విజయనగరం: సంక్రాంతి వచ్చింది.. ఇంటింటా సరాదాలు తెచ్చింది... కరోనా ప్రభావంతో గత రెండేళ్లు ఆంక్షలు నడుమ చేసుకున్న తెలుగింట పండగను ఈ ఏడాది మూడురోజులపాటు వైభంగా జరుపుకున్నారు. ఇళ్ల అలంకరణ, నూతన వస్త్రాలు, ప్రత్యేక వంటకాలతో పల్లెల్లో కొత్త సందడి కనిపించింది. సామాన్యుడు, సంపన్నుడనే తారతమ్యం లేకుండా ఎవరి స్థాయిలో వారు పండగను ఆస్వాదించారు. ఏడాదిలో మొదటిగా జరుపుకునే పండగకు ప్రత్యేక స్థానం కల్పిస్తూనే ఖర్చులోనూ అదే ప్రాధాన్యమిచ్చారు. ఈ మూడు రోజుల కోసం విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలు కోట్లలో ఖర్చు చేశారంటే పండగ సందడి అర్థం చేసుకోవచ్చు.
నూతన వస్త్రాల కోసం రూ.250 కోట్ల పైమాటే...
సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు వస్త్ర దుకాణాలకు పెద్ద పండగ వచ్చినట్టే. ఏడాదిలో చేసే వ్యాపారం ఈ ఒక్క నెలలోనే సాగుతుంది. కుటుంబంలో ప్రతి ఒక్కరికీ నూతన వస్త్రాలు కొనుగోలు చేయడం ఆనవాయితీ. దీంతో వీటి వ్యాపారానికి గిరాకీ పెరుగుతుంది. విజయనగరం పట్టణంలో ‘బాలాజీ టెక్స్‌టైల్ మార్కెట్’లో జోరుగానే విక్రయాలు సాగాయి. సుమారు 250 వరకు బ్రాండెడ్, సాధారణ దుకాణాలుండగా.. ప్రధానంగా పిల్లల రెడీమేడ్ దుస్తులు, మహిళల చీరలు అమ్మకాలు అధికంగా సాగాయి. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి, సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, ఒడిస్సా, మధ్యప్రదేశ్ ప్రాంతాలను నుంచి రిటైల్ వ్యాపారులు ఈ మార్కెట్‌కి వచ్చి నిత్యం విక్రయాలు చేస్తుంటారు. రిటైల్ వ్యాపారంతో బిజీగా ఉన్న దుకాణ యాజమాన్యులు సాధారణ వినియోగదారుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఒక అడుగు ముందుకువేసి షాపు ముందే ఆరుబయట తాత్కాలిక అమ్మకాలు చేశారు. పట్టణంలోని కన్యకాపమేశ్వరి ఆలయం కూడలిలోని ఉల్లి వీధి, గంటస్తంభం జంక్షన్, మెయిన్‌రోడ్డు ప్రాంతాల్లోని ప్రధాన షాపుల్లో కూడా వస్త్రవిక్రయాలు జోరుగా సాగాయి. మొత్తంగా జిల్లాలో ఈ ఏడాది రూ.250 కోట్ల వరకు వస్త్ర వ్యాపారం సాగినట్టు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
విందు.. వినోదాల కోసం..
కొత్త అల్లుళ్లకు మర్యాదలు, ప్రతి ఇంటా పిండి వంటలు ఘుమఘుమలతో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు సందడిగా మారాయి. పండగ మూడు రోజుల పాటు మాంసాహారానికి, పిండివంటకాలు, వినోద ఖర్చుల కోసం రూ.50 కోట్లు ఖర్చు చేయగా అందులో కేవలం మాంసాహారానికి రూ.20 కోట్ల వరకు ఖర్చు చేశారు. కిలో మటన్ ధర రూ.800 పలికింది. గతేడాది రూ.700 ఉన్న ధర ఈ ఏడాది రూ.100 పెరిగింది. అలాగే, చికెన్ పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది స్కిన్‌తో కలిపి రూ.180, గ్రామీణ ప్రాంతాల్లో రూ.190 నుంచి రూ.200 వరకు పలికింది. ఇతర సరదాల కోసం రూ.5 కోట్ల వరకు ఖర్చు చేశారని అంచనా.
పెరుగుతున్న ఖర్చు...
తెలుగువారింట ఎంతో ఆడంబరంగా జరుపుకొనే సంక్రాంతి పండగ ఖర్చు ఏటేటా పెరుగుతోంది. శుభకృతనామ సంవత్సరంలో జనవరి 14, 15, 16 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా జరుపుకున్న పండగ కోసం రూ.కోట్లలో ఖర్చయినట్లు వ్యాపార వర్గాలు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల పరిధిలో 166 మద్యం దుకాణాలు ఉండగా... బార్‌లు 31 వరకు ఉన్నాయి. వీటి ద్వారా గడిచిన పక్షం రోజుల్లో సుమారు రూ.25 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరిగాయి. విలాసాలు, ఆడంబరాలకు జనం వెనుకాడకుండా మరో రూ.20కోట్లు వరకు ఖర్చుచేసినట్టు అంచనా.
ప్రయాణ ఖర్చు రూ.4 కోట్ల పైమాటే..
వివిధ ప్రాంతాల నుంచి పండగకు పల్లెలకు చేరుకున్న వారు గతవారం రోజుల్లో సుమారు రూ.4 కోట్లు వరకు ఖర్చు చేశారు. విజయనగరం, సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం, ఎస్.కోట డిపోల్లో సుమారు 560 ఆర్టీసీ సర్వీసులు నడుస్తుండగా... సాధారణ రోజుల్లో రూ.40 లక్షలు వరకు ఆదాయం వస్తుంది. కేవలం విజయనగరం జిల్లా కేంద్రం నుంచి విజయవాడ, హైదరాబాద్‌కు 14 సర్వీసులు నిర్వహించగా... సాధారణంగా నడిపే 111 సర్వీసుల నుంచి ççపండగ నేపథ్యంలో రూ.2 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని అంచనా. వ్యక్తిగత వాహనాలపై రాకపోకలకు మరో రూ.2 కోట్ల వరకు ఖర్చు చేశారని అంచనా.
భక్తజన జాతర..
వేపాడ: విజయనగరం జిల్లాలో సంక్రాంతి, కనుమ పండగలు వైభవంగా జరిగాయి. కనుమ పండగను పురస్కరించుకుని సోమవారం పలు గ్రామాల్లో నిర్వహించే తీర్థాలకు జనం పోటెత్తా రు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. వేపాడ మండలం కొండగుళ్లు బ్రహ్మాలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన జాతర జనసంద్రాన్ని తలపించింది. జాతరలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులను అలరించాయి.
Comments
Please login to add a commentAdd a comment