బెట్‌.. కొట్లాట రసపట్టు | Cock Fight Betting and Jallikattu in Andhra Pradesh and Tamil Nadu | Sakshi
Sakshi News home page

బెట్‌.. కొట్లాట రసపట్టు

Published Wed, Feb 8 2023 3:28 AM | Last Updated on Wed, Feb 8 2023 3:28 AM

Cock Fight Betting and Jallikattu in Andhra Pradesh and Tamil Nadu - Sakshi

సాక్షి, అమరావతి: శునకం.. వరాహం.. అశ్వం.. ఎద్దు.. ఒంటె.. కోడి.. బుల్‌ బుల్‌ పిట్ట.. పక్షా, జంతువా కాదు.. బరిలో ఉందంటే దుమ్ము దులపాల్సిందే. ప్రత్యర్థిని మట్టికరిపించాల్సిందే. అనాది కాలం నుంచి మన దేశంలో జంతువులు, పక్షుల పోటీలు జరుగుతూనే ఉన్నాయి. దేశంలో అనేక రాష్ట్రాలు... ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతాల వారీగా ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని జంతువులు, పక్షులతో పోటీలు సంప్రదాయమైంది. జంతు హింసను నిరోధించే చట్టాలున్నప్పటికీ ఏళ్ల తరబడి అదే ఆనవాయితీ కొనసాగుతోంది. అనేక రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన జంతువుల పందేలు, పోటీలపై ఓ లుక్కేద్దాం.. 

పౌరుషానికి ప్రతీక కోడి పుంజులు 
కోడి పందేలకు ఘనమైన చరిత్రే ఉంది. సింధు నాగరికత నుంచి మొదలెడితే.. భారత్, చైనా, పర్షియా, గ్రీకు నాగరికతల్లోను వీటిని నిర్వహించిన ఆధారాలున్నాయి. పల్నాడు, బొబ్బిలి యుద్ధంలో కోడి పుంజుల పోరు చరిత్ర అందరికీ తెలిసిందే. కోడి పుంజుల పందేలను పౌరుషానికి ప్రతీకగా భావిస్తారు. ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి బరిలోకి దించుతారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళలో వీటిని ఎక్కువగా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రముఖంగాను, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ భోగి, సంక్రాంతి, కనుమ పండుగల రోజు కోడి పందేలు నిర్వహించడం సంప్రదాయంగా మారింది.

తమిళంలో ‘వెట్రికాల్‌’ అని, తుళులో ‘గోరిక్‌ కట్ట’ అని కోడి పందాలను పిలుస్తారు. కర్ణాటకలోని ఉడుపి, కేరళలోని కాసర్‌గోడ్‌లలోనూ కోడి పందాలను నిర్వహిస్తుంటారు. కోడి పందాల పేరుతో కోడి పుంజులను దారుణంగా హింసిస్తున్నారని యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా కూడా నివేదించింది. జంతు సంరక్షణ చట్టం ఉల్లంఘిస్తున్న కోడి పందేలను సుప్రీం కోర్టు నిషేధించింది. అయినా సంప్రదాయం, సరదా పేరుతో కోడి పందేలు.. బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయి. 

కంబాళ.. భళా భళ 
దున్నలను కాడికి కట్టి రేసు నిర్వహించడాన్ని కన్నడ భాషలో కంబాళ అంటారు. ఖాత్రి కంబాళ అనేది మంగళూరు ఖాత్రిలోని మంజునాథ ఆలయ పరిసరాల్లో నిర్వహించేవారు. దీన్నే థీవర కంబాళ అని కూడా పిలిచేవారు. 300 ఏళ్ల క్రితం నిర్వహించిన ఈ వేడుకకు ఆనాటి అలూబ రాజులు కూడా హాజరయ్యేవారు. ఇప్పటికీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కంబాళను నిర్వహిస్తుంటారు. సాధారణంగా బురద నేలలు, వరి పొలాల్లో ఈ రేసు నిర్వహిస్తారు.

వీటిలో పాల్గొనే రైతులు కొరడా ఝుళిపిస్తూ రెండు దున్నలతో వేగంగా పరుగులు తీస్తారు. పందెంలో గెలిచిన వారికి బంగారం, వెండి నాణేలతో పాటు విలువైన బహుమతులు ఇస్తారు. ఈ పోటీపై పెద్దఎత్తున బెట్టింగ్‌లు వేస్తుంటారు. కేరళలోనూ వరికోతల తర్వాత ఈ పోటీలు నిర్వహిస్తుంటారు. ఈ పోటీల్లో కొరడాలను ఉపయోగించడంపై జంతు హక్కుల కార్యకర్తలు మొదట్నుంచీ ఆందోళనలు చేస్తున్నారు. దీంతో జల్లికట్టు, కంబాళ పోటీల్లో జంతువులను హింసించ కూడ­దని 2014 మే 7న సుప్రీం కోర్టు స్పష్టంచేసింది.

ఒంటెల రేసు.. 
రాజస్థాన్‌లోని అజ్మీర్‌ జిల్లా పుష్కర్‌లో గుర్రం, ఒంటెల పరుగు (రేసు) పందేలు నిర్వహిస్తుంటారు. వీటిలో విజేతలకు నేరుగా రాజస్థాన్‌ ప్రభుత్వమే నగదు బహుమతిని అందిస్తుంటుంది. ఈ రేసులో గెలిచేందుకు ఒంటెలకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. ఈ రేసులకు ముందుగా గిరిజనుల నృత్యాలు, ఒంటెల అందాల పోటీలు కూడా నిర్వహిస్తుంటారు. ఎక్కువ దూరం వేగంగా ప్రయాణించిన ఒంటెను విజేతగా ప్రకటిస్తారు. 

ఎద్దుల ఆట కట్టించే జల్లికట్టు..
బుసలు కొడుతూ పరుగులు తీసే బలమైన ఎద్దులను లొంగదీసుకునే క్రీడే జల్లికట్టు. సింధు నాగరికత, తమిళ్‌ సాహిత్యంలోను జల్లికట్టుకు సంబంధించిన ఆధారాలున్నాయి. ప్రాచీన తమిళనాడులోని ‘ముల్లై’ ప్రాంతంలో నివసించే తెగల్లో జల్లికట్టు సర్వసాధా­రణం. తమిళ పురాణాల ప్రకారం పూర్వకాలంలో మహిళలు జల్లికట్టులో విజేతలైన వారిని తమ భర్తలుగా ఎంచుకునే వారు.

నీలగిరి జిల్లాకు చెందిన కరిక్కియూర్‌ అనే గ్రామంలో సుమారు 3,500 సంవత్సరాల వయ­సుగల శిలా ఫలకాలపై మనుషులు ఎద్దు­లను తరిమే దృశ్యాలు చెక్కి ఉన్నాయి. స్పెయిన్‌లో జరిగే బుల్‌ ఫైట్‌కు దగ్గరగా జల్లి­కట్టు ఉంటుంది. అయితే జల్లికట్టులో ఎద్దులను చంపరు. తమిళనాడులోని గ్రామా­ల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోను జల్లికట్టు నిర్వహిస్తారు. 

శునకాల కొట్లాట.. 
ఇంగ్లాండ్‌లో 18వ శతాబ్దంలో శునకాల కొట్లాట పోటీలను నిర్వహించేవారు. తర్వాత భారత్‌కు ఈ పోటీలు చేరాయి. ఈ పోటీల కోసం అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, ఆస్ట్రేలియాల నుంచి ప్రత్యేకంగా కుక్కలను తీసుకువస్తుంటారు. ఢిల్లీ శివారు ప్రాంతాలతోపాటు గురుగ్రామ్, నోయిడాలలోనూ ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. పంజాబ్, హరియాణాల్లో ధనవంతులు సరదా కోసం ఇలాంటి పోటీలను నిర్వహించే సంప్రదాయం పెరుగుతోంది.

కుక్కల కొట్లాటలో రక్తస్రావం తీవ్రంగా ఉంటుంది. పందేల్లో దింపే కుక్కలను రోజుల తరబడి ఆహారం పెట్టకుండా బోనులో బంధిస్తారు. ఒక్కసారిగా వాటిని వదులుతారు. అప్పటికే ఆకలితో తీవ్ర కోపంతో రగిలిపోయే కుక్కలు ప్రత్యర్థి కుక్కలపై భయానకంగా దాడులు చేస్తాయి. ఒక్కోసారి వీటిలో ఒక్కోసారి ప్రత్యర్థి కుక్కలు చనిపోతుంటాయి. గెలిచిన కుక్క యజమానికి రూ.లక్షల్లో నగదు బహుమతులు అందిస్తుంటారు. వీటిపైనా సుప్రీం కోర్టు నిషేధం ఉంది.  

బుల్‌ బుల్‌ పక్షుల పోటీ 
పూర్వం అస్సాం రాజు స్వర్గదేవ్‌ బ్రహ్మథ సింఘ పక్షుల పోటీలు ఎంతో ఇష్టంగా నిర్వహించేవారని, ఈ పోటీల కోసం ప్రత్యేకంగా పక్షులను పెంచేవారని చరిత్ర చెబుతోంది.  ఆ తర్వాతి కాలంలో ఇది ఒక సంప్రదాయంలా మారింది. సంక్రాంతి సమయంలోనే అస్సాంలో భోగలి బిహు వేడుక నిర్వహిస్తుంటారు. దీనిలో భాగంగా గువాహటికి 30 కిలోమీటర్ల దూరంలో హయగ్రీవ మాధవ ఆలయానికి సమీపంలో బుల్‌బుల్‌ పక్షుల పందేలు నిర్వహిస్తారు.

ఈ పందాల కోసం పక్షులకు గ్రామస్తులు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ పోటీల్లో పక్షులు కూడా గాయపడుతుంటాయి. పోటీల్లో ఓడిపోయిన పక్షుల ముక్కు ముందు భాగాన్ని కత్తిరిస్తారు. దీంతో మరోసారి మళ్లీ ఇవి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉండదు. ఈ పక్షుల పోటీపై నిషేధం విధించాలని జంతు ప్రేమికులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, 2016లో ఈ పోటీ నిర్వహించకుండా గువాహటి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ నిర్వహిస్తున్నారు.

ఎద్దుల బండ్ల రేసు.. 
మహారాష్ట్రలో ఎద్దుల బండ్ల రేసులను శతాబ్దాల నుంచి నిర్వహిస్తున్నారు. దాదాపు 500 మీటర్ల దూరాన్ని ఎద్దుల బండ్లపై ఎవరైతే వేగంగా చేరుకుంటారో వారిని విజేతగా ప్రకటిస్తారు. ఈ పోటీల్లో చాలా మంది రైతులు పాల్గొంటారు. వినాయక చవితి సమయంలో ఎక్కువగా ఈ పోటీలను నిర్వహిస్తారు. ఇవి తమ సంప్రదాయమని నిర్వాహకులు చెబుతుంటారు.

పోటీ కోసం కొన్ని ఎద్దులను ప్రత్యేకంగా సిద్ధం చేస్తారు. మహారాష్ట్రతో పాటు పంజాబ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్‌ల్లో కొన్ని ప్రాంతాల్లోనూ ఈ రేసు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను 2014లో సుప్రీం కోర్టు నిషేధం విధించింది. కానీ, స్థానిక నాయకుల ప్రోత్సాహంతో ఈ పోటీలు జరుగుతూనే ఉన్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement