కెమేరా కన్నుల్లో... ప్రకృతి బంధనం
ఆశపడడానికీ, ఆశించింది అందుకోవడానికీ మధ్య చాలా తేడా ఉంది. ఆశపడడం సులభమే. కానీ ఆశించినదాన్ని అందుకోవడం మాత్రం అంత సులభం కాదు. సమయం మరచి, సాధన చేయాలి. అవిశ్రాంతంగా శ్రమించాలి. అప్పుడే అనుకున్నది దక్కుతుంది. లక్ష్యాన్ని ఛేదించడం సాధ్యపడుతుంది. ఇవన్నీ రతికా రామస్వామి అనుభవం తెలిపే మాటలు. ఇటీవలే హైదరాబాద్ వచ్చి ఫొటోగ్రఫీ వర్క్‌షాప్‌ను నిర్వహించిన వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ రతిక సాగించిన ప్రయాణం ఆసక్తికరం, స్ఫూర్తిదాయకం!
మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నా, ఇప్పటికీ పురుషులు మాత్రమే అడుగుపెట్టే రంగాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఫొటోగ్రఫీ ఒకటని చెప్పవచ్చు. బరువైన కెమెరాను భుజాన వేసుకుని, ఎక్కడెక్కడికో వెళ్లి, ఏవేవో దృశ్యాలను ఒడిసిపట్టడం అంత తేలికేమీ కాదు. ఇక వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ అయితే... ఆ కష్టం రెట్టింపు ఉంటుంది. మనిషిని కదలకుండా ఆగమంటే ఆగుతాడు. కానీ జంతువులు, పక్షులు ఆగవు. అలాంటి వాటి వెంటపడి, వాటిని కెమెరాలో బంధించడం సామాన్యమైన విషయం కాదు. అయినా అది చేయడానికే ఇష్టపడ్డారు రతిక. మగవాళ్లకే చాలెంజింగ్‌గా ఉండే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ రంగంలో అడుగుపెట్టి, దశాబ్దకాలంగా తిరుగులేకుండా వెలుగుతున్నారు!
ఆసక్తిగా మొదలై...
తమిళనాడులోని తేని ప్రాంతంలో జన్మించారు రతిక. తండ్రి సైనిక అధికారి. తల్లి టీచర్. ఒక్కగానొక్క కూతురు కావడంతో కోరుకున్నవన్నీ కాళ్ల దగ్గరకు వచ్చేవి. చిన్నతనం గురించి తలచుకున్నప్పుడు రతికకి మొదట గుర్తొచ్చేది సెలవుల గురించే. బడి ఇలా మూయగానే విహార యాత్రలకు వెళ్లేది వారి కుటుంబం. సైనికాధికారి అయిన తండ్రి వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించడంతో చాలా ప్రదేశాలు చూసే అవకాశమూ కలిగింది. అయితే ఎక్కడికి వెళ్లినా అక్కడి ప్రకృతి, జంతువుల మీదే ఉండేది రతిక దృష్టి. అది గమనించిన ఆమె తండ్రి, పదకొండో తరగతి చదువుతున్నప్పుడు రతికకు ఒక కెమెరాను బహూకరించారు. ఫొటోగ్రఫీ వైపు అడుగులు వేయడానికి ఆ సంఘటనే పురికొల్పింది!
మొదట్లో ఇంటినీ, గార్డెన్‌నీ ఫొటోలు తీస్తుండేవారు రతిక. వెళ్లిన ప్రతిచోటా అందాలను బంధించాలని చూసేవారు. అయితే 2003లో భరత్‌పూర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించినప్పుడు ఫొటోగ్రఫీ మీద ఆమెకున్న మమకారం రెట్టింపయ్యింది. అక్కడున్న జంతువులు, పక్షులను రకరకాల కోణాలలో ఫొటోలు తీసింది. అవి అద్భుతంగా వచ్చాయి. దాంతో వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌ను కావాలన్న కోరిక రతిక మనసులో బలంగా నాటుకుపోయింది. ఆమె అభిరుచి గురించి విన్న ఇంట్లోవాళ్లు అభ్యంతర పెట్టలేదు. కంప్యూటర్ ఇంజినీరింగ్ , ఎంబీయే పూర్తి చేసిన కూతురు లక్షలు సంపాదించే ఉద్యోగం చేయాలనుకోకుండా జంతువుల వెంట పడి తిరుగుతానన్నా కాదనలేదు. దాంతో రతిక కోరుకున్న మార్గంలో నిరాటంకంగా కొనసాగిపోయారు.
ఎడతెగని ఉత్సాహంతో...
వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్లకి పెను సవాలు... ప్రకృతి. ఫొటోషూట్ ప్లాన్ చేసుకుని, అన్నీ అమర్చుకుని, రహస్యంగా ఓ మూల నక్కి జంతువుల కోసం ఎదురు చూస్తుంటారు. అలాంటప్పుడు హఠాత్తుగా ఆకాశం మేఘావృతమై సూర్యకాంతి తగ్గిపోతే? ఊహించని విధంగా వర్షం కురవడం మొదలుపెడితే? అలా చాలాసార్లు జరిగిందంటారు రతిక. ‘ప్రకృతి ఎప్పుడెలా మారుతుందో తెలియదు. అన్ని ఏర్పాట్లూ చేసుకున్న తర్వాత మార్పులు ఏర్పడి షూట్ క్యాన్సిలయ్యే పరిస్థితి చాలాసార్లు ఏర్పడుతుంది. కానీ ఏం చేస్తాం... ప్రకృతిని మనం నియంత్రించలేం కదా’ అంటారావిడ. అడవుల్లో, కొండల్లో, లోయల్లో సంచరిం చడం తేలికైన విషయం కాదుగా అంటే... ‘ఎడతెగని ఉత్సాహం ఉంటే ఏదీ కష్టం కాదు. నేనెప్పుడూ దీన్ని కష్టమను కోలేదు’ అంటారు దృఢంగా. మిగతా రంగాల్లో మాదిరిగా ఇక్కడ కూడా మహిళలకు ఇబ్బందులు ఎదురవుతాయా అంటే... ‘వివక్షకు తావే లేదు. ఎందుకంటే ఫొటో తీస్తున్నది ఆడో మగో జంతువులకి తెలియదుగా’ అంటూ నవ్వేస్తారు.
రతిక మాట్లాడే ప్రతి మాటలోనూ ఆత్మవిశ్వాసం కనబడుతుంది. ఆమె తీసే ప్రతి ఫొటోలోనూ ఆమె శ్రమ, తపన కనిపిస్తాయి. అవే ఆమెను సక్సెస్ ఫుల్ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌ని చేశాయి. ఈ రోజు ఆమె గురించి ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేశాయి.
వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌కి ఉండాల్సిన ప్రధానమైన లక్షణం... ఓర్పు. ఎందుకంటే మనుషుల మాదిరిగా జంతువులు ఫొటోలకి ఫోజులివ్వవు. మనకు కావలసిన ఎక్స్‌ప్రెషన్‌ని మనమే పట్టుకోగలగాలి. అది వచ్చే వరకూ వేచి ఉండాలి. ఆ ఓర్పు లేకపోతే కష్టం. మరో విషయం ఏమిటంటే... జంతువుల ప్రవర్తన గురించి పూర్తిగా అధ్యయనం చేయాలి. ఏ జంతువు ఎలా ప్రవర్తిస్తుంది, దేనికెలా స్పందిస్తుంది అన్న విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఎందుకంటే వాటి మూడ్‌స మీదే మన ఫొటోగ్రఫీ ఆధారపడి ఉంటుంది. ఈ రెండూ తెలిసినవాళ్లు మంచి ఫొటోగ్రాఫర్ అయి తీరుతారు!