గర్భసంచి... ఉంచితే మంచి! | If the uterus is good | Sakshi
Sakshi News home page

గర్భసంచి... ఉంచితే మంచి!

Published Mon, Jun 1 2015 10:34 PM | Last Updated on Sun, Sep 3 2017 3:03 AM

గర్భసంచి...  ఉంచితే మంచి!

గర్భసంచి... ఉంచితే మంచి!

అనవసర హిస్టరెక్టమీలు అనర్థం
 
తొమ్మిది నెలలు పెరగాల్సిన శిశువును అతి జాగ్రత్తగా ఉంచడానికి ఏర్పాటు చేసిన సంచి అది. నవమాసాల బిడ్డ కాస్తా నవజాతశిశువుగా మారి ప్రపంచంలోకి వచ్చే వరకూ ఆ బరువు కాస్తుంది. ఆ భారాన్ని మోస్తుంది. మరి ఈ సంచిని జాగ్రత్తగా ఎక్కడైనా తగిలించాలి కదా. అందుకే పొత్తికడుపులో జాగ్రత్తగా ఉండేలా రూపొందించి, కొన్ని లిగమెంట్ల సహాయంతో వెన్నుపూసకూ, పెల్విక్‌జోన్‌కూ అతికి ఉంచేలా చేసింది ప్రకృతి. అదీ ఈ సంచి మహత్యం. గర్భసంచి అని మామూలు భాషలో అందరూ పిలుచుకునే దీనికి గర్భాశయం అనే మాటనూ ఉపయోగిస్తుంటారు. శరీరంలోని అన్ని అవయవాలకూ సమస్యలు వచ్చినట్టే... ఈ సంచికీ వస్తాయి.

అలా వచ్చినప్పుడు చాలామంది మహిళలు ఇక తమకు పిల్లలు పుట్టేశారు కాబట్టి దాన్ని తొలగిస్తే మేలు అనీ, దాంతో రుతుస్రావం వంటి నెలనెలా బాధలు తప్పిపోతాయనీకోరుతుంటారు. వారు కోరిందే తడవుగా కొందరు డాక్టర్లు సైతం దాన్ని తొలగించి వేస్తుంటారు. నిజానికి గర్భసంచి చేసే మంచి ఏమిటో తెలుసుకుంటే అలాంటి కోరికలు కోరరు. గర్భసంచి ఉంచడం కంటే తీసివేయడం వల్లనే మహిళకు నిజంగానే మేలు జరుగుతుందని డాక్టర్లు అనుకుంటే అప్పుడు వారే ఆ సలహా ఇస్తారు. అది ఏ పరిస్థితుల్లో జరుగుతుందో కూడా తెలుసుకుందాం.
 
ఆరు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల పొడవు, మూడు నుంచి ఐదు సెంటీమీటర్ల పరిమాణంలో ఉండే ఈ గర్భసంచి తన ఈ కొలతలకు మించి 15 రెట్లు పెరుగుతుంది. అందుకే ఒకే ఒక కణం (జైగోట్) నుంచి అనేక కోట్ల రెట్ల విభజనలు జరిగి ఒక బిడ్డగా రూపొందేవరకు బిడ్డ భారాన్ని భరిస్తుంది గర్భసంచి. దీనికి ఇరువైపులా రెండు అండాశయాలు (ఓవరీస్) ఉంటాయి. ఈ రెండూ ఒవేరియన్ లిగమెంట్స్ ద్వారా గర్భసంచికి ఇరువైపులా వేలాడుతుంటాయి. అండాశయాల నుంచి ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్, చాలా కొద్ది మోతాదులో టెస్టోస్టెరాన్ విడుదల అవుతుంటాయి. ఈ హార్మోన్లు మహిళల కండరాలనూ, ఎముకలనూ గట్టిపరుస్తాయి.
 
గర్భసంచికి వచ్చే సమస్యలెన్నో...

గర్భసంచి కూడా అన్ని అవయవాల్లాగే ఒక కీలకమైన అవయవం. అయితే మిగతా అవయవాల తరహాలోనే సమస్యలకు ఇదేమీ అతీతం కాదు. దీనికి వచ్చే సమస్యలు అనేక రకాలుగా ఉంటాయి. అంటే... గడ్డలు, ఇన్ఫెక్షన్లు, వాపులు, పుండ్లు, గర్భాశయ కేన్సర్, గర్భసంచి కిందికి జారిపోవడం, అధికంగా రక్తస్రావం కావడం వంటి ఎన్నో సమస్యలు రావచ్చు. అయితే చాలారోజుల క్రితం వరకూ గర్భసంచికి ఎలాంటి సమస్య వచ్చినా... పిల్లలు పుట్టిన మహిళలు దీన్ని తొలగించుకోవడమే మంచి మార్గమని అనుకునేవారు. కాలక్రమంలో అది అంత మేలైన మార్గం కాదని తెలిసింది.

హిస్టరెక్టమీ అంటే ఏమిటి? దాని తర్వాత వచ్చే పరిణామాలేమిటి?
గర్భసంచి లేదా గర్భాశయాన్ని తొలగించే ఆపరేషన్‌ను ఇంగ్లిష్‌లో ‘హిస్టరెక్టమీ’ అంటారు. గర్భాశయాన్ని తొలగించే సమయంలో దానికి ఆనుకొని ఉన్న అండాశయాలనూ (ఓవరీస్‌నూ) కొన్నిసార్లు తొలగిస్తారు. కేవలం గర్భాశయాన్ని మాత్రమే తొలగించి, అండాశయాలను (ఓవరీస్‌ను) ఉంచినా, అండాశయాలకు రక్తాన్ని అందించే రక్తనాళాలు కొన్ని ఈ శస్త్రచికిత్సలో కట్ అవుతాయి. దాంతో వాటికి రక్తప్రసరణ తగ్గి, అవి పనిచేసే తీరు మందగిస్తుంది. ఫలితంగా వాటి నుంచి విడుదలయ్యే హార్మోన్లు కొద్దికాలంలోనే తగ్గిపోతాయి. అండాశయాలను తొలగించకుండా అలా వదిలేస్తే, కొంతమందిలో అండాశయాల్లో కంతులు ఏర్పడవచ్చు. చాలా కొద్దిమందిలో (కేవలం ఒక శాతం మందిలో మాత్రమే) అండాశయ కేన్సర్ కూడా రావచ్చు. ఆ లక్షణాలు బయటపడేలోపే అది అడ్వాన్స్‌డ్ దశలోకి చేరవచ్చు. ఈ పరిణామానికే భయపడి, చాలామంది ఆరోగ్యంగా ఉన్న అండాశయాలను కూడా తొలగింపజేసుకుంటారు.

 సాధారణంగా ముట్లు ఆగిపోవడాన్ని ‘మెనోపాజ్’ అంటారు. ఈ సమయంలో అండాశయం నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గిపోతుంది లేదా పూర్తిగా ఆగిపోతుంది. ఇది సాధారణంగా 45-55 ఏళ్ల మధ్యకాలంలో జరుగుతుంది. గర్భాశయాన్నీ, అండాశయాలనూ తొలగిస్తే కూడా ఇదే పరిణామం సంభవిస్తుంది. అయితే శస్త్రచికిత్స తర్వాత జరిగే ఈ పరిణామాన్ని ‘సర్జికల్ మెనోపాజ్’ అంటారు. సాధారణ మెనోపాజ్‌లో హార్మోన్స్ మెల్లగా తగ్గటం వల్ల వాటి లక్షణాలు అంత తీవ్రంగా ఉండవు. కానీ సర్జికల్ మెనోపాజ్‌లో హార్మోన్స్ అకస్మాత్తుగా ఆగిపోవడం వల్ల... దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.

 సర్జికల్ మెనోపాజ్ వల్ల సంభవించే పరిణామాలు
ఈస్ట్రోజెన్ హార్మోన్ స్రావాలు తగ్గడం లేదా ఆగిపోవడం వల్ల మహిళలలో ఈ కింది పరిణామాలు సంభవిస్తాయి. శరీరం నుంచి వేడి ఆవిర్లు వచ్చినట్లుగా అనిపిస్తుంది. వీటిని హాట్‌ఫ్లషెస్ అంటారు. ఉన్నట్లుండి జ్వరం వచ్చినట్లు, అంతలోనే చలిగా ఉన్నట్లు, ఫ్యాన్/ఏసీ వేసి ఉన్నా చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి   కండరాలు శక్తిని కోల్పోతాయి. ఎప్పుడూ నీసరం, అలసట, ఒంటినొప్పులు ఉంటాయి  ఎముకలు బలహీనపడి, పెళుసుగా మారి, నడుంనొప్పి, కీళ్లనొప్పులు, దీర్ఘకాలంలో చిన్న దెబ్బకు సైతం ఎముకలు తేలిగ్గా విరిగిపోవడం వంటివి జరుగుతాయి యోని లోపల చెమ్మ తగ్గి, పొడిదనం పెరగడం వల్ల మూత్రసంబంధ సమస్యలు వస్తాయి. అంటే మాటిమాటికీ యూరిన్ ఇన్ఫెక్షన్లు రావడం, అక్కడి కండరాల పటుత్వం తగ్గడం వల్ల మహిళ ప్రమేయమే లేకుండా మూత్రం పడిపోవడం, తుమ్మినా, దగ్గినా మూత్రం లీక్ కావడం జరగవచ్చు  యోనిలో ఇన్ఫెక్షన్స్, లైంగిక కలయికలో నొప్పి  టెస్టోస్టెరాన్ హార్మోన్ పాళ్లు తగ్గడం వల్ల లైంగిక వాంఛలు తగ్గడం, సెక్స్‌పై ఆసక్తి లేకపోవడం మెదడు చురుకుదనం కోల్పోతుంది. డిప్రెషన్, కోపం, చిరాకు వంటివి కనిపిస్తాయి.

ఆధునిక వైద్యవిజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత గర్భాశయానికి వచ్చే సమస్యలకు ఇటీవల అనేక కొత్త పద్ధతులు, వినూత్నమైన చికిత్సా ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. దాంతో గర్భాశయం తీయకుండానే అనేక సమస్యలకు చికిత్సలు చేయవచ్చు. ఒకవేళ తొలగించాల్సిన పరిస్థితే వస్తే... అప్పుడు వచ్చే దుష్పరిణామాలను తగ్గించుకునేందుకు హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (హెచ్‌ఆర్‌టీ) వంటి చికిత్సలను డాక్టర్ల పర్యవేక్షణలో తీసుకోవచ్చు. ఈస్ట్రోజెన్ హార్మోన్‌ను దీర్ఘకాలం తీసుకున్నా, కొన్ని దుష్ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి హిస్టరెక్టమీ ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే, ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం, అవసరమైతే సెకండ్ ఒపీనియన్‌కు వెళ్లడం మంచిది.
 
 మరి నిజంగానే గర్భాశయం ఎప్పుడు తొలగించాలి?  
 గర్భాశయంలో కంతులు ఏర్పడి, వాటి వల్ల కలిగే లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు గర్భాశయం జారినప్పుడు ఎండోమెట్రియాసిస్ అనే సమస్య సివియర్ దశలో ఉండి, లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు  అండాశయంలో కంతులు వచ్చినప్పుడు అధిక రక్తస్రావం అవుతూ మందులతో దాన్ని అరికట్టలేనప్పుడు  గర్భాశయ క్యాన్సర్ లేదా అండాశయ క్యాన్సర్ వచ్చినప్పుడు మాత్రమే గర్భాశయాన్ని తొలగించే హిస్టరెక్టమీ చేయించాలి. ఏ సమస్య అయినా దాని లక్షణాల తీవ్రత చాలా ఎక్కువగా ఉండి, మందులు, ఇతర ప్రత్యామ్నాయ పద్ధతుల వల్ల తగ్గనప్పుడు మాత్రమే ఆపరేషన్‌ను ఎంచుకోవడం మంచిది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement