చెన్నై, సాక్షి ప్రతినిధి: పోలీసు అధికారుల అలసత్వామా ? యువతలో పెరిగిపోతున్న విశృలంఖత్వమా ?... కారణం ఏదైనా రాష్ట్రంలో పెరిగిపోతున్న లైంగికదాడులు భయపెడుతున్నాయి. కేవలం 44 నెలల్లో 4,697 కేసులు నమోదై పరిస్థితి తీవ్రతను హెచ్చరిస్తోందని ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి కన్నగి అన్నారు.తిరువారూరు జిల్లా తిరుత్తురైపూండిలో భారత మహిళా సంఘం జాతీయ సమ్మేళనం (ఐద్వా) అధ్వర్యంలో మీనాక్షి సుందరామ్మాళ్ 18వ వర్ధంతి సభ మనలిలో శుక్రవారం జరిగింది. ఈ సభలో సమ్మేళన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కన్నగి మాట్లాడుతూ 1948 దళిత మహిళల హక్కుల కోసం వామపక్ష పార్టీలతో కలిసి పోరాడి అనేక నెలలు జైలు జీవితం గడిపిన పోరాట యోధురాలు మీనాక్షి సుందరామ్మాళ్ తంజావూరు చరిత్రలో నిలిచిపోయారని చెప్పారు.
బానిసత్వం నుంచి మహిళల విముక్తి కోసం గ్రామస్థాయిలో ఆమె చేసిన పోరాటాలు, మహిళా సంఘాల స్థాపనకు ఆమె చేసిన కృషి నేటికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల సమీపంలోనే టాస్మాక్ దుకాణాలు ఉన్నాయి, మద్యానికి బానిసైన భర్తలను కోల్పోయి ఎందరో మహిళలు వితంతువులుగా మారిపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం అమ్మకాలు రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో గత 44 నెలల్లో 4, 697 లైంగికదాడులు, 79,305 దోపిడీలు, 7,365 హత్యలు చోటుచేసుకున్నాయని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జయలలితను ఇంటికి పంపితీరుతామని ఆమె అన్నారు.
వామ్మో లైంగికదాడులు
Published Sat, Jul 18 2015 2:09 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM
Advertisement
Advertisement