చాలా ఏళ్ళ నా కల FRAMES ఫొటో స్టూడియో. ఆ రోజే ఓపెనింగ్. మా గురువుగారు విచ్చేసి స్టూడియోకి ఒక కాప్షన్‌ని కానుకగా ఇచ్చారు.
‘There's more to life that meets the camera eye!’.
‘ఈ కాప్షన్‌కి అర్థమేంటి గురువు గారు?’ అడిగాను నేను.
'You don't have to know everything. You'll know it when you see it' అన్నారాయన.
ఆయన ఎందుకలా అన్నారో నాకు అప్పుడు అర్థం కాలేదు. ఎప్పటికైనా సరే, ఈ కాప్షన్ ఎందుకు పెట్టారో తెలుసుకోవాలనిపించింది.
స్టూడియో ఓపెనింగ్ రోజున గంగిరెద్దుల్ని ఆడించే ఆయనొచ్చాడు. నాకు శుభసూచకంగా అనిపించింది. చిన్నప్పటి నుండి సంక్రాంతి వచ్చిందంటే చాలు వారితో వీధులు కళకళలాడిపోయేవి. అందుకే వారిని చూసినప్పుడల్లా శుభానికి చిహ్నాలుగా నా స్మృతిపథంలో మిగిలిపోయారు. ఆ గంగిరెద్దులాయన నా ముందు తన కోరికను వెలిబుచ్చాడు.
‘బాబయ్యా, మా బసవణ్ణతో ఒక్క ఫొటో తీసిపెట్టవా? బసవడితో ఒక్క ఫోటో దిగాలన్న కోరిక అలాగే మిగిలిపోయుండాది.’
నేను సమాధానం ఇచ్చేలోపే మా గురువుగారు అడ్డుపడ్డారు. ‘ఫ్రేమ్ అప్పర్స్ అని ఫ్రేమ్ డౌనర్స్ అని ఉంటారు. ఫొటోగ్రాఫర్ మొదటి ఫ్రేమ్ అందంగా ఉండాలి. రోజూ చూసే మొహాల్ని ఏం తీస్తాం చెప్పు’అంటూ నవ్వాడు ఆయనొక్కడే.
ఆ గంగిరెద్దులాయనే కాదు నేను కూడా ఎంతగానో నొచ్చుకున్న సందర్భం అది. కానీ గురువుగా ఆయననే ఆహ్వానించాను కాబట్టి, ఆ రోజున ఆయన మాటకు ఎదురు చెప్పలేకపోయాను. బాధతో నిష్క్రమించిన ఆ గంగిరెద్దులాయన మాత్రం నా మస్తిష్కం అనే ఫొటోస్టూడియోలో ఫ్రేమ్‌గా మిగిలిపోయాడు.
నేనొక ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌ని. పైగా నాస్తికుడిని కూడా. నాకు ఫొటోగ్రఫీ నేర్పించిన గురువుగారి ప్రభావం నాపై చాలా ఉండేది. ఆయన ఏం చేస్తే అది చేస్తూ ఉండేవాణ్ణి. ఆయన ఎథీస్ట్ అని తెలిసింది ఒక రోజున. ఆ ఇంగ్లిష్ పదానికి అర్థం తెలియకపోయినా నేనూ అదేనంటూ ప్రగల్భాలు పలికా నా మిత్రుడితో. అతను పరమ భక్తుడు. వెంటనే నవ్వేశాడు.
‘ఎందుకు నవ్వుతున్నావ్?’
‘ఆ పదానికి అర్థం కూడా తెలీకుండా నేనూ అదే అంటూవుంటే నవ్వొచ్చిందిరా!’
‘అయినా దేవుడు ఎక్కడున్నాడురా? క్లాస్‌లో మన సర్ చెప్పింది వినలేదా? ఆయన లాజిక్ నూటికి నూరు శాతం కరెక్ట్. కనిపించని వాటిని నమ్మకపోవటమే నయం.’
‘ఒకటి లేదు అంటున్నావంటేనే దాని ఉనికిని నువ్వు అంగీకరిస్తున్నట్టే లెక్క కదరా..‘
‘అర్థం కాలేదు!’
‘ఒకప్పుడు ఉండటం అంటూ జరిగితేనే కదా ఇప్పుడు లేకపోవటం అంటూ జరిగేది. ఒక వస్తువు ఇక్కడ పెట్టావు. అదిప్పుడు లేదు. ఒక అరగంట క్రితం ఇక్కడే ఉంది. ఇప్పుడు నీ ముందు లేదంతే. ఎక్కడో ఉంది. అది నీకు కనబడట్లేదు.’
‘అర్థం అవుతున్నట్టే ఉంది. కానీ నువ్వు భక్తుడివి కాబట్టి నేను కన్విన్స్ అవ్వట్లేదురా..’
‘ఉంది అన్నా, లేదు అన్నా దాని ఉనికిని అంగీకరిస్తున్నట్టే అవుతుంది కదరా! అసలు ఆ బ్రహ్మ పదార్థం ఉందో లేదో అనుభవం ఉన్నవాళ్లు చెప్పాలి. దైవత్వం అనుభవంలోకి వస్తే ఇంకా మాటలెందుకు మిగులుతాయి చెప్పు..? కాబట్టి వ్యర్థమైన వాదనలతో కాలాన్ని వృథా చేసుకోకు. ఆయన గురువే కావొచ్చు. ఆయన చెప్పిన దాంట్లో నీకు పనికొచ్చే విషయాల్ని మాత్రమే తీసుకో! అనవసరం అయిన వాటి జోలికి వెళ్ళకు. మిత్రుడిగా నీ మంచి కోరి చెబుతున్నా. ఇక నీ ఇష్టం!’
వాడి మాటల్లో ఏం మాయ ఉందో తెలీదు కానీ, కేవలం ఫొటోగ్రఫీ పైనే దృష్టి పెడుతూ మిగతా విషయాల్ని పక్కన పెట్టేశాను. అప్పటి నుండి మంచి ఫొటోగ్రాఫర్ అవ్వటమే లక్ష్యంగా పనిచేశాను.
అలాంటి నేను ఇప్పుడు చేతిలో పనిలేకుండా అయిపోయాను. రోజూ స్టూడియోకి వెళుతున్నాను. పని ఉండట్లేదు. దానికి కారణం స్మార్ట్‌ఫోన్ డిజిటల్ ఫొటోగ్రఫీ అని నా ప్రగాఢ నమ్మకం.
ఇన్నేళ్లల్లో స్మార్ట్‌ఫోన్‌ని నేనెప్పుడూ వాడలేదు. ఎందుకో ఆ స్మార్ట్‌ఫోన్ భూతాన్ని చూస్తేనే చిరాకు. నాలాంటి ఎంతోమంది ఫొటోగ్రాఫర్‌లకు పనిలేకుండా చేస్తోంది. ఒకప్పుడు పాస్‌పోర్ట్ సైజు ఫొటో కోసం ఎగబడేవాళ్లు. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌తోనే తీసి అప్లోడ్ చేసి పంపించేస్తున్నారు చాలామంది.
ఒకప్పుడు ఫ్రెండ్స్ కలిసి గుర్తుగా ఫొటోలు దిగేవాళ్ళు మా స్టూడియోలో. మా స్టూడియోకొచ్చిన వాళ్లతో ఎటువంటి సంబంధం లేని ఒక ఫొటోగ్రాఫర్ తన నిర్మలమైన దృష్టితో ఒక ఫొటో తీస్తాడు. అంటే ఆ కాలాన్ని తన కంటితో బంధిస్తున్నాడు. ఆ క్షణానికి సొంతమైన ఒక నిజాన్ని ఫ్రేమ్ చేస్తున్నాడు. ఇది ఒక ఘనతే అనుకోవచ్చు. అలాంటి కళను మా నుండి దూరం చేసిన భావన కలిగింది ఈ స్మార్ట్‌ఫోన్ డిజిటల్ ఫొటోగ్రఫీ ఎక్కువైపోయాక! అందుకే నా జీవితంలో ఈ స్మార్ట్‌ఫోన్ భూతాన్ని దరిజేరనివ్వను అని శపథం చేశాను. అలాంటి నేను ఆ స్మార్ట్‌ఫోన్ చేతిలోనే అంత ఘోరంగా ఓడిపోతానని కలలో కూడా ఊహించలేదు.
నాకు పొద్దున్నే న్యూస్ పేపర్ చదవటం అలవాటు. న్యూస్‌లో కూడా క్రైమ్ సెక్షన్ అంటే ప్రత్యేకమైన ఇంట్రెస్ట్. ఒకరోజు పొద్దున్నే ఒక క్రైమ్ న్యూస్ కవరేజ్ నన్ను అమితంగా ఆకర్షించింది. పుణేలోని ఒక డెలివరీ బాయ్ దాదాపు 15 లక్షలు విలువ చేసే 18 స్మార్ట్‌ఫోన్స్ చోరీ చేశాడు అన్నది ఆ వార్త. ఇదంతా ఒక రెండు నెలల వ్యవధిలో జరిగిందట.
కస్టమర్స్ స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ చేశాక రీప్లేస్‌మెంట్ పెట్టుకునే ఆప్షన్ ఒకటుంది. వాళ్లకి హ్యాండ్ సెట్ నచ్చని పక్షంలో! ఈ సదుపాయాన్ని ఆ డెలివరీ బాయ్ దుర్వినియోగం చేశాడు. ఆ డెలివరీ బాయ్ స్మార్ట్‌ఫోన్‌ని తనే దోచేసి, కస్టమర్ రీప్లేస్‌మెంట్ పెట్టినట్టుగా సృష్టించాడట! అలా హ్యాండ్ సెట్ రీప్లేస్మెంట్ ఉన్న కస్టమర్‌ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూపోయే సరికి ఈ అబ్బాయి మీద అనుమానం పెరిగి చివరికి అరెస్ట్ చేశారు.
క్రైమ్ న్యూస్ ఇప్పటికి చాలాసార్లు చదివాను. కానీ ఎప్పుడూ కలగని ఓ ఆలోచన ఈసారి మాత్రమే కలిగింది. నాకు కూడా స్మార్ట్‌ఫోన్ చోరీ చేద్దాం అనిపించింది. నేను ఇంతవరకు స్మార్ట్‌ఫోన్ వాడలేదు. ఇంట్లో వాళ్ళని కూడా అడగలేదు. ఇన్నేళ్లల్లో స్మార్ట్‌ఫోన్‌కు, నాకూ మధ్యనున్న ఒక తెలియని దూరం శతృత్వంగా స్థిరపడిపోయింది నా మదిలో. నాకు పనిలేకుండా చేసిన ఆ స్మార్ట్‌ఫోన్‌ని ఇంకొకరికి దూరం చేసి దానిపై నాకుండిపోయిన పగ సాధిద్దాం అనిపించింది.
నాకు తెలిసిన ఒక డెలివరీ బాయ్ ఒకరోజు తను డెలివరీ చెయ్యాల్సిన ఐటమ్స్‌లో ఆ ఖరీదైన ఒక స్మార్ట్‌ఫోన్‌ని తీసుకుని అదేదో నా కోసమే అన్నట్టుగా మా స్టూడియోకొచ్చాడు.
‘అన్నా, ఇవ్వాళ వర్క్ లోడ్ ఎక్కువైపోయింది. అన్ని ఆర్డర్లు డోర్ డెలివరీ చేయగలిగాను కానీ చివరిగా ఒక్క స్మార్ట్‌ఫోన్ మిగిలిపోయింది. ఇది మీరు ఇంటికెళ్ళే దారిలోనే ఉన్న అడ్రస్. చాలా సందులు, గొందులు తిరగాలి. దయచేసి ఈ ఒక్కసారికి ఇచ్చేస్తావా?’ అని అడిగాడు.
‘సరే.. అడ్రస్ ఎక్కడన్నావ్?’
‘అదే అన్నా.. మీ ఇంటి దగ్గర నేతి గారెల షాప్ బాగా ఫేమస్ కదా! ఆ సందులోనే చివరి ఇల్లు. శివుడి ఇల్లు అని అడిగితే ఎవరైనా చెబుతారంట మరి!’
‘శివుడి ఇల్లా? అది కైలాసం కదా..’ అన్నాను.
‘ఇంటి దొంగను ఈశ్వరుడు అయినా పట్టలేడు అంటారు. వీళ్ళ ఇంటికి ఆ ఇబ్బందేం లేదనుకుంటా’ అంటూ నవ్వాడు వాడు.
స్మార్ట్‌ఫోన్ కొట్టేద్దామనే నా ఆలోచన పసిగట్టినట్టే సామెత చెప్పాడేంటీ అని ముచ్చెమటలు పట్టాయి నాకు. దేవుడనే వాడుండి.. జరగబోయేదాన్ని ఇలా ముందుగానే పలికిస్తాడా ఏంటీ.. అనిపించింది.
‘శివుడు ఆయన పేరా?’ మళ్ళీ అడిగాను.
‘అదే తెలియట్లేదన్నా.. శివుడి ఇల్లు అని అడిగితే ఎవరైనా చెబుతారని ఇందాక కస్టమరే చెప్పాడు ఫోన్‌లో అక్కడికెళ్ళాక డౌట్ వస్తే నాకు కాల్ చెయ్’ అన్నాడు.
నేను ధైర్యం చేశాను. స్టూడియో కట్టేసి ఆ స్మార్ట్‌ఫోన్ తీసుకుని రోజూ నేను వెళ్లే దారిలోనే వెళుతున్నాను. కానీ, అవ్వాళ నా మనసు మనసులో లేదు. ధ్యాస అంతా దొంగతనంపైనే ఉంది. నేను వెళ్లే దారిలో శివుడి గుడి ఒకటుంటుంది. ప్రతిరోజూ, అక్కడి నుండి ఏదో ఒకటి వినిపిస్తూనే ఉంటుంది. ఆరోజు మొట్టమొదటిసారి చెవులు రిక్కించి వింటున్నానో.. మరేంటో తెలియదు కానీ గుడిలో జరుగుతున్న ప్రవచనంలో నుండి కొన్ని మాటలిలా వినబడ్డాయి.. ‘ఎదుటివాడికి మోసం చెయ్యాలనే బుద్ధి పుట్టినప్పుడే మనం మోసం చేసేసినట్టు.
ఏ కర్మ చెయ్యాలన్నా అది మనసులో నుండి పుట్టాలి. అలాంటి కర్మ చెయ్యాలి అనే ప్రేరణను బుద్ధి మనకిస్తుంది. అది మంచి అయినా.. చెడు అయినా! ఆ బుద్ధికి ప్రేరణను దేవుడే కలిగిస్తున్నాడనుకుంటాడు మనిషి. అందుకే, చెడు కూడా ఆయనే చేయిస్తున్నాడన్న భ్రమలో బతుకుతాడు. నిజానికి నువ్వు చేసే మంచికి ఆయన కారణం కాదు. నువ్వు చేస్తున్న చెడుకి ఆయన కారణం కాదు. ఎవరి కర్మానుసారం వారు ప్రవర్తిస్తూంటారు. భగవంతుడు మనలో ఉండే ఆత్మ చైతన్య శక్తి మాత్రమే!’
ఆగి ఒక్క నిమిషం అటు వైపుగా చూశాను. నాలో ఉదయించబోయే కాంతికి ఆయన వాక్యాలు సంకేతాలుగా కనబడ్డాయి. అనుకోకుండా ఆ ప్రవచనకర్త వైపు చూశాను. లిప్త కాలమైనా సరే ఏదో తెలియని అలౌకిక స్థితి నెలకొన్నది నాలో. ఆ భావాన్ని ఏమంటారో చెప్పలేని మనఃస్థితి నాది. ఇన్ని విషయాలు నా గుండెకేం తెలుస్తాయి.. కన్నీటి రూపంలో వెల్లడయ్యాయి.
జ్ఞానం వచ్చే లోపే అహం అడ్డొస్తుంది. అహం దహనం అయితే తప్ప అజ్ఞానం తొలగదు. అజ్ఞానం పూర్తిగా తొలిగితే తప్ప జ్ఞానం రాదు. అప్పుడు నాకదే జరిగింది. కన్నీళ్లు తుడుచుకుని సరాసరి ఆ నేతి గారెల షాప్ వరకు వెళ్లాను.. ఏ ఆలోచనను రానివ్వకుండా! అక్కడ ఒకతను కనిపించాడు.
‘శివుడి గారిల్లు తెలుసా అండి?’ అడిగానో లేదో
‘నేను ఆయనింటికే వెళుతున్నానండీ.. ఇంతకీ మీరెవరు?’ తిరిగి ప్రశ్నించాడు.
‘ఆయనకో పార్సెల్ ఇవ్వటానికి వచ్చానండీ..’ అని చెప్పేసి ఆ వస్తువును అక్కడే పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోయాను భయం భయంగా.
ఆయన నన్ను పిలుస్తున్నా సరే వెనక్కి తిరిగి చూడలేదు. కొంత దూరం నడిచాక మళ్ళీ వెనక్కి తిరిగొచ్చాను. నేతి గారెల షాప్‌లో చుట్టూ చూశాను. ఆయన కనబడలేదు. ఈసారి షాప్ ఓనర్‌ని శివుడి ఇల్లు చిరునామా అడిగాను. చెప్పాడు.
ఆయన చెప్పిన వీధిలో వెళుతూంటే శివుడి ఇల్లు కనబడింది దూరం నుంచి. ఎవరో ఒకాయన ఒక వస్తువును ఆ ఇంటి ప్రహరీగోడపై ఉంచి మాట్లాడుతూన్నాడు.
శివుడితోటే కాబోలు. ఆ వస్తువును గోడపై ఉంచిన విషయం మరిచిపోయి ఆయన, శివుడు ఇరువురూ ఇంట్లోకి కదిలారు. వెంటనే నేను నా ముఖం కనిపించకుండా చొక్కాని పైకి లాక్కుని.. మెల్లగా ఆ వస్తువును తీసుకుని అక్కడి నుండి పరిగెత్తాను. వెనక్కి తిరిగి చూడకుండా అలా చీకట్లో ఎంత సేపు పరిగెత్తానో తెలీదు. ఇంటికి చేరిపోయాను.
శివుడి దగ్గరుండాల్సిన ఆ వస్తువు ఇప్పుడు నా దగ్గరుంది. తెరిచి చూశాను. స్మార్ట్‌ఫోన్.. నిజంగానే నా కంటికి భూతంలా కనిపించింది. చార్జింగ్ పెట్టి వాడదామనుకున్నాను. ఇప్పుడు దాన్ని చూస్తూంటే పరమశివుడి చేతిలో ఉండే డమరుకం గుర్తుకొస్తోంది. శివుడు అనే ఆ కస్టమర్ ఎలా ఉంటాడో తెలీదు. ఆయన దగ్గరుండాల్సిన వస్తువును నేను తస్కరించాను అనే భావనే నాకు నిద్రపట్టనివ్వట్లేదు. వెనక్కి తిరిగొచ్చి దొంగతనం చేసింది కేవలం స్మార్ట్‌ఫోన్ పై నాకున్న పగ, ద్వేషం వల్లనే. దొంగలించిన తర్వాత మాత్రం స్మార్ట్‌ఫోన్ మీదున్న నా పగ ఏమైందో నాకు అర్థం కాలేదు. దొంగతనం చేశానన్న భావన నన్ను కుంగదీయసాగింది.
దేవుడిపై నమ్మకం లేకపోయినా ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అనుకున్నాను. అతికష్టం మీద నిద్రపట్టింది. నిద్రలో కల.. గంగిరెద్దులాయన నా ఫొటోస్టూడియోకొచ్చాడు.
‘బాబయ్యా, నా ఫొటో వచ్చినాది’ అన్నాడు.
‘అవునా? ఎక్కడ? చూపించు..?’ అడిగాను.
‘ఇదిగో..’ అంటూ తన స్మార్ట్‌ఫోన్‌లో తను దిగిన సెల్ఫీని చూపిస్తూ ఆనందబాష్పాలతో నన్ను చూశాడు. ‘నేను, నా బసవడు’ అంటూ నా ముందే మరొక సెల్ఫీ దిగాడు. కెమెరా షట్టర్ సౌండ్ వచ్చింది. ‘రోజూ కనిపించే మేము ఎంత అందంగా వచ్చామో చూడయ్యా’ అన్నాడు నాతో.
ఆ మాట ఎక్కడో గుచ్చుకుంది నాకు. సమాధానం బలంగా తెలుస్తున్నట్టు అనిపించినా ‘నీ పేరేంటి?’ అడిగాను.
‘శివుడు’ నిండుగా నవ్వాడు. ‘ఇదే నా సిత్రం’ అంటూ ఆ సెల్ఫీని చూపించాడు. ‘వెళ్ళొస్తాను’ అంటూ నవ్వుతూ తన బసవడితో వెళ్తూ ఒకసారి వెనక్కి తిరిగి.. మా ఫొటోస్టూడియో బోర్డు చూసి ఆగిపోయాడు.
నా దగ్గరికొచ్చి నాకు మాత్రమే వినబడేలా.. ‘There's more to life that meets the camera eye!’ అన్నాడు.
మా గురువుగారు ఇచ్చిన ఆ కాప్షన్‌కి అర్థం ఇన్నాళ్లకి.. అది కలలో తెలిసింది. దిగ్గున లేచాను.
మధ్యరాత్రని కూడా చూడకుండా నేతి గారెల షాప్ మీదుగా శివుడి ఇల్లున్న వీధికి చేరుకున్నాను. చీకటిగా ఉండటంతో శివుడి ఇల్లు అంత త్వరగా కనబడలేదు. నంబర్ 10 అన్న సంఖ్య గుర్తుండటంతో పదో నెంబర్ ఇల్లు కనబడే దాకా వెళ్లాను. అలా ఇంటి గేట్ దగ్గరికి వెళ్ళానో లేదో ఇంటి వరండా ముందరి జీరో బల్బ్ వెలిగింది. తలుపు తీస్తూ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఒక వ్యక్తి గేట్ వైపుగా వస్తున్నాడు. నేను భయపడుతూన్నాను. నా ముఖం కనిపించకుండా గుడ్డ అడ్డుపెట్టుకుని ఉన్నాను. ఆ వ్యక్తి సరిగ్గా గేట్ దగ్గరికి చేరగానే స్ట్రీట్ లైట్ వెలిగింది.
గేట్‌కి అటువైపునున్న ఆయన.. చేయి చాచాడు. నా చేతిలోని స్మార్ట్ ఫోన్‌ని ఆయనకు అందించాను.
‘ఎప్పటి నుండో పాడైన మా వీధి దీపం ఇప్పుడే వెలిగింది. పోయిన వస్తువు తిరిగి చేరాల్సిన చోటికే చేరింది. చీకటి పడింది. ఇక వెళ్ళిపో బాబయ్యా..’ అన్నాడు.
ఆ గంగిరెద్దులాయనే ఈ శివుడన్న విషయం నిర్ధారణయ్యి వెనుదిరుగుతున్న నాకు అప్పుడే జ్ఞానోదయం అయ్యింది. – ఈశ్వరచంద్ర
ఇవి చదవండి: ఇది.. 'మట్టిదిబ్బ' అనుకుంటున్నారా!?
Comments
Please login to add a commentAdd a comment