cock fight bettings
-
బెట్.. కొట్లాట రసపట్టు
సాక్షి, అమరావతి: శునకం.. వరాహం.. అశ్వం.. ఎద్దు.. ఒంటె.. కోడి.. బుల్ బుల్ పిట్ట.. పక్షా, జంతువా కాదు.. బరిలో ఉందంటే దుమ్ము దులపాల్సిందే. ప్రత్యర్థిని మట్టికరిపించాల్సిందే. అనాది కాలం నుంచి మన దేశంలో జంతువులు, పక్షుల పోటీలు జరుగుతూనే ఉన్నాయి. దేశంలో అనేక రాష్ట్రాలు... ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతాల వారీగా ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని జంతువులు, పక్షులతో పోటీలు సంప్రదాయమైంది. జంతు హింసను నిరోధించే చట్టాలున్నప్పటికీ ఏళ్ల తరబడి అదే ఆనవాయితీ కొనసాగుతోంది. అనేక రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన జంతువుల పందేలు, పోటీలపై ఓ లుక్కేద్దాం.. పౌరుషానికి ప్రతీక కోడి పుంజులు కోడి పందేలకు ఘనమైన చరిత్రే ఉంది. సింధు నాగరికత నుంచి మొదలెడితే.. భారత్, చైనా, పర్షియా, గ్రీకు నాగరికతల్లోను వీటిని నిర్వహించిన ఆధారాలున్నాయి. పల్నాడు, బొబ్బిలి యుద్ధంలో కోడి పుంజుల పోరు చరిత్ర అందరికీ తెలిసిందే. కోడి పుంజుల పందేలను పౌరుషానికి ప్రతీకగా భావిస్తారు. ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి బరిలోకి దించుతారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళలో వీటిని ఎక్కువగా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రముఖంగాను, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ భోగి, సంక్రాంతి, కనుమ పండుగల రోజు కోడి పందేలు నిర్వహించడం సంప్రదాయంగా మారింది. తమిళంలో ‘వెట్రికాల్’ అని, తుళులో ‘గోరిక్ కట్ట’ అని కోడి పందాలను పిలుస్తారు. కర్ణాటకలోని ఉడుపి, కేరళలోని కాసర్గోడ్లలోనూ కోడి పందాలను నిర్వహిస్తుంటారు. కోడి పందాల పేరుతో కోడి పుంజులను దారుణంగా హింసిస్తున్నారని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా కూడా నివేదించింది. జంతు సంరక్షణ చట్టం ఉల్లంఘిస్తున్న కోడి పందేలను సుప్రీం కోర్టు నిషేధించింది. అయినా సంప్రదాయం, సరదా పేరుతో కోడి పందేలు.. బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయి. కంబాళ.. భళా భళ దున్నలను కాడికి కట్టి రేసు నిర్వహించడాన్ని కన్నడ భాషలో కంబాళ అంటారు. ఖాత్రి కంబాళ అనేది మంగళూరు ఖాత్రిలోని మంజునాథ ఆలయ పరిసరాల్లో నిర్వహించేవారు. దీన్నే థీవర కంబాళ అని కూడా పిలిచేవారు. 300 ఏళ్ల క్రితం నిర్వహించిన ఈ వేడుకకు ఆనాటి అలూబ రాజులు కూడా హాజరయ్యేవారు. ఇప్పటికీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కంబాళను నిర్వహిస్తుంటారు. సాధారణంగా బురద నేలలు, వరి పొలాల్లో ఈ రేసు నిర్వహిస్తారు. వీటిలో పాల్గొనే రైతులు కొరడా ఝుళిపిస్తూ రెండు దున్నలతో వేగంగా పరుగులు తీస్తారు. పందెంలో గెలిచిన వారికి బంగారం, వెండి నాణేలతో పాటు విలువైన బహుమతులు ఇస్తారు. ఈ పోటీపై పెద్దఎత్తున బెట్టింగ్‌లు వేస్తుంటారు. కేరళలోనూ వరికోతల తర్వాత ఈ పోటీలు నిర్వహిస్తుంటారు. ఈ పోటీల్లో కొరడాలను ఉపయోగించడంపై జంతు హక్కుల కార్యకర్తలు మొదట్నుంచీ ఆందోళనలు చేస్తున్నారు. దీంతో జల్లికట్టు, కంబాళ పోటీల్లో జంతువులను హింసించ కూడదని 2014 మే 7న సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. ఒంటెల రేసు.. రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లా పుష్కర్‌లో గుర్రం, ఒంటెల పరుగు (రేసు) పందేలు నిర్వహిస్తుంటారు. వీటిలో విజేతలకు నేరుగా రాజస్థాన్ ప్రభుత్వమే నగదు బహుమతిని అందిస్తుంటుంది. ఈ రేసులో గెలిచేందుకు ఒంటెలకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. ఈ రేసులకు ముందుగా గిరిజనుల నృత్యాలు, ఒంటెల అందాల పోటీలు కూడా నిర్వహిస్తుంటారు. ఎక్కువ దూరం వేగంగా ప్రయాణించిన ఒంటెను విజేతగా ప్రకటిస్తారు. ఎద్దుల ఆట కట్టించే జల్లికట్టు.. బుసలు కొడుతూ పరుగులు తీసే బలమైన ఎద్దులను లొంగదీసుకునే క్రీడే జల్లికట్టు. సింధు నాగరికత, తమిళ్ సాహిత్యంలోను జల్లికట్టుకు సంబంధించిన ఆధారాలున్నాయి. ప్రాచీన తమిళనాడులోని ‘ముల్లై’ ప్రాంతంలో నివసించే తెగల్లో జల్లికట్టు సర్వసాధారణం. తమిళ పురాణాల ప్రకారం పూర్వకాలంలో మహిళలు జల్లికట్టులో విజేతలైన వారిని తమ భర్తలుగా ఎంచుకునే వారు. నీలగిరి జిల్లాకు చెందిన కరిక్కియూర్ అనే గ్రామంలో సుమారు 3,500 సంవత్సరాల వయసుగల శిలా ఫలకాలపై మనుషులు ఎద్దులను తరిమే దృశ్యాలు చెక్కి ఉన్నాయి. స్పెయిన్‌లో జరిగే బుల్ ఫైట్‌కు దగ్గరగా జల్లికట్టు ఉంటుంది. అయితే జల్లికట్టులో ఎద్దులను చంపరు. తమిళనాడులోని గ్రామాల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోను జల్లికట్టు నిర్వహిస్తారు. శునకాల కొట్లాట.. ఇంగ్లాండ్‌లో 18వ శతాబ్దంలో శునకాల కొట్లాట పోటీలను నిర్వహించేవారు. తర్వాత భారత్‌కు ఈ పోటీలు చేరాయి. ఈ పోటీల కోసం అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, ఆస్ట్రేలియాల నుంచి ప్రత్యేకంగా కుక్కలను తీసుకువస్తుంటారు. ఢిల్లీ శివారు ప్రాంతాలతోపాటు గురుగ్రామ్, నోయిడాలలోనూ ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. పంజాబ్, హరియాణాల్లో ధనవంతులు సరదా కోసం ఇలాంటి పోటీలను నిర్వహించే సంప్రదాయం పెరుగుతోంది. కుక్కల కొట్లాటలో రక్తస్రావం తీవ్రంగా ఉంటుంది. పందేల్లో దింపే కుక్కలను రోజుల తరబడి ఆహారం పెట్టకుండా బోనులో బంధిస్తారు. ఒక్కసారిగా వాటిని వదులుతారు. అప్పటికే ఆకలితో తీవ్ర కోపంతో రగిలిపోయే కుక్కలు ప్రత్యర్థి కుక్కలపై భయానకంగా దాడులు చేస్తాయి. ఒక్కోసారి వీటిలో ఒక్కోసారి ప్రత్యర్థి కుక్కలు చనిపోతుంటాయి. గెలిచిన కుక్క యజమానికి రూ.లక్షల్లో నగదు బహుమతులు అందిస్తుంటారు. వీటిపైనా సుప్రీం కోర్టు నిషేధం ఉంది. బుల్ బుల్ పక్షుల పోటీ పూర్వం అస్సాం రాజు స్వర్గదేవ్ బ్రహ్మథ సింఘ పక్షుల పోటీలు ఎంతో ఇష్టంగా నిర్వహించేవారని, ఈ పోటీల కోసం ప్రత్యేకంగా పక్షులను పెంచేవారని చరిత్ర చెబుతోంది. ఆ తర్వాతి కాలంలో ఇది ఒక సంప్రదాయంలా మారింది. సంక్రాంతి సమయంలోనే అస్సాంలో భోగలి బిహు వేడుక నిర్వహిస్తుంటారు. దీనిలో భాగంగా గువాహటికి 30 కిలోమీటర్ల దూరంలో హయగ్రీవ మాధవ ఆలయానికి సమీపంలో బుల్బుల్ పక్షుల పందేలు నిర్వహిస్తారు. ఈ పందాల కోసం పక్షులకు గ్రామస్తులు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ పోటీల్లో పక్షులు కూడా గాయపడుతుంటాయి. పోటీల్లో ఓడిపోయిన పక్షుల ముక్కు ముందు భాగాన్ని కత్తిరిస్తారు. దీంతో మరోసారి మళ్లీ ఇవి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉండదు. ఈ పక్షుల పోటీపై నిషేధం విధించాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, 2016లో ఈ పోటీ నిర్వహించకుండా గువాహటి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ నిర్వహిస్తున్నారు. ఎద్దుల బండ్ల రేసు.. మహారాష్ట్రలో ఎద్దుల బండ్ల రేసులను శతాబ్దాల నుంచి నిర్వహిస్తున్నారు. దాదాపు 500 మీటర్ల దూరాన్ని ఎద్దుల బండ్లపై ఎవరైతే వేగంగా చేరుకుంటారో వారిని విజేతగా ప్రకటిస్తారు. ఈ పోటీల్లో చాలా మంది రైతులు పాల్గొంటారు. వినాయక చవితి సమయంలో ఎక్కువగా ఈ పోటీలను నిర్వహిస్తారు. ఇవి తమ సంప్రదాయమని నిర్వాహకులు చెబుతుంటారు. పోటీ కోసం కొన్ని ఎద్దులను ప్రత్యేకంగా సిద్ధం చేస్తారు. మహారాష్ట్రతో పాటు పంజాబ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్‌ల్లో కొన్ని ప్రాంతాల్లోనూ ఈ రేసు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను 2014లో సుప్రీం కోర్టు నిషేధం విధించింది. కానీ, స్థానిక నాయకుల ప్రోత్సాహంతో ఈ పోటీలు జరుగుతూనే ఉన్నాయి. -
కాలు దువ్విన కోడి పుంజులు
సాక్షి,అమరావతి/కాకినాడ/భీమవర/పెనమలూరు: సంక్రాంతి సంబరాల తొలి రోజునే కోడి పందేల జాతర మొదలైంది. భోగి రోజైన శనివారం మొదలైన ఈ పందేలు మూడు రోజులపాటు నిర్వహించేలా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసుకున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఊరూ వాడా కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అనేకచోట్ల పందేలు మొదలయ్యాయి. ఈ సారి భారీ బరుల వద్ద కోడి పందేల్లో పాల్గొనే వారి కోసం ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ద్వారా నగదు చెల్లింపులకు వీలుగా ఏర్పాట్లు చేశారు. విశాలమైన మైదానాలు, తోటల్లో బరులను ఏర్పాటు చేశారు. భారీ టెంట్లు వేసి కూర్చునేందుకు వీవీఐపీ, వీఐపీ, సాధారణ గ్యాలరీలను సైతం ఏర్పాటు చేశారు. రాత్రి వేళలోనూ పందేలు కొనసాగేలా బరుల వద్ద ఫ్లడ్ లైట్లను అమర్చారు. కేరవాన్లు.. స్పెషల్ పాస్‌లు కోడి పందేలకు పెట్టింది పేరైన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతంలో భారీ ఏర్పాట్ల నడుమ కోడి పందేలు నిర్వహిస్తున్నారు. కాకినాడ రూరల్ పరిధిలోని వలసపాకలో పందేలు వీక్షించేందుకు పాస్‌లు జారీ చేశారు. కొన్నిచోట్ల పందేల్లో గెలిచిన వారికి బుల్లెట్ వాహనం, కారు బహుమతిగా ప్రకటించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురంలో భారీ ఏర్పాట్లతో ఒక్కో కోడి పందెం రూ.లక్షల్లో నిర్వహించారు. పందేల్లో పాల్గొనే వారికి వీవీఐపీ పాస్ ధర రూ.60 వేలు.. వీఐపీ పాస్ రూ.40 వేలుగా నిర్ణయించారు. పందేల రాయుళ్ల కోసం క్యూఆర్ కోడ్ నగదు చెల్లింపుల సౌకర్యం కల్పించారు. కొన్నిచోట్ల వీవీఐపీల కోసం బరులకు సమీపంలో కేరవాన్లు (బస చేసే వాహనాలు) కూడా ఏర్పాటు చేశారు. అతిథి మర్యాదలకు లోటు లేకుండా.. పందేలను చూసేందుకు, పందేలు ఒడ్డేందుకు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారి అభిలాషకు అనుగుణంగా పలుచోట్ల బరుల నిర్వాహకులు అతిథి మర్యాదలు సిద్ధం చేశారు. ప్రత్యేకంగా హోటళ్లు, అతిథి గృహాలు, చేపల చెరువులపై మకాంలను కేటాయించి ప్రత్యేకంగా మాంసాహార వంటకాలు, విదేశీ మద్యంతో అతిథి మర్యాదల్లో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ‘పశ్చిమ’లో 270 బరులు పశ్చిమ గోదావరి, జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో చిన్నాపెద్దా అన్నీ కలిపి కోడి పందేల బరులు దాదాపు 270 వరకు ఏర్పాటయ్యాయి. ఉండి, ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాల్లో ఎక్కువ కోడి పందేలు గెలిచిన వారికి బుల్లెట్ మోటార్ సైకిల్ బహుమతిగా ప్రకటించారు. దుంపగడప బరిలో ఏలూరు జిల్లా తాడినాడకు చెందిన వ్యక్తి 9 పందేలకు గాను 5 పందేలు గెలిచి బుల్లెట్ మోటార్ సైకిల్ బహుమతి అందుకున్నాడు. ఏలూరు జిల్లా పరిధిలోనూ సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని ఈడుపుగల్లులో కోడిపందేల బరి ‘తూర్పు’ పందేలు డీలా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కోడి పందేలు నిర్వహించినప్పటికీ.. గుండాటలను పోలీసులు అడ్డుకోవడంతో జూదరులు డీలా పడ్డారు. తూర్పు గోదావరి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో దాదాపు 300 చోట్ల కోడి పందేల బరులు వెలిశాయి. గత సంక్రాంతితో పోల్చితే ఈ సారి కోడి పందేలు సాధారణంగా జరిగాయే తప్ప భారీ ఎత్తున ఎక్కడా జరగలేదు. ప్రత్యేక వాహనాల్లో రాక ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కోడి పందేల బరులను సిద్ధం చేశారు. పెనమలూరు, గన్నవరం, మచిలీపట్నం, పామర్రు, ఎన్టీఆర్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా సిద్ధం చేసిన బరుల్లో సంప్రదాయంగా, రైతువారీగా కోడిపందేలు నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ముంబై, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి పందెంరాయుళ్లు ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు. వారి కోసం బరుల నిర్వాహకులు ప్రత్యేక వసతి సదుపాయాలను సమకూర్చారు. -
ఏపీ బరిలో తెలంగాణ పుంజు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సంక్రాంతి పండుగ వచ్చిందంటే కోడి పందేల జోరు మొదలవుతుంది. కాళ్లకు కత్తులతో కలబడే పుంజులు, వాటి చుట్టూ చేరి ఉత్సాహంగా పందాలు కాసేవారితో బరులు కళకళలాడుతాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంత జిల్లాలు ఈ కోడి పందాలకు పెట్టింది పేరు. కానీ అక్కడ బరిలోకి దిగే పుంజుల్లో తెలంగాణలో పుట్టిపెరిగినవి పెద్ద సంఖ్యలో ఉంటుండటం గమనార్హం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, ముఖ్యంగా అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని పామాయిల్ తోటల్లో పందెం పుంజులను పెంచుతుంటారు. ఈ రెండు మండలాల్లోని పదికిపైగా గ్రామాల్లో సుమారు ఇరవై కోడి పుంజుల ఫారాలు ఉన్నాయి. ఒక్కో ఫారం నుంచి సంక్రాంతి సీజన్లో 80 నుంచి 100 వరకు పుంజులు ఏపీలో పందేలకు తరలుతాయి. లోకల్ పెట్ట.. పందెం పుంజు..: ఫారాల నిర్వాహకులు ఏపీలో జరిగిన పందేల్లో గెలిచిన పుంజులను కొనుక్కొచ్చి స్థానికంగా కోడిపెట్టలతో క్రాసింగ్ చేయిస్తారు. ఆ కోడిపెట్టలు పెట్టిన పిల్లల నుంచి పుంజులను వేరుచేసి ప్రత్యేకమైన ఆహారం, శిక్షణ ఇస్తారు. ఆరు నెలల వయసు వచ్చేవరకు గుంపుగా ఉంచిన పుంజులను తర్వాత వేరు చేస్తారు. గుడ్లు, రాగులు, నానబెట్టిన బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్లు, మటన్ కీమా వంటివి ఆహారంగా పెడతారు. కాళ్లు దృఢంగా అయ్యేందుకు నీటిలో ఈత కొట్టిస్తారు. మసాజ్ చేస్తారు. కాస్త అటూఇటూగా ఏడాదిన్నర వయసున్న పుంజులను పందాలకు వినియోగిస్తారు. ‘కాకి, నెమలి, డేగ, సీతువా, పచ్చకాకి, కోడి డేగ, ఆబ్రాసు, రసంగి డేగ’ తదితర జాతుల కోళ్లను పోటీకి దింపుతారు. ఏపీ నుంచి పందెం రాయుళ్లు నవంబర్ నుంచే పుంజుల ఫారాలకు వస్తారు. పుంజుల బలం, ఆరోగ్యం, పంజా విసిరే వేగం, ఒంటిపై జుట్టు విచ్చుకునే తీరు వంటివాటిని బట్టి రూ.20 వేల నుంచి రూ.లక్షన్నర వరకు ధర పలుకుతాయి. క్యూ కట్టిన హైదరాబాదీలు – ఏపీలో కోడి పందాలకు భారీగా తరలిన జనం కోస్తా నుంచి సాక్షి ప్రతినిధి:సంక్రాంతి సెలవులతో హైదరాబాద్‌లో రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తే.. ఏపీలోని ఏలూరు, ఎన్టీఆర్, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లాల్లో గ్రామాలకు వెళ్లే మార్గాలు కూడా ట్రాఫిక్‌తో నిండిపోయాయి. పెద్ద సంఖ్యలో హైదరాబాదీలు సంక్రాంతికి ఊరెళ్లడం ఒక కారణమైతే.. కోడి పందాలకు క్యూకట్టడం మరో కారణం ఏ బంకిణీ (కోడి పందాలు నిర్వహించే ప్రాంగణం) పార్కింగ్‌లో చూసినా హైదరాబాద్, శివార్లలోని ప్రాంతాల వాహనాలే కనిపించాయి. ఆకివీడు సమీపంలో ఉన్న ఐభీమవరం బంకిణీలో భారీ సందడి కనిపించింది. దీనికి సమీపంలో ఉన్న చెరుకుమిల్లితోపాటు గుడివాడ–భీమవరం మార్గంలో ఉన్న కాళ్ల, జువ్వలపాలెంలలోనూ బంకిణీలు జనాలతో నిండిపోయాయి. కూచిపూడి, వెంప, భీమవరం, కొప్పాడ, పత్తేపురం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, ఉండి, గణపవరం, తాడేపల్లిగూడెం చుట్టుప్రక్కల గ్రామాల్లోనూ జోరుగా కోడిపందాలు జరిగాయి. చెక్‌పోస్టులను దాటుకుని.. కోడి పందాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు భారీగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం నుంచే వాహనాల తనిఖీ చేపట్టారు. కోడి పుంజులు, నగదుతో వెళ్తున్నవారిని అదుపులోకి తీసుకోవడం ప్రారంభించారు. అయితే స్థానిక యువకులు కొందరు.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారి వాహనాల్లోని కోడి పుంజులను దొడ్డిదారిన చెక్‌పోస్టులు దాటిస్తూ, బంకిణీల వద్దకు చేరుస్తూ కొంత సొమ్ము తీసుకున్నారు. దీనితో పందాలకు వెళ్లేవారికి అడ్డులేకుండా పోయింది. -
పుంజు భలే రంజుగా! సంప్రదాయం నుంచి సంపాదనగా ‘కోడి పందేలు’
సాక్షి, అమరావతి: బరిలో తలపడే పుంజులు అత్యంత పౌరుషంతో పోరాడుతాయి. ఓడిపోయిన పుంజు తోక ముడిచి బరినుంచి పారిపోతే.. గెలిచిన పుంజు తన యజమాని ఉప్పొంగిపోయేంత గర్వాన్ని ఇచ్చేది. పుంజుల పోరాటం చూపరులకు సైతం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేది. తొలినాళ్లలో సరదా కోసం మొదలైన పందాలు ట్రెండ్ మార్చుకుంటున్నాయి. ఇప్పుడు కోడి పందాలంటే విశాలమైన మైదానం.. భారీ టెంట్లు.. ప్రేక్షకులు కూర్చుని వీక్షించేలా ప్రత్యేకంగా గ్యాలరీలు.. ఫ్లాష్లైట్ల కాంతులు.. భారీ సంఖ్యలో జన సందోహం నడుమ జాతరను తలపించేలా మారిపోయింది. ప్రత్యేక శిక్షణ పొందిన పుంజులను పహిల్వాన్ మాదిరిగా వాటి కాళ్లకు పదునైన కత్తులు కట్టి బరిలో దించుతున్నారు. రక్తమోడుతున్నా వీరోచితంగా పోరాడి ఒక కోడి గెలిస్తే.. మరో కోడి ప్రాణాలు విడుస్తుంది. ఆ తరువాత పెద్ద మొత్తంలో నగదు చేతులు మారుతుంది. సంక్రాంతి మూడు రోజుల్లోనే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో రూ.వందలాది కోట్లు కోడి పందాల మాటున చేతులు మారుతున్నాయి. తాజాగా ఒకచోట కోడి పందాలు వేసి.. వాటిని సోషల్ మీడియాలో లైవ్‌లో చూపించి బెట్టింగ్‌లు వేసుకునే స్థాయికి చేరింది. అలా మొదలై.. పూర్వం దేశంలోని అనేక ప్రాంతాల్లో కోడి పందాలు వినోదం కోసం మొదలై వీరోచిత పోరాటాలకు దారితీశాయని చరిత్ర చెబుతోంది. తొలినాళ్లలో అడవి కోళ్లు లేదా పెరటి కోళ్లు పోరాడుకునేలా ప్రేరేపించి వినోదం పొందేవారు. పల్నాడు యుద్ధం (1178–1182) కోడి పందాల్లో తలెత్తిన వివాదం వల్లే సంభవించినట్టు చరిత్ర చెబుతోంది. బొబ్బిలి యుద్ధంలోనూ కోడి పందాలు జరిగాయి. రానురాను కోడి పందాలు ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో జూదం తరహాలో మార్పు చెందాయి. సుమారు రెండున్నర దశాబ్దాలుగా సంక్రాంతి అంటే కోడి పందాలు అనేలా మారిపోయాయి. సంక్రాంతి మూడు రోజులపాటు నిర్వహించే కోడి పందాల కోసం ఐదు నెలల ముందు నుంచే ప్రత్యేకంగా ఎంపిక చేసిన కోడి పుంజులను తీర్చిదిద్దుతారు. వాటి పెంపకానికి రూ.లక్షల్లో వెచ్చిస్తున్నారు. ఇదీ చదవండి: ఆ ఒక్కటీ... అడక్కు..!! షాక్‌లో ఆడిట్ అధికారులు -
'పుంజు'కుంటున్నాయ్.. సూర్యోదయానికి ముందే కోడి పుంజుల వ్యాయామం
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి కోచింగ్ క్యాంపులు మొదలయ్యాయి. ఆ క్యాంపుల్లో కోడి పుంజులు కొత్త అల్లుళ్ల మాదిరిగా మహారాజ భోగాలు అనుభవిస్తున్నాయి. బాదం..పిస్తా.. మేక మాంసంతో చేసిన ఖైమా వంటి అదిరిపోయే మెనూతో ఒళ్లు పెంచుకుంటున్నాయి. ఆ తరువాత స్పెషల్ ట్రైనర్ల సమక్షంలో వ్యాయామాలు కూడా చేస్తున్నాయి.నిత్యం గోరు వెచ్చని నీటిలో జలకాలాడుతూ సంక్రాంతి పందేలకు సిద్ధమవుతున్నాయి. సాక్షి ప్రతినిధి, కాకినాడ: గోదావరి తీరంలో సంస్కృతి, సంప్రదాయల కలబోతగా సాగే సంక్రాంతి సంబరాల కోసం పందెం కోళ్లు క్యాంపుల్లో శిక్షణ పొందుతున్నాయి. ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని పల్లెల్లో 6 నెలలుగా పందెం కోళ్లకు శిక్షణ ఇస్తున్నారు. దేశవాళీ జాతులైన నెమలి, డేగ, శేషువా, గేరువా, రసంగి, కాకి, అబ్రాస్, కక్కిరా, పింగళి, నల్లబొట్ల శేషువా, కోడి కాకి వంటి 20 రకాల జాతులకు చెందిన కోడి పుంజులు ఈ క్యాంపుల్లో శిక్షణ పొందుతున్నాయి. ట్రైనర్లను నియమించి మరీ కోడి పుంజులకు శిక్షణ ఇస్తున్నారు. వాటికి బలవర్ధకమైన ఆహారం ఇచ్చేందుకు వేలకు వేలు వెచ్చిస్తున్నారు. రూ.5 వేల నుంచి రూ.10 వేలకు కోడి పుంజుల్ని కొనుగోలు చేసి.. వాటికి 6 నెలల పాటు శిక్షణ ఇచ్చిన అనంతరం ఒక్కొక్క పుంజును రూ.2 లక్షలకు పైనే విక్రయిస్తుంటారు. మెనూ మామూలుగా ఉండదు మరి అక్టోబర్ నెలలో ఉదయాన్నే కోడిగుడ్డు, ధాన్యం, గంట్లు కలిపిన మిశ్రమాన్ని కోడి పుంజులకు ఆహారంగా పెట్టారు. ఆ తరువాత నుంచి ఉడకబెట్టిన కోడి గుడ్డును పిండి మాదిరిగా నలిపి మొదటివిడతగా ఉదయం 9 గంటలకు అల్పాహారం, ఉదయం 10 గంటలకు బాదం, పిస్తా కలిపిన మిశ్రమం, 50 గ్రాముల ఖైమా వంటి వాటిని విడివిడిగా పెట్టారు. మధ్యాహ్నం శక్తి కోసం రివైటల్ ట్యాబ్లెట్స్ వేస్తారు. డిసెంబర్ నెలలో 20 నుంచి 30 రకాల డ్రైఫ్రూట్స్‌తో తయారయ్యే నాస్తా పెడుతున్నారు. అంజూర, బాదం, జీడిపప్పు, పిస్తా, ఎండు ఖర్జూరం, కిస్మిస్, నల్లద్రాక్ష, తేనె, నువ్వుల నూనె, సొంఠి, తోక మిరియాలు, మసాలా దినుసులు కలిపి రోటిలో ముద్దగా చేసి రోజుకు ఒక గోలీ చొప్పున తినిపిస్తున్నారు. ఇలా ఒక్కో పుంజుకు రోజుకు రూ.200 వరకు ఆహారం కోసం వెచ్చిస్తున్నారు. ఇలా ఒక పందెం కోడికి 6 నెలల మెనూ ఖర్చు రూ.36 వేలకు పైగా దాటిపోతుంది. ట్రైనర్ల జీతాలు, క్యాంప్ నిర్వహణ ఖర్చులు అదనం. క్రాస్ జనరేషన్ పుంజులదే హవా గడచిన మూడేళ్లుగా పందేలలో క్రాస్ జనరేషన్ కోడి పుంజుల హవా నడుస్తోంది. వీటిలో ప్రధానమైనవి అమెరికన్ గేమ్ పౌల్, అమెరికన్ పెర్విన్, సాహివాల్తో పాటు బ్రెజిల్ జాతి కోళ్లు వంటివి ఉన్నాయి. జత పుంజు, పెట్టను రూ.3.50 లక్షలకు మూడేళ్ల క్రితం అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నారు. వీటిని దేశీయ నెమలి, డేగ తదితర జాతి కోళ్లతో క్రాసింగ్ చేయించారు. విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పశు వైద్యుల పర్యవేక్షణలో ఇదంతా జరిగింది. ఇలా సుమారు 100 జతల కోళ్లను దిగుమతి చేసుకున్నారని అంచనా. ప్రస్తుతం పందెం కోళ్లలో ‘అమెరికన్ గేమ్ పౌల్’ పుంజు ఇటీవల విజేతగా నిలుస్తోంది. దీని తరువాత స్థానం పెర్విన్ జాతిదే. ఈ రెండు క్రాసింగ్ జనరేషన్ పుంజులే. ఈ విదేశీ పుంజులు తొలి ఏడాది బరిలో బోల్తా పడ్డాయి. దీనిని గుర్తించి వీటిని దేశవాళీ మేలు రకం పుంజులతో క్రాసింగ్ చేయడంతో మూడో జనరేషన్ నుంచి వీటిలో పోరాట పటిమ పెరిగిందంటున్నారు. అమెరికన్ జాతి కోళ్లలో మెళకువలు, స్వదేశీ జాతి కోళ్లలో ఎముక పటుత్వం కలగలిపి ఇవి బరిలో మేటిగా నిలుస్తున్నాయని పెంపకందారులు చెబుతున్నారు. ఈ కోడిపుంజు ధర రూ.లక్షకు పైమాటే. తరువాత అమెరికన్ పెర్విన్ జాతి పుంజు రూ.70 వేల ధర పలుకుతోంది. వీటికి శిక్షణ ఖర్చులు అదనం. పోషణ, శిక్షణతోనే గెలుపు పందెం కోళ్ల పోషణ చాలా ముఖ్యమైనది. చక్కని బలవర్ధకమైన ఆహారంతో పాటు ఉదయాన్నే కోళ్లకు వ్యాయామం కూడా చేయిస్తాం. నీళ్ల పోత, కాక తీత చేయిస్తాం. ఇదంతా నిపుణుల పర్యవేక్షణలోనే జరుగుతుంది. వైద్యుల సాయంతో మందులు కూడా వినియోగిస్తాం. – రామరాజు, బట్టేలంక, కోనసీమ జిల్లా ఈ ఏడాదీ అమెరికన్ గేమ్ పౌల్దే 2018లో అమెరికన్ గేమ్ పౌల్దే జాతి కోళ్లను దిగుమతి చేసుకున్నాం. తొలి జనరేషన్ బాగా క్లిక్ అయింది. రెండో జనరేషన్ ఫెయిలైంది. వీటిని నాణ్యమైన దేశీయ కోళ్లతో క్రాసింగ్ చేయడంతో గత సంక్రాంతికి మూడో జనరేషన్ నుంచి ఈ జాతి పోటీలలో విజేతగా నిలుస్తోంది. ఈ ఏడాది కూడా అమెరికన్ గేమ్ పౌల్ పైచేయిగా నిలిస్తుందన్న నమ్మకం ఉంది. – పరుచూరి కృష్ణారావు, గుడివాడ, కృష్ణా జిల్లా -
చింతమనేనిదే పందెం కోడి!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/పటాన్చెరు/పటాన్చెరు టౌన్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం చిన్నకంజర్ల శివారులోని ఓ ఫాంహౌస్‌లో కోడిపందేల ఉదంతంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కోడిపందేల స్థావరంపై బుధవారం రాత్రి పటాన్చెరువు పోలీసులు దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. అయితే.. పందేల ప్రధాన నిర్వాహకుడైన టీడీపీ నేత, ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పోలీసుల కళ్లుగప్పి పరారవడంతో ఆయన కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. పందెం నిర్వహణకు చింతమనేనే ప్రధాన సూత్రధారి అని దర్యాప్తులో తేలడంతో ఆయన్ను ఏ1 నిందితుడిగా చేర్చామని, ఆయనతోపాటు పరారీలో ఉన్న మరో 40 మందిని పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటుచేశామని పటాన్చెరువు డీఎస్పీ భీంరెడ్డి తెలిపారు. చింతమనేని తన ఫోన్‌ను స్వీచ్చాఫ్ చేసుకున్నారని చెప్పారు. అయితే, పోలీసులు దాడులు నిర్వహించిన కోళ్ల పందేల స్థావరంలో తాను లేనంటూ చింతమనేని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై డీఎస్పీ స్పందించారు. ఆయన కోడి పందేలు ఆడిస్తున్నట్లు వీడియోలు ఉన్నాయని, అవసరం వచ్చినప్పుడు సాంకేతిక ఆధారాలను విడుదల చేస్తామన్నారు. అయితే, చింతమనేని బుధవారం కోడి పందేల్లో పాల్గొన్న ఓ వీడియో ‘సాక్షి’కి చిక్కింది. పోలీసుల దాడి సమయంలో ఆయన అక్కడి నుంచి పారిపోతున్నట్లుగా అందులో స్పష్టంగా కనిపించింది. మరోవైపు.. ఇదే స్థావరంలో రేవ్ పార్టీలు కూడా జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. స్థాయిని బట్టి బరుల ఏర్పాటు కోడిపందేల్లో పాల్గొనే వారిని చింతమనేని వాట్సాప్‌లో లొకేషన్ షేర్ చేస్తూ రప్పిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. చింతమనేని తొలుత సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కోహీర్ శివారులోని కుంచారంలో కోళ్ల పందేలు ఆడి తిరిగి అక్కడి నుంచి చిన్నకంజర్లలోని మామిడి తోటలో పందేలు ఆడేందుకు వచ్చారని పోలీసులు తెలిపారు. ముందుగా 20 మందితో పందేలు మొదలవగా వాట్సాప్ గ్రూప్‌లో చింతమనేని లోకేషన్ షేర్ చేయడంతో ఆ సంఖ్య 70కి చేరిందన్నారు. గతంలో సినీ పరిశ్రమలో పనిచేసిన బర్ల శ్రీను అనే వ్యక్తి కూడా పందేల నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ స్థావరంలో రూ.500 పందెం కాసేవారికి ఒక బరి, రూ. వెయ్యి కాసేవారికి మరొకటి, రూ.2 వేలు కాసే వారికి మరొకటి.. ఇలా స్థాయిని బట్టి బరులను ఏర్పాటుచేశారు. పోలీసులు దాడులు నిర్వహించిన చోట గుట్టలకొద్దీ ఖాళీ మద్యం సీసాలు దర్శనమిచ్చాయి. సీజ్ చేసిన వాహనాల్లోనూ ఇవి లభించాయి. పట్టుబడిన 21 మంది వీరే.. ఈ కేసులో పట్టుబడిన నిందితులు హైదరాబాద్‌తోపాటు ఏలూరు, కృష్ణాజిల్లా, రాజమండ్రి, విజయవాడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నిందితులైన అక్కినేని సతీశ్, శ్రీనివాస్‌రావు, చేతేశ్వర్‌రావు, శ్రీరామకృష్ణ, బాలస్వామి, లింగాల నాగేశ్వర్రావు, రవడి శ్రీను, రవీంద్ర చంద్రశేఖర్, నాగబాబు, నాగశేషు, సూర్యనారాయణరావు, వంశీ, షణ్ముఖ్‌సాయి, నిఖిల్, గంటా శ్రీనివాసరావు, పార్స శ్రీనివాసరావు, బొడపాటి నాగేశ్వరరావు, ముల్లపుడి నర్సన్న, సత్యనారాయణ రాజు, నర్ర సాంబశివరావు, ప్రకాశ్‌లను రిమాండ్‌కు తరలించారు. ఇక్కడే రేవ్ పార్టీలు కూడా? చింతమనేని ప్రభాకర్ సంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న కోళ్ల పందేల స్థావరంలో రేవ్ పార్టీలు కూడా జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీకెండ్లో హైదరాబాద్‌కు చెందిన పలువురు యువతీ యువకులను తీసుకొచ్చి ఇక్కడ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఈ కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. -
కోడి పందేలను అడ్డుకుంటున్నాం
సాక్షి, అమరావతి: గతంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కోడి పందేల నిర్వహణను అడ్డుకుంటున్నామని హైకోర్టుకు పోలీసులు నివేదించారు. కోడి పందేలు, జూదం, ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కఠినంగా వ్యవహరిస్తున్నామని వివరించారు. ఇప్పటికే రెండు కేసులు కూడా నమోదు చేశామని తెలిపారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. కోడి పందేలపై ఇప్పటికే దాఖలైన పిటిషన్‌తో ఈ వ్యాజ్యాలను జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేశ్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులిచ్చారు. సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు, జూదంతో పాటు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు చేపట్టేలా పోలీసులను ఆదేశించాలని పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలానికి చెందిన పి.రాజవర్ధన్రాజు, కొప్పాక విజయరాజు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని జస్టిస్ సురేశ్‌రెడ్డి బుధవారం విచారించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది పరిమి రామరాయుడు వాదనలు వినిపిస్తూ.. కోడి పందేలు నిర్వహించకుండా చర్యలు చేపట్టాలని హైకోర్టు ధర్మాసనం 2017లో తీర్పునిచ్చిందన్నారు. దీనిని కఠినంగా అమలు చేసేలా పోలీసులను ఆదేశించాలన్నారు. ప్రభుత్వ సహాయ న్యాయవాది(హోం) వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏటా కఠినంగా అమలు చేస్తున్నామని చెప్పారు. కోడి పందేలపై ఇప్పటికే పిటిషన్ దాఖలైందని, దాని విచారణను హైకోర్టు సంక్రాంతి సెలవుల తరువాతకు వాయిదా వేసిందని వివరించారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ఇదే అంశంపై దాఖలైన పిటిషన్‌తో ఈ వ్యాజ్యాలను కూడా జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. -
అంగరంగ వైభవం.. సంక్రాంతి సంబరం
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా, సంప్రదాయబద్ధంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. చాలా ఏళ్ల తర్వాత మంచి వర్షాలు కురవడం, వాతావరణం అనుకూలించడం.. పేదలు, అల్పాదాయ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందడంతో పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ ఆనందంగా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. చేతినిండా గాజులు వేసుకుని పట్టువస్త్రాలు ధరించి సంప్రదాయబద్ధంగా ముస్తాబైన ఆడపడుచులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జీన్స్ ప్యాంట్లు, పంజాబీ డ్రస్‌లకే పరిమితమైన పట్టణ, నగర యువతులు స్వగ్రామాలకు వచ్చి పట్టు పరికిణీలు ధరించి సందడి చేస్తూ సరికొత్త అనుభూతులు పంచుకున్నారు. యువతులు రంగురంగుల రంగవల్లులు వేసి గొబ్బెమ్మలను పెట్టారు. డూడూ బసవన్నలు గ్రామాల్లో సందడి చేశాయి. హరిదాసుల కీర్తనలు మార్మోగాయి. ఇక చాలా ప్రాంతాల్లో గురువారం భక్తిశ్రద్ధలతో పెద్దలకు తర్పణాలు వదిలి బ్రాహ్మణులకు తోచిన రీతిలో దానధర్మాలు చేశారు. పశువుల ముస్తాబు మరోవైపు.. శుక్రవారం కనుమ (పశువుల) పండుగ సందర్భంగా తెల్లవారుజామునే గోవులు, ఎద్దులు, గేదెలు, పొట్టేళ్లు వంటి వాటికి వేడినీటితో స్నానాలు చేయించి కొమ్ములకు రంగులు పూసి పసుపు, కుంకుమతో బొట్లు పెట్టారు. పూలమాలలు వేసి అలంకరించారు. గోవులు, ఎద్దులకు అరిసెలు, బెల్లం, తవుడు తినిపించి పూజలు చేశారు. ఇక పలు జిల్లాల్లో ఎద్దులతో బండ లాగుడు పోటీలు వైభవంగా జరిగాయి. వీటిని వీక్షించేందుకు జనం తండోపతండాలుగా వచ్చారు. జనసంద్రం.. విశాఖ సాగరతీరం ఇదిలా ఉంటే.. సంక్రాంతి సంబరాలతో విశాఖ సాగర తీరం జన సంద్రంగా మారింది. గురు, శుక్రవారాలు ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. ఆకాశంలో వయ్యారాలొలుకుతూ పతంగులు సందడి చేశాయి. సంక్రాంతి పండుగకు సగం నగరం ఊళ్ల వైపు పరుగులు తీయగా.. మిగిలిన వారు బీచ్‌లో కనిపించారు. దీంతో నగర రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. కోనసీమలో కోలాహలంగా ప్రభల తీర్థాలు తూర్పు గోదావరి జిల్లాలో కనుమ పండగ రోజైన శుక్రవారం ప్రభల తీర్థాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జనంతో కోలాహలంగా జరిగాయి. కోనసీమలోని దాదాపు 175 గ్రామాల్లో ఇవి నేత్రపర్వంగా జరిగాయి. ప్రభల తయారీతో సంక్రాంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన భక్తులు ప్రభలను గ్రామగ్రామాన ఊరేగించి, తీర్థాలు నిర్వహించారు. వీటిని తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల్లో స్థిరపడిన స్థానికులు కూడా గ్రామాలకు తరలివచ్చారు. అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోట ప్రభల తీర్థానికి 11 గ్రామాల నుంచి ఏకాదశ (11) రుద్ర ప్రభలు తరలివచ్చాయి. అపురూపమైన ఆ దృశ్యాన్ని చూసిన భక్తజనం ఓ మధురానుభూతికి గురైంది. ఇక్కడకు లక్ష మందికి పైగా భక్తులు తరలివచ్చారని అంచనా. అలాగే, ఇదే మండలం తొండవరం గ్రామంలో 45 అడుగులు, వాకలగరువులో 42 అడుగుల ఎత్తున రూపొందించిన ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంక్రాంతి రోజున కొత్తపేటలో జరిగిన ప్రభల తీర్థం, భారీ బాణాసంచా కాల్పులతో వేడుకగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గన్నతోట తీర్థంలో కొలువుదీరిన ప్రభలు ముగిసిన పందెం సంక్రాంతి కోడి పందాల ముచ్చట శుక్రవారం ముగిసింది. పలు జిల్లాల్లో పోలీసులు రంగంలోకి దిగి బరుల వద్ద పందేలను నిలిపివేయించారు. భోగి రోజైన బుధవారం ఒక మోస్తరుగా మొదలైన కోడి పందాలు సంక్రాంతి రోజైన గురువారం జాతరను తలపించాయి. కనుమరోజైన శుక్రవారం అదే జోరు కొనసాగింది. ప్రధానంగా ఉభయ గోదావరితో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వందల కోట్ల రూపాయల బెట్టింగ్‌లు చేతులు మారాయి. సంప్రదాయం పేరుతో జరిగిన కోడి పందేలను చూసీచూడనట్టు వదిలేసిన పోలీసులు పేకాట, గుండాట, కోతాట తదితర జూదాలపై కఠినంగా వ్యవహరించారు. అయితే గతంలో పోల్చితే ఈ ఏడాది సంక్రాంతి కోడి పందాల జాతర కళ తప్పింది. కోడి పందాలపైన కోవిడ్ ప్రభావం స్పష్టంగా కన్పించింది. పందేలు చూసేందుకు, బెట్టింగ్‌లు వేసేందుకు గతంలో పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చేవరాని, ఈ ఏడాది అంత పెద్ద సంఖ్యలో జనం రాలేదని బరుల నిర్వాకులు తెలిపారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల రాజకీయ, సినీ, వ్యాపార, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు ఈసారి అశించిన స్థాయిలో రాలేదు. గతంలో జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన, సొంత తోటల్లోను, గుర్తింపు పొందిన ప్రాంతాల్లోను బరులు ఏర్పాటు చేసి కోడి పందాలు నిర్వహించే వారు. ఈసారి నిర్వాహకులు రహదారులకు రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో కొత్త ప్రాంతాల్లో బరులు ఏర్పాటు చేయడం గమనార్హం. తూర్పు గోదావరి జిల్లా గోదావరి నదీ పాయల్లోని లంకల్లో బరులు ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, ఉండి, పాలకొల్లు, వీరవారసరం, నరసాపురం, గోపాలపురం, దేవరపల్లి, తణుకు మండలం తేతలి, ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర ప్రాంతాల్లో పెద్దఎత్తున పందేలు నిర్వహించారు. కృష్టా జిల్లా గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, పెనమలూరు, బాపులపాడు, కంచికచర్ల, నందిగామ, తోట్లవల్లూరు మండలాల్లో, గుంటూరు జిల్లా తెనాలి, రెపల్లె, వేమూరు తదితర ప్రాంతాల్లో కోడి పందాలు సాగాయి. -
కండల కోడి c/o ‘పాతబస్తీ
సాక్షి,హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది పిండివంటలతోపాటు కోడి పందేలు.. ఇందుకోసం అవసరమయ్యే మేలు జాతి కోళ్లను హైదరాబాద్‌లోనూ పెంచుతున్నారు. పాతబస్తీలో పెంచే కోళ్లకు భలే డిమాండ్ ఉంది. సంక్రాంతికి 3–4 నెలల ముందు నుంచే ఇక్కడ పందెం కోళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. పాతబస్తీ పందెం కోళ్లు, వాటికి ఇచ్చే ఆహారం, పందేల కోసం ఇచ్చే శిక్షణపై సాక్షి ప్రత్యేక కథనం... జీవనశైలి ప్రత్యేకం... పందెం కోళ్ల పెంపకం, వాటి జీవనశైలి సాధారణ కోళ్లతో పోలిస్తే ప్రత్యేకంగా ఉంటుంది. వాటి ఎంపిక దగ్గర నుంచి ఆహారం, శిక్షణ వరకు అన్నీ విభిన్నంగా సాగుతాయి. పుంజులను బలంగా తయారు చేయడం కోసం వాటికి పౌష్టిక ఆహారం పెడతారు. ప్రత్యేక శిక్షణ ఇస్తారు. నాలుగు నెలల కాలాన్ని వారాలుగా విభజించి పుంజులను బలంగా తయారు చేస్తారు. పందెం కోళ్ల ఆహార జాగ్రత్తలు చూస్తే కళ్లు తిరుగుతాయి. వెజ్, నాన్‌వెజ్ ఐటమ్స్‌తో కూడిన బలవర్ధకమైన ఆహారం అందిస్తారు. కఠోర శిక్షణ... పండుగ నెల రోజుల ముందు నుంచి పందెం కోళ్లకు అసలైన ట్రైనింగ్ మొదలవుతుంది. ఉదయాన్నే వాటికి మౌత్ వాష్ చేయిస్తారు. పుంజుల గొంతులో ఏమైనా మలినాలుంటే వాటిని తొలగిస్తారు. ట్రైనర్ తన నోట్లో నీళ్లు పోసుకొని కోళ్ల ముఖంపై స్ప్రే చేస్తాడు. ఈ ప్రక్రియను కల్లె కొట్టడం అంటారు. పుంజు కండరాలు బిగుతుగా ఉండేందుకు వాకింగ్ చేయిస్తారు. అటూఇటూ పరుగెత్తిస్తారు. ఆ తర్వాత వేడి నీళ్లు, ప్రత్యేక షాంపూతో స్నానం చేయిస్తారు. రెండు గంటల తర్వాత మళ్లీ ట్రైనింగ్ మొదలవుతుంది. ఈసారి ఒక పుంజును మరో దానితో పోటీకి దింపుతారు. కొద్దిసేపు ఫైటింగ్ తర్వాత వాటికి స్పెషల్ మసాజ్ ఉంటుంది. అట్ల పెనంపై గుడ్డును వేడిచేసి బాదం, నిమ్మ నూనెతో మసాజ్ చేస్తారు. పెంపకందారులు వాటికి ప్రత్యేకంగా ప్రతిరోజూ పండుగ భోజనమే పెడతారు. ఒక్కో కోడిపై నెలకు రూ. 5 వేల నుంచి 6 వేల వరకు ఖర్చు అవుతుంది. పందెం కోళ్ల ధరలు రూ. వేలల్లో ఉంటాయి. అసీల్ రకం కోళ్ల ధర రూ. 50 వేల నుంచి 75 వేల వరకు ఉంటుంది. కొన్ని రకాల కోళ్లు రూ. లక్షపైన కూడా పలుకు తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పుంజుల పెంపకం ఓ యజ్ఞంలా సాగుతుంది. కోళ్లను నిర్వాహకులు కంటికి రెప్పలా చూసుకుంటారు. పందెం కోళ్ల మెనూ ఇలా.. ► ఉదయం ఎండు ఖర్జూరం కిస్మిస్, మేకపాలు ► మూడు గంటలకోసారి జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా మిశ్రమం ► బియ్యం, రాగులు, మినప్పప్పు, శనగపప్పు, గోధుమ మిశ్రమం.. మధ్యాహ్నం మటన్ కైమా, సాయంత్రం స్నాక్స్‌గా జొన్నలు, కోడిగుడ్లు కోడిపుంజుల కసరత్తులు ఇవీ.. ► కండరాల బిగుతుకు రోజూ మార్నింగ్ వాక్ ► తిన్నది ఒంటికి పట్టేవిధంగా అటుఇటు పరుగెత్తించడం. చెరువులో ఈత కొట్టించడం ► వేడి నీళ్లు, స్పెషల్ షాంపూతో స్నానం ► అట్ల పెనంపై గుడ్డును వేడిచేసి బాదం, నిమ్మ నూనెతో మసాజ్ -
కోడి పందేల కట్టడికి రంగంలోకి పోలీసులు
సాక్షి, అమరావతి: సంక్రాంతికి ఆడే కోడి పందేల కట్టడికి పోలీసులు రంగంలోకి దిగారు. రెండు రోజులుగా ప్రధానంగా ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కోడి పందేలతో పాటు గుండాట, పేకాటలను అడ్డుకునేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. కోడి పందేలు, జూదం కట్టడికి ప్రతి మండలంలో జాయింట్ యాక్షన్ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఈసారి పోలీసులతో పాటు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) కూడా రంగంలోకి దిగింది. ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, గుట్కా, మట్కా, కోడిపందేలపై నిఘా ముమ్మరం చేసింది. తొలిదశలో పలు గ్రామాల్లో కోడిపందేల నిర్వాహకులను, కత్తులు తయారు చేసే వాళ్లను, కత్తులు కట్టేవాళ్లను, కోళ్లను పెంచే వాళ్లను అదుపులోకి తీసుకుని బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు. ఒక్క ఏలూరు రేంజ్ పరిధి (కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలు)లో 4,395 బైండోవర్ కేసులు నమోదు చేశారు. కోడి కత్తులు తయారు చేసేవారు, కోడి కత్తులు కట్టే వారి నుంచి 5,243 కత్తులను స్వాదీనం చేసుకున్నారు. కోడి పందేలు, పేకాటలు నిర్వహించే వారిపై 848 కేసులు నమోదు చేశారు. కోవిడ్ వ్యాప్తి ప్రమాదం.. సంక్రాంతి పేరుతో కోడి పందేలు, పేకాట నిర్వహిస్తే పెద్ద ఎత్తున జూదరులు ఒక చోటకు చేరతారని, అందువల్ల కోవిడ్ వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామాల్లో పోలీసులు ప్రచారం చేస్తున్నారు. పందేలు, పేకాట నిర్వహకులపై చట్టరీత్యా కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఉభయగోదావరి జిల్లాల్లోని లాడ్జిల్లో ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చారా? అనే కోణంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. లాడ్జిల్లో ఉండే వారి వద్ద ఎక్కువగా నగదు ఉంటే సీజ్ చేస్తామని, బెట్టింగ్ ఆడితే క్రిమినల్ కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి సంక్రాంతి సంబరాల కోసం వస్తే సంతోషమని, అదే పేకాట, కోడి పందేలు కోసం వచ్చి లాడ్జిల్లో ఉంటే అరెస్టులు తప్పవని పోలీసులు సూచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోడి పందేలు, పేకాటలను అడ్డుకునేందుకు ఐపీసీ సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30ను అమలు చేస్తున్నారు. -
కోడి పందేల చరిత్రలో ఈ పరిస్థితి ఇదే తొలిసారి
సాక్షి, అమరావతి: ఈ ఏడాది కోడి పందేల శిబిరాల వద్ద పేకాట, మద్యం విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. గతంలో కోడిపందేల బరుల వద్దే అనధికారంగా ఏర్పాటుచేసే షాపుల్లో మద్యం ఏరులై పారేది. దీంతోపాటు పేకాట, గుండాట, కోతాట వంటివి కూడా పెద్దఎత్తున సాగేవి. కానీ, గతానికి కన్నా భిన్నంగా ఈ ఏడాది పందేలు జరిగే ప్రతిచోటా మద్యం అమ్మకాలు, జూదం నిర్వహణపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో పెద్దఎత్తున పోలీసు గస్తీ ఏర్పాటుచేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కూడా వైర్లెస్ మెసేజ్‌లు పంపించారు. అలాగే, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ సోమవారం జిల్లాలోని పోలీసు అధికారులతో నిర్వహించిన వైర్లెస్ కాన్ఫరెన్స్‌లోనూ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. తమ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరి ప్రాంతంలోనైనా మద్యం అమ్మకాలు, పేకాటలు జరిగితే అక్కడి పోలీసులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. పంతం నెగ్గించుకున్న పోలీసులు కోడి పందేల చరిత్రలో తొలిసారిగా పోలీసులు భోగి రోజున ఒక పూట అయినా వాటిని అడ్డుకుని రికార్డు సృష్టించారు. ఏటా పోలీసులు హడావుడి చేయడం.. చివరికి భోగి రోజు ఉదయమే పందేలు మొదలు కావడం ఎప్పుడూ జరిగే తంతే. అయితే, ఈసారి మాత్రం అందుకు భిన్నంగా కొంతమేర వాటిని నిలువరించగలిగారు. భీమవరం, ఎదుర్లంక, యనమలకుదురు తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం తర్వాత పందేలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే.. కోడి పందేలు, పేకాట కోసం పొరుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన అతిథులు పోలీసు ఆంక్షల నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం వరకు భీమవరం, తదితర ప్రాంతాల్లో లాడ్జీలు, గెస్ట్‌హౌస్‌లకే పరిమితమయ్యారు. ఆలస్యంగా.. అరకొరగా కోడిపందేలు మరోవైపు.. పోలీసు ఆంక్షల నడుమ తొలిరోజున పందెం కోళ్లు ఆలస్యంగా ఎగిరాయి. కోడి పందేలు జరుగుతాయో లేదోనని భోగి రోజైన మంగళవారం మధ్యాహ్నం వరకు ఉత్కంఠ కొనసాగింది. ఎందుకంటే.. పందేలను అడ్డుకుంటామంటూ పోలీసులు బరుల వద్ద పికెట్లు ఏర్పాటుచేశారు. ప్రధానంగా ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన కోడి పందేల నిర్వాహకులు, కత్తులు కట్టే వారిని అదుపులోకి తీసుకుని బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఇది ఎప్పుడూ ఉండే తంతే అనుకున్న నిర్వాహకులు చివరకు భోగి రోజున కోడి పందేలకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో ఆయా బరుల వద్ద పికెట్ నిర్వహిస్తున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆయా జిల్లాల్లో బరుల వద్ద పందేలు ప్రారంభించుకోవడానికి నిర్వాహకులకు ఎదురుచూపులు తప్పలేదు. అనుమతి కోసం వారు పడిగాపులు కాసారు. చివరికి మంగళవారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో ఒంటి గంట నుంచి మూడు గంటలలోపు అరకొరగానే కోడి పందేలు ప్రారంభమయ్యాయి. దీంతో తొలి రోజు పందేల రాయుళ్లు నిరుత్సాహానికి గురయ్యారు. -
కొక్కొక్కో.. కోట్లు
సాక్షి, నెట్వర్క్: తూర్పుగోదావరి జిల్లాలో జూదరాయుళ్లు చెలరేగిపోయారు. సుమారు 400 బరులకు పైగా ఏర్పాటు చేసి పందేలు నిర్వహించారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం నుంచి జూదప్రియులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పండుగ మూడు రోజులు రూ.800 కోట్లకుపైగా కోడి పందేలు జరిగాయని అంచనా. ఒకప్పుడు ఊరి పొలిమేరలకు, కొబ్బరి తోటలకు పరిమితమైన పందేలు ఇప్పుడు మెయిన్ రోడ్లకు దగ్గరగా బహిరంగంగానే సాగాయి. యు.కొత్తపల్లిలో అయితే పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలోనే పందేలు జరిగాయి. డిప్యూటీ సీఎం చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం మండలం ఆర్.బి.కొత్తూరులో పండుగ మూడు రోజులు రూ.5 కోట్ల మేర, పనసపాడు– తిమ్మాపురం సరిహద్దులో రూ.10 కోట్ల మేర, తుని నియోజకవర్గం తేటగుంటలో రూ.మూడు కోట్ల మేర పందేలు నడిచాయి. జగ్గంపేట మండలం మర్రిపాకలో పందేలు చూసేందుకు వచ్చినవారి నుంచి రూ.300 చొప్పున నిర్వాహకులు వసూలు చేయడం గమనార్హం. పందేనికి కనీస ధర రూ.30 వేలుగా నిర్ణయించారు. కిర్లంపూడి, వేళంక, కాట్రేవుల పల్లెలో భారీ పందేలు జరిగాయి. పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే వర్మ సొంత గ్రామం పి.దొంతముర్రులో రూ.మూడు కోట్లు, ఇసుకపల్లి, పిఠాపురంలలో రూ.ఆరు కోట్ల మేర పందేలు సాగాయి. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సుమారు 25 కోట్ల మేర పందేలు జరిగాయని తెలుస్తోంది. అల్లవరం మండలం గోడి, గోడిలంక, అల్లవరం, రెళ్లుగడ్డ, ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లి, చల్లపల్లి, గొల్లవిల్లి, భీమనపల్లిలో అడ్డూ అదుపులేకుండా పందేలు జరిగాయి. కోడి పందేలకు తోడు పలుచోట్ల అశ్లీల నృత్యాలను నిర్వహించారు. డిప్యూటీ సీఎం చినరాజప్ప సొంత మండలం ఉప్పలగుప్తంలో గొల్లవిల్లి, భీమనపల్లిలో అశ్లీల నృత్యాలను నిర్వహించడం గమనార్హం. మినీ స్టేడియాలను తలపించిన బరులు పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందేల కోసం ఏర్పాటు చేసిన బరులతోపాటు వాటి పక్కనే పేకాట శిబిరాలు, మద్యం దుకాణాలు, బెల్టు షాపులు వెలిశాయి. ఫలితంగా బరులు జాతరలను తలపించాయి. జిల్లాలో రూ.700 కోట్ల మేర పందేలు సాగాయి. కోడిపందేలు, పేకాటల్లో రూ.కోట్లు చేతులు మారితే గుండాట, కోతాటల్లో రూ.లక్షలు, రూ.వేలు చేతులు మారాయి. ఒక్కో కోడి పందెం కనీసం రూ.25 వేల నుంచి గరిష్టంగా రూ.25 లక్షల వరకు సాగింది. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది.. నిర్వాహకుల నుంచి భారీగా వసూళ్లు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు మూడురోజులూ పందేలు జరిగే ప్రాంతాల వైపు రాకపోవడం గమనార్హం. బరుల వద్దే మద్యం అమ్మకాలు పెద్ద ఎత్తున జరిగాయి. జిల్లాలో 30 వరకూ పెద్ద బరులు ఏర్పాటు చేయగా.. మరో 200 వరకూ చిన్న బరులు సిద్ధం చేశారు. ఆయా ప్రాంతాల్లో మినీ స్టేడియాలను తలపించేలా భారీ షామియానాలు, వీఐపీ గ్యాలరీలు ఏర్పాటు చేశారు. చింతలపూడి, జంగారెడ్డిగూడెం మండలాల్లో ఏర్పాటు చేసిన పందేలకు తెలంగాణ నుంచి కూడా జూదరులు భారీగా తరలివచ్చారు. లక్షల్లో పందేలు జరిగాయి. కామవరపుకోట మండలం రావికంపాడు అడ్డరోడ్డు వద్ద మంగళవారం రాత్రి కోతాట, గుండాట ఆడుతున్న వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. పోలవరం నియోజకవర్గంలో 7 మండలాల్లో సుమారు 45 బరుల్లో కోడిపందేలు నిర్వహించారు. జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెంలో కోడిపందేల్లో భాగంగా జరిగిన కొట్లాటలో ఇద్దరికి గాయాలయ్యాయి. నరసాపురం నియోజకవర్గంలో విచ్చలవిడిగా కోడిపందేలు, పేకాట, గుండాట సాగాయి. నరసాపురం పట్టణంలో రోడ్డు పక్కన తోపుడుబళ్లపై పెట్టి మరీ గుండాట ఆడించారు. టీడీపీ నేతలు దగ్గరుండి నిర్వహించడంతో పోలీసులు కన్నెత్తి చూడలేదు. మార్టేరులో ఫ్లడ్‌లైట్ల వెలుగులో కోడిపందేలు నిర్వహించారు. తణుకు నియోజకవర్గంలో 16 చోట్ల బరులు ఏర్పాటు చేశారు. విజయవాడలో విచ్చలవిడిగా కోతముక్కాట కృష్ణా జిల్లాలో రూ.500 కోట్ల మేర కోడి పందేలు సాగాయని అంచనా. జిల్లావ్యాప్తంగా బహిరంగంగానే కోడిపందేలు, గుండాట, పేకాట జరిగాయి. కంకిపాడు, ముసునూరు, బాపులపాడు, మచిలీపట్నం, గుడివాడ, నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు, మైలవరం, గన్నవరం, పామర్రు మండలాల్లో భారీ స్థాయిలో కోడి పందేలు నిర్వహించారు. ఎన్నడూ లేనివిధంగా విజయవాడ నగరంలోని ప్రముఖ హోటళ్లలో టీడీపీ నేతల ఆధ్వర్యంలో కోతముక్కాట విచ్చలవిడిగా సాగింది. ఒక్కో కోసుకు రూ.లక్ష చొప్పున పందేలు జరిగాయి. సంక్రాంతి మూడు రోజుల్లో వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అంచనా. గుంటూరు జిల్లాలో కూడా రూ.350 కోట్ల మేర కోడి పందేలను నిర్వహించినట్టు తెలుస్తోంది. రేపల్లె రూరల్ మండలంలోని బొబ్బర్లంక, గుడ్డికాయలలంక, నిర్మల్ నగర్, చెరుకుపల్లి మండలం తూర్పుపాలెం, బలుసులపాలెం, నిజాంపట్నం మండలం అడవులదీవి, దిండి, కొత్తపాలెం, తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలం కొత్తబొమ్మువానిపాలెం పుష్కరఘాట్ల వద్ద అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో పందేలు సాగాయి. కోడి పందేలకు అనుబంధంగా గుండాట, కోతముక్క, చక్రం ఆటలు జరిగాయి. కొత్తబొమ్మువానిపాలెంలో తెనాలి టీడీపీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ దగ్గరుండి మరీ కోడిపందేలు నిర్వహించారు. గతేడాది కోడి పందేల కేసులు కోర్టులో నడుస్తున్న నేపథ్యంలో రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తెరవెనుకే ఉండి ఫోన్ ద్వారా అన్నీ తానై పర్యవేక్షించారు. విశాఖపట్నం జిల్లాలో ఎక్కువగా భీమిలి–విజయనగరం సరిహద్దు ప్రాంతాల్లో కోడి పందేలు సాగగా యలమంచలి, పాయకరావుపేట, అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం నియోజకవర్గాల పరిధిలో మారుమూల ప్రాంతాల్లో పందేలు సాగాయి. జిల్లావ్యాప్తంగా రూ.80 కోట్ల మేర పందేలు కాశారు. విజయనగరం జిల్లాలో జూదంతోపాటు కోడి, పొట్టేలు పందేల కోసం రూ.70 కోట్ల వరకు ఖర్చు చేశారు. పోలీసులపై టీడీపీ ఎమ్మెల్యే చిందులు ‘ఏం తమాషాగా ఉందా? కోళ్లు ఎలా పట్టుకెళతావు? కోళ్లకు కత్తులేమైనా కట్టామా? జూదమేమైనా ఆడిస్తున్నామా? మీరు వాంటెడ్‌గా చేస్తున్నారు.. చాలా ఎగస్ట్రాలు చేస్తున్నారు. పో... వెళ్లిపో.. మీ డీఎస్పీని రమ్మను’ అంటూ గుంతకల్లు టూటౌన్ ఏఎస్ఐ తిరుపాల్‌పై అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ చిందులు తొక్కారు. బుధవారం పాత గుంతకల్లు ఏరియా అంకాలమ్మ ఆలయ సమీపంలోని పార్కులో సంక్రాంతి సంబరాల్లో భాగంగా స్థానిక టీడీపీ నేతలు కొందరు కోడి పందేలు నిర్వహించారు. ఈ సమాచారం టూటౌన్ పోలీసులకు చేరడంతో ఏఎస్ఐ తిరుపాల్, కానిస్టేబుల్ శ్రీనివాసులు, ఇతర పోలీసు సిబ్బంది ఘటన స్థలానికి వెళ్లి కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. పందేపు కోళ్లను స్టేషన్‌కు తరలిస్తుండగా.. ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ అడ్డుకొని పోలీసు సిబ్బందిపై బూతు పురాణం అందుకున్నారు. ‘ఏం తమాషాలు చేస్తున్నారా? సంప్రదాయాలను కాపాడాల్సిందిపోయి అడ్డుకుంటారా?’ అంటూ కోపంతో ఊగిపోయారు. పోలీసుల నుంచి బలవంతంగా కోళ్లను తీసుకుని మళ్లీ పందేలు నిర్వహించడం గమనార్హం. -
కోఢీ అంటే ఢీ
సాక్షి, అమరావతి: కత్తులు కట్టిన కోళ్లు బరిలోకి దిగాయి. మొదటిరోజే ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రూ.350కోట్లకు పైగా చేతులు మారాయి. ఈ ఏడాది పశ్చిమ గోదావరి జిల్లాను తలదన్నే రీతిలో కృష్ణా జిల్లాల్లోనూ వందలాది బరుల్లో వేల సంఖ్యలో పందేలు సాగాయి. ఆడా..మగా, చిన్నా..పెద్దా అనే తేడా లేకుండా కోడి పందేలు చూసేందుకు జనం ఎగబడ్డారు. కత్తి కట్టి పందేలు వేయవద్దని, డింకీ పందేలు వేసుకోవచ్చని పోలీసులు చేసిన సూచనలను బేఖాతరు చేస్తూ డింకీ పందేలే అంటూ టీడీపీ నేతల దన్నుతో కత్తులు కట్టి నిర్వహించారు. అమెరికాలోని లాస్ వేగాస్‌లో ప్రసిద్ధి చెందిన క్యాసినో జూదాన్ని ఈసారి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఉభయ గోదావరి జిల్లాలను సైతం తలదన్నేలా రాజధాని ప్రాంతమైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో బరులు ఏర్పాటుచేసిన టీడీపీ నేతలు పందేల నిర్వాహకుల అవతారమెత్తారు. బెట్టింగ్‌లపై వచ్చే లక్షలాది రూపాయల కేవుల్ (నిర్వహణ వాటా) కోసం వారు కోడి పందేల నిర్వాహణకు క్యూకట్టారు. ఈసారి పోలీసులకు మామూళ్లు ఇచ్చే అవసరంలేకపోవడంతో మొత్తం మిగుల్చుకునేందుకు టీడీపీ నేతలు పోటీపడ్డారు. భీమవరం మండలంలోని ఓ గ్రామంలో గుండాట నిర్వహణకు బరి ఏర్పాటు చేసిన కోడిపందేల నిర్వాహకులకు రూ.72 లక్షలు ముట్టజెప్పేలా ఒప్పందం చేసుకున్నారంటే జూదం ఏ స్థాయిలో జరుగుతోందో అర్థంచేసుకోవచ్చు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో బరులు ఏర్పాటుచేయగా.. వాటి పక్కనే పేకాట, కోతాట, గుండాట తదితర జూద కేంద్రాలనూ పెద్ద సంఖ్యలోనే ఏర్పాటు చేశారు. తూ.గో. జిల్లా అచ్చంపేట బరిలో తలపడుతున్న పందెం కోళ్లు పెదగరువులో క్యాసినో..: అమెరికాలోని లాస్వేగాస్లో ప్రసిద్ధి చెందిన క్యాసినో జూదాన్ని ఈసారి సంక్రాంతికి పశ్చిమగోదావరి జిల్లా పెదగరువులో ప్రవేశపెట్టారు. దేశంలోని మెట్రో నగరాలకే పరిమితమైన దీనిని ఈసారి మూడు బస్సుల్లో ఇక్కడ నిర్వహించారు. పైకి టూరిస్టు బస్సులా కన్పించే వీటిలో క్యాసినో నిర్వహణకు ప్రత్యేక సెట్టింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనేందుకు విదేశీయులతోపాటు దేశంలోని పలు మెట్రో నగరాలకు చెందిన జూదరులు అతిథులుగా వచ్చినట్టు తెలిసింది. ఒక్క సోమవారం నాడే ఈ ఆటలో సుమారు రూ.60 కోట్లు చేతులు మారినట్టు సమాచారం. టీడీపీ నేతల కనుసన్నల్లో.. - పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం కొప్పాకలో ఎమ్మెల్యే చింతమనేని, ఉండి నియోజకవర్గంలో కనుమూరు రఘురామకృష్ణంరాజు ప్రారంభించారు. - కాళ్ళ మండలం సీసలిలో ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు పందేలు ప్రారంభించారు. - పాలకొల్లు మండలం పూలపల్లిలో ఏఎంసీ చైర్మన్ గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు నేతృత్వంలోనూ, ఏఎంసీ మాజీ చైర్మన్ చెరుకూరి పండురాజు ఆధ్వర్యంలోనూ కోడిపందేలు జరిగాయి. - కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ దగ్గరుండి మరీ నిర్వహించారు. - గుంటూరు జిల్లా తెనాలి వద్ద స్థానిక ఎస్ఐ కోడి పందేల టెంట్లను తొలగించడంతో టీడీపీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ స్వయంగా అక్కడకు వెళ్లి పందేలు దగ్గరుండి మరీ నిర్వహించారు. పందేలకు తెలంగాణ ప్రముఖులు ఏటా రాష్ట్రంలో జరిగే కోడి పందేలను తిలకించేందుకు తెలంగాణ నుంచి వచ్చే ప్రజాప్రతినిధులు ఈసారీ పలువురు వచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, ఏలూరులో నిర్వహించిన కోడి పందేలకు హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, కూకట్పల్లి ఎమ్మెల్యే ఎం.కృష్ణారావులు హాజరు కాగా.. కృష్ణాజిల్లా కొత్తూరులో పందేలకు ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రకాష్‌గౌడ్, నాగేశ్వరరావులతోపాటు సినీనటులు శివారెడ్డి, జబర్దస్త్ నటులు వేణు, రాకేష్ తదితరులు హాజరయ్యారు. నాలుగు జిల్లాల్లో 700కు పైగా బరులు ఉభయ గోదావరి జిల్లాల్లో సోమవారం 600 వరకు బరుల్లో పందేలు జరిగినట్లు సమాచారం. అలాగే, కృష్ణాలో ఈసారి రికార్డు స్థాయిలో 210కి పైగా బరుల్లో నిర్వహించారు. విజయవాడ భవానీపురంలో జరుగుతున్న కోడి పందేలను పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. కత్తులు కట్టకుండా డింకీ పందేలు నిర్వహించుకోవచ్చని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. గుంటూరు జిల్లాలోను దాదాపు 150 బరుల్లో పందేలు జరిగాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోను కొనసాగాయి. కాగా, మొదటి రోజే కోడి పందేలు, జూదాల్లో సుమారు రూ.350 కోట్లకు పైగా చేతులు మారినట్లు అంచనా. జిల్లాల్లో జోరుగా.. నిన్నటి వరకూ ఉక్కుపాదం మోపిన పోలీసులు.. వాటిని చూసీచూడనట్లు ఉండాలని సర్కారు నుంచి లోపాయికారిగా వచ్చిన సంకేతాలతో సోమవారం సైలెంట్ అయిపోయారు. దీంతో కోడి పందేల నిర్వాహకులు చెలరేగిపోయారు. - పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల చేతుల మీదుగా కోడిపందేలు ప్రారంభమయ్యాయి. వీటిని చూసేందుకు భారీ స్క్రీన్లు ఏర్పాటుచేశారు. రాత్రి వేళల్లోనూ పందేలు సాగించడానికి చాలా బరుల్లో ఫ్లడ్‌లైట్లు ఏర్పాటుచేశారు. లక్ష్యణేశ్వరంలో యాంకర్ శ్రీముఖి, జబర్దస్త్ నటులతో ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. మొగల్తూరులో సాక్షాత్తు తహసీల్దార్ కార్యాలయం పక్కనే బరి ఏర్పాటుచేశారు. ఈ జిల్లాలో తొలిరోజు రూ.120కోట్లకు పైగా పందేలు జరిగినట్లు సమాచారం. - ‘తూర్పు’లో గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పందేల సంఖ్య రెట్టింపయింది. సోమవారం ఒక్క రోజే జిల్లావ్యాప్తంగా రూ.100 కోట్ల మేర పందేలు జరిగాయని అంచనా. మంగళ, బుధవారాలు సంక్రాంతి, కనుమ రోజున పందేలు ఎక్కువుగా జరగనున్నట్టు అంచనా. జిల్లాలో సుమారు 400కు పైగా బరిలు వెలిశాయి. సాక్షాత్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న పెద్దాపురం, సొంత నియోజకవర్గం అమలాపురాల్లోనే పందేలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. - కృష్ణా జిల్లాలో కంకిపాడు, బాపులపాడు, ముసునూరు, కైకలూరు, జగ్గయ్యపేట, మచిలీపట్నం, గుడివాడ మండలాల్లో రూ.70–80 కోట్ల మేర కోడిపందేలు జరిగాయి. కంకిపాడు మండలం ఈడుపుగల్లులో పందేలు హోరెత్తాయి. ఇక్కడ ఒక్కచోటే రూ.15 కోట్ల మేర పందేలు జరిగినట్లు తెలుస్తోంది. - గుంటూరు జిల్లాలోనూ అనేక ప్రాంతాల్లో కోడిపందేల బరులు ఏర్పాటు చేశారు. రేపల్లె నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో కోడి పందేలు నిర్వహించారు. - విశాఖపట్నం జిల్లాలో సోమవారం అక్కడక్కడ జరిగాయి. మంగళ, బుధవారాల్లో విస్తృతంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. జిల్లాల్లోని పాయకరావుపేట, నర్సీపట్నం, యలమంచిలి, అనకాపల్లి, చోడవరం, భీమిలి, గాజువాక నియోజకవర్గాల్లో ఏటా కోడి పందేలు నిర్వహిస్తుంటారు. -
కోడి పందేల వెల రూ.2 వేల కోట్లు
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్ : సంక్రాంతి పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా కోడిపందేల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఎన్ని ఆంక్షలు పెట్టినా రాజకీయ అండతో ఈసారి కూడా నిర్వాహకులు మరింతగా ‘బరి’తెగిస్తున్నారు. రూ.రెండు వేల కోట్లకు పైగా ఈ ఏడాది పందేలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం ఎన్నికల ఏడాది కావడంతో ఇందుకు ఎంతో ముందు నుంచే వీటికి కసరత్తు జరిగింది. పోలీసులూ చూసీచూడనట్లు ఉండాలని వారికి లోపాయికారిగా సంకేతాలు అందాయి. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పలువురు మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీఎత్తున కోడిపందాలను ప్రోత్సహిస్తున్నారు. కాగా, ఎప్పటిలాగే ఈసారి కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఈ పందేలకు ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ వంటి పోటీలు అని చెప్పి బరులు పెద్దఎత్తున సిద్ధంచేశారు. పందేలు సోమవారం నుంచి ప్రారంభమవుతుండడంతో కోళ్ల గ్రేడింగ్ పూర్తిచేసి పందేలకు అర్హత కలిగిన పుంజులను ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఆయా ప్రాంతాలకు తరలించారు. ఈసారి రూ.2వేల కోట్లు టార్గెట్ కోడి పందేలతో పాటు బరుల పక్కనే పెద్దఎత్తున జూదం జరుగుతుంటుంది. పేకాట, కోతాట, గుండాటల్లో పెద్ద మొత్తాల్లో చేతులు మారుతుంది. ఇలా గతేడాది దాదాపు రూ.వెయ్యి కోట్ల మేర చేతులు మారినట్టు అంచనా. ఈసారి పెద్దగా పోలీసుల ఆంక్షలు లేకపోవడంతో ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలకు కోడి పందేలు, జూదాన్ని బాగా విస్తరించారు. ప్రధానంగా ఒక్కో జిల్లాలో కనీసం భారీ పందేలు వేసేలా 15 పెద్ద బరులు, చిన్నపాటి పందేలు వేసుకునేలా 600 నుంచి 800 బరులు సిద్ధమయ్యాయి. చిన్నపాటి పందాల్లో కనీసం రూ.5 వేల నుంచి లక్ష వరకు పందెం ఒడ్డుతుంటారు. అదే భారీ పందేల్లో అయితే కనీసం రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు బెట్టింగ్ వేస్తుంటారు. దీనికితోడు పుంజులను బరిలో దింపిన వారు తమ పుంజు నెగ్గుతుందని నేరుగా బెట్టింగ్ వేస్తే.. చుట్టూ చేరిన వారు పైపందేలు కాస్తుంటారు. ఒక్కో పందెంలో నేరుగా రూ.5 వేల నుంచి రూ.5 లక్షల వరకు పందెం వేస్తే దానికి పైపందేలు రూ.లక్ష నుంచి రూ.50 లక్షల వరకు జరుగుతుంటాయి. ఈ లెక్కన ఒక్కో బరిలో రోజుకు కనీసం 15 కోడి పందేలను వేస్తుంటారు. అదే సంక్రాంతి రోజైతే 24గంటలూ పందేలు వేస్తారు. దీంతో ఒక్కో బరిలో మూడు రోజుల్లో దాదాపు 60 పందేలు వేస్తుంటారు. దీనికితోడు పేకాట, కోతాట, గుండాట ఫలితాలు నిమిషాల్లో తేలిపోతుంటాయి. వాస్తవానికి కోడి పందాల కంటే జూదంలోనే పెద్దఎత్తున మొత్తాలు చేతులు మారుతుంటాయి. ఈ లెక్కన గతేడాది రాష్ట్రంలో దాదాపు రూ.వెయ్యి కోట్లు చేతులు మారితే ఈ ఏడాది రూ.1,500 నుంచి రూ.2 వేల కోట్లు మారుతుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. గ్రేడింగ్ ఇలా.. పందేలకు ఇక ఒకరోజే సమయం ఉండడంతో పెంపకం స్థావరాల్లో కోడి పుంజులకు గ్రేడింగ్ పూర్తిచేసి పందెం బరులకు తరలించారు. తొలుత డింకీ పందెం వేస్తారు. అందులో పందెం పుంజు తన ప్రత్యర్థి పుంజుపై నిమిషానికి నాలుగుసార్లు చొప్పున దాడిచేసి వరుసగా రెండు డింకీ పందేలలో ప్రతిభ చూపితే ఆ పుంజు మొదటి శ్రేణి పుంజుగా పరిగణిస్తారు. ఈ రకం పుంజు ధర రూ.1.50 లక్షలు ఉంటుంది. సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఎన్నికల సంవత్సరం కావడంతో రాజకీయంగా రాణించాలంటే కోడి పందేలకు అడ్డంకులు చెప్పకూడదని పలు జిల్లాల నేతలు ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చారు. దీంతో సర్కారు వీరికి లోపాయికారిగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతేడాది కోడి పందాలు అడ్డుకుంటామంటూ నెలరోజుల ముందు నుంచే పోలీసులు హెచ్చరికలు చేయడంతోపాటు ముందస్తు దాడులు, కత్తులు కట్టే వారిపై బైండోవర్ కేసులు పెట్టి కట్టడిచేసే ప్రయత్నాలు చేశారు. అయినా, పందేలు ఆగకపోవడంతో పోలీసులు, అధికారులు న్యాయస్థానానికి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. వాటిని ఎందుకు అడ్డుకోలేకపోయారో వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర హైకోర్టు ఆదేశించడంతో డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోర్టుకు హాజరయ్యారు. తాజాగా, విజయవాడలో హైకోర్టు కార్యకలాపాలు మొదలవడంతో ఈ విషయంలో న్యాయస్థానం ఎలా స్పందిస్తుందోనని నిర్వాహకుల్లో టెన్షన్ నెలకొంది. తోటల్లో బరులు.. అక్కడే అన్ని ఏర్పాట్లు ఇదిలా ఉంటే.. కోడి పందేల నిర్వహణకు మామిడి తోటలు, కొబ్బరి తోటలు, ఇతర పండ్ల తోటలను నిర్వాహకులు లీజుకు తీసుకుంటున్నారు. ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు, ఇతర ముఖ్యమైన వారి కోసం బరుల వద్దే మద్యం విక్రయాలు ఏర్పాటుచేస్తున్నారు. కోడి పందేల బరులకు ఆనుకుని పేకాట, కోతాట, గుండాట వంటి జూదాల నిర్వహణకు కూడా రంగం సిద్ధమైంది. ఈ జూదాల్లో కేవుల్ (నిర్వహణ వాటా) వల్ల పెద్ద మొత్తాల్లో ఆర్థిక లాభం ఉండటంతో వీటి నిర్వహణకు గ్రామ, పట్టణాల్లో తీవ్ర పోటీ నెలకొంది. విదేశాల నుంచీ రాక మరోవైపు.. సంక్రాంతి పండుగ కోసం అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో స్థిరపడిన వారు సైతం సొంతూళ్లకు వస్తుండగా పందేల్లో పాల్గొనేందుకు వారు ఇప్పటికే స్థానిక బ్యాంకుల్లోని తమ ఖాతాల్లోకి నగదును బదిలీ చేసేశారు. పురుషులకు తామేమీ తీసిపోమంటూ మహిళలు, యువతులు కూడా పందేలకు వస్తున్నారు. కోనసీమలోని దిండి పరిసర రిసార్ట్స్లతోపాటు పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని హోటళ్లు నెలరోజుల కిందటే బుక్ అయిపోయాయి. అమరావతి, విజయవాడ, రాయలసీమ ఉత్తరాంధ్రలతోపాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, నాగపూర్, భువనేశ్వర్, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచీ కూడా పందెం రాయుళ్లు చేరుకుంటున్నారు. ‘పశ్చిమ’లో అయితే పర్యాటక ఏజెంట్లు ప్రైవేటు నివాస గృహాలను కూడా సంప్రదిస్తున్నారు. ఒక మడత మంచం వేస్తే సాధారణ తాటాకు ఇల్లు కూడా స్టార్ హోటల్ రూమ్ ధర పలుకుతుందని ఒక పర్యాటక ఏజెంట్ ‘సాక్షి’కి చెప్పారు. మొక్కుబడిగా దాడులు.. కోడి పందాలకు కేంద్రంగా చెప్పుకునే ఉభయగోదావరి జిల్లాల్లో గడిచిన రెండు రోజులుగా పోలీసులు మొక్కుబడిగా దాడులు నిర్వహిస్తున్నారు. పలు ప్రాంతాల్లో బరులను ధ్వంసం చేసిన పోలీసులు కోడి పుంజులకు కత్తులు కట్టే వారిపై బైండోవర్ కేసులు పెట్టారు. అయితే, రాజకీయ అండదండలున్న వారు పోలీసులకు ఎదురు తిరుగుతున్నారు. ఎటువంటి హెచ్చరికలు లేకుండా ఈ దాడులేంటని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఒక పోలీసు అధికారిని నిర్వాహకులే నిలదీశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కోనసీమ పుంజులకు అత్యధిక ధర కోడి పందేల్లో కోనసీమ పుంజులకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి వాతావరణంలో పెరిగిన పుంజులు పందేలలో రాణిస్తాయన్న నమ్మకం ఉంది. పెంపకం, తర్ఫీదు కూడా అదేస్థాయిలో ఉంటుంది. ప్రస్తుత సంక్రాంతికి పందెం రాయుళ్ళు కోనసీమ పుంజులపై అత్యధికంగా నగదు పెట్టారని సమాచారం. ఈసారి కోనసీమ పుంజు ఏకంగా రూ.1.50 లక్షల ధర పలికింది. ఈ ధరకు సుమారు 300లకుపైగా పందెం పుంజులు పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లినట్లు తెలిసింది. లక్షా యాభై వేలలోపు ధరలున్న పుంజులు కూడా అధికంగా అమ్ముడయ్యాయి. టీడీపీ నేతల అండదండలతో.. - రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేల అండదండలతో అనేకచోట్ల బరులు సిద్ధంచేశారు. - కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లులో అధికార పార్టీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అనుచరులు 10 ఎకరాలను చదును చేసి బరిని సిద్ధంచేశారు. - ఇదే జిల్లా గొడవర్రు గ్రామంలో ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అనుచరులు కూడా ఆరు ఎకరాల్లో బరిని ఏర్పాటుచేశారు. - అలాగే, బాపులపాడు మండలం అంపాపురంలోనూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు బరి ఏర్పాటుచేశారు. అంతేకాక, కొత్తూరు తాడేపల్లి, గుడివాడ, పామర్రు, కైకలూరు, మైలవరం మండలాల్లో అధికార పార్టీ నేతల అండదండలతో బరులు సిద్ధం చేశారు. - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అనుచరులు ఐదు మండలాల్లో బరులను ఏర్పాటుచేస్తున్నారు. - ఇక గుంటూరు జిల్లాలో ఆదివారం నుంచే పందేలకు తెరలేపారు. రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో అనేక ప్రాంతాల్లో ఒక్కరోజే కోటికి పైగా చేతులు మారినట్లు సమాచారం. జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎంపీ డైరెక్షన్లో పెద్దఎత్తున బరులు ఏర్పాటుచేశారు. - విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఆరిలోవలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మూడేళ్లుగా పందేలు నిర్వహిస్తున్నారు. - తూర్పు గోదావరి జిల్లాలో హోంమంత్రి చినరాజప్ప సొంత ఇలాకా పెద్దాపురం నియోజకవర్గంలోనే భారీఎత్తున పందేలకు ఏర్పాట్లుచేశారు. అలాగే, ఆర్థికమంత్రి యనమల ఇలాకా తునిలోని తేటగుంటలో పెద్ద పందేలకు రంగం సిద్ధం చేశారు. -
సంప్రదాయం ముసుగులో జూదమా?
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో కోడిపందేలను సంప్రదాయం ప్రకారం కాకుండా జూదంగా మార్చేశారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. మంగళవారం ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘కోట్ల రూపాయల మేర కోడి పందేల రూపంలో చేతులు మారాయి. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంమ్మెల్సీలే స్వయంగా ఈ జూదంను ప్రోత్సహించడం దారుణం. ముఖ్యమంత్రి, హోంమంత్రి కూడా పోలీసులను చూసిచూడనట్లు వ్యవహరించాలని సూచించడం వల్లే ఈ జూదం నడిచింది. పేకాట, గుండాట, బెల్ట్ షాపులు, కత్తులు కట్టి కోడిపందేలు జరుగుతూ ఉంటే పోలీసులు ఎందుకు స్పందించడం లేదు. అధికార పార్టీ నేతలు సంప్రదాయం ముసుగులో వేలకోట్లు చేతులు మారేలా చేస్తున్నారు. చాటుమాటుగా జరిగే జూదం నేడు కార్పొరేట్ స్థాయికి అధికార పార్టీ నేతలు తీసుకువెళ్లారు. ఎంపీ మాగంటి బాబు ఏర్పాటు చేసుకున్న టీడీపీ కార్యాలయాన్ని పేకాట కేంద్రంగా మార్చేశారు. ప్రజల బలహీనతను సొమ్ము చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధపడటం దారుణం. కోడిపందేల శిబిరాల్లో అశ్లీల నృత్యాలు, బెల్ట్ షాపులు, పలావు సెంటర్లు ఏర్పాటు చేశారు. వీటిని పెట్టుకున్నందుకు టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు డబ్బులు వసూలు చేయడం సిగ్గుచేటు. కొన్నిచోట్ల అశ్లీల నృత్యాలు చేయించారు. న్యాయస్థానాలు అంటే తెలుగుదేశం పార్టీ నేతలకు గౌరవం లేదా? ఇక హోంమంత్రి సొంత నియోజకవర్గంలోనే కత్తులతో కోడి పందేలు, జూదం జరుగుతోంది. ఇక పోలీసులు ఏం చేయగలరు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకే ఈ అరాచకం జరుగుతోంది. ఇక రాష్ట్రంలో చట్టాలు, సంప్రదాయాలు ఎందుకు?. ఇది సమాజానికి ప్రమాదకరం. క్రికెట్ పిచ్‌ల మాదిరిగా కోడిపందేల బరులు సిద్ధం చేశారు. ఫ్లడ్ లైట్ల వెలుగులో పందేలు నిర్వహించారు. ప్రజల బలహీనతలను పెంచేలా సాక్షాత్తూ ప్రజాప్రతినిధులే ప్రవర్తిస్తే ఎలా?. కోడి పందేల పేరుతో సామాన్యుడి జీవితాలతో ఆటాడుకుంటారా?. జూదాన్ని ప్రోత్సహించేవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. అమాయకుల జీవితాలతో ఆడుకోవద్దు’ అని అంబటి సూచించారు. -
కత్తులు దూసిన పందెం కోళ్లు
సాక్షి, అమరావతి : కోర్టు ఓడిపోయింది. కోడే గెలిచింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ పలుచోట్ల కోళ్లకు కత్తులు కట్టి మరీ భారీగా పందేలు నిర్వహిస్తున్నారు. ఆదివారం భోగి పండుగ సందర్భంగా తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో బరులు ఏర్పాటు చేశారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలే బరుల నిర్వాహకులు కావడంతో అధికార యంత్రాంగం, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. కోడిపందేలు, పేకాట శిబిరాల్లో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందని అంచనా వేస్తున్నారు. భోగి పండుగ రోజే దాదాపు రూ.200 కోట్లు చేతులు మారాయని అంటున్నారు. కర్ణాటక, తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో పందెంరాయుళ్లు తరలిరావడంతో విజయవాడలోని హోటళ్లు, లాడ్జిలు రద్దీగా మారాయి. బరిలో టీడీపీ ప్రముఖులు అధికారపార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు దగ్గరుండి మరీ కోడిపందేల బరులు నిర్వహించారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో మంత్రి అయ్యన్నపాత్రుడు పందేలను ప్రారంభించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురంలో కోడి పందేలను ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రారంభించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగొలనులో పందేలను ఎమ్మెల్యే గన్నివీరాంజనేయులు ప్రారంభించారు. ఏలూరు నియోజకవర్గంలో జాలిపూడి, గుడివాకలంక, శ్రీపర్రు గ్రామాల్లో టీడీపీ నాయకులు కొత్త బరులు ఏర్పాటు చేశారు. పెనమలూరు నియోజకవర్గం ఈడుపుగల్లులో పందేలను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఇక్కడే పొట్టేళ్ల పందేలు కూడా జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా మురమళ్లలో పందేలను ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఆరంభించారు. గుంటూరుజిల్లా చెరుకుపల్లి మండలంలో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో బరులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ పందేలకు తెర తీశారు. జిల్లాల్లో పందేల జోరు.. కోర్టు నిషేధం ఉన్నప్పటికీ ఈ ఏడాది భారీ స్థాయిలో బరులు ఏర్పాటుచేశారు. గత ఏడాది నిర్వహించిన ప్రాంతాలలో కాకుండా చాలా చోట్ల ఈ సారి కొత్త ప్రాంతాలలో బరులు ఏర్పాటు చేయడం విశేషం. పశ్చిమగోదావరి జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం వరకు కోడిపందేలను అడ్డుకునేందుకు పోలీసులు శతవిధాలా యత్నించారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాల మేరకు ఆదివారం మధ్యాహ్నం నుంచి జిల్లా వ్యాప్తంగా కోడిపందేలు మొదలయ్యాయి. యలమంచిలిలోని గుంపర్రులో పందేలను తిలకించేందుకు పలువురు సినీ కమెడియన్లు వచ్చారు. ఏలూరు నియోజకవర్గంలో జాలిపూడి, గుడివాకలంక, శ్రీపర్రు గ్రామాల్లో టీడీపీ నాయకులు కొత్త బరులు ఏర్పాటు చేశారు. దెందులూరు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లోనూ పలుచోట్ల పందేలు జరుగుతున్నాయి. భీమవరం నియోజకవర్గంలో వెంప, వీరవాసరం, నౌడూరు, కొణితివాడ, మత్స్యపురి గ్రామాల్లో కోడి పందేలు నిర్వహిస్తున్నారు. కొవ్వూరు, పాలకొల్లు, ఉండి, చింతలపూడి, ఆచంట, నరసాపురం, గోపాలపురం, తణుకు నియోజకవర్గాల్లో భారీగా పందేలు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం తూర్పుపాలెం గ్రామంలో 30 ఎకరాల భూమిలో భారీ స్థాయిలో బరి ఏర్పాటు చేసి పందేలు చేపట్టారు. కోడిపందేలతో పాటు గుండాట, కోత ముక్క వంటి జూదాలు కూడా నిర్వహించారు. డబ్బు బయటికి కనబడకుండా పందేల వద్ద కాయిన్ విధానం ప్రవేశపెట్టారు. తొలుత కత్తులు లేకుండా పోటీలు ప్రారంభించి.. అనంతరం కత్తులు కట్టి యథావిధిగా పందేలు నిర్వహించారు. సెల్ ఫోన్లలో పందేల నిర్వహణను ఫొటోలు తీయకుండా నియంత్రించేందుకు దాదాపు 200 మంది పార్టీ కార్యకర్తలను నియమించారు. విజయవాడ శివారు ప్రాంతంమైన పెనమలూరు నియోజకవర్గంలో ఈడ్పుగల్లు వద్ద భారీ బరిని నిర్వహించారు. ఇదే నియోజకవర్గంలో దాదాపు 10చోట్ల బహిరంగంగా బరులు ఏర్పాటు చేశారు. ఇక్కడ కోడిపందేలు, గొర్రెపొట్టేళ్ల పందేలు, జూదం శిబిరాలు యథేచ్ఛగా నిర్వహించారు. ఈడ్పుగల్లులో జరిగిన పొట్టేళ్లు, కోడిపందేలకు హైదరాబాద్, తెలంగాణా, కర్ణాటక నుంచి గొర్రెపొట్టేళ్లు, కోళ్లతో పందెందారులు తరలివచ్చారు. కోస్తా జిల్లాల నుంచి కూడా కోడి పందెం దారులు తరలివచ్చారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గంలో గోడి, రాజానగరం నియోజకవర్గంలో పుణ్యక్షేత్రం, దివాన్‌చెరువు, రాజోలు నియోజకవర్గంలో మలికిపురం, లక్కవరం, రాజోలు, చింతలపల్లిలో జరిగాయి. ఏజెన్సీలోని రంపచోడవరం, మెట్టలోని తుని, ఏలేశ్వరం, ప్రత్తిపాడు, పిఠాపురం నియోజకవర్గాల్లో పందేలు జోరుగా సాగాయి. కోట్లలో పందేలు ఆదివారం భోగి పండుగ సందర్భంగా కోడిపందేలు, పేకాటలలో దాదాపు రూ. 200 కోట్ల మేర డబ్బు చేతులు మారిందని వినిపిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరిగిన కోడిపందేలు, జూదంలో రూ. 150కోట్లు చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో తొలి రోజు రూ.30 కోట్లు, తూర్పు గోదావరిలో రూ.20 కోట్ల మేర పందేలు సాగినట్లు అంచనా. విశాఖలో రూ. 3 కోట్లు, విజయనగరం జిల్లాలో రూ.2 కోట్ల మేర పందేలు సాగాయని అంచనా వేస్తున్నారు. -
కోడి పందేలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
కాలు దువ్వుతున్న నేతలు..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘సంక్రాంతికి కోడిపందేలు వేయొద్దని ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, డీజీపీలపై చర్యలు తప్పవు. అధికారులు ఎంత చిత్తశుద్దితో పనిచేస్తారో చూస్తాం’’ అని హైకోర్టు హెచ్చరించినా అధికారపార్టీ నేతలకు, ప్రజాప్రతినిధులకు చీమకుట్టినట్టయినా లేదు. పందెం కోళ్లను సిద్ధం చేశారు. బెట్టింగులకు కోట్ల కొద్దీ డబ్బు రెడీ చేశారు. పందేలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసేశారు. దీంతో అధికారులు వణికిపోతున్నారు. ఒకవైపు కోర్టు హెచ్చరికలు, మరోవైపు అధికార పార్టీ నేతల దూకుడుతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. గత ఏడాది జరిగిన పందేలపైనే కోర్టు సీరియస్ కావడంతోపాటు తహసీల్దార్లు, ఎస్సైలపై ఏం యాక్షన్ తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించింది. తాజాగా కొందరు నేతలు దీనిపై సుప్రీంను ఆశ్రయించడం, కోర్టు తీర్పు ఎలా ఉన్నా పందేలకు సన్నాహాలు జరుగుతుండడంతో తాము బలిపశువులుగా మారతామన్న ఆందోళన మండల స్థాయి అధికారుల నుంచి వ్యక్తం అవుతోంది. గతంలో ఉభయ గోదావరి జిల్లాలకే పరిమితమైన ఈ పందేలు ఇప్పుడు శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకూ విస్తరించాయి. గత ఏడాది కోడిపందేలలో రూ.200 కోట్ల వరకు చేతులు మారగా ఈసారి రెట్టింపుకన్నా ఎక్కువే ఉండవచ్చని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాకే పెరిగిన పందేలు.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విష సంస్కృతి పెచ్చుమీరిపోయింది. దీంతో మూడేళ్లుగా వరుసగా హైకోర్టు జోక్యం చేసుకోవడం.. అయినా పండగ మూడు రోజులు ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలతో కోడి పందేలు నిర్వహించడం ఆనవాయితీగా మారిపోయింది. అయితే ఈసారి హైకోర్టు ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందించడం, కోడిపందేలు జరిగితే డీజీపీతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బాధ్యులుగా చేస్తామని హెచ్చరించడంతో అధికారుల్లో కలకలం మొదలైంది. కోడిపందేలు నిర్వహించే మండలాల్లో రెవెన్యూ, పోలీసు, స్వచ్ఛంద సేవాసంస్థల బృందాలతో కమిటీలు వేశారు. గత ఏడాది పందేలు నిర్వహించిన ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. గోదావరి జిల్లాల్లో సుమారు ఎనిమిది వందల మందిపై బైండోవర్ కేసులు పెట్టారని, కత్తులు కూడా స్వాధీనం చేసుకున్నారని వినిపిస్తోంది. అయితే చివరినిమిషంలో ఏమైనా జరగవచ్చని, పందేలను నిర్వహించేలా ప్రభుత్వ పెద్దల నుంచి మళ్లీ ఆదేశాలు రావచ్చని అధికారపార్టీనేతలు ధీమాగా ఉన్నారు. సిద్ధమౌతున్న బరులు.. ఆందోళనలో అధికారులు.. కోర్టు ఆంక్షలు, అధికారుల హడావిడి నేపథ్యంలో పందెంరాయుళ్లు ఈసారి కొత్త ప్రాంతాల్లో ఈ పందేలు నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నారు. కృష్ణాజిల్లా ముసునూరులో బరులను ట్రాక్టర్లతో దున్నించారు. వాటిని ఎలా ఆపాలో తెలియక అధికారులు సతమతమవుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 2016లో తాము ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయని 43 మంది తహసీల్దార్లు, 49 మంది ఎస్హెచ్ఓలపై ఏం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఇప్పటికే కోర్టు ఆదేశించింది. వెంప గ్రామానికి చెందిన కలిదిండి రామచంద్రరాజు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. ఈ నెల 29కి వాయిదా వేయడంతో ఈలోపు కోడిపందేలు జరిగితే తాము బలిపశువులుగా మారతామనే భయం మండలస్థాయి అధికారుల్లో కనపడుతోంది. కొంతమంది అధికారులు సెలవుపై వెళ్లేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేసి తమను తాము కాపాడుకుంటున్నారని, తమ పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు కోడి పందేలను నిర్వహించి తీరుతామని చెబుతుండగా, బీజేపీ నేత రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే పండుగ మూడురోజులు పందేలు నిర్వహించుకుందామని తమ నేతలకు చెబుతున్నారు. ఒక ఎమ్మెల్యే అయితే ‘మా తోటలోనే వేస్తాను. ఎవరు అడ్డువస్తారో చూద్దాం’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. కోళ్లకు సహజంగానే ఎదురుపడితే కొట్టుకుంటాయని, వాటిని ఎలా ఆపగలమని ప్రభుత్వ విప్ చింతమనేని అంటున్నారు. గతంలో ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణాలో మెట్టప్రాంతానికి పరిమితం అయిన ఈ పోటీలు ఇప్పుడు ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయి. అ«ధికార పార్టీ నేతల పుణ్యమా అని విశాఖపట్నంలో కూడా మూడేళ్లుగా కోడి పందేలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. పందేలు ఎక్కడెక్కడ? విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు రెండేళ్లుగా ఆరిలోవ సమీపంలోని ముడసర్లోవలో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా ముడసర్లోవ రిజర్వాయరు వెనుక రామకృష్ణాపురం సమీపంలో జీవీఎంసీ ఖాళీ స్థలంలో కోడి పందేలు నిర్వహించడానికి రామకృష్ణబాబు అనుచరులు సన్నాహాలు చేస్తున్నారు. కృష్ణాజిల్లాలో పెడన నియోజకవర్గంలోని కొంకేపూడి, నందమూరు, పుల్లపాడు, కాకర్లమూడి, బందరు రూరల్ మండలంలోని కానూరు, గోపువానిపాలెం, మేకవానిపాలెం, పోలాటితిప్ప, రుద్రవరం, మాలకాయలంక, చిన్నాపురం, ఘంటసాల మండలం కొడాలి, శ్రీకాకుళం, పాపవినాశనం, మొవ్వ మండలం కూచిపూడి, గోడపాడు, బార్లపూడి, భట్లపెనుమర్రు, గూడూరు, కంకిపాడు మండలం ఈడ్పుగల్లు, గుడివాడ, నూజివీడు, కైకలూరు ప్రాంతాల్లో జోరుగా నిర్వహిస్తారు. మోపిదేవి మండలం వెంకటాపురం గ్రామంలో భారీస్థాయిలో పందేలు నిర్వహించనున్నారు. ఏటా 30 ఎకరాల్లో టెంట్లు వేసి మరీ పందేలు నిర్వహిస్తూ ఉంటారు. తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమలో ఐ.పోలవరం, మలికిపురం, కొత్తపేట, రావులపాలెం, సఖినేటిపల్లి, అంబాజీపేట, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన ఇలా పలు మండలాల్లో కోడి పందేల బరులు వెలుస్తాయి. సామర్లకోట, పెద్దాపురం మండలాల్లో కూడా పందేలు జరుగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధానంగా వెంప, భీమవరం ఆశ్రమతోట, లోసరి, ఐ భీమవరం, సీసలి, మహదేవపట్నం, కొప్పాక, జంగారెడ్డిగూడెం, ధర్మాజీగూడెం, భీమడోలు, గుండుగొలను తదితర ప్రాంతాల్లో పందేలు నిర్వహిస్తున్నారు. ఈసారి హైకోర్టు బ్రేకులు వేయడంతో ఇప్పటికే గుండాట, లోపుబయట, కోత ముక్క వంటి జూదాలకు ముందుగానే డబ్బులు చెల్లించిన వారు ఆ డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ నిర్వాహకులపై ఒత్తిడి తెస్తున్నారు. హైకోర్టు ఏం చెప్పిందంటే.... ‘‘మీరు కళ్లు మూసుకుని ఉండొచ్చు. కాని మేం కళ్లు మూసుకోలేదు. వందల కోట్ల రూపాయల్లో బెట్టింగులు జరుగుతున్నాయి. మీరు రూ.9.72 లక్షలు స్వాధీనం చేసుకున్నామంటారా! ఎక్కడెక్కడి నుంచో జనాలొస్తున్నారు.. టూరిస్ట్ బస్సులు నడుపుతున్నారు. మేం ఈసారి అధికారుల చిత్తశుద్ధిని పరీక్షించదలిచాం. కోడి పందేలపై 2016లో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాల్సిందే. ఉల్లంఘన జరిగితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలపై చర్యలు తప్పవు. కోడి పందేలు జరగకుండా ఏం చర్యలు తీసుకున్నారో నివేదికలివ్వాలి’’ అంటూ హైకోర్టు ఈనెల 4న ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది కోడి పందేలు జరగకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు గట్టి చర్యలు తీసుకుంటారని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ ఇచ్చిన హామీని కోర్టు నమోదు చేసింది. అంతేకాక 2016లో తాము ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని 43 మంది తహసీల్దార్లు, 49 మంది ఎస్హెచ్ఓలపై ఏం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ నివేదిక ఇవ్వాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. గత సంక్రాంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం మండలం, వెంప, శ్రీరాంపురం గ్రామాల్లో కోడిపందేల పేరుతో జూదం, అశ్లీల నృత్యాలు, వ్యభిచారం నిర్వహించారని, రానున్న సంక్రాంతి సందర్భంగా ఇవేమీ జరగకుండా తగిన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ కలిదిండి రామచంద్రరాజు హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. -
గోదావరి జిల్లాల్లో జూదాల టర్నోవర్ రూ.500 కోట్లు
-
పందేల జాతర
సాక్షి ప్రతినిధి, ఏలూరు :కాళ్లకు కత్తులతో కోళ్లు కొట్లాడుకుంటున్నాయి. చుట్టూ వేలాదిగా చేరిన జనం కేరింతల కొడుతున్నారు. చేతిలో డబ్బు కట్టలు. పక్కనే పేకాట శిబిరాలు. మరోవైపు గుండాట బోర్డు లు. ఇంకోవైపు టెంట్లలో మద్యం అమ్మకాలు. బిర్యానీ నుంచి కోడి పకోడి వరకూ తినుబండారాల స్టాళ్లు.. వేలాది కార్లు, ద్విచక్ర వాహనాలు.. తిరునాళ్లను తలపించే రీతిలో కోడి పం దేలు సాగుతున్నాయి. జిల్లాలో మూడు రోజులుగా బరితెగించి మరీ పందేలు కడుతున్నారు. బరుల వద్ద ఇతర జూద క్రీడలకూ అంతు లేకుండాపోయింది. వినోదం పేరుతో గ్రామాల్లో అడ్డూఅదుపూ లేకుండా సాగుతున్న జూదాల్లో వందలాది కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. సాధారణ వ్యక్తుల నుంచి ఉన్నత కుటుంబాలకు చెందినవారు, విద్యావంతులు సైతం సంప్రదాయం పేరుతో పందేల్లో తలమునకలవుతున్నారు. జిల్లాలో ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా కోడి పందేలు సాగా. పందెం బరులు వేయని మండలం లేదంటే అతిశయోక్తి కాదు. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన ఐ.భీమవరం, భీమవరం ఆశ్రం తోటల్లో ఎప్పటిమాదిరిగానే పందేలు తిరునాళ్లను తలపించాయి. ఈసారి ఆ రెండు ప్రాంతాలను తలదన్నేలా భీమవరం మండలం వెంపలో పందేలు నిర్వహించారు. పెదవేగి మండలం కొప్పాకలోనూ అదే స్థాయిలో పందేలు జరిగాయి. నిడమర్రు మండలం పత్తేపురంలో భారీగా పందేలు వేశారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం, లింగపాలెంలోనూ పెద్దఎత్తున పందేలు నిర్వహిస్తున్నారు. ఇవికాకుండా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ 40 నుంచి 50 ప్రాంతాల్లో పందేలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. పందేల బరుల వద్ద లక్షలాది రూపాయలు చేతులు మారిపోతున్నాయి. రూ.500 మొదలుకుని రూ.50 లక్షల వరకూ పందేలు కాస్తున్నారు. రెండు లక్షలు పైబడి భారీస్థాయిలో జరిగే పందేల సుమారు పదికిపైగా జిల్లాలో జరిగాయి. అక్కడ ఒక్క పందెం విలువే రూ.30 నుంచి రూ.50 లక్షల వరకూ ఉంటోంది. మిగిలినచోట్ల రూ.5 లక్షలు ఆ పైబడి ఉంటోంది. విచ్చలవిడిగా జూదం.. మద్యం.. కోడి పందేలతోపాటు పేకాట, గుండాడ, కోతాట ఇతర జూదక్రీడలు బరుల వద్ద యథేచ్ఛగా జరుగుతున్నాయి. పందేల కంటే ఎక్కువగా ఈ క్రీడల వద్దే జనం ఉంటున్నారు. డబ్బు చెలామణి కూడా ఇక్కడే ఎక్కువగా జరుగుతోంది. కోడి పందేల మొత్తం కంటే ఈ జూదాల దగ్గర జరగే టర్నోవర్ రెట్టింపు మొత్తంలో ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు మద్యం అమ్మకాలు కూడా పెద్దఎత్తున జరుగుతున్నాయి. బరుల వద్ద మినీ బార్లు వెలిశాయి. టెంట్లు వేసి మద్యం దుకాణాల మాదిరిగా అమ్మకాలు జరుపుతున్నారు. ఆ లోపలే బల్లలు వేసి బార్ల మాదిరిగా మద్యం సరఫరా చేస్తున్నారు. ప్రముఖుల సందడి మరోవైపు ఈ పందేలు జరిగే చోట ప్రముఖుల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. డెల్టాలో పందేలకు సినీ జనం తరలివచ్చారు. ప్రముఖ దర్శకుడు ఎ.కోదండ రామిరెడ్డి, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ వంటివారు పందేలకు రావడం గమనార్హం. అలాగే చిన్న సినిమాల హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అనేక మంది మంది బరుల వద్ద కనిపించారు. అన్నింటికీ మించి ఈసారి రాజకీయ నాయకుల హడావుడి కూడా ఎక్కువైంది. ఆయా ప్రాంతవాసులను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీల నేతలు బరుల వద్ద ఏర్పాట్లు చేశారు. వారు కూడా పందేల్లో పాల్గొన్నారు. పత్తాలేని పోలీసులు జిల్లా అంతటా మూడురోజుల నుంచి ఈ పరిస్థితి నెలకొన్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూసినపాపాన పోలేదు. పండగకు ముందు రెండు రోజులపాటు హడావుడి చేసినా ఆ తర్వాత ఏ పోలీసు అధికారి నోరు మెదపలేదు. పోలీసులు కనీస విధులు కూడా నిర్వర్తించకపోవడంతో పందెగాళ్లు అడ్డూఅదుపూ లేకుండా వ్యవహరించారు. పందేల గురించి లోకాయుక్త హెచ్చరించినా పోలీసులు తమకు పట్టనట్టే వ్యవహరించారు. రాజకీయ నాయకులు ఒత్తిడి ఎంత ఉన్నా పూర్తిగా పందేలరాయుళ్లను వదిలేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులకు భారీ ఎత్తున మామూళ్లు ముట్టిన విషయం బహిరంగ రహస్యంగానే ఉంది. -
గోదావరి జిల్లాల్లో జూదాల టర్నోవర్ రూ.500 కోట్లు
పందేలకు రెట్టింపు స్థాయిలో పేకాట, గుండాట సంక్రాంతి ముసుగులో జూదం తొడగొట్టి మరీ పురివిప్పింది. గోదావరి జిల్లాల్లో మూడురోజుల నుంచి కోడి పందేలు అడ్డూఅదుపూ లేకుండా సాగిపోతున్నాయి. ఆ బరుల వద్దే కోడి పందేలను తలదన్నే రీతిలో పేకాట, గుండాట, కోసాటలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఈ మూడు రోజుల నుంచి వందల ప్రాంతాల్లో జరిగిన పందేలు, జూదాల్లో రూ.500 కోట్లు చేతులు మారినట్లు అంచనా. కోడి పందేలకు పేరొందిన పశ్చిమగోదావరి జిల్లాలోనే రూ.300 కోట్లకుపైగా లావాదేవీలు జరిగినట్లు చెబుతున్నారు. ఈ పందేల్లో అన్ని పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు కూడా పాల్గొనడం గమనార్హం. - న్యూస్‌లైన్ నెట్వర్క్ జూదం.. మద్యం.. కోడి పందేలు జరిగే బరుల వద్దే పేకాట, గుండాట, కోసాటలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. వెంప, ఐ.భీమవరం, భీమవరం ప్రకృతి ఆశ్ర మం, కొప్పాక, ఫతేపురం తదితర చోట్ల 200కిపైగా గుండాట బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా పేకాట శిబిరాలు ఇక్కడ వెలిశాయి. కోడి పందేలకు రెట్టింపు స్థాయిలో ఇక్కడ డబ్బులు చేతులు మారుతున్నాయి. ఇక్కడే మినీ బార్లు కూడా వెలిశాయి. టెంట్లు వేసి మద్యం అమ్మారు. బిర్యానీతోపాటు, బార్లలో దొరికే ఐటమ్‌లతో రెస్టారెంట్లూ ఏర్పాటుచేశారు. ఎమ్మెల్యేలు, ప్రముఖుల హడావుడి కోడి పందేలు జరిగే చోట్ల ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, సినీప్రముఖుల హడావుడి ఎక్కువగా కనిపించింది. అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు పందేల్లో హల్చల్ చేశారు. టీడీపీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కొప్పాకలో కోడిపందేలను స్వయంగా నిర్వహించారు. వెంపలో బుధవారం కాంగ్రెస్‌కు చెందిన తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, ప్రముఖ సినీ దర్శకుడు కోదండ రామిరెడ్డి పందేలు కాశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే హనుమంతుషిండే, టీడీపీ నేత తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెంపలో పందేలను వీక్షించారు. టీడీపీకి చెందిన ఉండి ఎమ్మెల్యే శివరామరాజు కూడా పందేల్లో పాల్గొన్నారు. నిడదవోలులో సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ పందేలను వీక్షించారు. హైదరాబాద్‌తోపాటు తెలంగాణ జిల్లాలు, రాయలసీమ కోస్తా జిల్లాలేకాకుండా బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది భీమవరం ప్రాంతాల్లో జరిగే పందేలకు రావడం విశేషం. బడ్జెట్‌ను బట్టి బరి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం వెంపలో ఈసారి ఊహించని రీతిలో కోడి పందేలు జరిగాయి. ఇక్కడ రెండు లక్షలకుపైబడి పందేల కోసం ఒక బరి, లక్ష లోపు పందేలకు మరో బరిని ఏర్పాటు చేశారు. రెండు బరుల్లోనూ సగటున రోజుకు 100కుపైగా పందేలు జరిగాయి. బరిలో దిగేవాళ్లు రెండు లక్షలకు పందెం వేస్తే వీక్షించేవారు వాటిపై రూ.20 లక్షలనుంచి రూ.30 లక్షల వరకు పైపందేలు కాశారు. అంటే ఒక పందెం జరిగితే రూ.30 లక్షలు చేతులు మారుతున్నాయి. ఇలా పెద్ద బరిలోనే రోజుకు రూ.15 కోట్లు చొప్పున మూడురోజుల్లో రూ.45 కోట్ల పందేలు జరిగినట్లు తెలిసింది. లక్ష లోపు పందేల కోసం ఏర్పాటుచేసిన బరిలోనూ రూ.10 నుంచి రూ.20 లక్షల వరకూ చేతులు మారుతున్నాయి. ఇలా ఒక్క వెంపలోనే మూడు రోజుల్లో రూ.60 కోట్లకుపైగా పందేలు జరిగినట్లు సమాచారం. ఇక్కడ జరిగిన బరిలో బుధవారం హైదరాబాద్ నుంచి కుమారుడితో కలిసి వచ్చిన ఒక ప్రముఖుడు రూ.30 లక్షలు ఒకసారి, రూ.20 లక్షలు ఒకసారి పోగొట్టుకున్నారు. భీమవరం పట్టణంలోని ప్రకృతి ఆశ్రమం, ఆకివీడు మండలం ఐ.భీమవరంలోనూ ఇదేస్థాయిలో పందేలు జరిగాయి. భీమవరం, కొప్పాక, ఫత్తేపురం బరుల్లో లక్షలోపు పందేలు లేవంటే ఏ స్థాయిలో జరిగాయో ఊహించుకోవచ్చు. ఇవిగాక జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం, లింగపాలెం, పోలవరం, నర్సాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, తణుకు తదితర అన్ని ప్రాంతాల్లోనూ పందేలు ఇష్టానుసారం జరిగాయి. మొత్తంగా పశ్చిమగోదావరి జిల్లాలో రూ.300 కోట్లకుపైగా పందేలు జరిగినట్లు చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఆత్రేయపురం మండలం తాడిపూడి, మలికిపురం, ఐ.పోలవరం మండలంలోని కేశనకుర్రు, సామర్లకోట మం డలం మట్లపాలెంలో భారీ పందేలు జరిగాయి. ఈ పందేల విలువ రూ.100 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. మొత్తంగా గోదావరి జిల్లాల్లో రూ.400 కోట్ల మేర కోడి పందేలు జరిగినట్లు చెబుతున్నారు. రాజకీయ పందేరం ఈసారి కోడి పందేల్లో రాజకీయ జోక్యం ఎక్కువగా కనిపించింది. అన్ని పార్టీలకు చెందిన నేతలు పందేల్లో పాల్గొనడంతోపాటు కొన్నిచోట్ల స్వయంగా బరులను నిర్వహించడం గమనార్హం. కోడి పందేల బరుల వద్ద ఆధిపత్యం కోసం పార్టీల నేతలు మోహరించారు. కొవ్వూరు మండలం వాడపల్లిలో కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలు ఏకమై వైఎస్సార్ సీపీ నేతలపై కాలుదువ్వారు. దీంతో ఘర్షణ జరిగి పందేలు నిలిచిపోయాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే స్థాయి నేతలు, ఎంపీ స్థాయి నేతలు కూడా పందేల బరుల వద్ద ఆధిపత్యం కోసం ప్రయత్నించడం విశేషం. ఈ పందేల వద్ద ఆధిపత్యం కోల్పోతే ఆయా గ్రామాల్లో రాజకీయం కూడా తమ చేతుల్లోంచి జారిపోతుందనే ఆందోళనతో రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువైంది. జాతరను తలపించిన ప్రాంతాలు కోడి పందేల ప్రాంతాలు తిరునాళ్లను తలపిస్తున్నాయి. వందల సంఖ్యలో కార్లు, ద్విచక్రవాహనాలు ఈ ప్రాంతాలకు వస్తున్నాయి. పార్కింగ్ కోసమే పందేల బరుల వద్ద ప్రత్యేకంగా 30 నుంచి 50 ఎకరాల స్థలాన్ని ఏర్పాటు చేశారు. కొప్పాకలో ట్రాఫిక్‌ను నియంత్రించడానికి 14 మంది సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేశారు. కరీంనగర్లోనూ కదనరంగం గోదావరి జిల్లాలను తలపించేలా... తెలంగాణలోనూ కోడి పందేలు ఊపందుకున్నాయి. రెండు ప్రాంతాలను రెండు కళ్ల సిద్ధాంతంలా భావించిన ‘తెలుగు తమ్ముడు..’ అన్నీ తానై దగ్గరుండి ఈ పందేలకు సారథ్యం వహించారు. స్వయానా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు స్వగ్రామం ఎలిగేడు మండలం శివపల్లిలో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలు జోరుగా సాగాయి. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, హైదరాబాద్ ప్రాంతాల నుంచి వందలాది వాహనాల్లో పందెం రాయుళ్లు ఇక్కడి బరిలోకి దిగారు. స్వయానా ఎమ్మెల్యేతోపాటు అదే గ్రామానికి సర్పంచ్‌గా ఉన్న ఆయన సోదరుడు పోటీలకు సారథ్యం వహించడం గమనార్హం. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన స్వగ్రామం సున్నంబట్టిలో బహిరంగంగా రెండు బిర్రులు కట్టి అధికార పార్టీ నాయకులు కోడిపందేలు నిర్వహించారు. భద్రాచలం ఏజెన్సీలో కూడా పందేలు నడిచాయి. -
కోడి పందెంరాయుళ్ల అరెస్ట్.. నగదు స్వాధీనం
హైదరాబాద్: సంకాంత్రి పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కోడిపందేలు జోరందుకున్నాయి. పోలీసులు పలు ప్రాంతాల్లో దాడులు జరిపి పందెంరాయుళ్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలం పెద్దశెట్టిపల్లిలో 17 మంది పందెంరాయుళ్లను అరెస్ట్ చేసి వారి నుంచి 7 వేల రూపాయిలు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా తలుపుల మండలం గుడాలగొందిలో 16 మంది పందెంరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 9 వేల రూపాయిలు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నగర శివారులో కోడిపందాలు నిర్వహిస్తున్న 35 మంది అరెస్ట్ చేశారు. వారి నుంచి 57వేల రూపాయిలు స్వాధీనం చేసుకున్నారు. ఇక ప్రకాశం జిల్లా సంతమావులూరు మండలం బండివారిపాలెంలో పదమూడు మంది పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలావుండగా, పలు చోట్ల కోట్ల రూపాయిల్లో పందేలు జరుగుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జోరుగా సాగుతున్నాయి.