ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక
మదనపల్లె రూరల్/తిరుపతి క్రైం: ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక ఇద్దరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మహత్యకు యత్నించారు. అనంతపురం జిల్లా పరిగి మండలం వణంపల్లెకు చెందిన ఎంటీ భగీరథరెడ్డి(58) హిందూపురంలోని సిల్క్ ఎక్స్ఛేంజ్‌లో సెరికల్చర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడ పనిచేసే ఏడీలు కార్యాలయంలోనే మహిళలతో రాసలీలలు కొనసాగిస్తున్నారని ఉన్నతాధికారులకు ఎవరో ఆకాశ రామన్న ఉత్తరాలు రాశారు. ఈ పని భగీరథరెడ్డి చేశాడనే అనుమానంతో సెరికల్చర్ అసిస్టెంట్ డెరైక్టర్లు అతడిని వేధింపులకు గురిచేశారు. బంధువులు, సిబ్బందితో చితకబాదిం చారు. మడకశిర పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెట్టించారు. 3 రోజుల క్రితం అతడిని పోలీసులు విచారించారు. స్టేషన్ నుంచి ఇంటికొచ్చిన భగీరథరెడ్డి జీవితంపై విరక్తిచెంది చనిపోవాలనుకున్నాడు.
గతంలో ఈయన హార్స్‌లీహిల్స్, పలమనేరు, మదనపల్లెలో పనిచేయడంతో సోమవారం ఉదయం హార్స్‌లీహిల్స్‌కు చేరుకున్నాడు. తన సోదరుడు శ్రీనివాసులురెడ్డికి ఫోన్ చేసి హార్స్‌లీహిల్స్ నుంచి దూకి చనిపోతున్నట్లు తెలిపి కిం దకు దూకేశాడు. మధ్యలో 3 వందల మీటర్ల లోయ లో చెట్లపై చిక్కుకున్నాడు. అప్రమత్తమైన అతని సోదరుడు, బాధితుడి భార్య జానకమ్మ, బంధువులు హార్స్‌లీహిల్స్‌కు చేరుకుని చెట్టుకు వేలాడుతున్న భగీరథరెడ్డిని పోలీసుల సాయంతో కిందకు తీసుకొచ్చారు. పోలీసులు ఏడీలపై కేసు నమోదు చేసి భగీరథరెడ్డిని ఆసుపత్రికి తరలించారు.
తిరుపతిలో: తిరుపతిలోని సమాచార శాఖలో ఉన్నతాధికారి వేధింపులు భరించలేక అటెండర్ రామ్‌ప్రసాద్ ఆత్మహత్యకు యత్నిం చాడు. సోమవారం కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకోబోయాడు. సహోద్యోగులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సమాచార పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ అటెండర్లను మానసికంగా వేధిస్తున్నారని వారు మీడియాకు తెలిపారు.