కాలు దువ్వుతున్న నేతలు.. | Getting ready to the cock fight at AP | Sakshi
Sakshi News home page

అటు కోర్టు.. ఇటు కోడి!

Published Thu, Jan 11 2018 3:45 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM

Getting ready to the cock fight at AP - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘సంక్రాంతికి కోడిపందేలు వేయొద్దని ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, డీజీపీలపై చర్యలు తప్పవు. అధికారులు ఎంత చిత్తశుద్దితో పనిచేస్తారో చూస్తాం’’ అని హైకోర్టు హెచ్చరించినా అధికారపార్టీ నేతలకు, ప్రజాప్రతినిధులకు చీమకుట్టినట్టయినా లేదు. పందెం కోళ్లను సిద్ధం చేశారు. బెట్టింగులకు కోట్ల కొద్దీ డబ్బు రెడీ చేశారు. పందేలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసేశారు. దీంతో అధికారులు వణికిపోతున్నారు. ఒకవైపు కోర్టు హెచ్చరికలు, మరోవైపు అధికార పార్టీ నేతల దూకుడుతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. గత ఏడాది జరిగిన పందేలపైనే కోర్టు సీరియస్‌ కావడంతోపాటు తహసీల్దార్లు, ఎస్సైలపై ఏం యాక్షన్‌ తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించింది. తాజాగా కొందరు నేతలు దీనిపై సుప్రీంను ఆశ్రయించడం, కోర్టు తీర్పు ఎలా ఉన్నా పందేలకు సన్నాహాలు జరుగుతుండడంతో తాము బలిపశువులుగా మారతామన్న ఆందోళన మండల స్థాయి అధికారుల నుంచి వ్యక్తం అవుతోంది. గతంలో ఉభయ గోదావరి జిల్లాలకే పరిమితమైన ఈ పందేలు ఇప్పుడు శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకూ విస్తరించాయి. గత ఏడాది కోడిపందేలలో రూ.200 కోట్ల వరకు చేతులు మారగా ఈసారి రెట్టింపుకన్నా ఎక్కువే ఉండవచ్చని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. 
 
టీడీపీ అధికారంలోకి వచ్చాకే పెరిగిన పందేలు..  
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విష సంస్కృతి పెచ్చుమీరిపోయింది. దీంతో మూడేళ్లుగా వరుసగా హైకోర్టు జోక్యం చేసుకోవడం.. అయినా పండగ మూడు రోజులు ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలతో కోడి పందేలు నిర్వహించడం ఆనవాయితీగా మారిపోయింది. అయితే ఈసారి హైకోర్టు ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందించడం, కోడిపందేలు జరిగితే డీజీపీతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బాధ్యులుగా చేస్తామని హెచ్చరించడంతో అధికారుల్లో కలకలం మొదలైంది. కోడిపందేలు నిర్వహించే మండలాల్లో రెవెన్యూ, పోలీసు, స్వచ్ఛంద సేవాసంస్థల బృందాలతో కమిటీలు వేశారు. గత ఏడాది పందేలు నిర్వహించిన ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. గోదావరి జిల్లాల్లో సుమారు ఎనిమిది వందల మందిపై బైండోవర్‌ కేసులు పెట్టారని, కత్తులు కూడా స్వాధీనం  చేసుకున్నారని వినిపిస్తోంది. అయితే చివరినిమిషంలో ఏమైనా జరగవచ్చని, పందేలను నిర్వహించేలా ప్రభుత్వ పెద్దల నుంచి మళ్లీ ఆదేశాలు రావచ్చని అధికారపార్టీనేతలు ధీమాగా ఉన్నారు. 
 
సిద్ధమౌతున్న బరులు.. ఆందోళనలో అధికారులు.. 

కోర్టు ఆంక్షలు, అధికారుల హడావిడి నేపథ్యంలో పందెంరాయుళ్లు ఈసారి కొత్త ప్రాంతాల్లో ఈ పందేలు నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నారు. కృష్ణాజిల్లా ముసునూరులో బరులను ట్రాక్టర్లతో దున్నించారు. వాటిని ఎలా ఆపాలో తెలియక అధికారులు సతమతమవుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 2016లో తాము ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయని 43 మంది తహసీల్దార్లు, 49 మంది ఎస్‌హెచ్‌ఓలపై ఏం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ నివేదిక ఇవ్వాలని  జిల్లా కలెక్టర్, ఎస్పీలను  ఇప్పటికే కోర్టు ఆదేశించింది. వెంప గ్రామానికి చెందిన  కలిదిండి రామచంద్రరాజు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై హైకోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. ఈ నెల 29కి వాయిదా వేయడంతో ఈలోపు కోడిపందేలు జరిగితే తాము బలిపశువులుగా మారతామనే భయం మండలస్థాయి అధికారుల్లో కనపడుతోంది.

కొంతమంది అధికారులు సెలవుపై వెళ్లేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఉన్నతాధికారులు షోకాజ్‌ నోటీసులు జారీ చేసి తమను తాము కాపాడుకుంటున్నారని, తమ పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు కోడి పందేలను నిర్వహించి తీరుతామని చెబుతుండగా, బీజేపీ నేత రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే పండుగ మూడురోజులు పందేలు నిర్వహించుకుందామని తమ నేతలకు చెబుతున్నారు. ఒక ఎమ్మెల్యే అయితే ‘మా తోటలోనే వేస్తాను. ఎవరు అడ్డువస్తారో చూద్దాం’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. కోళ్లకు సహజంగానే ఎదురుపడితే కొట్టుకుంటాయని, వాటిని ఎలా ఆపగలమని ప్రభుత్వ విప్‌ చింతమనేని అంటున్నారు. గతంలో ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణాలో మెట్టప్రాంతానికి పరిమితం అయిన ఈ పోటీలు ఇప్పుడు ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయి. అ«ధికార పార్టీ నేతల పుణ్యమా అని విశాఖపట్నంలో కూడా మూడేళ్లుగా కోడి పందేలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. 
 
పందేలు ఎక్కడెక్కడ? 
విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు రెండేళ్లుగా ఆరిలోవ సమీపంలోని ముడసర్లోవలో నిర్వహిస్తున్నారు.  ఈ ఏడాది కూడా ముడసర్లోవ రిజర్వాయరు వెనుక రామకృష్ణాపురం సమీపంలో జీవీఎంసీ ఖాళీ స్థలంలో కోడి పందేలు నిర్వహించడానికి  రామకృష్ణబాబు అనుచరులు సన్నాహాలు చేస్తున్నారు.  కృష్ణాజిల్లాలో పెడన నియోజకవర్గంలోని కొంకేపూడి, నందమూరు, పుల్లపాడు, కాకర్లమూడి, బందరు రూరల్‌ మండలంలోని కానూరు, గోపువానిపాలెం, మేకవానిపాలెం, పోలాటితిప్ప, రుద్రవరం, మాలకాయలంక, చిన్నాపురం, ఘంటసాల మండలం కొడాలి, శ్రీకాకుళం, పాపవినాశనం, మొవ్వ మండలం కూచిపూడి, గోడపాడు, బార్లపూడి, భట్లపెనుమర్రు, గూడూరు, కంకిపాడు మండలం ఈడ్పుగల్లు, గుడివాడ, నూజివీడు, కైకలూరు ప్రాంతాల్లో జోరుగా నిర్వహిస్తారు.

మోపిదేవి మండలం వెంకటాపురం గ్రామంలో భారీస్థాయిలో పందేలు నిర్వహించనున్నారు. ఏటా 30 ఎకరాల్లో టెంట్లు వేసి మరీ పందేలు నిర్వహిస్తూ ఉంటారు. తూర్పుగోదావరి జిల్లాలో  కోనసీమలో ఐ.పోలవరం, మలికిపురం, కొత్తపేట, రావులపాలెం, సఖినేటిపల్లి, అంబాజీపేట, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన ఇలా పలు మండలాల్లో కోడి పందేల బరులు వెలుస్తాయి. సామర్లకోట, పెద్దాపురం మండలాల్లో కూడా పందేలు జరుగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధానంగా వెంప, భీమవరం ఆశ్రమతోట, లోసరి, ఐ భీమవరం, సీసలి, మహదేవపట్నం, కొప్పాక, జంగారెడ్డిగూడెం, ధర్మాజీగూడెం, భీమడోలు, గుండుగొలను తదితర ప్రాంతాల్లో పందేలు నిర్వహిస్తున్నారు. ఈసారి హైకోర్టు బ్రేకులు వేయడంతో ఇప్పటికే గుండాట, లోపుబయట, కోత ముక్క వంటి జూదాలకు ముందుగానే డబ్బులు చెల్లించిన వారు ఆ డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ నిర్వాహకులపై ఒత్తిడి తెస్తున్నారు.  
 
హైకోర్టు ఏం చెప్పిందంటే.... 
‘‘మీరు కళ్లు మూసుకుని ఉండొచ్చు. కాని మేం కళ్లు మూసుకోలేదు. వందల కోట్ల రూపాయల్లో బెట్టింగులు జరుగుతున్నాయి. మీరు రూ.9.72 లక్షలు స్వాధీనం చేసుకున్నామంటారా! ఎక్కడెక్కడి నుంచో జనాలొస్తున్నారు.. టూరిస్ట్‌ బస్సులు నడుపుతున్నారు. మేం ఈసారి అధికారుల చిత్తశుద్ధిని పరీక్షించదలిచాం. కోడి పందేలపై 2016లో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాల్సిందే. ఉల్లంఘన జరిగితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలపై చర్యలు తప్పవు. కోడి పందేలు జరగకుండా ఏం చర్యలు తీసుకున్నారో నివేదికలివ్వాలి’’ అంటూ హైకోర్టు ఈనెల 4న  ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఏడాది కోడి పందేలు జరగకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు గట్టి చర్యలు తీసుకుంటారని అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ ఇచ్చిన హామీని కోర్టు నమోదు చేసింది. అంతేకాక 2016లో తాము ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని 43 మంది తహసీల్దార్లు, 49 మంది ఎస్‌హెచ్‌ఓలపై ఏం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ నివేదిక ఇవ్వాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. గత సంక్రాంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం మండలం, వెంప, శ్రీరాంపురం గ్రామాల్లో కోడిపందేల పేరుతో జూదం, అశ్లీల నృత్యాలు, వ్యభిచారం నిర్వహించారని, రానున్న సంక్రాంతి సందర్భంగా ఇవేమీ జరగకుండా తగిన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ కలిదిండి రామచంద్రరాజు హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.      

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement