జల్లికట్టు చిన్నారి పట్టు | Ten year old girl training bulls for Jallikattu in Tamil Nadu | Sakshi
Sakshi News home page

జల్లికట్టు చిన్నారి పట్టు

Published Thu, Jan 2 2025 4:57 AM | Last Updated on Thu, Jan 2 2025 4:57 AM

Ten year old girl training bulls for Jallikattu in Tamil Nadu

న్యూస్‌మేకర్‌

‘జల్లికట్టు’ అంటే ఎద్దును లొంగదీసుకుని దాని కొమ్ములకున్న అలంకరణలను సొంతం చేసుకోవడం. జల్లికట్టు ఎద్దులకు ΄పౌరుషం ఎక్కువ. కొమ్ములకు వాడి ఎక్కువ. తమ మూపురాలను తాకనివ్వవు. అందుకే ఈ మనిషి–పశువు క్రీడ తరాలుగా తమిళనాడులో ఉంది. జల్లికట్టులో దించబోయే ఎద్దుకు  తర్ఫీదు ఇస్తూ పదేళ్ల యజిని వార్తల్లోకి ఎక్కింది. రాబోయే సంక్రాంతికి యజిని.. ఎద్దు‘నన్బన్‌’ చాలా పెద్ద వార్తలనే సృష్టించనున్నాయి.

రాబోయే‘΄పొంగల్‌’కి తమిళనాడులో జల్లికట్టు ధూమ్‌ధామ్‌గా జరగనుంది. మదురై, తంజావూరు, తిరుచిరాపల్లి తదితర ప్రాంతాల్లో ΄పొంగల్‌ నుంచి మొదలై వేసవి వరకు జల్లికట్టు పోటీలు జరుగుతూనే ఉంటాయి. అక్కడి పల్లెవాసులు కూడా వేలాదిగా వీటిలో పాల్గొంటారు. తమ ఎడ్లను తెచ్చి పాల్గొనేలా చేస్తారు. మన కోళ్ల పందేలకు కోడిపుంజులను తీర్చిదిద్దినట్టే ఇందుకై ఎడ్లనూ తీర్చిదిద్దుతారు. రైతు కుటుంబాల్లో తండ్రులు వారికి తోడు పిల్లలు ఈ పనిలో నిమగ్నమ
వుతారు. అలాంటి రైతు కూతురే పదేళ్ల వయసున్న యజిని.

ఎద్దు– మనిషి
మదురైలోని మంగులం అనే గ్రామంలో శ్రీనివాసన్‌ అనే రైతుకు రెండు ఎడ్లు ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని జల్లికట్టులో పాల్గొనేలా చేస్తున్నాడు. ‘జల్లికట్టు’లో ‘జల్లి అంటే రెండు కొమ్ములకు అలంకరణ వస్త్రాలు ‘కట్టు’ అంటే కట్టడం. రెండు కొమ్ముల మధ్య వెండి లేదా బంగారు నాణేలు కూడా కడతారు. ఆటగాళ్లు పరిగెడుతున్న ఎద్దును తాకి, మూపురం పట్టి నెమ్మదించేలా చేసి ఆ అలంకరణలను, నాణేలను సొంతం చేసుకుంటారు. ఎన్ని సొంతం చేసుకుంటే అంత వీరుడిగా గుర్తింపు. అలాగే ఈ వీరులకు చిక్కకుండా వారి మీద కొమ్ము విసిరి తరిమికొడితే ఆ ఎద్దుకు అంతటి ఘనత. ‘మా ఎద్దు కూడా అంతటి గొప్పదే. చాలా మెడల్స్‌ సాధించింది’ అంటుంది యజిని.

పాపకు స్నేహితుడు
యజినికి ఐదేళ్లుండగా తండ్రి ఎద్దులను కొన్నాడు. వాటిలో ఒకదానికి యజిని‘నన్బన్‌’ (స్నేహితుడు) అనే పేరు పెట్టింది. రోజూ దానికి మేత వేయడం, నీళ్లు పెట్టడం, కబుర్లు చెప్పడం ఇదే పని. ‘నేను దగ్గరికి వెళితే ఏమీ చేయదు. పిలవగానే వచ్చేస్తుంది’ అంటుంది యజిని. గత మూడేళ్లుగా జల్లికట్టులో తండ్రితో పాటు నన్బన్‌ను తీసుకొని వెళుతోంది యజిని. ‘వాడివాసల్‌ (స్టార్టింగ్‌ పాయింట్‌) నుంచి మా నన్బన్‌ పరుగు అందుకోగానే చాలామంది ఆటగాళ్లు దాని మూపురం పట్టుకోవాలని, కొమ్ములు అందుకోవాలని ట్రై చేస్తారు. కాని మా నన్బన్‌ అందరి మీదా బుసకొట్టి దూరం పోయేలా చేస్తుంది. ఆట గెలిచాక బుద్ధిగా నా వెంట ఇంటికి వస్తుంది. ఆ ఎద్దు – ఈ ఎద్దు ఒకటేనా అన్నంత డౌట్‌ వస్తుంది’ అంటుంది యజిని.

ట్రైనింగ్‌
జల్లికట్టు కోసం ట్రైనింగ్‌ యజిని ఇస్తోంది తండ్రితో పాటు. జల్లికట్టులో పాల్గొనే ఎద్దును రోజూ వాకింగ్‌కి, స్విమ్మింగ్‌కి తీసుకెళ్లాలి. తడి నేలలో, మెత్తటి నేలలో కొమ్ములు గుచ్చి కొమ్ములు బలపడేలా చేయాలి. దీనిని ‘మన్‌ కుథల్‌’ అంటారు. ఇక మంచి తిండి పెట్టాలి. ఇవన్నీ యజిని చేస్తోంది. ‘నేను ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకుంటున్నా. గవర్నమెంట్‌ జల్లికట్టు కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎద్దుకు ఎటువంటి అపాయం కలక్కుండా రూల్స్‌ పెట్టింది. అందుకే నన్బన్‌ను నేను ధైర్యంగా పోటీకి తీసుకెళ్తా’ అంటోంది యజిని.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement