
న్యూఢిల్లీ: తమిళనాడులో నిర్వహించే జల్లికట్టుపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో జల్లికట్టును అనుమతించే తమిళనాడు ప్రభుత్వ చట్టాన్ని రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది. జల్లికట్టు తమిళనాడు సాంస్కృతిక వారసత్వంలో భాగమని శాసనసభ ప్రకటించినప్పుడు, న్యాయవ్యవస్థ అందుకు భిన్నమైన అభిప్రాయాన్ని తెలపదని వ్యాఖ్యానించింది.
ఇది క్రీడ సాంస్కృతిక వారసత్వంలో భాగమని, సాంప్రదాయక క్రీడ కాదని చెప్పడానికి ఎలాంటి రుజువు లేదని ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో జట్టికట్టు పోటీలపై ఎలాంటి నిషేధం లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. జంతువులతో కూడిన క్రీడలను అనుమతించేందుకు మహారాష్ట్ర & కర్ణాటక ప్రభుత్వాలు రూపొందించిన ఇలాంటి చట్టాలను అత్యన్నత న్యాయస్థానం కూడా సమర్థించింది. కాగా జల్లికట్టు వంటి క్రీడలను సుప్రీంకోర్టు 2014లో నిషేధించిన సంగతి తెలిసిందే.
సుప్రీంకోర్టు నిర్ణయం అనంతరం ఈ రాష్ట్రాలు ఇటువంటి క్రీడలకు అనుమతి ఇచ్చేందుకు వీలుగా చట్టాలను సవరించాయి. ఇవి వారసత్వ క్రీడలని పేర్కొన్నాయి. 2017లో జల్లికట్టును అనుమతిస్తూ కొన్ని సవరణలు చేసి తమిళనాడు ప్రభుత్వం చట్టం చేసింది. ఈ సవరణల రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేస్తూ జంతు హింస చట్టం ఈ ఆటకు వర్తించదని తెలిపింది. ఈ మేరకు 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాజాగా ఐదుగురు సభ్యుల ధర్మాసనం సవరించింది.
చదవండి: ఆర్బీఐ కంటైనర్‌లో రూ.1000 కోట్ల నగదు.. భారీ భద్రత, హఠాత్తుగా ఆగిపోయిన వాహనం