ఏపీ బరిలో తెలంగాణ పుంజు | Telangana Cock To Fight In Andhra Pradesh Cock Fight Betting | Sakshi
Sakshi News home page

ఏపీ బరిలో తెలంగాణ పుంజు

Published Sun, Jan 15 2023 1:45 AM | Last Updated on Sun, Jan 15 2023 9:55 AM

Telangana Cock To Fight In Andhra Pradesh Cock Fight Betting - Sakshi

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సంక్రాంతి పండుగ వచ్చిందంటే కోడి పందేల జోరు మొదలవుతుంది. కాళ్లకు కత్తులతో కలబడే పుంజులు, వాటి చుట్టూ చేరి ఉత్సాహంగా పందాలు కాసేవారితో బరులు కళకళలాడుతాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంత జిల్లాలు ఈ కోడి పందాలకు పెట్టింది పేరు. కానీ అక్కడ బరిలోకి దిగే పుంజుల్లో తెలంగాణలో పుట్టిపెరిగినవి పెద్ద సంఖ్యలో ఉంటుండటం గమనార్హం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, ముఖ్యంగా అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని పామాయిల్‌ తోటల్లో పందెం పుంజులను పెంచుతుంటారు. ఈ రెండు మండలాల్లోని పదికిపైగా గ్రామాల్లో సుమారు ఇరవై కోడి పుంజుల ఫారాలు ఉన్నాయి. ఒక్కో ఫారం నుంచి సంక్రాంతి సీజన్‌లో 80 నుంచి 100 వరకు పుంజులు ఏపీలో పందేలకు తరలుతాయి.

లోకల్‌ పెట్ట.. పందెం పుంజు..: ఫారాల నిర్వాహకులు ఏపీలో జరిగిన పందేల్లో గెలిచిన పుంజులను కొనుక్కొచ్చి స్థానికంగా కోడిపెట్టలతో క్రాసింగ్‌ చేయిస్తారు. ఆ కోడిపెట్టలు పెట్టిన  పిల్లల నుంచి పుంజులను వేరుచేసి ప్రత్యేకమైన ఆహారం, శిక్షణ ఇస్తారు. ఆరు నెలల వయసు వచ్చేవరకు గుంపుగా ఉంచిన పుంజులను తర్వాత వేరు చేస్తారు. గుడ్లు, రాగులు, నానబెట్టిన బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్‌లు, మటన్‌ కీమా వంటివి ఆహారంగా పెడతారు.

కాళ్లు దృఢంగా అయ్యేందుకు నీటిలో ఈత కొట్టిస్తారు. మసాజ్‌ చేస్తారు. కాస్త అటూఇటూగా ఏడాదిన్నర వయసున్న పుంజులను పందాలకు వినియోగిస్తారు. ‘కాకి, నెమలి, డేగ, సీతువా, పచ్చకాకి, కోడి డేగ, ఆబ్రాసు, రసంగి డేగ’ తదితర జాతుల కోళ్లను పోటీకి దింపుతారు. ఏపీ నుంచి పందెం రాయుళ్లు నవంబర్‌ నుంచే పుంజుల ఫారాలకు వస్తారు. పుంజుల బలం, ఆరోగ్యం, పంజా విసిరే వేగం, ఒంటిపై జుట్టు విచ్చుకునే తీరు వంటివాటిని బట్టి రూ.20 వేల నుంచి రూ.లక్షన్నర వరకు ధర పలుకుతాయి.

క్యూ కట్టిన హైదరాబాదీలు
– ఏపీలో కోడి పందాలకు భారీగా తరలిన జనం
కోస్తా నుంచి సాక్షి ప్రతినిధి:సంక్రాంతి సెలవులతో హైదరాబాద్‌లో రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తే.. ఏపీలోని ఏలూరు, ఎన్టీఆర్, అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లాల్లో గ్రామాలకు వెళ్లే మార్గాలు కూడా ట్రాఫిక్‌తో నిండిపోయాయి. పెద్ద సంఖ్యలో హైదరాబాదీలు సంక్రాంతికి ఊరెళ్లడం ఒక కారణమైతే.. కోడి పందాలకు క్యూకట్టడం మరో కారణం ఏ బంకిణీ (కోడి పందాలు నిర్వహించే ప్రాంగణం) పార్కింగ్‌లో చూసినా హైదరాబాద్, శివార్లలోని ప్రాంతాల వాహనాలే కనిపించాయి.

ఆకివీడు సమీపంలో ఉన్న ఐభీమవరం బంకిణీలో భారీ సందడి కనిపించింది. దీనికి సమీపంలో ఉన్న చెరుకుమిల్లితోపాటు గుడివాడ–భీమవరం మార్గంలో ఉన్న కాళ్ల, జువ్వలపాలెంలలోనూ బంకిణీలు జనాలతో నిండిపోయాయి. కూచిపూడి, వెంప, భీమవరం, కొప్పాడ, పత్తేపురం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, ఉండి, గణపవరం, తాడేపల్లిగూడెం చుట్టుప్రక్కల గ్రామాల్లోనూ జోరుగా కోడిపందాలు జరిగాయి.

చెక్‌పోస్టులను దాటుకుని..
కోడి పందాలకు చెక్‌ పెట్టేందుకు పోలీసులు భారీగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం నుంచే వాహనాల తనిఖీ చేపట్టారు. కోడి పుంజులు, నగదుతో వెళ్తున్నవారిని అదుపులోకి తీసుకోవడం ప్రారంభించారు. అయితే స్థానిక యువకులు కొందరు.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారి వాహనాల్లోని కోడి పుంజులను దొడ్డిదారిన చెక్‌పోస్టులు దాటిస్తూ, బంకిణీల వద్దకు చేరుస్తూ కొంత సొమ్ము తీసుకున్నారు. దీనితో పందాలకు వెళ్లేవారికి అడ్డులేకుండా పోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement