బార్న్ టు విన్
ఆనందం ఎక్కడ ఉంటుందో ఆత్మస్థైర్యం అక్కడ ఉంటుంది. ఆత్మస్థైర్యం కొలువైన చోట అనేక ద్వారాలు తెరుచుకుంటాయి. విజయానికి సింహద్వారాన్ని చూపిస్తాయి.
శారీరక మార్పుల వల్ల లింగమార్పిడికి ముందు, లింగ మార్పిడి తరువాత ఎన్నో అవహేళనలు ఎదుర్కొంది శ్వేతాసుధాకర్. అవమానాలు, కష్టాలలో ఆమె జపించిన
మంత్రం... ‘జీవితం ఒక్కటే. బార్న్ 2 విన్. ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా సామాజిక కార్యకర్త, రచయిత, మోటివేషనల్ స్పీకర్‌గా ఎంతోమంది ట్రాన్స్‌జెండర్‌ల జీవితాలలో వెలుగులు నింపుతోంది చెన్నైకి చెందిన శ్వేతా సుధాకర్.
వెయ్యి ఏనుగుల బలంతో రోజు మొదలు కావాలి అంటారు. ఆ మాట విషయం ఎలా ఉన్నా శ్వేతకు రోజు మొదలైందంటే దిగులుగా ఉండేది. ‘ఈరోజు ఎన్ని అవమానాలు పడాలో!’ అనుకునేది. చెన్నైలో పుట్టిన శ్వేత సుధాకర్‌లోని శారీరక మార్పులు చూసి ‘నీ బాడీ లాంగ్వేజ్ ఇలా ఉందేమిటి... అలా మాట్లాడుతున్నావేమిటీ’... ఇలా రకరకాలుగా వెక్కిరించేవారు. శారీరకంగా వచ్చిన మార్పులతో కుటుంబాన్ని వదిలి లింగమార్పిడితో ఎన్నో కష్టాలు ఎదుర్కొంది శ్వేత. ‘చదువును నమ్ముకున్నవారు ఎప్పుడూ జీవితంలో ఓడిపోరు’ తాను విన్న మాట ఆ రోజు పదే పదే గుర్తు వచ్చింది.
ఇక అప్పటినుంచి చదువు తన నేస్తం అయింది. ఆత్మీయత పంచే కుటుంబం అయింది. ధైర్యం ఇచ్చే గురువు అయింది. మద్రాస్ యూనివర్సిటీలో ఎం.ఏ. సోషియాలజీ చేసిన శ్వేతాసుధాకర్ ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాలనుకోలేదు. ఒక ఉద్యమంలా తనలాంటి వారి కోసం విస్తరించాలనుకుంది. ‘బార్న్ 2 విన్’ అనే స్వచ్ఛంద సంస్థకు శ్రీకారం చుట్టింది. అయితే చెన్నైలో సంస్థ కార్యాలయం కోసం గదిని అద్దెకు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ పరిస్థితుల్లో ఒక మానవతావాది సహాయంతో చెన్నైలోని సైదాపేటలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయగలిగింది శ్వేత.
గురుకులం...
ఇప్పుడు ఈ కార్యాలయం వందలాది మంది ట్రాన్స్‌జెండర్‌లకు రణక్షేత్రం. ‘ఇదిగో... జీవితంలో ఎదురయ్యే సమస్యలతో ఇలా యుద్ధం చేయాలి’ అని నేర్పుతుంది. ‘చింతవద్దు. నువ్వు బతికేమార్గాలు ఎన్నో ఉన్నాయి’ అంటూ ఉపాధి విద్యలను నేర్పే గురుకులం అవుతోంది. లింగమార్పిడి చేసుకున్న వారి హక్కుల కోసం తన గళాన్ని వినిపించడంతో పాటు విద్య, ఉపాధి, లైఫ్‌స్కిల్స్... మొదలైన వాటిలో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తోంది. సాఫ్ట్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, టైలరింగ్, కాస్మోటాలజీ, ఫ్యాషన్ డిజైన్‌కోర్సులతో ఎవరికి వారు తమ సొంత కాళ్లపై నిలబడే విధంగా తీర్చిదిద్దుతుంది శ్వేతా సుధాకర్.
ట్రాన్స్ అచీవర్స్ అవార్డ్
తమిళనాడుకే పరిమితం కాకుండా దేశంలోని ఎన్నో రాష్ట్రాలకు విస్తరించింది బార్న్ 2 విన్. శ్రీలంక నుంచి మొదలు యూరప్‌లోని ఎన్నో దేశాల వరకు వివిధ రంగాలలో రాణిస్తున్న ట్రాన్స్‌జెండర్‌లను గత పదకొండు సంవత్సరాలుగా ‘ట్రాన్స్ అచీవర్స్’ అవార్డులతో సత్కరిస్తోంది శ్వేత. తమిళంతో పాటు తెలుగు, కన్నడం, మలయాళం లాంటి భాషలను అనర్గళంగా మాట్లాడుతూ ‘శ్వేతా టాక్ షో’ పేరుతో ట్రాన్స్ మీడియా యూ ట్యూబ్‌ను నిర్వహిస్తోంది. ‘మిస్ తమిళనాడు ట్రాన్స్ క్వీన్ ప్రొగ్రామ్‌ను గత ఎనిమిది సంవత్సరాలుగా నిర్వహిస్తోంది. ‘బార్న్ 2 విన్ అనేది సంస్థ కాదు. మా కుటుంబం. అది నాకు ఇచ్చిన ధైర్యం ఇంతా అంతా కాదు’ అంటుంది సుప్రియ. నిజానికి ఇది ఆమె మాటే కాదు ‘బార్న్ 2 విన్’ ద్వారా గెలుపు పాఠాలు నేర్చుకున్న ఎందరో విజేతల మాట.
మన కోసం మనం
కుటుంబాన్ని వదిలి నేను ఎన్నో బాధలు పడ్డాను. ఆ ఒంటరి రోజులలో పుస్తకాలు నా కుటుంబసభ్యులు అయ్యాయి. నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. ఇప్పుడు అదే చదువు ద్వారా ఎంతోమందికి ధైర్యం వచ్చేలా చేస్తున్నాను. ‘నా కోసం ఏదీ లేదు. నా కోసం ఎవరూ లేరు’ అని ఎప్పుడూ అనుకోవద్దు. ఈ విశాల ప్రపంచంలో మన కోసం ఎన్నో ఉన్నాయి. అయితే వాటిని వెదుక్కోగలగాలి. వాటిని వెదకాలంటే బలం కావాలి. ఆ బలం జీవనోత్సాహం నుంచి వస్తుంది. అందుకే నిరాశానిస్పృహలకు దూరంగా ఉంటూ ఎప్పుడూ సంతోషంగా ఉండేలా ప్రయత్నిస్తుంటాను. ఇప్పుడు ‘బార్న్ 2 విన్’ రూపంలో నాకంటూ ఒక కుటుంబం ఉంది. సామాజిక, రాజకీయ రంగాలలో గుర్తింపు దొరికింది.
– శ్వేతా సుధాకర్, బార్న్ 2 విన్–ఫౌండర్
అక్షర బలం
శ్వేతా సుధాకర్ మంచి వక్త మాత్రమే కాదు రచయిత్రి కూడా. నిండైన భావుకత, చక్కని శైలి ఆమె అక్షరబలం. ‘నన్‌గై స్వేతాసీ’ పేరుతో హిజ్రాల జీవితాలపై ‘ఇయర్కై ఎలిదియ ఎలుత్తు పిలయ్(ప్రకృతి రాసిన అక్షర దోషం)’, కూందలుం... మీసయుం(శిరోజాలు..మీసాలు), వానం పాత్త తారగయే (ఆకాశం చూసిన తార), తర్కొలై దాహంగల్ (ఆత్మహత్యా దాహం), కల్యాణ కనువుగల్ (పెళ్లి కలలు)... మొదలైన పుస్తకాలను తన ‘నన్‌గై పబ్లికేషన్స్’ ద్వారా ప్రచురించింది.
– అస్మతీన్ మైదీన్, సాక్షి, చెన్నై
Comments
Please login to add a commentAdd a comment