స్ఫూర్తి
బాల్యం పేదరికాన్ని పరిచయం చేసింది. చదువుకు దూరం చేసింది. అనివార్యంగా పెళ్లికి తలవంచాల్సి వచ్చింది. భర్త పట్టించుకోని ఇంటి బాధ్యతను మోయడానికి భుజాలనివ్వాల్సి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా ఐదుసార్లు వదిలి వెళ్లాడు భర్త. ఇద్దరు పిల్లలను పోషించుకోవాలి. తనకు దూరమైన చదువును వారికివ్వాలి. అందుకోసం తానెంతయినా కష్టపడాలి. ఇదీ ఆమెకు జీవితం నిర్దేశించిన దారి. ఆ దారి ఆమెను దేశం ఎల్లలు దాటించింది. పరాయి దేశంలో ఆ భాషలు నేర్చుకుంది. చదువుకుంది. ఆ దేశపు మంత్రిత్వ శాఖలో ఉద్యోగంలో చేరింది. ఆ విధుల్లో ఏకైక మహిళ రషీదా బేగం షేక్ పరిచయం ఇది.
బతుకు బడి
రషీదా పుట్టింది తమిళనాడులో. ఆమె చిన్నప్పుడే తండ్రి ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లాలోని గూడూరుకి వచ్చి స్థిరపడ్డారు. రషీదా బాల్యం, చదువు గూడూరులోనే. ఆమె పాఠశాల చదువు పూర్తయ్యేలోపు తండ్రి పోవడంతో కష్టాలు మొదలయ్యాయి. క్లాసులో ఫస్ట్ ర్యాంకులో చదివిన రషీదకు టెన్త్ క్లాస్ హాల్ టికెట్ తెచ్చుకోవడానికి పాతిక రూపాయలు కష్టమయ్యాయి. చదువు విలువ తెలియని తల్లి కారణంగా రషీదా చదువాగిపోయింది.
అడిగిన వారికిచ్చి పెళ్లి చేశారు. వ్యసనపరుడైన భర్త వదిలేసి పోవడంతో ఇద్దరు పిల్లలను పోషించుకోవడానికి వదిన సహాయంతో కువైట్‌కి వెళ్లింది. పిల్లలను అక్క దగ్గర వదిలి కువైట్‌లో ఉద్యోగంలో చేరిన రషీదా లక్ష్యం ఒక్కటే. బాగా డబ్బు సంపాదించాలి, పిల్లల్ని బాగా చదివించాలి. నెలకు నాలుగు వేల రూపాయల ఉద్యోగంతో మొదలైన ఆమె ప్రస్థానంలో ఆమె చేరిన మైలురాయి ఏమిటో తెలుసా? కువైట్ పబ్లిక్ రిలేషన్స్, ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీలో అఫిషియల్ ఫొటోగ్రాఫర్.
ఇదేమీ సినిమా కథలా ఒక రీల్‌లో జరిగిపోలేదు. ఆమె ప్రయాణంలో ఒక్కొక్క అడుగూ చిట్టడవిలో దారి వెతుక్కుంటూ సాగింది. ఒక్కొక్క సంఘటన ఒక్కోపాఠం. భాష తెలియక యజమానురాలి ఆదేశం సరిగ్గా అర్థం కాకపోవడం, దాంతో ఆమెకు ఆగ్రహం కట్టలు తెంచుకోవడం, రషీద ఉన్న గది తలుపు వేసి రెండో రోజు వరకు తియ్యకపోవడం... ఇండియాకి వెళ్లిపోదామనిపించిన చేదు అనుభవం. పిల్లల్ని బాగా చదివించాలి... ఒక్కటే లక్ష్యం ఆమెను కువైట్‌లో కట్టిపడేసింది. ఇటాలియన్ వంటల పుస్తకంలోని బొమ్మల ఆధారంగా రకరకాల సలాడ్‌లు చేసి జీతం పెంచుకుంది.
కష్టాల పాఠాలు
రషీదా ఓ రోజు పైకి ఎక్కి కిటికీలను తుడుస్తూ కాలు జారి పడిపోయింది. కాలుకు కట్టు కట్టించారు. ఆ ఒక్కరోజే రెస్ట్. రెండో రోజు చేతి కర్ర ఇచ్చి పని చేయమన్నారు. కాలికి కట్టు, కర్ర సాయంతో నడుస్తూ ఇంటి పనంతా చేయాల్సి వచ్చింది. చిమ్మ చీకటిలోనూ ఒక వెలుగురేఖ ప్రకాశిస్తుందనడానికి నిదర్శనం ఆ ఇంటి అమ్మాయి బ్యూటీషియన్ కావడం. ఆమెకు సహాయం చేస్తూ కోర్సు మొత్తం నేర్చుకుంది రషీదా. బ్యూటీషియన్‌గా పని చేసింది. ఒకరోజు అరబ్ వార్తాపత్రికలో మహిళలకు ఫొటోగ్రఫీలో శిక్షణ, ఉద్యోగం ప్రకటన ఆమెను కొత్త దారి పట్టించింది.
ఆ ప్రకటనలో ఆమెకు అర్థమైంది మహిళ ఫొటో, కెమెరా బొమ్మ, జీతం అంకె మాత్రమే. కోర్సులో చేరి ఫొటోగ్రఫీ నేర్చుకుంది. డిగ్రీ ఉంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని చెప్పారెవరో. ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ బీకామ్ చేసింది. ఇంగ్లిష్ మాట్లాడడంతోపాటు అరబ్బీ చదవడం, రాయడం కూడా నేర్చుకుంది. గవర్నమెంట్‌లో స్వీపర్ ఉద్యోగం అయినా చేస్తానని తెలిసిన వాళ్లందరినీ అడిగింది. కానీ ఆమె కోసం అఫిషియల్ ఫొటోగ్రాఫర్ ఉద్యోగం ఎదురు చూసింది. ఇప్పుడామె తనకంటూ మినిస్ట్రీలో ఒక అఫిషియల్ క్యాబిన్, పోలీస్ జాకెట్‌తో ఉన్నతస్థాయిలో ఉన్న విజేత. కొడుకులిద్దరూ ఆమె కోరుకున్నట్లే ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.
విజేత లక్ష్యం
రషీదా ప్రస్థానం పర్వత శిఖరం చేరిన తర్వాత అక్కడే ఆగిపోలేదు. పరాయి దేశంలో ఒంటరి మహిళకు ఎదురయ్యే కష్టాలను స్వయంగా అనుభవించింది. ఉపాధి కోసం బయటి ప్రాంతాలకు వెళ్లే వారికి మంచి దారి చూపించాలనుకుంది. ఉమెన్స్ థ్రైవ్ ఏపీ పేరులో స్వచ్ఛంద సంస్థను స్థాపించి మహిళలను శిక్షణనిస్తోంది. టైలరింగ్, బ్యూటీషియన్, ఇంగ్లిష్ చదవడం– మాట్లాడడం, కేక్ తయారీ, పెళ్లి మండపాల అలంకరణ వంటి పనుల్లో శిక్షణనిస్తోంది. అలాగే ఉజ్వల భవిష్యత్తు పేరుతో పాఠశాల పిల్లలకు కెరీర్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయోననే అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత ఇండియాకి వచ్చి పూర్తి స్థాయిలో మహిళలు, పిల్లల కోసం పని చేయాలనేదే తన లక్ష్యం అంటోంది రషీదా బేగం షేక్.
ఇకిగాయ్ నేర్పించింది
ఫొటోగ్రఫీతోపాటు ఫొటోషాప్ కోర్సు నేర్చుకోవడానికి వెళ్లినప్పటికి నాకు కీబోర్డ్ కాదు కదా, మౌస్ కదపడం కూడా రాదు. బ్యూటీషియన్‌గా కొనసాగమని సూచించారు. అప్పుడు నాకెంత ఉక్రోషం వచ్చిందంటే... ఆ మాట అన్న వారి నంబర్ బ్లాక్ చేసేశాను. ఏడాది తర్వాత వారికి ఒక ప్రోగ్రామ్‌కి ఫొటోగ్రాఫర్ అవసరం ఏర్పడినప్పుడు ఎంక్వయిరీ చేస్తే ఎవరో నా పేరు చెప్పారట. వాళ్ల ఈవెంట్ కోసం నన్నే పిలిచారు. మరొక సందర్భంలో నా దుస్తుల కారణంగా చిన్నచూపుకు గురవుతున్నానని తెలిసింది. నేను నేర్చుకున్న మరో పాఠం అది. జపాన్ పుస్తకం ఇకిగాయ్ ద్వారా చాలా తెలుసుకున్నాను. ఉమెన్స్ థ్రైవ్ కోర్సులో ఈ పుస్తకంలోని అంశాలను చేర్చాను. నన్ను నేను మలుచుకున్నట్లే సాటి మహిళలను తీర్చిదిద్దాలనేది నా ఆకాంక్ష.
– రషీదా బేగం షేక్, ఫొటోగ్రాఫర్, మంత్రిత్వ శాఖ, కువైట్
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment