వైద్య శాస్త్రంలో ఓ అరుదైన కేసు.. సుమారు పాతికేళ్ల తర్వాత వివాదాస్పదంగా మారింది. ఆడ-మగ జననాంగాలతో(ఇంటర్‌సెక్స్ జెండర్) కలగలిసి పుట్టిన ఓ బిడ్డను.. సర్జరీలతో పూర్తి మగాడిలా మార్చేశారు వైద్యులు. అయితే ఆ నిర్ణయంపై అతడుగా ఉన్న ఆమె ఇన్నేళ్ల తర్వాత పోరాటానికి దిగింది. తన అనుమతి లేకుండా క్రూరంగా వ్యవహరించిన డాక్టర్ల తీరును తప్పుబడుతూ.. తనును మళ్లీ యథాస్థితికి మార్చేయాలని కోరుతోంది.
హవాయి స్టేట్ పూనాకి చెందిన 24 ఏళ్ల యోగా ఎక్స్‌పర్ట్ లూనా అనిమిషా.. తనను మహిళగా మార్చేయాలని పోరాడుతోంది. పుట్టినప్పుడు డాక్టర్లు ఆమె జననాంగాన్ని కుట్టేయడంతో పాటు, సర్జరీ ద్వారా గర్భసంచిని తొలగించారు. దీంతో లూనా.. ఇన్నేళ్లూ మగవాడిలానే పెరుగుతూ వస్తోంది. అయితే తనలో ‘ఆమె’ను ఎంతో కాలం అణుచుకోలేకపోయింది లూనా. అయితే తనని ఓ జంతువులా భావించి కర్కశంగా వ్యవహరించిన డాక్టర్ల తీరును తప్పుబడుతూ.. తిరిగి సర్జరీలకు ఆమె సిద్ధమైంది.
‘‘తప్పు నా తల్లిదండ్రులదా? ఆ డాక్టర్లదా? అనే ప్రసక్తి కాదు. అంతిమంగా ఇబ్బంది పడుతోంది నేను. నాకు మగాడిగా కంటే ఆడదానిగా బతకడమే ఇష్టంగా అనిపిస్తోంది. 14 ఏళ్ల వయసులో తొలిసారి నా శరీరానికి కలిగిన గాయమేంటో నేను అర్థం చేసుకోగలిగాను. ఇన్నేళ్లలో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాను. అవమానాల్ని భరించాను. అసలు నా గుర్తింపు కోసం మానసిక క్షోభను అనుభవించాను. ఎవరితోనూ కలవలేకపోయాను. బొమ్మలతో ఆడుకోవాలని, గౌన్లు వేసుకోవాలనే కోరికల్ని అణచివేసుకున్నా. ఒకానొక టైంలో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా. కానీ, ఇప్పుడు పోరాడే వయసు, శక్తి రెండూ నాకు వచ్చాయి’’ అని నవ్వుతూ చెప్తోందామె.
మగాడి గుర్తింపును వద్దనుకుంటున్న లూనా.. సర్జరీలకు అవసరమయ్యే డబ్బు కోసం ‘గో ఫండ్ మీ’ వెళ్లింది. లక్షా యాభై వేల డాలర్లు సేకరించి.. తన కోరికను నెరవేర్చుకోవాలని అనుకుంటోంది. 2019లో క్లీవ్‌లాండ్‌కు చెందిన ఓ మహిళకు చనిపోయిన మహిళ గర్భసంచిని మార్పిడి ద్వారా ఎక్కించారు. అలా ఆ మహిళ తల్లి కాగలిగింది కూడా. ఆ కేసును రిఫరెన్స్‌గా తీసుకుని లూనా.. తనకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఎదురుచూస్తోంది. అంతేకాదు సొసైటీలో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొంటున్న ఇంటర్‌సెక్స్, ట్రాన్స్‌జెండర్ బాధితుల కోసం లూనా పోరాడుతోంది కూడా.
Comments
Please login to add a commentAdd a comment