Public Relations Department
-
తానే దిద్దుకున్న బతుకు చిత్రం
బాల్యం పేదరికాన్ని పరిచయం చేసింది. చదువుకు దూరం చేసింది. అనివార్యంగా పెళ్లికి తలవంచాల్సి వచ్చింది. భర్త పట్టించుకోని ఇంటి బాధ్యతను మోయడానికి భుజాలనివ్వాల్సి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా ఐదుసార్లు వదిలి వెళ్లాడు భర్త. ఇద్దరు పిల్లలను పోషించుకోవాలి. తనకు దూరమైన చదువును వారికివ్వాలి. అందుకోసం తానెంతయినా కష్టపడాలి. ఇదీ ఆమెకు జీవితం నిర్దేశించిన దారి. ఆ దారి ఆమెను దేశం ఎల్లలు దాటించింది. పరాయి దేశంలో ఆ భాషలు నేర్చుకుంది. చదువుకుంది. ఆ దేశపు మంత్రిత్వ శాఖలో ఉద్యోగంలో చేరింది. ఆ విధుల్లో ఏకైక మహిళ రషీదా బేగం షేక్ పరిచయం ఇది.బతుకు బడి రషీదా పుట్టింది తమిళనాడులో. ఆమె చిన్నప్పుడే తండ్రి ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లాలోని గూడూరుకి వచ్చి స్థిరపడ్డారు. రషీదా బాల్యం, చదువు గూడూరులోనే. ఆమె పాఠశాల చదువు పూర్తయ్యేలోపు తండ్రి పోవడంతో కష్టాలు మొదలయ్యాయి. క్లాసులో ఫస్ట్ ర్యాంకులో చదివిన రషీదకు టెన్త్ క్లాస్ హాల్ టికెట్ తెచ్చుకోవడానికి పాతిక రూపాయలు కష్టమయ్యాయి. చదువు విలువ తెలియని తల్లి కారణంగా రషీదా చదువాగిపోయింది. అడిగిన వారికిచ్చి పెళ్లి చేశారు. వ్యసనపరుడైన భర్త వదిలేసి పోవడంతో ఇద్దరు పిల్లలను పోషించుకోవడానికి వదిన సహాయంతో కువైట్‌కి వెళ్లింది. పిల్లలను అక్క దగ్గర వదిలి కువైట్‌లో ఉద్యోగంలో చేరిన రషీదా లక్ష్యం ఒక్కటే. బాగా డబ్బు సంపాదించాలి, పిల్లల్ని బాగా చదివించాలి. నెలకు నాలుగు వేల రూపాయల ఉద్యోగంతో మొదలైన ఆమె ప్రస్థానంలో ఆమె చేరిన మైలురాయి ఏమిటో తెలుసా? కువైట్ పబ్లిక్ రిలేషన్స్, ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీలో అఫిషియల్ ఫొటోగ్రాఫర్. ఇదేమీ సినిమా కథలా ఒక రీల్లో జరిగిపోలేదు. ఆమె ప్రయాణంలో ఒక్కొక్క అడుగూ చిట్టడవిలో దారి వెతుక్కుంటూ సాగింది. ఒక్కొక్క సంఘటన ఒక్కోపాఠం. భాష తెలియక యజమానురాలి ఆదేశం సరిగ్గా అర్థం కాకపోవడం, దాంతో ఆమెకు ఆగ్రహం కట్టలు తెంచుకోవడం, రషీద ఉన్న గది తలుపు వేసి రెండో రోజు వరకు తియ్యకపోవడం... ఇండియాకి వెళ్లిపోదామనిపించిన చేదు అనుభవం. పిల్లల్ని బాగా చదివించాలి... ఒక్కటే లక్ష్యం ఆమెను కువైట్‌లో కట్టిపడేసింది. ఇటాలియన్ వంటల పుస్తకంలోని బొమ్మల ఆధారంగా రకరకాల సలాడ్లు చేసి జీతం పెంచుకుంది.కష్టాల పాఠాలురషీదా ఓ రోజు పైకి ఎక్కి కిటికీలను తుడుస్తూ కాలు జారి పడిపోయింది. కాలుకు కట్టు కట్టించారు. ఆ ఒక్కరోజే రెస్ట్. రెండో రోజు చేతి కర్ర ఇచ్చి పని చేయమన్నారు. కాలికి కట్టు, కర్ర సాయంతో నడుస్తూ ఇంటి పనంతా చేయాల్సి వచ్చింది. చిమ్మ చీకటిలోనూ ఒక వెలుగురేఖ ప్రకాశిస్తుందనడానికి నిదర్శనం ఆ ఇంటి అమ్మాయి బ్యూటీషియన్ కావడం. ఆమెకు సహాయం చేస్తూ కోర్సు మొత్తం నేర్చుకుంది రషీదా. బ్యూటీషియన్‌గా పని చేసింది. ఒకరోజు అరబ్ వార్తాపత్రికలో మహిళలకు ఫొటోగ్రఫీలో శిక్షణ, ఉద్యోగం ప్రకటన ఆమెను కొత్త దారి పట్టించింది. ఆ ప్రకటనలో ఆమెకు అర్థమైంది మహిళ ఫొటో, కెమెరా బొమ్మ, జీతం అంకె మాత్రమే. కోర్సులో చేరి ఫొటోగ్రఫీ నేర్చుకుంది. డిగ్రీ ఉంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని చెప్పారెవరో. ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ బీకామ్ చేసింది. ఇంగ్లిష్ మాట్లాడడంతోపాటు అరబ్బీ చదవడం, రాయడం కూడా నేర్చుకుంది. గవర్నమెంట్లో స్వీపర్ ఉద్యోగం అయినా చేస్తానని తెలిసిన వాళ్లందరినీ అడిగింది. కానీ ఆమె కోసం అఫిషియల్ ఫొటోగ్రాఫర్ ఉద్యోగం ఎదురు చూసింది. ఇప్పుడామె తనకంటూ మినిస్ట్రీలో ఒక అఫిషియల్ క్యాబిన్, పోలీస్ జాకెట్‌తో ఉన్నతస్థాయిలో ఉన్న విజేత. కొడుకులిద్దరూ ఆమె కోరుకున్నట్లే ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.విజేత లక్ష్యం రషీదా ప్రస్థానం పర్వత శిఖరం చేరిన తర్వాత అక్కడే ఆగిపోలేదు. పరాయి దేశంలో ఒంటరి మహిళకు ఎదురయ్యే కష్టాలను స్వయంగా అనుభవించింది. ఉపాధి కోసం బయటి ప్రాంతాలకు వెళ్లే వారికి మంచి దారి చూపించాలనుకుంది. ఉమెన్స్ థ్రైవ్ ఏపీ పేరులో స్వచ్ఛంద సంస్థను స్థాపించి మహిళలను శిక్షణనిస్తోంది. టైలరింగ్, బ్యూటీషియన్, ఇంగ్లిష్ చదవడం– మాట్లాడడం, కేక్ తయారీ, పెళ్లి మండపాల అలంకరణ వంటి పనుల్లో శిక్షణనిస్తోంది. అలాగే ఉజ్వల భవిష్యత్తు పేరుతో పాఠశాల పిల్లలకు కెరీర్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయోననే అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత ఇండియాకి వచ్చి పూర్తి స్థాయిలో మహిళలు, పిల్లల కోసం పని చేయాలనేదే తన లక్ష్యం అంటోంది రషీదా బేగం షేక్. ఇకిగాయ్ నేర్పించింది ఫొటోగ్రఫీతోపాటు ఫొటోషాప్ కోర్సు నేర్చుకోవడానికి వెళ్లినప్పటికి నాకు కీబోర్డ్ కాదు కదా, మౌస్ కదపడం కూడా రాదు. బ్యూటీషియన్‌గా కొనసాగమని సూచించారు. అప్పుడు నాకెంత ఉక్రోషం వచ్చిందంటే... ఆ మాట అన్న వారి నంబర్ బ్లాక్ చేసేశాను. ఏడాది తర్వాత వారికి ఒక ప్రోగ్రామ్‌కి ఫొటోగ్రాఫర్ అవసరం ఏర్పడినప్పుడు ఎంక్వయిరీ చేస్తే ఎవరో నా పేరు చెప్పారట. వాళ్ల ఈవెంట్ కోసం నన్నే పిలిచారు. మరొక సందర్భంలో నా దుస్తుల కారణంగా చిన్నచూపుకు గురవుతున్నానని తెలిసింది. నేను నేర్చుకున్న మరో పాఠం అది. జపాన్ పుస్తకం ఇకిగాయ్ ద్వారా చాలా తెలుసుకున్నాను. ఉమెన్స్ థ్రైవ్ కోర్సులో ఈ పుస్తకంలోని అంశాలను చేర్చాను. నన్ను నేను మలుచుకున్నట్లే సాటి మహిళలను తీర్చిదిద్దాలనేది నా ఆకాంక్ష. – రషీదా బేగం షేక్, ఫొటోగ్రాఫర్, మంత్రిత్వ శాఖ, కువైట్– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కరోనా సోకిన జర్నలిస్టులకు ప్రత్యేక వైద్య సదుపాయాలు
సాక్షి, అమరావతి: కరోనాకు గురైన పాత్రికేయులు, వారి కుటుంబసభ్యులకు వైద్యం అందించేందుకు ప్రతి జిల్లాలో ఒక ఆసుపత్రిని గుర్తించనున్నామని సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆసుపత్రిలో పాత్రికేయులకు వైద్య పరీక్షలు నుంచి అడ్మిట్ చేసుకొని వైద్యం అందించే వరకు ప్రతి జిల్లాలో సమాచార శాఖ అధికారి, వైద్య ఆరోగ్య శాఖ అధికారి కలిసి.. సహకారం అందించనున్నారని చెప్పారు. పాత్రికేయులకు వైద్యం అందించేందుకు రాష్ట్ర స్థాయిలో నోడల్ అధికారిగా సమాచార శాఖ సంయుక్త సంచాలకుడు పోతుల కిరణ్‌కుమార్‌ను నియమించామన్నారు. ప్రతి జిల్లాలో సమాచార శాఖ, వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధులను నోడల్ అధికారులుగా నియమించి వారి ఫోన్ నంబర్లను పాత్రికేయులకు అందుబాటులో ఉంచి సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. -
అలా నెట్టుకొస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సమాచార, ప్రజాసంబంధాల శాఖ ఇబ్బందులతో నెట్టుకొస్తోంది. ఈ విభాగం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. జిల్లాల పునర్విభజన వరకు అధికారుల కొరత ఉన్నా నెట్టుకొచ్చారు. నూతన జిల్లాల ఏర్పాటుతో ఈ కొరత మరింత తీవ్రమైంది. ప్రభుత్వం చేసే ప్రతీ పని, చేపట్టిన ప్రతీ పథకాన్ని ప్రజలకు చేరువచేసే సమాచార శాఖ పనితీరు కొత్త జిల్లాల్లో ఆశించిన రీతిలో లేదని.. ఆ విభాగంలోనే చర్చ జరుగుతోంది. మంజూరు కానీ పోస్టులు... కొత్త జిల్లాలకు డిస్టిక్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, అదనపు పీఆర్వో, డివిజన్ పీఆర్వో, ఇద్దరు ఆఫీస్ అసిస్టెంట్లు, టైపిస్ట్, సీనియర్ అసిస్టెంట్, అటెండర్ల పోస్టులు మంజూరు కావాలి. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఆ పోస్టులను మంజూరు చేయలేదు. జిల్లాల పునర్విభజన సమయంలో పంపిన ప్రతిపాదనలు పెండింగ్‌లోనే ఉండిపోయాయి. అలా ఉండగానే కొత్త జిల్లాలు ఏర్పాటుకావడంతో.. నూతన జిల్లాలకు డివిజన్ పీఆర్వోలను ఇన్చార్జిలుగా నియమించారు. రెండేళ్లు గడుస్తున్నా శాశ్వత సిబ్బందిని నియమించలేదు. ఉమ్మడి జిల్లాలకు డీపీఆర్వోలుగా ఉన్న అధికారులను కొన్ని చోట్ల కొత్త జిల్లాలకు ఇన్చార్జిలుగా కొనసాగిస్తున్నారు. కొంత మంది డిప్యూటీ డైరెక్టర్లుగా పదోన్నతి పొందినా ఇంకా జిల్లా పీఆర్వోలుగానే పనిచేస్తున్నారు. కాగా, సమాచార, ప్రజాసం బంధాల శాఖలో అధికారుల హోదాలో 300 మంది వరకు పనిచేస్తున్నారు. వీరిలో రెండేళ్లలో 35 శాతం మంది పదవీ విరమణ చేయబోతున్నారు. -
అందని ‘పద్మ’o.. కనిపించని శకటం!
సాక్షి, హైదరాబాద్: ఈసారి గణతంత్ర వేడుకలు తెలంగాణకు నిరాశనే మిగిల్చాయి. కేంద్రం ప్రక టించిన పద్మ అవార్డుల్లో రాష్ట్రానికి ఆశాభంగం కలగగా.. ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల ప్రదర్శనలో రాష్ట్ర శకటానికి అవకాశం లభించలేదు. అవార్డుల్లో నిరాశ వివిధ రంగాల్లో పేరొందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పద్మ అవార్డుల కోసం ఈసారి రాష్ట్ర ప్రభుత్వం 24 మందితో కూడిన జాబితాను పంపింది. అయితే కేంద్రం ఈసారి పద్మ అవార్డుల నామినేషన్ల విధానంలో పలు మార్పులు చేసింది. అర్హులైన వారు సొంతంగా కూడా నామినేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. దీంతో రాష్ట్రం నుంచి మరో 15 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. మొత్తంగా రాష్ట్రం నుంచి 39 ప్రతిపాదనలు వెళ్లినా.. ఒక్కరికి కూడా అవార్డు లభించకపోవడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇలా జరగడం ఇదే మొదటిసారి. రాష్ట్రం నుంచి 2015లో ముగ్గురికి, 2016లో ఆరుగురికి, 2017లో ఆరుగురికి పద్మ పురస్కారాలు దక్కాయి. ఇక ఈసారి 85 మందికి పద్మ అవార్డులు ఇచ్చినా.. రాష్ట్రం నుంచి ఒక్కరికీ చోటు లభించలేదు. రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసినవారిలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. ప్రభుత్వం మాజీ ప్రధాని పీవీ నరసింహారావును దేశంలో అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డుకు సిఫారసు చేసింది. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్, ఆర్థికవేత్త చెన్నమనేని హనుమంతరావు, నవలా రచయిత, కవి శివ కె.కుమార్ల పేర్లను పద్మ విభూషణ్‌కు నామినేట్ చేసింది. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును పద్మభూషణ్‌కు, గాయకులు గోరటి వెంకన్న, అందెశ్రీ, విద్యావేత్త చుక్కా రామయ్య, సినీ రచయిత సుద్దాల అశోక్తేజలతో పాటు మరికొందరి పేర్లను పద్మశ్రీ పురస్కారాలకు పంపించింది. వేడుకల్లోనూ ఆశాభంగమే.. రిపబ్లిక్‌డే పరేడ్‌లో ప్రదర్శించే శకటాల్లోనూ తెలంగాణకు ప్రాతినిధ్యం లభించలేదు. ఆసియాలోనే పెద్దదిగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ గిరిజన జాతర ఇతివృత్తంతో శకటపు నమూనాను రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ కేంద్రానికి పంపింది. కానీ ఎంపిక కమిటీ రెండో దశలోనే దీనిని తిరస్కరించింది. గతేడాది బతుకమ్మ శకటం నాలుగో దశలో అర్హత కోల్పోయి.. ప్రదర్శనకు నోచుకోలేదు. అంతకు ముందు 2016లో రాష్ట్రానికి చెందిన బోనాల శకటానికి పరేడ్‌లో అవకాశం దక్కింది. -
లంచం ఇవ్వకపోతే మృతుల జాబితాలో చేరుస్తా...
లక్ష్మీపురం(గుంటూరు): వృద్ధ కళాకారుడి లైఫ్ సర్టిఫికెట్‌ను రెన్యూవల్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ప్రభుత్వ అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గుంటూరు జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ ఆడియో విజువల్ సూపర్వైజర్ అన్నం వెంకటనారాయణ రూ.5 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీకి చిక్కాడు. నరసరావుపేట మండలం కొత్తపాలెంకు చెందిన కోనాటి కోటేశ్వరరావు 30 ఏళ్లుగా పౌరాణిక నాటకాల్లో నటిస్తున్నాడు. వృద్ధ కళాకారులకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ రూ.1,500తో జీవనం సాగిస్తున్నాడు. ఈ ఏడాది లైఫ్ సర్టిఫికెట్ తీసుకుని, పెన్షన్ రెన్యూవల్ చేసేందుకు ఇంకా సమయం ఉన్నప్పటికీ సమయం అయిపోయిందని అధికారి నారాయణ చెప్పాడు. లైఫ్ సర్టిఫికెట్ రెన్యూవల్ చేయాలంటే రూ.6 వేలు ఖర్చవుతుందన్నాడు. లంచం ఇవ్వకపోతే నీ పేరును మృతుల జాబితాలో చేరుస్తానని బెదిరించాడు. చివరకు రూ.5 వేలైనా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు కోటేశ్వరరావు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు కోటేశ్వరరావు మంగళవారం నారాయణకు రూ.5 వేలు అందజేశాడు. ఏసీబీ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి నారాయణను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. -
రాజధాని నవ నగరాల విస్తీర్ణంలో భారీ మార్పు!
సాక్షి, అమరావతి: రాజధానిలో ప్రతిపాదిస్తున్న నవ నగరాల విస్తీర్ణంలో భారీ మార్పు చోటుచేసుకుంది. గతంలో 17,708 ఎకరాల్లో ఈ నగరాలను నిర్మించాలని ప్రతిపాదించగా తాజాగా దాన్ని 53,647 ఎకరాలకు పెంచారు. రాజధానిలో పర్యావరణ ప్రభావ అంచనా సర్వే నివేదికలో ఈ విషయాన్ని పొందుపరచగా, సమాచార, పౌర సంబంధాల శాఖ సైతం శనివారం ఈ వివరాలను విడుదల చేసింది. -
సమాచార శాఖ పనితీరు భేష్
హైదరాబాద్ పర్యటనలో మహారాష్ట్ర ఐఅండ్‌పీఆర్ బృందం ప్రశంస సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సకాలంలో మీడియాకు చేరవేస్తూ తెలంగాణ సమాచార శాఖ (పబ్లిసిటీ సెల్) ప్రశంసనీయంగా పనిచేస్తోందని సోమవారం సచివాలయంలో మహారాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్ అజయ్ అంబేకర్ కితాబునిచ్చారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖలో అమలవుతున్న వివిధ కార్యక్రమాల అధ్యయనానికి రెండు రోజుల పర్యటన నిమిత్తం అజయ్ అంబేకర్ అధ్యక్షతన సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్లు సురేఖ ములే, ప్రవీణ్ టాకే, విలాస్ బోడాకేలతో కూడిన అధికారుల బృందం హైదరాబాద్‌లో పర్యటించింది. ఈ సందర్భంగా ప్రచార విభాగం ఇంచార్జ్ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్ పబ్లిసిటీ సెల్ పనితీరును మహారాష్ట్ర బృందానికి వివరించారు. మహారాష్ట్రలో జర్నలిస్టులకు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అజయ్ వివరించారు. తెలంగాణ జర్నలి స్టులకు అందుతున్న ఫలాలను అడిగి తెలుసుకున్నారు. సమాచార పౌర సం బంధాల శాఖలో ఉత్తమంగా అమలవు తున్న వాటిని తమ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టడానికి కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా జర్నలిస్టుల వెల్ఫేర్ ఫండ్ పథకం చాలా బావుందని, దీన్ని అధ్యయ నం చేసి నివేదికను తమ ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. అంతకు ముందు సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై అక్రిడిటేషన్ జారీ విధానం, మీడియాకు ప్రకటనల జారీ, వివిధ ప్రభుత్వ కార్యక్ర మాలు, ప్రము ఖుల సమావేశాలకు పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు, జర్నలిస్టులకు రాయితీలు తదితర పథకాల గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సమాచార పౌరసం బంధాల శాఖ అడిషనల్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లే, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ ఎల్. ఎల్.ఆర్.కిశోర్ బాబు, రీజినల్ జాయింట్ డైరెక్టర్ సుజాత, డిప్యూటీ డైరెక్టర్లు వెంకటేశం, భాస్కర్, మధుసూ దన్, శ్రీనివాస్, రీజినల్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్లు దామోదర్, విజయభాస్కర్‌రెడ్డి, అకౌంట్స్ అధికారి శౌరిరెడ్డి పాల్గొన్నారు. -
రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
మంత్రి పల్లె రఘునాథరెడ్డి సాక్షి, అమరావతి: తనపై వస్తున్న ఆరోపణలు రుజువుచేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, త్వరలోనే తాను ఆస్తులు ప్రకటిస్తానని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలోని తన చాంబర్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తన ఆస్తుల విషయంలో సాక్షి మీడియా కథనాల్లో వాస్తవాలు లేవని, తనపై ప్రచురించిన వార్తల విషయంలో సాక్షి మీడియాకు నోటీసులిస్తానని చెప్పారు. ఆరోపణలు రుజువు చేయకపోతే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాను భూదందాలు, రౌడీయిజం చేయలేదన్నారు. విద్యా సంస్థలను నిర్వహించి సంపాదించుకున్నానని చెప్పారు. -
ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక
మదనపల్లె రూరల్/తిరుపతి క్రైం: ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక ఇద్దరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మహత్యకు యత్నించారు. అనంతపురం జిల్లా పరిగి మండలం వణంపల్లెకు చెందిన ఎంటీ భగీరథరెడ్డి(58) హిందూపురంలోని సిల్క్ ఎక్స్ఛేంజ్లో సెరికల్చర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడ పనిచేసే ఏడీలు కార్యాలయంలోనే మహిళలతో రాసలీలలు కొనసాగిస్తున్నారని ఉన్నతాధికారులకు ఎవరో ఆకాశ రామన్న ఉత్తరాలు రాశారు. ఈ పని భగీరథరెడ్డి చేశాడనే అనుమానంతో సెరికల్చర్ అసిస్టెంట్ డెరైక్టర్లు అతడిని వేధింపులకు గురిచేశారు. బంధువులు, సిబ్బందితో చితకబాదిం చారు. మడకశిర పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెట్టించారు. 3 రోజుల క్రితం అతడిని పోలీసులు విచారించారు. స్టేషన్ నుంచి ఇంటికొచ్చిన భగీరథరెడ్డి జీవితంపై విరక్తిచెంది చనిపోవాలనుకున్నాడు. గతంలో ఈయన హార్స్‌లీహిల్స్, పలమనేరు, మదనపల్లెలో పనిచేయడంతో సోమవారం ఉదయం హార్స్‌లీహిల్స్‌కు చేరుకున్నాడు. తన సోదరుడు శ్రీనివాసులురెడ్డికి ఫోన్ చేసి హార్స్‌లీహిల్స్ నుంచి దూకి చనిపోతున్నట్లు తెలిపి కిం దకు దూకేశాడు. మధ్యలో 3 వందల మీటర్ల లోయ లో చెట్లపై చిక్కుకున్నాడు. అప్రమత్తమైన అతని సోదరుడు, బాధితుడి భార్య జానకమ్మ, బంధువులు హార్స్‌లీహిల్స్‌కు చేరుకుని చెట్టుకు వేలాడుతున్న భగీరథరెడ్డిని పోలీసుల సాయంతో కిందకు తీసుకొచ్చారు. పోలీసులు ఏడీలపై కేసు నమోదు చేసి భగీరథరెడ్డిని ఆసుపత్రికి తరలించారు. తిరుపతిలో: తిరుపతిలోని సమాచార శాఖలో ఉన్నతాధికారి వేధింపులు భరించలేక అటెండర్ రామ్‌ప్రసాద్ ఆత్మహత్యకు యత్నిం చాడు. సోమవారం కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకోబోయాడు. సహోద్యోగులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సమాచార పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ అటెండర్లను మానసికంగా వేధిస్తున్నారని వారు మీడియాకు తెలిపారు.