సాక్షి, హైదరాబాద్: ఈసారి గణతంత్ర వేడుకలు తెలంగాణకు నిరాశనే మిగిల్చాయి. కేంద్రం ప్రక టించిన పద్మ అవార్డుల్లో రాష్ట్రానికి ఆశాభంగం కలగగా.. ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల ప్రదర్శనలో రాష్ట్ర శకటానికి అవకాశం లభించలేదు.
అవార్డుల్లో నిరాశ
వివిధ రంగాల్లో పేరొందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పద్మ అవార్డుల కోసం ఈసారి రాష్ట్ర ప్రభుత్వం 24 మందితో కూడిన జాబితాను పంపింది. అయితే కేంద్రం ఈసారి పద్మ అవార్డుల నామినేషన్ల విధానంలో పలు మార్పులు చేసింది. అర్హులైన వారు సొంతంగా కూడా నామినేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. దీంతో రాష్ట్రం నుంచి మరో 15 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. మొత్తంగా రాష్ట్రం నుంచి 39 ప్రతిపాదనలు వెళ్లినా.. ఒక్కరికి కూడా అవార్డు లభించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇలా జరగడం ఇదే మొదటిసారి. రాష్ట్రం నుంచి 2015లో ముగ్గురికి, 2016లో ఆరుగురికి, 2017లో ఆరుగురికి పద్మ పురస్కారాలు దక్కాయి. ఇక ఈసారి 85 మందికి పద్మ అవార్డులు ఇచ్చినా.. రాష్ట్రం నుంచి ఒక్కరికీ చోటు లభించలేదు. రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసినవారిలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. ప్రభుత్వం మాజీ ప్రధాని పీవీ నరసింహారావును దేశంలో అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డుకు సిఫారసు చేసింది. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్, ఆర్థికవేత్త చెన్నమనేని హనుమంతరావు, నవలా రచయిత, కవి శివ కె.కుమార్‌ల పేర్లను పద్మ విభూషణ్‌కు నామినేట్ చేసింది. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును పద్మభూషణ్‌కు, గాయకులు గోరటి వెంకన్న, అందెశ్రీ, విద్యావేత్త చుక్కా రామయ్య, సినీ రచయిత సుద్దాల అశోక్‌తేజలతో పాటు మరికొందరి పేర్లను పద్మశ్రీ పురస్కారాలకు పంపించింది.
వేడుకల్లోనూ ఆశాభంగమే..
రిపబ్లిక్‌డే పరేడ్‌లో ప్రదర్శించే శకటాల్లోనూ తెలంగాణకు ప్రాతినిధ్యం లభించలేదు. ఆసియాలోనే పెద్దదిగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ గిరిజన జాతర ఇతివృత్తంతో శకటపు నమూనాను రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ కేంద్రానికి పంపింది. కానీ ఎంపిక కమిటీ రెండో దశలోనే దీనిని తిరస్కరించింది. గతేడాది బతుకమ్మ శకటం నాలుగో దశలో అర్హత కోల్పోయి.. ప్రదర్శనకు నోచుకోలేదు. అంతకు ముందు 2016లో రాష్ట్రానికి చెందిన బోనాల శకటానికి పరేడ్‌లో అవకాశం దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment