
లక్ష్మీపురం(గుంటూరు): వృద్ధ కళాకారుడి లైఫ్ సర్టిఫికెట్‌ను రెన్యూవల్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ప్రభుత్వ అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గుంటూరు జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ ఆడియో విజువల్ సూపర్‌వైజర్ అన్నం వెంకటనారాయణ రూ.5 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీకి చిక్కాడు. నరసరావుపేట మండలం కొత్తపాలెంకు చెందిన కోనాటి కోటేశ్వరరావు 30 ఏళ్లుగా పౌరాణిక నాటకాల్లో నటిస్తున్నాడు. వృద్ధ కళాకారులకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ రూ.1,500తో జీవనం సాగిస్తున్నాడు.
ఈ ఏడాది లైఫ్ సర్టిఫికెట్ తీసుకుని, పెన్షన్ రెన్యూవల్ చేసేందుకు ఇంకా సమయం ఉన్నప్పటికీ సమయం అయిపోయిందని అధికారి నారాయణ చెప్పాడు. లైఫ్ సర్టిఫికెట్ రెన్యూవల్ చేయాలంటే రూ.6 వేలు ఖర్చవుతుందన్నాడు. లంచం ఇవ్వకపోతే నీ పేరును మృతుల జాబితాలో చేరుస్తానని బెదిరించాడు. చివరకు రూ.5 వేలైనా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు కోటేశ్వరరావు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు కోటేశ్వరరావు మంగళవారం నారాయణకు రూ.5 వేలు అందజేశాడు. ఏసీబీ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి నారాయణను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.