కంట్రోల్ రూములోనే వేధింపులా?
చెన్నై, సాక్షి ప్రతినిధి:సాధారణ ప్రజలు లైంగిక వేధింపులకు పాల్పడితే పోలీసలుకు చెబుతాం, అలాంటిది పోలీసులే ఆ దుశ్చర్యకు పూనుకుంటే ఎవరికి చెప్పుకోవాలి. ఇదే ప్రశ్న కృష్ణగిరి ఎస్పీని మద్రాసు హైకోర్టు అడిగింది. ఈనెల 22వ తేదీలోగా పూర్తిస్థాయి నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఈ దారుణానికి సంబంధించి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబరు 8న రాజస్థాన్‌కు చెందిన నలుగురు మహిళలు, ఇద్దరు పిల్లలతో కలిసి హోసూరు బస్‌స్టేషన్ వద్ద నిలుచున్నారు. హోసూరు పోలీస్ కంట్రోల్ రూము హెడ్‌కానిస్టేబుల్ వారిని స్టేషన్‌కు తీసుకెళ్లాడు. వారివద్దనున్న డబ్బును తీసుకున్నాడు.
ఆ తరువాత నలుగురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో వారు అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించాడు. అఖిలభారత జననాయక మాదర్ సంఘం అధ్యక్షులు వాసుకి ఈ దారుణ ఉదంతంపై మద్రాసు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. బాధిత మహిళలు ప్రస్తుతం ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు. తమిళనాడు బాలల హక్కుల కమిషన్ పర్యవేక్షణలో సీబీసీఐడీ చేత విచారణ జరిగేలా ఆదేశించాలని, బాధిత మహిళలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణల ముందుకు ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చింది.
పిటిషనర్ తరపున న్యాయవాది నిర్మలారాణి వాదిస్తూ, న్యాయస్థానంలో పదిమంది ముందు చెప్పలేని భాషలో సదరు హెడ్ కానిస్టేబుల్ మహిళలను లైంగికవేధింపులకు గురిచేశాడని తెలిపారు. ప్లాస్టిక్ వస్తువుల అమ్మకంతో జీవనం సాగించే బాధిత మహిళల జాడలేదని, లైంగిక వేధింపులకు పాల్పడిన హెడ్ కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేయలేదని న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లారు. వ్యాజ్యంలోని వివరాలను విన్న న్యాయమూర్తులు విస్తుపోయారు. పోలీసులే లైంగిక వేధింపులకు పాల్పడితే ఎలాగని కృష్ణగిరి జిల్లా ఎస్పీని ప్రశ్నించారు. ఆస్పత్రిలో చేరిన బాధిత మహిళల మెడికల్ రిపోర్టు, హెడ్ కానిస్టేబుల్‌పై తీసుకున్న క్రమశిక్షణ చర్య తదితర వివరాలతో ఈ నెల 22వ తేదీలోగా నివేదిక సమర్పించాలని కృష్ణగిరి ఎస్పీని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. కేసును సైతం 22వ తేదీకి వాయిదావేసింది.