో వన్డేలో కోహ్లి విధ్వంసకర శతకంతో పాటు శుభ్‌మన్ గిల్ సెంచరీ సాధించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 390 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక.. సిరాజ్ (4/32), షమీ (2/20), కుల్దీప్ (2/16) ధాటికి 73 పరుగులకే ఆలౌటై, 317 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే భారీ విజయం. -
Recipe: వెన్న మురుకులు, నువ్వుల ఉండలు.. ఇంట్లోనే ఇలా ఈజీగా!
Venna Murukulu And Nuvvula Undalu Recipes In Telugu: వెన్న మురుకులు, నువ్వుల ఉండలు ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి కావలసినవి: ►బియ్యప్పిండి – అర కేజీ ►శనగపిండి – పావు కేజీ ►వెన్న – పావు కేజీ ►ఉప్పు – 2 టీ స్పూన్లు లేదా రుచికి తగినంత ►జీలకర్ర పొడి – టీ స్పూన్ ►ఇంగువ – అర స్పూన్ ►వేడి నీరు – అర లీటరు ►నూనె – అర కేజీ. తయారీ: ►బియ్యప్పిండి, శనగపిండిని కలిపి జల్లించాలి. ►ఇందులో వెన్న వేసి సమంగా కలిసే వరకు వేళ్లతో మర్దన చేస్తూ కలపాలి. ►ఇప్పుడు ఉప్పు, జీలకర్ర పొడి, ఇంగువ వేసి మరోసారి కలపాలి. ►ఇందులో వేడినీటిని పోసి ముద్దగా కలుపుకోవాలి. ►మురుకుల గొట్టంలో వేసి ఒకసారి వత్తుకుని చూసుకోవాలి. ►తీగ సరిగ్గా పడకుండా మధ్యలో విరిగిపోతుంటే పిండి మీద కొద్దిగా నీటిని చిలకరించి కలుపుకోవాలి. ►బాణలిలో నూనె వేడి చేసి పిండిని మురుకుల గొట్టంలో వేసుకుని నూనెలోకి వత్తుకోవాలి. ►దోరగా కాలిన తరవాత చిల్లుల గరిటెతో తీసుకోవాలి. పిండినంతటినీ ఇలాగే చేసుకోవాలి. ►ఈ మురుకులు రెండు వారాల వరకు తాజాగా ఉంటాయి. నువ్వుల ఉండలు కావలసినవి: ►నువ్వులు – పావు కేజి ►బెల్లం పొడి – 200 గ్రా; ►ఏలకుల పొడి – ఒక టీ స్పూను ►నెయ్యి – కొద్దిగా. తయారీ: ►నువ్వులను వేయించి పొడి చేయాలి. ►కొన్నింటిని పొడి చేయకుండా అలాగే ఉంచాలి. ►ఇందులో బెల్లం పొడి, ఏలకుల పొడి వేసి రెండూ సమంగా కలిసే వరకు రోట్లో దంచాలి. ►చేతికి నెయ్యి రాసుకుని కావలసిన సైజులో ఉండలు చేయాలి. ►ఇవి రెండు–మూడు రోజుల వరకు నిల్వ ఉంటాయి. ►బెల్లం పాకం పట్టి నువ్వులు కలిపి ఉండలు చేసుకుంటే నెల వరకు తాజాగా ఉంటాయి. గమనిక: తెల్ల నువ్వులు కాని నల్ల నువ్వులు కాని వాడవచ్చు. నల్ల నువ్వులైతే వేయించిన తర్వాత కాస్త నలిపి పొట్టు వదిలించాలి. ఇవి కూడా ట్రై చేయండి: Best Sweet Recipe: ఎప్పుడూ సేమ్యా పాయసమేనా? ఈసారి... శనగపప్పు పాయసం ఇలా.. Capsicum Bajji Recipe: రుచికరమైన క్యాప్సికమ్ బజ్జీ -
కనుమ పండగ .. “అన్నదాతల పండుగ".. పోలో పొలి అని చల్లే ఆ పొలి ఏంటంటే?
కనుమను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశుపక్షాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పని చేసిన ఆవులను , ఎద్దులను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వ్రేలాడ దీస్తారు. పశువుల పండుగ ముఖ్యంగా చిత్తూరుజిల్లా , అందులో పాకాల మండలంలోని వల్లివేడు గ్రామ పరిసర అన్ని పల్లెల్లో ఈ పండగ జరుపుకోవటంలో ఒక ప్రత్యేకత వున్నది. ఆ ప్రత్యేకత ఏమిటంటే ? ఆ రోజు ఇంటికి ఒకరు చొప్పున తెల్లవారక ముందే ఒక కత్తి , ఒక సంచి తీసుకొని సమీపంలో ఉన్న అడవికి బయలు దేరుతారు. అక్కడ దొరికే వన మూలికలు , ఔషద మొక్కలు సేకరిస్తారు. కొన్ని చెట్లఆకులు , కొన్ని చెట్ల బెరుడులు , కొన్ని చెట్ల పూలు , వేర్లు , కాండాలు , గడ్డలు , ఇలా చాల సేకరిస్తారు. కొన్ని నిర్దిష్టమైన చెట్ల భాగాలను మాత్రమే సెకరించాలి. అంటే ... మద్ది మాను , నేరేడు మానుచెక్క , మోదుగ పూలు , నల్లేరు , మారేడు కాయ ఇలా అనేక మూలికలను సేకరించి ఇంటికి తీసుకొచ్చి వాటిని కత్తితో చిన్న ముక్కలుగా చేసి , ఆ తర్వాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో వేసి బాగా దంచుతారు. అదంతా మెత్తటి పొడిలాగ అవుతుంది. దీన్ని "ఉప్పు చెక్క'' అంటారు. ఇది అత్యంత ఘాటైన మధురమైన వాసనతో వుంటుంది. దీన్ని పశువులకు తిని పించాలి. ఇదొక పెద్ద ప్రహసనం. అవి దీన్ని తినవు. అంచేత ఒక్కొక్క దాన్ని పట్టుకొని దాని నోరు తెరిచి అందులో ఈ ఉప్పు చెక్కను చారెడు పోసి దాని నోరు మూస్తారు. అప్పుడు ఆ పశువు దాన్ని మీంగుతుంది.. ఇలా ఒక్కదానికి సుమారు రెండు మూడు దోసిళ్ళ ఉప్పు చెక్కను తినిపిస్తారు. గొర్రెలు మేకలు ఐతే కొన్ని వాటంతట అవే తింటాయి. లేకుంటే వాటిక్కూడ తినిపిస్తారు. ఏడాదికి ఒకసారి ఈ ఉప్పుచెక్కను తినిపిస్తే అది పశువులకు సర్వరోగ నివారణి అని వీరి నమ్మకం. ఎందుకంటే అందులో వున్నవన్నీ ఔషధాలు , వన మూలికలే గదా. ఆ తర్వాత పశువులన్నింటిని పొలాల్లోని బావుల వద్దకు గాని , చెరువుల వద్దకు గాని తోలుకెళ్ళి స్నానం చేయించి , లేదా ఈత కొట్టించి , ఇంటికి తోలుకొస్తారు. ఆ తర్వాత వాటి కొమ్ములను , పదునయిన కత్తితో బాగా చెలిగి వాటికి రంగులు పూస్తారు. మంచి కోడెలున్న వారు వాటి కొమ్ములకు ఇత్తడి కుప్పెలు తొడిగి , మెడలో మువ్వల పట్టీలు , మూతికి మూజంబరాలు అలంకరిస్తారు. అన్నింటికీ కొత్త పగ్గాలు వేస్తారు. ఈ సమయంలో చేలన్నీ పరిగిలి పోయి వున్నందున పశువులన్నింటిని వదిలేస్తారు. సాయంకాలం ఊరు ముందున్న కాటమరాజును పునఃప్రతిష్టించి ఊరిలో ప్రతి ఇంటి నుండి ఆడవారు కాటమరాజు ముందు పొంగలి పెడ్తారు. పొంగలి అంటే కొత్త కుండలో , కొత్త బియ్యం , కొత్త బెల్లం వేసి అన్నం వండడం. ఒక నెల ముందు నుండే కాటమరాజు ముందు ఆ దారిన వచ్చిపోయే ఊరివారు రోజుకొక కంపో , కర్రో తెచ్చి అక్కడ కుప్పగా వేస్తారు. కనుమ రోజుకు అది ఒకపెద్ద కుప్పగా తయారయ ఉంటుంది. దాన్ని "చిట్లా కుప్ప" అంటారు. చీకటి పడే సమయానికి పొంగళ్లు తయారయి ఉంటాయి. ఊరి చాకలి కాటమరాజు పూజ కార్యక్రమం ప్రారంబించి దేవుని ముందు పెద్ద తళిగ వేస్తారు. అంటే ప్రతి పొంగలి నుండి కొంత తీసి అక్కడ ఆకులో కుప్పగా పెడతారు , పూజానంతరం మొక్కున్న వారు , చాకిలి చేత కోళ్ళను కోయించుకుంటారు. అప్పటికి బాగా చీకటి పడి వుంటుంది. అప్పటికి పశుకాపరులు అందరూ ఊరి పశువులన్నింటిని అక్కడికి తోలుకొని వస్తారు. పూజారి అయిన చాకలి తళిగలోని పొంగలిని తీసి ఒక పెద్దముద్దగా చేసి అందులో సగం పోలిగాని కిచ్చి (పశువుల కాపరి) తినమని చెప్పి , తర్వాత అక్కడున్న చిట్లాకుప్పకు నిప్పు పెడతారు. పెద్ద మంట పైకి లేవగా పోలిగాడు పశువులన్నింటిని బెదరగొట్టి , చెదరకొడతాడు. అవి బెదిరి పొలాల వెంబడి పరుగులు తీస్తాయి. ఆ సమయంలో పశువులను బెదర గొడుతున్న పోలిగాని వీపున చాకలి తనచేతిలో వున్న మిగిలిన సగం పొంగలి ముద్దను అతని వీపు మీద కొడతాడు. దానిని పిడుగు ముద్ద అంటారు. వాడు పరిగెడుతాడు. ఆ తర్వాత అందరూ అక్కడ మిగిలిన తళిగలోని ప్రసాదాన్ని తిని మొక్కులు తీర్చుకొని చిట్లకుప్ప మంట వెలుగులో తమ కోళ్ళను కోసుకొని పొంగళ్లను తీసుకొని తాపీగా ఇళ్ళకి వెళతారు. పొలి అంటే? ఈ సందర్భంగా పెద్ద మొక్కున్న వారు పొటేళ్ళను కూడ బలి ఇస్తారు. దాని రక్తాన్ని ఆన్నంలో కలిపి ఒక కుప్ప పెడతారు. దాన్ని ''పొలి'' అంటారు. ఆ "పొలి" ని తోటకాపరి గాని, నీరు కట్టేవాడు గాని తీసుకొని వెళ్ళి అందరి పొలాల్లో , చెరువుల్లో , బావుల్లో "పొలో.... పొలి" అని అరుస్తూ చల్లుతాడు. అప్పడే కొత్త మొక్కులు కూడ మొక్కు కుంటారు. అంటే , తమ పశుమందలు అభివృద్ది చెందితే రాబోయే పండక్కి పొట్టేలును , కోడిని ఇస్తామని కాటమ రాజుకు మొక్కు కుంటారు. అప్పటికప్పుడే ఒక పొటెలుపిల్లను ఎంపిక చేస్తారు. ఆ విధంగా పశువుల పండగ పరిసమాప్తి అవుతుంది. ఈ నెలరోజులు వాకిట్లో అందమైన ముగ్గులతో అలంకరిస్తాము. కానీ ఈ కనుమ రోజున మాత్రం రధం ముగ్గువేసి ఆ రథాన్ని వీధిచివర వరకూ లాగినట్టుగా ముగ్గువేస్తారు. దీని అర్థం సూర్యుడు తన దిశను మార్చుకున్న మొదటిరోజు అని తెలుస్తుంది. -
Sankranti Festival 2023: కాకినాడలో రామ్‌గోపాల్ వర్మ సందడి
-
RGV: కాకినాడలో రామ్‌గోపాల్ వర్మ సందడి..
సాక్షి, కాకినాడ: సంక్రాంతి సందర్భంగా కాకినాడ జిల్లాలో రెండో రోజు కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. బరులలో కోడి పుంజులు కాళ్లు దువ్వుతున్నాయి. పందాల కోసం ఇతర ప్రాంతాల నుంచి పందెం రాయుళ్లు తరలివచ్చారు. కాగా, సంక్రాంతి పండగ నేపథ్యంలో కాకినాడలో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సందడి చేశారు. వలసపాకలో కోడిపందాలను ఆయన తిలకించారు. పందెంలో గెలిచిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. రామ్‌గోపాల్‌వర్మతో పాటు నటుడు కృష్ణుడు కూడా ఉన్నారు. ఆర్జీవీ రాకతో కాకినాడలో సందడి వాతావరణం నెలకొంది. స్థానికులు ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి నివాసానికి చేరుకున్న ఆర్జీవీ.. అక్కడ అల్పహారం స్వీకరించారు. అనంతరం కోడిపందాలను ఆసక్తిగా తిలకించారు. చదవండి: హైదరాబాద్ అల్లుడు.. భీమవరం మామ.. 173 రకాలతో.. -
సంబరాల సంక్రాంతి..
నెల రోజులపాటు జరుపుకొనే అచ్చ తెలుగు పండుగ సంక్రాంతి. ప్రత్యేకతలెన్నో ఉన్న పండగ సంక్రాంతి. మనం జరుపుకునే పండుగలన్నీ చాంద్రమానం ప్రకారం జరుపుకునేవే! సంక్రాంతి పండుగ మాత్రం అందుకు భిన్నం. దీనిని సౌరమానం ప్రకారం జరుపుకుంటాం. ఈ పండుగ ప్రత్యేకించి ఒక దేవుడికో, దేవతకో సంబంధించినది కాదు. పంటల పండుగ. కళాకారుల పండుగ. రైతుల పండుగ. కొత్తల్లుళ్ల పండుగ. పెద్దల పండుగ. రంగవల్లుల పండుగ. వినోదాల పండుగ. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కనకనే అందరికీ పెద్ద పండుగ అయ్యింది. ఆరుగాలం పంటపొలాలలో శ్రమించే రైతన్న తమ పంట పండి ఇంటికి వచ్చిన సంబరంతో చేసుకునే పండుగ ఇది. పంట వేసినప్పటినుంచి çకోతకోసి ఇంటికి వచ్చేదాకా ఉదయం నుంచీ అర్ధరాత్రి వరకు పొలంలో కష్టపడిన రైతన్నకు వివిధ చేతివృత్తుల వాళ్లు, కళాకారులు అండగా నిలబడతారు. రైతుల అవసరాలు తీర్చి, వినోదం పంచి మానసికోల్లాసం కలిగిస్తారు. ప్రతిఫలంగా రైతులు వారికి ధాన్యం కొలిచి ఇస్తారు. ఉత్తరాయణంలో జరుపుకునే శుభాల పండుగ సంక్రాంతి పండుగ ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే తొలి పండుగ. ఉత్తరాయణం సకల శుభకార్యాలు జరుపుకొనేందుకు యోగ్యమైన కాలం. ఇంతకీ ఉత్తరాయణమంటే ఏమిటో చూద్దాం. సూర్యుని సంచారం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఉత్తరాయణం, రెండోది దక్షిణాయనం. మనకు ఒక సంవత్సరకాలం దేవతలకు ఒక్క రోజు. అంటే ఆరుమాసాల ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు. దక్షిణాయనం రాత్రి. ‘సంక్రాంతి’ లేదా ‘సంక్రమణం’ అంటే ‘చేరడం’ లేదా ‘మారడం’ అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశుల్లో క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. పురాణాల ప్రకారం సూర్య భగవానుడు ఈ రోజునే తన కుమారుడైన శని ఇంటికి వెళతాడు. ఆయనం అనగా పయనించడం అని అర్థం. ఉత్తర ఆయనం అంటే ఉత్తరం వైపు పయనించడం అని అర్థం. సూర్యుడు భూమికి కొంత కాలం దక్షిణం వైపు పయనించాక తన దిశ మార్చుకుని ఉత్తరం వైపు పయనించనారంభిస్తాడు. సూర్యుడు పయనించే దిక్కును బట్టి, దక్షిణం వైపు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనం అనీ, ఉత్తరం వైపు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు. ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయనం పాప కాలం అని కాదు. దక్షిణాయనం కూడా పుణ్యకాలమే! అయితే ఉత్తరాయణం విశిష్ఠత వేరు. భూమిపై రాత్రి, పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని, సూర్యుడు భూమిపై దక్షిణం వైపు పయనిస్తున్నంత కాలం రాత్రిగాను, ఉత్తరం వైపు పయనిస్తున్నంత కాలం పగలు గాను అభివర్ణించారు. మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయణంలో మేలుకొని ఉంటారని, వారు మేలుకొని ఉండగా అడిగిన కోర్కెలు వెంటనే తీరుస్తారని, ఆ విషయం అందరికీ తెలియజేయడం కోసం పెద్దలు ఈ పండుగలను జరపడం మొదలుపెట్టారని అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాయణం నుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. అందుకే కురుక్షేత్ర యుద్ధంలో అంపశయ్య పై ఒరిగిన భీష్మ పితామహుడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తరువాతనే ప్రాణాలు వదిలాడు. ఎందుకంటే ఈ మకర సంక్రమణం దేవతలకు పగటి కాలం కావడమే ప్రధాన కారణం. శాస్త్ర ప్రకారం ప్రతి సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. అయితే, మిగిలిన పదకొండు సంక్రమణాల్లో ఇవ్వకపోయినా, మకర సంక్రమణం సందర్భంగా మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు. సంక్రమణ దానాలు... సర్వపాపహరాలు ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్ఠమైందని ఆర్యోక్తి. ఉత్తరాయణ కాలంలో చేసే దానాలలో ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు మొదలైనవి ఉత్తమమైనవి. ఈ కాలంలో గోవును దానం చేస్తే స్వర్గ వాసం కలుగుతుందని ఆస్తిక లోక విశ్వాసం. సంక్రాంతి అనేది నెలరోజుల పండుగ. ధనుర్మాసంలో వచ్చే పండుగ. ధనుర్మాసం అని పండితులంటారు కానీ, వాడుకభాషలో చెప్పాలంటే సంక్రాంతి నెల పట్టటం అంటారు. ఈ నెల పట్టిన దగ్గరనుంచి తెలుగు లోగిళ్లలో పండగ వాతావరణం మొదలవుతుంది. ఇంటిముందు ముగ్గులు, హరిదాసులు, బుడబుక్కలవారు, గంగిరెద్దులవాళ్లతో గ్రామాల్లో పండుగ వాతావరణం వస్తుంది. ఆడపడచులు ఇంటిముందు ఊడ్చి, కళ్లాపి చల్లి రకరకాల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యప్పిండి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజిస్తారు. హరిదాసుల ఆగమనం వెనక... లేలేత సూర్యకిరణాలు భూమిని తాకే వేళ , ఇంటి ముందు మహిళలు ముగ్గులు పెట్టేవేళ, రామదాసు కీర్తనలు, హరినామ సంకీర్తన, శ్రీకృష్ణ లీలామృతాన్ని గానం చేసుకుంటూ, కాలికి గజ్జెకట్టి తంబుర మీటుతూ, తలపై అక్షయ పాత్రతో, చేతిలో చిడతలతో హరిదాసులు చేసే సంకీర్తనలు సంక్రాంతి సందర్భంగా కనిపించే సంప్రదాయాల్లో ఒకటిగా చెప్పవచ్చును. సంక్రాంతి ముందు మాత్రమే హరిదాసులు కనపడతారు. వీరి తలపై ఉండే పాత్రకు అక్షయ పాత్ర అని పేరు. హరిదాసుల అక్షయపాత్రలో బియ్యం పోస్తే మనం తెలిసీ తెలియక చేసిన ఎన్నో పాపాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు. అందుకే పిల్లలు, పెద్దలు పోటీలు పడి మరీ హరిదాసుల తలపై ఉండే అక్షయ పాత్రలో బియ్యం, కూరగాయలు వంటివి ఉంచుతారు. ధనుర్మాసం నెలరోజులు సూర్యోదయానికి ముందే గోదాదేవిని శ్రీకృష్ణుడిని స్మరించి, తిరుప్పావై పఠించి, అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు. గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి, హరినామ స్మరణ చేసే వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపంలో వైకుంఠపురం నుంచి శ్రీమహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం. నెలరోజుల పాటు హరినామాన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయంపాకానికి అందరూ ఇచ్చే ధన, ధాన్య, వస్తు దానాలను స్వీకరిస్తారు. ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమీ మాట్లాడరు. అక్షయపాత్రను దించరు. హరిదాసు పేద, ధనిక భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు. ఎవరి ఇంటి ముందు ఆగడు. శ్రీమద్రమా రమణ గోవిందో హరీ అంటూ ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతాడు. గుమ్మంలో ఎవరూ లేకపోతే మరో ఇంటికి వెళ్తాడు. హరిదాసు ఉత్త చేతులతో వెళ్ళిపోతే ఆ ఇంటికి అరిష్టమంటారు పెద్దలు. అందుకే గ్రామాలలో హరిదాసు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మాలలో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు. అక్షయపాత్రలో బియ్యం పోయడాన్ని ఆ శ్రీమహా విష్ణువుకు కానుకలు బహూకరించినట్లుగా భక్తులు భావిస్తారు. హరిదాసులతోపాటు, ఈ పర్వదినాలలో గంగిరెద్దుల వారు, బుడబుక్కల వారు, పగటి వేషధారులు, గారడీవాళ్ళు, ఎందరెందరో జానపద కళాకారులు కన్నుల పండువుగా తమ కళాకౌసలాన్ని ప్రదర్శిస్తారు. సంక్రాంతి పర్వదినంతో ఈ కళా ప్రదర్శనలన్నీ ముగుస్తాయి. పంటను ఇంటికి తెచ్చుకుని కళకళలాడే రైతు కుటుంబాలు సంక్రాంతి సంతోషంలో అందరినీ ఆదరిస్తారు. సంక్రాంతి పండుగలో మరిన్ని ప్రత్యేకతలు... పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు అరవైవేల మంది కొడుకులు. వీళ్లంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి, ఆయన తపస్సుని భంగం చేయడంతో కపిలముని వాళ్లందరినీ తన కంటిచూపు నుంచి వెలువడిన క్రోధాగ్ని జ్వాలలతో భస్మం చేశాడు. దాంతో వారికి మోక్షం లభించక అధోలోకాలలో పడి ఉన్నారని, వారికి సద్గతులు కలగాలంటే వారి భస్మరాశుల మీద గంగ ప్రవహించాలని తెలుసుకున్న వారి వంశీకులు చాలామంది గంగను భువికి రప్పించాలని పరిపరివిధాలా ప్రయత్నించి విఫలమయ్యారు. ఎట్టకేలకు భగీరథుడు తన కఠోర తపస్సు, ఎడతెగని ప్రయత్నాలతో ఈ పని చేయగలిగాడు. ఆయన తపస్సుకి మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీద అవతరించిందట. అందుకే సంక్రాంతి నాడు చేసే స్నానం గంగాజలంలో మునక వేసినంత సత్ఫలితాలనిస్తుందని పెద్దలు చెబుతారు. సంక్రాంతి గంగిరెద్దుల వెనుక కూడా ఓ కథ ఉంది. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. శివుడు తన కడుపులో ఉండేలా ఆ గజాసురుడు వరాన్ని కోరుకున్నాడు. శివుని బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఒక ఉపాయం ఆలోచించాడు. దేవతలంతా తలా ఓ వాద్యాన్ని పట్టుకుని, నందితో కలిసి గజాసురుడి దగ్గరకు వెళ్లి అత్యంత అద్భుతంగా గంగిరెడ్ల విన్యాసం చేయించారు. వీళ్ల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకొమ్మని అడిగాడు. ఇంకేముంది! నీ పొట్టలో ఉన్న శివుడిని బయటకు పంపమని వరాన్ని అడిగేశారు. అలా ఆనాడు శివుని పొందేందుకు దేవతలు చేసిన విన్యాసాలే ఇప్పటి గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది అని చెబుతారు. ప్రతి ఆచారానికీ ఓ కథ... కనుమను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశుపక్ష్యాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పని చేసిన ఆవులను, ఎద్దులను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే! పక్షులు కూడా రైతన్న నేస్తాలే! అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వేలాడ దీస్తారు. ఈ నెలరోజులు వాకిట్లో అందమైన ముగ్గులతో అలంకరిస్తాం. కానీ ఈ కనుమ రోజున మాత్రం ర«థం ముగ్గువేసి ఆ రథాన్ని వీధిచివరి వరకూ లాగినట్టుగా ముగ్గువేస్తారు. కనుమ రోజు పశువులను పూజించడం వెనుక కూడా ఓ కథ వినిపిస్తుంది. ఒకసారి శివుడు నందిని పిలిచి ‘భూలోకంలో అందరూ రోజూ ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకి ఓసారే ఆహారం తీసుకోవాలి’ అని చెప్పి రమ్మన్నాడు. కానీ నంది అయోమయంలో ‘రోజూ ఆహారం తీసుకోవాలి, నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి’ అని చెప్పాడట. దాంతో కోపం వచ్చిన శివుడు ‘ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి. ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి’ అని శపించాడట. అప్పటి నుంచి ఎద్దులు, వ్యవసాయంలో సాయపడుతున్నాయట. అందుకే కనుమ రోజు పశువులను ముఖ్యంగా ఎడ్లను సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు. డుబుక్కు డుబుక్కు... బుడబుక్కలవాళ్లు ఈ పండుగ కళారూపాలలో తొలి తాంబూలం బుడబుక్కలవానిది. పగలంతా కష్టపడిన రైతన్న రాత్రికి నడుం వాలిస్తే కళ్ళంలోని ధాన్యాన్ని దొంగలు తరలించుకు పోకుండా తొలిజాములో ఊరి పొలిమేరలలో సంచరిస్తూ కొత్తవాళ్ళను గ్రామంలోకి చొరబడనీకుండా డుబుక్కు డుబుక్కుమని శబ్దం చేస్తూ అందరినీ అప్రమత్తం చేస్తూ కొత్తవారిని కట్టడి చేస్తారు బుడబుక్కలవాళ్లు. వీరు తొలిజామంతా పంటకు కాపలా కాసి రెండోజాము ప్రవేశిస్తుండగా జంగం దేవరకు ఆ పని అప్పచెబుతారు. శంఖనాదాల జంగందేవర సాక్షాత్తూ శివుని అవతార అంశగా భావించే ఈ జంగందేవర శంఖనాదాలతో ఢమరుక శబ్దాలతో రైతుల కళ్ళాలకు ఊరి ప్రజానీకానికి శుభం పలుకుతూ పరమశివుని ఆశీస్సులను అందించే కాపాలికుడు ఈ జంగందేవర! జంగందేవర రాకను గ్రామీణులు శుభంగా భావిస్తారు. పిట్టలదొరలు గంగిరెడ్లు, డూడూ బసవన్నలు వెళ్ళాక చిత్ర విచిత్ర వేషధారణలో మనలను నవ్వులలో ముంచెత్తే కబుర్ల పోగు, కోతలరాయుడు పిట్టలదొర వస్తాడు. ఇతడి మాటలే కాదు, ఆహార్యమూ వింతగా ఉంటుంది. పిల్లలందరికీ నవ్వుల పువ్వులు పంచుతాడు. అందుకే ఏమాత్రం పొసగని దుస్తులు ధరించేవారిని, డంబాలు పోయేవారిని పిట్టలదొరతో పోల్చుతుంటారు. సోదెమ్మ ‘సోదె చెబుతానమ్మా సోదె చెబుతాను. ఉన్నదున్నట్టు చెబుతాను. లేనీదేమీ చెప్పను తల్లీ!’ అంటూ మన భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి తనకు తోచింది చెప్పి ఇంత ధాన్యం, పాతచీర, రవికలగుడ్డ పెట్టించుకుని చల్లగా ఉండమని ఆశీర్వదించి వెళ్లిపోతుంది సోదెమ్మ. ఇంతమంది కళాకారులు నెలరోజుల పాటు రైతుల పంటలకు కాపలా కాస్తూ రైతుల క్షేమాన్ని కాంక్షిస్తూ మనం బాగుంటే తామూ బాగుంటామని, మన క్షేమసౌఖ్యాలలో తామూ ఉంటామని భావిస్తూ, అందుకు తగ్గట్టే గ్రామస్థులకు మనోల్లాసం కలిగిస్తారు. మనకింత సాయం చేసిన వాళ్లు మననుంచి కోరుకునేది కాసిన్ని బియ్యం, కాసిని చిల్లర పైసలు, కాసిన్ని పాత దుస్తులే కదా... అందుకే లేదని కసిరికొట్టకుండా వారు కోరినది ఇచ్చి మన ముంగిటికొచ్చే చిరుకళాకారులను ఆదరించాలి. అందరికీ మంచిని పంచాలి. అందరి మంచిని పెంచాలి. సంక్రాంతి అల్లుడి ఘనత ఏమిటంటారా ? ఏ పండగకైనా ఇంటి అల్లుడి హాజరు తప్పని సరిగా ఉంటుంది. అయితే ఈ సంక్రాంతి రోజున అల్లుడికి శాస్త్రం విశిష్టమైన స్థానాన్ని ఇచ్చింది. అల్లుడు విష్ణు స్వరూపం అన్నారు. అదేవిధంగా సూర్యుడిని సూర్య నారాయణ మూర్తి అని కూడా సంబోధిస్తున్నాం. అంటే సూర్యుడి మకర రాశి ప్రవేశంలో గొప్ప రహస్యం దాగి ఉంది. జ్యోతిర్మండలంలో మకరరాశి పదో రాశి. ఇది అత్తగారిల్లు అంటే విశ్వానికి అల్లుడైన సూర్యుడు తన అత్తగారి ఇంటిలోకి అడుగు పెట్టాడని అర్థం. అందుకే సంక్రాంతికి ఇంటి అల్లుడిని తప్పని సరిగా పిలవాలని సంప్రదాయం ఏర్పడింది. ఈ రోజున అల్లుడి చేత గడ్డపెరుగును తినిపిస్తారు. ఇలా చేయడం వలన అల్లుడి వంశం వృద్ధి చెందుతుందని, అల్లుడు లేని వారు ఈ రోజున పండితులకి పెరుగును దానం చేయాలని పరాశర సంహిత చెబుతోంది. పూలూ–పిండి వంటల వెనుక సైతం సంక్రాంతి రోజున గుమ్మడి కాయ ముక్కలు వేసిన పులుసు, మినప గారెలు, నువ్వుల పొడి, చెరకు ముక్క తప్పని సరిగా తినాలని శాస్త్ర వచనం. ఎందుకు చెప్పిందంటే, ఇవన్నీ కూడా ఔషధ గుణాలు కలిగిన పదార్థాలు కనుక. ఇందులో ఒక్క గుమ్మడికాయను మినహాయిస్తే మిగిలినవి మన దేహాన్ని వెచ్చబరచి పుష్యమాసపు చలి నుంచి శరీరాన్ని రక్షించే పదార్థాలు. ఇక గుమ్మడికాయ స్త్రీ–పురుషుల్లోని వంధ్యత్వాన్ని నివారించి గర్భాశయ దోషాలను, వీర్యదోషాలను నివారించే గొప్ప ఔషధం. ఈ కాలంలో స్త్రీలు వాడే బంతి, చేమంతి, డిసెంబర్ పూలు, మునిగోరింట పూలు అన్నీ చలిని తట్టుకునే వేడిని ఇచ్చేవే. సంక్రాంతి సందర్భంగా చేసుకునే పిండివంటలు అన్నీ ఆరోగ్యాన్ని, ఒంటికి సత్తువనూ ఇచ్చేవే. కనుమ రోజు ప్రయాణం ఎందుకు చేయకూడదంటే..? సంక్రాంతి అంటే పంటల పండుగ కదా! కానీ ఆ పంటలు బాగా పండాలంటే, పశువుల సాయం కూడా కావాలిగా! అందుకే సంక్రాంతి మర్నాడు కనుమని పశువుల పండుగగా పిలుస్తారు. పశువులు ఉన్నవారు ఆ రోజు వాటిని శుభ్రంగా అలంకరించి మంచి ఆహారం పెడతారు. పక్షులకు కూడా ఆహారం అందేలా ఇంటిచూరుకి ధాన్యపుకంకులను వేలాడదీస్తారు. ఇదంతా రైతుల సంగతి. కానీ మిగతావారు పాటించే ఆచారాలు కూడా చాలా ఉన్నాయి. ఈ రోజున చనిపోయిన పెద్దలను తల్చుకుంటూ ప్రసాదాలు పెట్టాలని ఆచారం. కనుమ రోజు అటు పెద్దలకి ప్రసాదం పెట్టేందుకు, మాంసం తినని వారికి దాంతో సమానమైన పోషకాలని ఇచ్చే మినుములతో తయారు చేసిన గారెలు తినాలంటారు. గారెలు, మాంసంతో ఈ రోజు పెద్దలకి ప్రసాదం పెడతారు. కనుమ రోజు పెద్దల కోసం విందుభోజనం తయారు చేయడమే కాదు, దాన్ని అందరూ కలిసి తినాలని నియమం. అందుకే అక్కాచెల్లెళ్లు, అల్లుళ్లతో కలిసి ఈ కనుమ వేడుకని చేసుకుంటారు. కొన్ని పల్లెటూళ్లలో కనుమరోజు పొంగళ్లు వండటం, బలి ఇవ్వడంలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి కాబట్టి ఆ రోజు కూడా ఆగి, బంధువులతో కాస్త సమయం గడిపి, విశ్రాంతి తీసుకుని, మర్నాడు ప్రయాణించమని చెబుతారు. అందుకే ‘కనుమ రోజు కాకి కూడా కదలదు’ అన్న సామెత పుట్టి ఉండవచ్చు. సంక్రాంతి రోజున శబరిమలలో జరిగే మకర జ్యోతి దర్శనం, తిరుమలలో జరిగే పారువేట, శ్రీశైలంలో జరిగే బ్రహ్మోత్సవాలు గోదావరి జిల్లాలో జరిగే ప్రభల తీర్థం ఈ పండుగ ప్రత్యేకతను చాటి చెబుతాయి. ఈ ఉత్తరాయణంలో అందరికీ శుభాలు జరగాలని ఆశిద్దాం. -డి.వి.ఆర్. భాస్కర్ కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా తెలంగాణలో సంక్రాంతికి గాలిపటాలు ఎగరేయడం ఆచారం. దీనికి కూడా ఓ కథ చెబుతారు. సంక్రాంతి నెల రోజులూ నాడు దేవతలంతా ఆకాశంలో విహరిస్తారట. అందుకే వారికి స్వాగతం పలికేందుకు, వారి దృష్టిని ఆకర్షించేందుకు ఈ పండగ సమయంలో గాలిపటాలు ఎగరేయాలని చెబుతారు. గాలిపటాన్ని ఎగురవేయాలంటే ఎంతో నేర్పు, ఓర్పు కావాలి. చాకచక్యంగా గాలిపటాన్ని ఎగురవేసిన వారికి జీవితాన్ని సమతుల్యంగా నిర్వహించే సామర్థ్యం కలుగుతుందని, తెగిన గాలిపటాలతో పాటే దురదృష్టం కూడా మనల్ని వీడి వెళ్లిపోతుందనీ పెద్దలు చెబుతారు. బొమ్మలకొలువు సంక్రాంతి సంబరాలలో భాగమే బొమ్మల కొలువు కూడా. బొమ్మల కొలువును దేవీ నవరాత్రి ఉత్సవాల సమయంలో కూడా పెడతారు. ఇళ్లలో, ఆలయాలలో బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తారు. గృహిణులు తమ వద్దనున్న బొమ్మలననుసరించి మూడు, ఐదు, ఏడు, తొమ్మిది మెట్ల వరసలలో బొమ్మల కొలువులు పెట్టడం ఆచారం. ఇలా బొమ్మల కొలువులు పేర్చడంలో కొన్ని నియమాలు, సూత్రాలు ఉన్నాయి. భగవంతుడి దశావతారాల సూత్ర ప్రకారం ఈ సృష్టి పరిణామ క్రమాన్ని మానవుడి అభివృద్ధి క్రమాన్ని దృష్టిలో పెట్టుకొని కింది మెట్టునుంచి పై మెట్టువరకు వివిధ వర్ణాలు, వివిధ ప్రమాణాలలో బొమ్మలను అమరుస్తారు. గంగిరెడ్లు ‘అయ్యగారికి దండం పెట్టు! అమ్మగారికి దండం పెట్టు! బాబుగారికి దండంపెట్టు! పాపగారికి దండం పెట్టు!’ అంటూ బసవన్నల చేత దండాలు పెట్టించి, రైతు బతుకుకు అంతా తానై నడిపే ఎడ్లను అలంకరించి ఇంటిముంగిట్లో ఎడ్లను ఆడించి ఇంట్లోని చిన్నా పెద్ద అందరినీ అలరించే గంగిరెద్దుల వాళ్ళు ఊదే సన్నాయి సన్నాయి కూడా మంగళవాద్యమే. -
Sankranti 2023: పండగ రోజు ట్రెడిషనల్ లుక్ కోసం ఇలా చేయండి..
పండగ రోజున సంప్రదాయ దుస్తులతో ప్రత్యేకంగా కనిపిస్తూ సందడి చేస్తారు. అదేవిధంగా మేకప్ కూడా ప్రత్యేకంగా ఉంటే లుక్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. రోజంతా మేకప్‌తో ఫ్రెష్ లుక్‌లో కనిపించాలంటే ఎంపిక చేసుకునే సాధనాలలోనూ జాగ్రత్త వహించాలి. బ్లష్ సంప్రదాయ దుస్తులు ధరించినప్పుడు ఎక్కువ మేకప్ వేసుకోవడం కాస్త కష్టమే. అయితే, ట్రెడిషనల్‌గా నేచురల్ లుక్ కావాలంటే బ్లష్ అప్లై చేసుకోవచ్చు. ఫెయిర్‌గా ఉన్నవారు బ్లష్‌తో వారి ముఖారవిందాన్ని మరింతగా మెరిపించుకోవచ్చు. బ్లష్ అప్లై చేసిన తర్వాత రెగ్యులర్ ఫౌండేషన్ తో టచ్ అప్ చేయాలి. హైలైటర్ ధరించిన దుస్తులు ప్రకాశవంతమైన రంగులో ఉంటే, దానితో ప్రత్యేకంగా కనిపించడానికి లైట్ మేకప్ ఉత్తమంగా ఉంటుంది. ఇది న్యూడ్ ఐషాడో, లిప్‌స్టిక్‌తో పాటు చాలా తేలికపాటి బేస్ ఉంటుంది. దీనికోసం లైట్ హైలైటర్‌ని ఉపయోగించవచ్చు. మెరిసే కనుబొమ్మ గ్లిట్టర్ ఐషాడో ఎంపిక పండుగ రోజున ఉత్తమ ఎంపిక. సంప్రదాయ రూ΄ాన్ని అధునాతనంగా మార్చడానికి దీన్ని ప్రయత్నించవచ్చు. జరీ అంచు దుస్తులు ధరిస్తారు కాబట్టి బంగారు లేదా వెండి షిమ్మర్ ఐషాడో వేసుకుంటే ముఖ కాంతి మరింతగా పెరుగుతుంది. మాట్ లుక్ చాలా మంది సినీ తారలు మాట్ లుక్ మేకప్‌ని అనుసరిస్తారు. దీంతో చీర లేదా మరేదైనా సంప్రదాయ వేషధారణలో వారు మరింత అందంగా కనిపిస్తారు. మ్యాట్ లుక్ చర్మాన్ని ప్రకాశవంతంగా, సహజంగా కనిపించేలా చేస్తుంది. అయితే ఈ మేకప్ వేసుకునే ముందు చర్మ తత్వం గురించి తెలుసుకోవాలి. డార్క్ లిప్ స్టిక్ డార్క్ లిప్‌స్టిక్ మీ మేకప్‌ను మరింత అందంగా మారుస్తుంది. పండగరోజుల్లో సాధారణంగా బ్రైట్‌గా ఉండే దుస్తులను ధరిస్తారు కాబట్టి అప్పుడు ముదురు రంగు లిప్‌స్టిక్ ఎంపిక ధరించిన దుస్తులకు తగిన విధంగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో మాట్ లిప్‌స్టిక్ షేడ్స్ కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. -
సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)
-
ప్రజలకు ప్రధాని మోదీ పండుగ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: భోగి, ఉత్తరాయణ పర్వదినాలను పురస్కరించుకుని ప్రధాని మోదీ శనివారం దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రజలకు ఉత్తరాయణ, భోగి శుభాకాంక్షలు. ఈ పండుగ రోజులు అందరికీ సంతోషాన్ని, శుభాలను కలుగజేయాలని, జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ప్రార్థిస్తున్నాను’అని ఆయన ట్వీట్లు చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో భోగి పండుగను, ఉత్తరాయణం సందర్భంగా గుజరాత్ తదితర ప్రాంతాల్లో గాలిపటాలు ఎగురవేస్తారు. -
వేసవిలో రామబాణం
‘లక్ష్యం’ (2007), ‘లౌక్యం’ (2014) చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో రూపొందుతున్న మూడో చిత్రానికి ‘రామబాణం’ టైటిల్‌ను ఖరారు చేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను శనివారం ప్రకటించారు. డింపుల్ హయతి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, ఖుçష్బూ కీలక పాత్రలు చేస్తున్నారు. ఇందులో గోపీచంద్‌కు అన్నా వదిన పాత్రల్లో జగపతిబాబు, ఖుష్బూ కనిపిస్తారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీచంద్ కెరీర్లో 30వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ తుది దశలో ఉంది. ‘‘బాలకృష్ణగారు మా సినిమా టైటిల్‌ను ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సామాజిక సందేశం కూడా మిళితమై ఉన్న బలమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు కథ: భూపతి రాజా, కెమెరా: వెట్రి పళనీస్వామి, సంగీతం: మిక్కీ జే మేయర్. -
కాలు దువ్విన కోడి పుంజులు
సాక్షి,అమరావతి/కాకినాడ/భీమవర/పెనమలూరు: సంక్రాంతి సంబరాల తొలి రోజునే కోడి పందేల జాతర మొదలైంది. భోగి రోజైన శనివారం మొదలైన ఈ పందేలు మూడు రోజులపాటు నిర్వహించేలా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసుకున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఊరూ వాడా కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అనేకచోట్ల పందేలు మొదలయ్యాయి. ఈ సారి భారీ బరుల వద్ద కోడి పందేల్లో పాల్గొనే వారి కోసం ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ద్వారా నగదు చెల్లింపులకు వీలుగా ఏర్పాట్లు చేశారు. విశాలమైన మైదానాలు, తోటల్లో బరులను ఏర్పాటు చేశారు. భారీ టెంట్లు వేసి కూర్చునేందుకు వీవీఐపీ, వీఐపీ, సాధారణ గ్యాలరీలను సైతం ఏర్పాటు చేశారు. రాత్రి వేళలోనూ పందేలు కొనసాగేలా బరుల వద్ద ఫ్లడ్ లైట్లను అమర్చారు. కేరవాన్లు.. స్పెషల్ పాస్‌లు కోడి పందేలకు పెట్టింది పేరైన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతంలో భారీ ఏర్పాట్ల నడుమ కోడి పందేలు నిర్వహిస్తున్నారు. కాకినాడ రూరల్ పరిధిలోని వలసపాకలో పందేలు వీక్షించేందుకు పాస్‌లు జారీ చేశారు. కొన్నిచోట్ల పందేల్లో గెలిచిన వారికి బుల్లెట్ వాహనం, కారు బహుమతిగా ప్రకటించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురంలో భారీ ఏర్పాట్లతో ఒక్కో కోడి పందెం రూ.లక్షల్లో నిర్వహించారు. పందేల్లో పాల్గొనే వారికి వీవీఐపీ పాస్ ధర రూ.60 వేలు.. వీఐపీ పాస్ రూ.40 వేలుగా నిర్ణయించారు. పందేల రాయుళ్ల కోసం క్యూఆర్ కోడ్ నగదు చెల్లింపుల సౌకర్యం కల్పించారు. కొన్నిచోట్ల వీవీఐపీల కోసం బరులకు సమీపంలో కేరవాన్లు (బస చేసే వాహనాలు) కూడా ఏర్పాటు చేశారు. అతిథి మర్యాదలకు లోటు లేకుండా.. పందేలను చూసేందుకు, పందేలు ఒడ్డేందుకు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారి అభిలాషకు అనుగుణంగా పలుచోట్ల బరుల నిర్వాహకులు అతిథి మర్యాదలు సిద్ధం చేశారు. ప్రత్యేకంగా హోటళ్లు, అతిథి గృహాలు, చేపల చెరువులపై మకాంలను కేటాయించి ప్రత్యేకంగా మాంసాహార వంటకాలు, విదేశీ మద్యంతో అతిథి మర్యాదల్లో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ‘పశ్చిమ’లో 270 బరులు పశ్చిమ గోదావరి, జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో చిన్నాపెద్దా అన్నీ కలిపి కోడి పందేల బరులు దాదాపు 270 వరకు ఏర్పాటయ్యాయి. ఉండి, ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాల్లో ఎక్కువ కోడి పందేలు గెలిచిన వారికి బుల్లెట్ మోటార్ సైకిల్ బహుమతిగా ప్రకటించారు. దుంపగడప బరిలో ఏలూరు జిల్లా తాడినాడకు చెందిన వ్యక్తి 9 పందేలకు గాను 5 పందేలు గెలిచి బుల్లెట్ మోటార్ సైకిల్ బహుమతి అందుకున్నాడు. ఏలూరు జిల్లా పరిధిలోనూ సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని ఈడుపుగల్లులో కోడిపందేల బరి ‘తూర్పు’ పందేలు డీలా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కోడి పందేలు నిర్వహించినప్పటికీ.. గుండాటలను పోలీసులు అడ్డుకోవడంతో జూదరులు డీలా పడ్డారు. తూర్పు గోదావరి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో దాదాపు 300 చోట్ల కోడి పందేల బరులు వెలిశాయి. గత సంక్రాంతితో పోల్చితే ఈ సారి కోడి పందేలు సాధారణంగా జరిగాయే తప్ప భారీ ఎత్తున ఎక్కడా జరగలేదు. ప్రత్యేక వాహనాల్లో రాక ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కోడి పందేల బరులను సిద్ధం చేశారు. పెనమలూరు, గన్నవరం, మచిలీపట్నం, పామర్రు, ఎన్టీఆర్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా సిద్ధం చేసిన బరుల్లో సంప్రదాయంగా, రైతువారీగా కోడిపందేలు నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ముంబై, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి పందెంరాయుళ్లు ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు. వారి కోసం బరుల నిర్వాహకులు ప్రత్యేక వసతి సదుపాయాలను సమకూర్చారు. -
పుట్టిల్లు, అత్తిల్లు ఒకేచోట కావడం ఆనందంగా ఉంది: హన్సిక
పెళ్లయ్యాక వచ్చిన తొలి పండగ సంక్రాంతి సంబరాల్లో ఉన్న హన్సిక తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 4న వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో హన్సిక వివాహం జరిగింది. పెళ్లి తర్వాత షూటింగ్స్‌కి కాస్త బ్రేక్ ఇచ్చారామె. ఇక సంక్రాంతి సంబరాల గురించి హన్సిక ఈ విధంగా చెప్పారు. సంక్రాంతి మనందరికీ పెద్ద పండగ. మాకు నార్త్‌లో అయితే 13 నుంచి 16వ తేదీ వరకూ పండగ చేసుకుంటాం. శుక్రవారం లోరీ (భోగి పండగ) జరుపుకున్నాం. లోరీ అంటే మాకు నువ్వుల లడ్డు తప్పనిసరి. హల్వా కూడా చేస్తాం. మా అత్తగారింట్లో సంప్రదాయాలు బాగా పాటిస్తారు. కోడలు హల్వా చేయడం ఆనవాయితీ. సో.. లోరీకి నేనే హల్వా తయారు చేశాను. ఇంకా వేరుశెనగ పప్పుతో బర్ఫీ చేస్తాం. లోరీ మంటలో మరమరాలు, పేలాలు వంటివన్నీ వేస్తాం. అగ్నికి చెడు ఆహుతైపోవాలని, రానున్న రోజులన్నీ బాగుండాలని కోరుకుంటూ, మంట చుట్టూ తిరుగుతాం. పుట్టిల్లు.. అత్తిల్లు ఒకేచోటే... సంక్రాంతి సందర్భంగా మా అత్తగారు మా పుట్టింటివాళ్లని ఆహ్వానించారు. లోరీ రోజు మా అమ్మవాళ్లు వచ్చారు. పండగ పనులకు అమ్మ సాయం చేశారు. ఆ రోజంతా ఉండి, ఎంజాయ్ చేసి వెళ్లారు. పుట్టిల్లు, అత్తిల్లు ఒకేచోట.. అంటే ముంబైలోనే కావడం ఆనందంగా ఉంది. ఎప్పుడు అనుకుంటే అప్పుడు, ఇలా పండగలప్పుడు కలుసుకునే వీలుంటుంది. గ్రాండ్‌గా పండగ లోరీని ఘనంగా జరిపినట్లే మిగతా మూడురోజుల పండగను కూడా గ్రాండ్‌గా ప్లాన్ చేశాం. నిష్టగా పూజలు చేయడం, పిండి వంటలు చేయడం.. అన్నింటినీ చాలా జాగ్రత్తగా చేస్తున్నాం. ఇక పండగ అంటే ఇతరులను కూడా సంతోషపెట్టాలన్నది నా అభిప్రాయం. నా చిన్నప్పుడే మా అమ్మగారు నాకీ విషయం చెప్పి, ఇతరులకు సహాయపడేలా చేస్తుంటారు. పిల్లలకు కొత్త బట్టలు కొన్నాం ‘మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది’ అని మా అమ్మ అంటుంటారు. అందుకే టీనేజ్‌లో నేను హీరోయిన్ అయ్యాక కొంతమంది పిల్లలను దత్తత తీసుకునేలా చేశారు, ఇప్పుడు మేం మొత్తం 31 మంది పిల్లల ఆలనా పాలనా చూస్తున్నాం. సంక్రాంతి సందర్భంగా పిల్లలందరికీ కొత్త బట్టలు కొన్నాం. స్వీట్లు పంచి పెట్టాం. పిల్లల ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఆ ఆనందం తాలూకు ఆశీర్వాదాలు మనకు అందుతాయి. ఆ దేవుడి ఆశీర్వాదం ఉండటంవల్లే నా జీవితం సాఫీగా సాగిపోతోంది. ఈ 20 నుంచి ఫుల్ బిజీ పెళ్లయ్యాక ప్రొఫెషనల్ లైఫ్‌కి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చాను. ఈ మధ్యే యాడ్ షూట్స్‌లో పాల్గొన్నాను. ఇక ఈ నెల 20న నుంచి గ్యాప్ లేకుండా షూటింగ్ చేయబోతున్నాను. దాదాపు ఏడు సినిమాలు కమిట్ అయ్యాను. రెండు వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. వీటితో బిజీ అయిపోతాను కాబట్టి ఈ పండగను వీలైనంత ప్రశాంతంగా జరుపుకుంటున్నాను. మరోవైపు మా ఆయన కూడా తన బిజినెస్ పనులతో బిజీ అయిపోతారు. ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలని ఇద్దరం మాట్లాడుకున్నాం. మరోసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆ దేవుడి దయ వల్ల అందరి జీవితాలూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. -
AP: సంబరంలా సంక్రాంతి
సాక్షి, అమరావతి: సీఎం క్యాంపు కార్యాలయంలో శనివారం సంక్రాంతి సంబరాలు నేత్రపర్వంగా జరిగాయి. సంప్రదాయ పంచెకట్టుతో సతీసమేతంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అంతా మంచి జరగాలని, దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి చిహ్నానికి గుర్తుగా తెల్లని పావురాలను ఎగురవేశారు. సీఎం జగన్ దంపతుల మాటామంతీ గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా.. అంతకుముందు.. సీఎం క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న గోశాలను చక్కగా పల్లెటూరు వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. గ్రామ సచివాలయం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్, రైతుభరోసా కేంద్రాలు, పాఠశాలల నాడు–నేడు వంటి ప్రభుత్వ ప్రాధాన్యతలను తెలియజేస్తూ రంగవల్లులు, గొబ్బెమ్మలు, గాలిపటాలు, ధాన్యాగారాలు, గడ్డివాములు, ఎడ్లబండ్లు ఇలా అసలుసిసలైన పల్లె వాతావరణం ప్రతిబింబించేలా ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పర్యవేక్షణలో గ్రామ స్వరాజ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆద్యంతం ఉల్లాసంగా ఉత్సాహంగా.. ఇక ఈ కార్యక్రమానికి సంప్రదాయ దుస్తులతో హాజరైన సీఎం దంపతులను వేదపండితులు నుదుట తిలకం దిద్ది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారిరువురూ జ్యోతి ప్రజ్వలన చేసి సంక్రాంతి సంబరాలను లాంఛనంగా ప్రారంభించారు. గోశాలలోని గోవులకు పూజచేసి దండలు వేసి వాటిని నిమిరుతూ కొద్దిసేపు సంతోషంగా అక్కడ గడిపిన అనంతరం తులసి మొక్కకు నీళ్లుపోసి నమస్కరించుకున్నారు. అక్కడి వినాయకుడి గుడిలోనూ పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన భోగిమంటను కాగడాతో వెలిగించారు. హరిదాసుకు బియ్యం పోయడంతోపాటు పండ్లు కూరగాయలతో కూడిన స్వయంపాకాన్ని సమర్పించారు. గ్రామీణ సంక్రాంతి వేడుకల్లో ప్రధానంగా కనిపించే వివిధ కళాకారులను సీఎం ఆప్యాయంగా పలకరించారు. అంతేకాక.. తెలుగింటి సంక్రాంతి పిండివంటలను ముఖ్యమంత్రి దంపతులు రుచి చూశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పర్ణశాలలో సీఎం దంపతులు ఆశీనులయ్యారు. హరిదాసుకు బియ్యం సమర్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుడు ఆనంద్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ‘శ్రీనివాస కల్యాణం’ నృత్య రూపకాన్ని సీఎం వైఎస్ జగన్ దంపతులు ఆద్యంతం ఆస్వాదించారు. నవరత్నాలతో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించిన నేపథ్యంలో గ్రామ సచివాలయం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్, రైతుభరోసా కేంద్రాలు తదితర సేవల ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని సాక్షాత్కారం చేసిన తీరును కళ్ల కట్టినట్లు చూపించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమ్మా ఉయ్యాల కోన జంపాల.. పాట పాడిన గాయని ప్రకృతిరెడ్డి, అదే సినిమాలో ఎత్తర జెండా.. పాట పాడిన హారిక నారాయణ్, ప్రముఖ జానపద గాయని కనకవ్వ తదితర కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎక్కడో తెలంగాణ మారుమూల గ్రామంలో ఉన్న నన్ను గుర్తించి పిలిపించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దీర్ఘకాలం సీఎంగా ఉండాలంటూ ఆశీర్వదించారు. అనంతరం.. శాంతి చిహ్నానికి ప్రతీకగా సీఎం దంపతులు తెల్ల పావురాలను ఎగురవేశారు. ఈ సంబరాల్లో పాల్గొన్న వివిధ కళాకారులను ముఖ్యమంత్రి ఆప్యాయంగా పలకరించడంతో పాటు వారితో ఫొటోలు దిగుతూ వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రి జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానులతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఏపీ బరిలో తెలంగాణ పుంజు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సంక్రాంతి పండుగ వచ్చిందంటే కోడి పందేల జోరు మొదలవుతుంది. కాళ్లకు కత్తులతో కలబడే పుంజులు, వాటి చుట్టూ చేరి ఉత్సాహంగా పందాలు కాసేవారితో బరులు కళకళలాడుతాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంత జిల్లాలు ఈ కోడి పందాలకు పెట్టింది పేరు. కానీ అక్కడ బరిలోకి దిగే పుంజుల్లో తెలంగాణలో పుట్టిపెరిగినవి పెద్ద సంఖ్యలో ఉంటుండటం గమనార్హం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, ముఖ్యంగా అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని పామాయిల్ తోటల్లో పందెం పుంజులను పెంచుతుంటారు. ఈ రెండు మండలాల్లోని పదికిపైగా గ్రామాల్లో సుమారు ఇరవై కోడి పుంజుల ఫారాలు ఉన్నాయి. ఒక్కో ఫారం నుంచి సంక్రాంతి సీజన్లో 80 నుంచి 100 వరకు పుంజులు ఏపీలో పందేలకు తరలుతాయి. లోకల్ పెట్ట.. పందెం పుంజు..: ఫారాల నిర్వాహకులు ఏపీలో జరిగిన పందేల్లో గెలిచిన పుంజులను కొనుక్కొచ్చి స్థానికంగా కోడిపెట్టలతో క్రాసింగ్ చేయిస్తారు. ఆ కోడిపెట్టలు పెట్టిన పిల్లల నుంచి పుంజులను వేరుచేసి ప్రత్యేకమైన ఆహారం, శిక్షణ ఇస్తారు. ఆరు నెలల వయసు వచ్చేవరకు గుంపుగా ఉంచిన పుంజులను తర్వాత వేరు చేస్తారు. గుడ్లు, రాగులు, నానబెట్టిన బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్లు, మటన్ కీమా వంటివి ఆహారంగా పెడతారు. కాళ్లు దృఢంగా అయ్యేందుకు నీటిలో ఈత కొట్టిస్తారు. మసాజ్ చేస్తారు. కాస్త అటూఇటూగా ఏడాదిన్నర వయసున్న పుంజులను పందాలకు వినియోగిస్తారు. ‘కాకి, నెమలి, డేగ, సీతువా, పచ్చకాకి, కోడి డేగ, ఆబ్రాసు, రసంగి డేగ’ తదితర జాతుల కోళ్లను పోటీకి దింపుతారు. ఏపీ నుంచి పందెం రాయుళ్లు నవంబర్ నుంచే పుంజుల ఫారాలకు వస్తారు. పుంజుల బలం, ఆరోగ్యం, పంజా విసిరే వేగం, ఒంటిపై జుట్టు విచ్చుకునే తీరు వంటివాటిని బట్టి రూ.20 వేల నుంచి రూ.లక్షన్నర వరకు ధర పలుకుతాయి. క్యూ కట్టిన హైదరాబాదీలు – ఏపీలో కోడి పందాలకు భారీగా తరలిన జనం కోస్తా నుంచి సాక్షి ప్రతినిధి:సంక్రాంతి సెలవులతో హైదరాబాద్‌లో రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తే.. ఏపీలోని ఏలూరు, ఎన్టీఆర్, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లాల్లో గ్రామాలకు వెళ్లే మార్గాలు కూడా ట్రాఫిక్‌తో నిండిపోయాయి. పెద్ద సంఖ్యలో హైదరాబాదీలు సంక్రాంతికి ఊరెళ్లడం ఒక కారణమైతే.. కోడి పందాలకు క్యూకట్టడం మరో కారణం ఏ బంకిణీ (కోడి పందాలు నిర్వహించే ప్రాంగణం) పార్కింగ్‌లో చూసినా హైదరాబాద్, శివార్లలోని ప్రాంతాల వాహనాలే కనిపించాయి. ఆకివీడు సమీపంలో ఉన్న ఐభీమవరం బంకిణీలో భారీ సందడి కనిపించింది. దీనికి సమీపంలో ఉన్న చెరుకుమిల్లితోపాటు గుడివాడ–భీమవరం మార్గంలో ఉన్న కాళ్ల, జువ్వలపాలెంలలోనూ బంకిణీలు జనాలతో నిండిపోయాయి. కూచిపూడి, వెంప, భీమవరం, కొప్పాడ, పత్తేపురం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, ఉండి, గణపవరం, తాడేపల్లిగూడెం చుట్టుప్రక్కల గ్రామాల్లోనూ జోరుగా కోడిపందాలు జరిగాయి. చెక్‌పోస్టులను దాటుకుని.. కోడి పందాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు భారీగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం నుంచే వాహనాల తనిఖీ చేపట్టారు. కోడి పుంజులు, నగదుతో వెళ్తున్నవారిని అదుపులోకి తీసుకోవడం ప్రారంభించారు. అయితే స్థానిక యువకులు కొందరు.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారి వాహనాల్లోని కోడి పుంజులను దొడ్డిదారిన చెక్‌పోస్టులు దాటిస్తూ, బంకిణీల వద్దకు చేరుస్తూ కొంత సొమ్ము తీసుకున్నారు. దీనితో పందాలకు వెళ్లేవారికి అడ్డులేకుండా పోయింది. -
సంక్రాంతి: శుభాలకు వాకిలి
మన మహర్షులు ఏర్పరచిన పండుగలలో మనకు అత్యంత ప్రధానమైనది ‘సంక్రాంతి.‘ మకర సంక్రాంతి పుష్యమాసంలో వస్తుంది. పుష్ – అంటే పోషించటం, పుష్టిని కలిగించటం. సర్వ్రపాణికోటికీ పుష్టిని కలిగించే పంటలు ఇంటికి వచ్చే పండుగ సంక్రాంతి పండుగ. మన దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలే కాక ఒకప్పుడు మన భారతదేశంలోని భాగాలే అయిన శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, మలేషియా వంటి ప్రాంతాల్లో కూడా మకర సంక్రాంతిని జరుపుకుంటున్నారు. ‘సం’ అంటే ‘సమ్యక్’ – మంచి, చక్కని. ‘క్రాంతి’ అంటే మార్పు. సమ్యక్ క్రాంతి – సంక్రాంతి. ‘సంక్రాంతి’ లేదా ‘సంక్రమణం’ అంటే – ‘చేరటం’ అని అర్థం. మేషం మొదలైన పన్నెండు రాశులలో సంచరించే సూర్య భగవానుడు ముందున్న రాశి నుండి తరువాత రాశి లోనికి ప్రవేశించటమే సంక్రాంతి. ప్రతి నెలలో సూర్యుడు రాశులు మారుతుంటాడు. అలా మేష సంక్రాంతి, వృషభ సంక్రాంతి, మిథున సంక్రాంతి మొదలైన పన్నెండు సంక్రాంతులు ఏర్పడతాయి. వాటిలో సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే పుణ్యకాలాన్ని‘మకర సంక్రాంతి పండుగ‘ గా జరుపుకుంటున్నాం. సూర్యుడు ఈ మకర రాశిలో ప్రవేశించటాన్నే ఎందుకు పెద్ద పండుగగా జరుపుకుంటున్నాం అంటే, వెలుగు ఎక్కువగా ఉండే దీర్ఘమైన పగళ్ళకూ, ఆరోగ్యాన్ని వృద్ధిపరిచే సుందరమైన, ఆహ్లాదకరమైన కాలానికి నాంది కాగల ఉత్తరాయణ పుణ్యకాలం ్రపారంభమవుతుంది కనుక. ప్రకృతి లో ఇది గొప్ప మార్పు. మన ఉత్తరాయణం ఆరు నెలలు దేవతలకు పగటి కాలం. అందువల్ల కూడా ఉత్తరాయణం అత్యంత పవిత్రమైన కాలం. ఉత్తరాయణంలోనే మనం ఉపనయనాలు, వివాహాది శుభకార్యాలను జరిపిస్తాం. కనుకే ఉత్తరాయణం ్రపారంభంలో వచ్చే మకర సంక్రమణాన్ని‘సంక్రాంతి పండుగ‘గా జరుపుకుంటున్నాం. వెలుగుకు, జ్ఞానానికి సూచకమైన ‘మకర సంక్రాంతి’ మనకు పెద్ద పండుగ. సాధారణంగా మనం పండుగలకు చాంద్రమానాన్ని పాటిస్తాం. కనుక తిథులను బట్టి ఆయా పండుగలను జరుపుకుంటాం. కానీ సంక్రాంతి పండుగ మాత్రం సౌరమానం ప్రకారం జరుపుకుంటాం. కనుకే ప్రతి సంవత్సరం జనవరి 13, 14, 15, 16 తేదీలలోనే ఈ పండుగ మూడు రోజులు ఉంటాయి. తెలుగువారి ముఖ్య పండుగలలో ఒకటి సంక్రాంతి పండుగ. ఈ పండుగను భోగి, సంక్రాంతి, కనుమ అని మూడు రోజుల పండుగగా జరుపుకుంటాం. మన సనాతన సంప్రదాయాలను, ఆచారవ్యవహారాలను, సామాజిక స్పృహను, నైతిక విలువలను తెలియజేస్తూ, ఆరోగ్యాన్ని కలిగించే, ఆయుష్షును వృద్ధిపరిచే ఎన్నో అంశాలతో కూడి ఉంటుంది ఈ పండుగ. ప్రకృతి, జీవుడు, దేవుడు, పశుపక్ష్యాదుల సమైక్యతను నిరూపిస్తూ, ఆధ్యాత్మికతను కలిగిన గొప్ప పండుగ సంక్రాంతి పండుగ. మనది వ్యవసాయ ప్రధానమైన దేశం. ఏడాది పాటు కష్టపడి పని చేసిన ఫలితంగా ధాన్యపు రాశులు ఇంటికి వచ్చిన ఆనందంతో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. కొత్తధాన్యంతో పులగం, ΄÷ంగలి, పాయసం చేసి, శ్రీ సూర్యనారాయణ స్వామికి, ఇష్టదైవానికి, కులదైవానికి నివేదన చేస్తారు. ప్రతి సంక్రమణంలోనూ పితృతర్పణాలివ్వాలి, శ్రీ సూర్యనారాయణ స్వామికి అర్ఘ్యమివ్వాలి. అయితే అప్పుడు ఇవ్వలేకపోయినా, కనీసం ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి పండుగ రోజున అయినా సూర్యుని తప్పక ధ్యానించాలి, పూజించాలి, అర్ఘ్యమివ్వాలి. పితృతర్పణాలివ్వాలి, పితృదేవతలను స్తోత్రించాలి. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు గడలు, ఉదకుంభం మొదలైనవి దానమివ్వాలి. వీలున్నవారు గోదానం చెయ్యటం శ్రేష్ఠం. మనం మనకు తొలి పండుగ అయిన ఉగాదినాడు ఎలా పంచాంగ శ్రవణం చేస్తామో, అలాగే సంక్రాంతి పండుగనాడు దైవజ్ఞుల ద్వారా సంక్రాంతి పురుషుని గురించి తెలుసుకోవాలి. ఈ ఏడాది సంక్రాంతి పురుషుడు ఎటువంటి ఆకార విశేషాలను కలిగి, ఏ రంగు దుస్తులు ధరించి, ఏ వాహనం మీద ఎక్కి వస్తాడో, దానినిబట్టి దేశ భవిష్యత్తు తెలుస్తుంది, దానివల్ల రాబోయే ఫలితాలను గుర్తించి తగిన విధంగా మెలగటానికి ప్రయత్నం చెయ్యాలి. సంక్రాంతి రోజే జప తప దానాదుల నాచరించాలి. పండితులకు ధాన్యం, గోధుమలు, తిలలు, వస్త్రాలు, బంగార ం, ధనం, కూరలు, పళ్ళు, ఉదకుంభం వంటి వాటిని దానమివ్వాలి. దానివలన ఆరోగ్యం, వర్చస్సు, ఆత్మ సంస్కారం, గ్రహదోష నివారణ జరుగుతాయి. పితృతర్పణాల వలన వంశాభివృద్ధి జరుగుతుంది. సంక్రాంతి రోజున గంగిరెద్దులను అందంగా అలంకరించి, ఇంటింటికీ గంగిరెద్దు మేళం తెస్తారు. అందరూ గంగిరెద్దుకు నూతన వస్త్రాలు కప్పుతారు. సన్నాయి వాద్యకారులకు ధన, ధాన్య, వస్త్రాదులనిస్తారు. సంక్రాంతి రోజున ఉదయమే శ్రీ మహావిష్ణు స్వరూపునిగా భావించబడే హరిదాసు తలపైన రాగి అక్షయ పాత్రను పెట్టుకుని, రెండు చేతులతో చిరతలు వాయిస్తూ, ‘హరిలొ రంగ హరీ‘ అంటూ గానం చేస్తూ వస్తాడు. హరినామం గానం చేస్తూ సాతాని జియ్యరు కూడా వస్తాడు. ప్రజలు సాక్షాత్తు శ్రీహరే తమ ఇంటి ముంగిటికి వచ్చినంతగా ఆనందిస్తూ ఆ రాగి చెంబులో ధాన్యం పోస్తారు. డబ్బులిచ్చి సత్కరిస్తారు. ‘అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు‘ అంటూ చేతిలో డమరుకం పట్టుకుని వాయిస్తూ, జోస్యం చెప్పటానికి బుడబుక్కలవాడు వస్తాడు. ఈశ్వరుని వలె విభూతి రేఖలు నుదుటి మీద ధరించి, చేతిలో శంఖం పట్టుకుని ఓంకార నాదం చేస్తూ ‘హర హర మహాదేవ’ అంటూ శివ నామ సంకీర్తన చేస్తూ జంగమదేవర వస్తాడు. వీరందరూ మన సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీకలు. వీరందరినీ గౌరవిస్తూ, స్వయంపాకాలనిస్తూ, డబ్బులిస్తూ మన సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించుకోవలసిన బాధ్యత మనందరిదీ. వీరందరూ మనందరినీ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో విలసిల్లమని ఆశీర్వదిస్తారు. సంక్రాంతికి ఆంధ్రులు తమ ఇళ్ళల్లో బొమ్మలకొలువును ఏర్పాటు చేసి, బొమ్మలకు ప్రతీకగా పరమాత్మను ్రపార్థిస్తారు.బొమ్మలకు హారతిస్తారు, పేరంటం చేస్తారు. పిల్లలకు పప్పు బెల్లాలు, నువ్వుండలు పంచిపెడతారు. కొత్తగా పెళ్ళైన కూతుళ్ళను, అల్లుళ్ళను ఇంటికి పిలుస్తారు, విందుభోజనాలు, చీరసారె, అల్లుళ్లకు కానుకలూ ఇచ్చి ఆనందిస్తారు. తెలంగాణ ్రపాంతంలో సంక్రాంతి రోజున నోము పడతారు. ముత్తైదువులను ఇంటికి పిలిచి సంక్రాంతి నోము పేరంటం చేస్తారు. కనుమనాడు మనకు పాడిపంటలనిచ్చే గోవులను, ఎద్దులను, పుడమి తల్లినీ పూజిస్తారు. ‘కనుమనాడు మినుము తింటే ఎనుమంత బలం వస్తుంది‘ అంటారు కనుక కనుమనాడు గారెలు, ఆవడలు చేసి దైవానికి నివేదించి భుజిస్తాం. పంటలు, సమృద్ధికి దోహదపడే, వ్యవసాయానికి సహకరించే ఎద్దులను గౌరవించే శుభ దినం కనుమ పండుగ. ఈ విధంగా పుడమికీ, ప్రకృతికీ, మానవులకూ, గోవృషభాలకూ ఉన్న సంబంధాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ మకర సంక్రాంతి పండుగ. ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా, సామాజిక పరంగా భారత దేశ ప్రజలందరూ జరుపుకునే పెద్ద పండుగ ‘మన సంక్రాంతి పండుగ’. సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలు, యువకులు అత్యంత ఉత్సాహంగా గాలిపటాలను ఎగురవేస్తారు. రంగురంగుల గాలిపటాలతో ఆకాశం పగలే అందమైన కదిలే చుక్కలతో ప్రకాశిస్తున్న భ్రాంతిని కలుగజేస్తుంది. గాలిపటం మనకు గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని స్తుంది. దారం మన చేతిలో సవ్యంగా ఉన్నంతసేపే గాలిపటం ఆకాశంలో ఎగురుతుంది. అదుపు తప్పిందా, ఎగిరిపోతుంది. అదేవిధంగా మనం నైతిక విలువలు అనే పట్టులో మెలుగుతున్నంత కాలం సమాజాకాశంలో ఆనందంగా విహరించ గలుగుతాం. విలువలు తప్పితే పతనం తప్పదు, అన్న సత్యాన్ని బోధిస్తుంది. – డా. తంగిరాల విశాలాక్షి, – సోమంచి రాధాకృష్ణ -
సీఎం జగన్ నివాసంలో సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)
-
సంక్రాంతి వేడుకల్లో సీఎం జగన్ దంపతులు
12:01PM సీఎం జగన్.. నవరత్నాలతో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించిన నేపథ్యంలో గ్రామ సచివాలయం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలు తదితర సేవల ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని సాక్షాత్కారం చేసిన తీరును సాంస్కృతిక కార్యక్రమం ద్వారా కళ్ల కట్టారు. 11: 45AM సింగర్ హారిక నారాయణ్, ప్రముఖ జానపద గాయని కనకవ్వ తదితర కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మంచి జోష్‌తో పాటలు పాడి వీరు.. ఈ వేడుకలకు మరింత అందం తెచ్చారు. 11:38AM ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమ్మా ఉయ్యాల కోన జంపాల.. పాట పాడిన చైల్డ్ సింగర్ ప్రకృతి రెడ్డి. అనంతరం సీఎం జగన్ ఆశీర్వాదం తీసుకున్న చిన్నారి.. సీఎం జగన్ దంపతులతో సెల్ఫీ కూడా దిగింది. 11:20AM ‘శ్రీనివాస కల్యాణం’ ప్రదర్శన.. తిలకించిన సీఎం జగన్ దంపతులు ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుడు ఆనంద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ‘శ్రీనివాస కల్యాణం’ ప్రదర్శనను సీఎం జగన్ దంపతులు తిలకిస్తున్నారు. 10:49AM గోశాలలో గోపూజ చేసిన సీఎం జగన్ దంపతులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంట సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. సీఎం జగన్ దంపతులు ముందుగా జ్యోతిని వెలిగించి సంక్రాంతి సంబరాల్ని ప్రారంభించారు. అనంతరం గోశాలలో గోపూజ చేశారు సీఎం జగన్ దంపతులు. ఆపై భోగి మంటను వెలిగించిన సీఎం జగన్.. హరిదాసు కీర్తనలు ఆలకించి ఆశీర్వాదం తీసుకున్నారు. రైతులు, పల్లె ప్రజలతో కలిసి ఏటా సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం సీఎం జగన్‌కు ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వేడుకల నిర్వహిస్తున్నారు. రైతులు, పల్లె ప్రజలతో కలిసి ఏటా సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం సీఎం జగన్‌కు ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వేడుకల నిర్వహిస్తున్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా సీఎం జగన్ ఇంటి ఆవరణలో భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేశారు. వ్యవసాయ సామగ్రి, ఎడ్ల బండ్లు, గడ్డి వాములు, పశుసంపద, కుల వృత్తుల చిత్రాలతో పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పర్యవేక్షణలో ఈ సంబరాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి.. నవరత్నాలతో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించిన నేపథ్యంలో గ్రామ సచివాలయం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలు తదితర సేవల ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని సాక్షాత్కారం చేసిన తీరును కళ్లకు కట్టనున్నారు. ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుడు ఆనంద్ నేతృత్వంలో ‘శ్రీనివాస కల్యాణం’ ప్రదర్శిస్తారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమ్మా ఉయ్యాల కోన జంపాల.. పాట పాడిన గాయని ప్రకృతి రెడ్డి, అదే సినిమాలో ఎత్తర జెండా.. పాట పాడిన హారిక నారాయణ్, ప్రముఖ జానపద గాయని కనకవ్వ తదితర కళాకారులు ఈ వేడుకల్లో పాలుపంచుకోనున్నారు. -
Bhogi 2023: భోగి వచ్చిందోచ్
మసక చీకటిలో భోగి మంటలు ఇంటి ముంగిటిలో వెలుతురును తెస్తాయి. పాత వస్తువులను దగ్ధం చేసి కొత్త ఉత్సాహంలోకి అడుగు పడేలా చేస్తాయి. జనులెల్లా భోగభాగ్యాలతో విలసిల్లాలని కోరే పండగ భోగి. తెల్లవారుజాము తలంట్లూ దోసెలూ మసాలా కూరలూ చంటిపిల్లల భోగిపండ్లూ మూడు రోజుల సంక్రాంతి సంబరాలకు బోణి–భోగి. మనిషిని భోగంతో బతకండి అంటుంది ఈ పండగ. సంతోషాన్ని, సంతృప్తిని కనుగొనడంలోనే భోగం ఉందని చెబుతుంది ఈ పండగ. చలి వంటి జడత్వాన్ని ఉష్ణమనే చైతన్యంతో పారద్రోలి మనిషిని కర్తవ్యోన్ముఖుణ్ణి చేసేది భోగి. పరిశ్రమే భోగమూ భాగ్యమూ అని చెప్పేదే భోగి. భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో భోగిమంటల భోగుల్లో తెల్లారకుండానే పల్లెపల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో... చీకటిని తనకు తానుగా తరిమికొట్టడానికి వెలుతురు మంటను ఇంటి ఇంటి ముంగిటకు, వీధి వీధిలోనా, ప్రతి కూడలిలో మనిషి రాజేసే ఇలాంటి పండగ మరొకటి లేదు. అంత ఉదయాన లేచి పాతవన్నీ పనికి మాలినవన్నీ దగ్ధం చేసి నవీనతలోకి అడుగుపెడదామని మనిషి అనుకునే పండగ కూడా ఇలాంటిది వేరొకటి లేదు. తెల్లారకుండానే పల్లె లేస్తుంది. మనిషీ లేస్తాడు. ఎర్రటి నాల్కులు సాచుతూ మొద్దు చలిని, మంచు మందాన్ని కోస్తూ మంటా పైకి లేస్తుంది. ‘రేపటి నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి వస్తాడు. కాంతి ప్రకాశవంతం అవుతుంది. జీవితాన్ని ప్రకాశవంతం చేసుకోవడానికి సిద్ధపడు’ అని ఇవాళ మనిషిని సిద్ధం చేయడానికి వస్తుంది భోగి. ఎల్లవేళలా శుభ్రంగా స్నానం చేసి, మంచి బట్టలు కట్టుకుని, నచ్చింది తినడానికి మించిన భోగం లేదు. అందుకే భోగినాడు తలంట్లు తెలుగునాట ఫేమస్. భోగిమంటలు కాగానే స్త్రీలు కాగుల్లో, గంగాళాలలో వేడినీళ్లు సిద్ధం చేస్తారు. ఇంటి పిల్లలు, మగవాళ్లు నలుగు పెట్టుకుని ఒంటిని తోముకోవాలనే ఆనవాయితీ. ఆ తర్వాత తలంట్లు. కొత్త బట్టలు. కొత్తబియ్యం పాయసం. ఒళ్లు, ఇల్లు, పరిసరాలు శుభ్రంగా ఉండటం, శుభ్రమైన పరిసరాల్లో సుఖవంతంగా జీవించడం భోగం. అందుకే భోగి శుభ్రతను సూచిస్తుంది. శుభ్రత అంటే బయట శుభ్రత మాత్రమే కాదు... ఆత్మిక, ఆధ్యాత్మిక శుభ్రత కూడా. జ్ఞాన శుభ్రత కూడా. వివేచనా శుభ్రత. అజ్ఞానాన్ని మించిన అంధకారం లేదు. సరైన ‘చదువు’, దృక్పథం మనిషికి ఉండాలి. మూకలు చెప్పినట్టు చేయరాదు. అలాంటి అజ్ఞాన అంధకారాన్ని మంటల్లో వేసి మాడ్చి మసి చేయమని చెబుతుంది భోగి. నీలోని కల్మషాన్ని, కసిని, పగని, ద్వేషాన్ని, చెడుని తగులబెట్టు అని చెబుతుంది భోగి. మనలో మంచితనం నిండటమే భోగం. మంచివాడిగా బతకడం, అగ్నిలా స్వచ్ఛంగా ఉండటం భోగం. అగ్నికి చీడ అంటదు. అలాంటి జీవితం జీవించగలగాలని సూచన. భోగం అంటే కేవలం ఐశ్వర్యం అనే అర్థం చూడరాదు. అన్నివేళలా చెరగని చిర్నవ్వును ధరించి ఉండగలగడం కూడా భోగమే. భోగిపళ్లు రేగిపండ్లు సూర్యుడి నుంచి ఎక్కువ శక్తిని గ్రహించి దాచుకుంటాయట. ఎటువంటి జటిల వాతావరణం లోనైనా, ఉష్ణోగ్రతలో అయినా ఎదురు తిరిగి బతికి రేగుచెట్లు నిలబడతాయట. చంటి పిల్లలు కూడా అలాంటి శక్తితో అలాంటి ఆయుష్షుతో దిష్టి గిష్టి వదిలించుకుని ఈ కొత్తకాలంలోకి ప్రవేశించాలని భోగినాటి సాయంత్రం భోగిపళ్ల పేరంటం పెడతారు. రేగుపండ్లు, తలంబ్రాలు, రాగి నాణేలు, చిల్లర పైసలు, పూల రెక్కలు కలిపి పిల్లల నెత్తిన పోసి, దిగవిడిచి దిష్టి తీస్తారు. చిట్టి చిట్టి రేగుపళ్ళు చిట్టి తలపై భోగిపళ్ళు ఎంతో చక్కని భోగిపళ్ళు ఎర్ర ఎర్రని రేగుపళ్ళు.... అని పాటలు పాడతారు. ఆయుష్షుతో ఉండటం భోగం. అందుకు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం భోగం. పరిస్థితులను ఎదుర్కొనే గుండె దిటవును కలిగి ఉండటం భోగం. బొమ్మల కొలువులు... గొబ్బి పాటలు భోగినాడు బొమ్మల కొలువు పెడతారు కొంతమంది. చిన్నపిల్లలు తమ బొమ్మలు, సేకరించిన బొమ్మలు తీర్చిదిద్ది సంబరపడతారు. ఇక భోగితో మొదలెట్టి పండగ మూడు రోజులూ సాయంత్రం సందె గొబ్బెమ్మలను పెడతారు. వాటి చుట్టూ ఆడవారందరూ చేరి గొబ్బిళ్ళ పాటలు పాడుతూ గొబ్బెమ్మల చుట్టూ ఆడతారు. ‘గొబ్బియళ్ళో సఖియా వినవె చిన్ని కృష్ణుని చరితము గనవె చిన్ని కృష్ణుని మహిమను గనవె ..... ‘ ‘సుబ్బీ సుబ్బమ్మ శుభము నీయవె తామర పువ్వంటి తమ్ముణ్ణీయవె చామంతి పువ్వంటి చెల్లెల్నీయవె’ లాంటి పాటలు పాడతారు. పెళ్ళి కాని అమ్మాయిలు ‘మొగలి పువ్వంటి మొగుణ్ణీయవె’ అని కలుపుతారు. పండగ అంటే అందరికి సంతోషాన్ని ఇచ్చేది. అందరి శుభాన్ని కోరడం భోగం. ఈ భోగి సకల శుభాలను తేవాలని కోరుకుందాం. -
Photo Feature: పండగొచ్చింది పద బసవా..!
మకర సంక్రాంతి వేళ పల్లెలతో పాటు పట్టణాలు కూడా సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ముచ్చటగా మూన్నాళ్లు చేసే పండుగకు బసవయ్యలతో గంగిరెద్దోళ్లు కూడా సిద్ధమయ్యారు. పీ..పీ ఊదుతూ గంగిరెద్దును పట్టుకొని ఇంటింటికీ వెళ్లి ఇచ్చింది తీసుకెళ్తుంటారు. హైటెక్ యుగంలోనూ బసవయ్యలను దైవంగా భావిస్తూ తమ కులవృత్తిని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు . – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
పండుగ ప్రయాణం.. నరకయాతన
సాక్షి, హైదరాబాద్: కరోనా తర్వాత పూర్తి స్థాయిలో సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు జనం ఉత్సుకత కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే పల్లె బాట పట్టి ఖర్చుకు సైతం వెనకాడకుండా.. నరకయాతన అనుభవిస్తున్నారు. నగరం నుంచి ఇప్పుడు సొంతూళ్లకు ప్రయాణమంటే నరకమనే అర్థం!!. సంక్రాంతికి ప్రయాణాల కోసం బస్టాండ్, రైల్వే స్టేషన్లలో గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నారు. మరికొందరు సుఖవంతమైన ప్రయాణం లేకున్న పర్వాలేదనుకుని.. తోపులాటలో నిల్చుని మరీ ఊళ్లకు పయనమయ్యారు. ఇంకోవైపు నగరాలు, పట్టణాల్లోని రోడ్లు, జాతీయ రహదారులు.. విపరీతమైన వాహన రద్దీతో కిక్కిరిసిపోయాయి. ట్రాఫిక్ జామ్‌తో పడిగాపులు పడాల్సి వస్తోంది. రైళ్లు, బస్సు ప్రయాణాలకు మూడు, నాలుగు నెలల ముందే బుకింగ్‌లు అయిపోయాయి. దీంతో ప్రయాణాల కోసం బ్లాక్ దందాలను ఆశ్రయిస్తున్నారు చాలామంది. ఆ దందాలను కట్టడి చేసేందుకు అధికారులు యత్నిస్తున్నా.. ప్రయాణం ఎలాగైనా సాగాలని అవేం పట్టించుకోకుండా ముందుకెళ్తున్నారు కొందరు. ఇక విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు ప్రయాణికుల తాకిడి పెరిగిపోయింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా కనిపిస్తోంది. సొంతూళ్లకు ప్రయాణికులు క్యూ కడుతుండడంతో కిటకిలాడుతున్నాయి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు. బస్సుల్లో సీట్లు దొరక్క చివరి నిమిషంలో ప్రైవేట్ వాహనాలు ఆశ్రయిస్తున్నారు మరికొందరు ప్రయాణికులు. అయితే అందులోనూ కుక్కి కుక్కి మరీ ప్రయాణాలు చేయిస్తున్నారు. ఈసారి సంక్రాంతికి 140 ప్రత్యేక రైళ్ళను ప్రకటించించింది దక్షిణ మధ్య రైల్వే. కానీ, ప్రయాణికుల తాకిడి విపరీతంగా ఉంది. దీంతో.. ఆ రైళ్లు ఎటూ సరిపోలేదు!. దీంతో స్టేషన్ బయటే ప్రయాణికులు ఎదురు చూపులు చూసే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు కనెక్టవిటీ ఎంఎంటీఎస్ రైళ్లు మరమ్మత్తుల పనులతో రద్దు కావడంతో.. భారమైన సరే ఖర్చు పెట్టుకుని బస్టాండ్లకు, స్టేషన్లకు చేరుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంక్రాంతి పండుగకు వాహనాలు రహదారి ఎక్కడంతో.. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. పండుగకు మామూలు రోజులకంటే అధికంగా వాహనాల తాకిడి నెలకొంటుందనేది తెలిసిందే. అయితే ఈసారి ఆ తాకిడి ఊహించిన దానికంటే ఎక్కువ వస్తోంది. ఫాస్టాగ్ ఉన్నా కూడా అర కిలోమీటర్ పైనే వాహనాలు జారీ అయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మామూలు రోజుల్లో 30-35 వేల వాహనాల రాకపోకలు సాగించేవని, కానీ, గత మూడు రోజుల నుంచి యాభై వేల వాహనాల రాకపోకలు కొనసాగించాయని జీఎంఆర్ ప్రతినిధులు వెల్లడించారు. మరోవైపు వాహనాల రద్దీని తట్టుకునేందుకు అదనపు టోల్ బూతులను తెరచినట్లు వెల్లడించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)