
కృష్ణాజిల్లా ఈడుపుగల్లులో ఏర్పాటు చేసిన కోడి పందేల బరి వద్ద భారీగా నిలిపి ఉంచిన వాహనాలు
సాక్షి, అమరావతి: కత్తులు కట్టిన కోళ్లు బరిలోకి దిగాయి. మొదటిరోజే ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రూ.350కోట్లకు పైగా చేతులు మారాయి. ఈ ఏడాది పశ్చిమ గోదావరి జిల్లాను తలదన్నే రీతిలో కృష్ణా జిల్లాల్లోనూ వందలాది బరుల్లో వేల సంఖ్యలో పందేలు సాగాయి. ఆడా..మగా, చిన్నా..పెద్దా అనే తేడా లేకుండా కోడి పందేలు చూసేందుకు జనం ఎగబడ్డారు. కత్తి కట్టి పందేలు వేయవద్దని, డింకీ పందేలు వేసుకోవచ్చని పోలీసులు చేసిన సూచనలను బేఖాతరు చేస్తూ డింకీ పందేలే అంటూ టీడీపీ నేతల దన్నుతో కత్తులు కట్టి నిర్వహించారు. అమెరికాలోని లాస్ వేగాస్‌లో ప్రసిద్ధి చెందిన క్యాసినో జూదాన్ని ఈసారి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఉభయ గోదావరి జిల్లాలను సైతం తలదన్నేలా రాజధాని ప్రాంతమైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో బరులు ఏర్పాటుచేసిన టీడీపీ నేతలు పందేల నిర్వాహకుల అవతారమెత్తారు. బెట్టింగ్‌లపై వచ్చే లక్షలాది రూపాయల కేవుల్ (నిర్వహణ వాటా) కోసం వారు కోడి పందేల నిర్వాహణకు క్యూకట్టారు. ఈసారి పోలీసులకు మామూళ్లు ఇచ్చే అవసరంలేకపోవడంతో మొత్తం మిగుల్చుకునేందుకు టీడీపీ నేతలు పోటీపడ్డారు. భీమవరం మండలంలోని ఓ గ్రామంలో గుండాట నిర్వహణకు బరి ఏర్పాటు చేసిన కోడిపందేల నిర్వాహకులకు రూ.72 లక్షలు ముట్టజెప్పేలా ఒప్పందం చేసుకున్నారంటే జూదం ఏ స్థాయిలో జరుగుతోందో అర్థంచేసుకోవచ్చు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో బరులు ఏర్పాటుచేయగా.. వాటి పక్కనే పేకాట, కోతాట, గుండాట తదితర జూద కేంద్రాలనూ పెద్ద సంఖ్యలోనే ఏర్పాటు చేశారు.
తూ.గో. జిల్లా అచ్చంపేట బరిలో తలపడుతున్న పందెం కోళ్లు
పెదగరువులో క్యాసినో..: అమెరికాలోని లాస్‌వేగాస్‌లో ప్రసిద్ధి చెందిన క్యాసినో జూదాన్ని ఈసారి సంక్రాంతికి పశ్చిమగోదావరి జిల్లా పెదగరువులో ప్రవేశపెట్టారు. దేశంలోని మెట్రో నగరాలకే పరిమితమైన దీనిని ఈసారి మూడు బస్సుల్లో ఇక్కడ నిర్వహించారు. పైకి టూరిస్టు బస్సులా కన్పించే వీటిలో క్యాసినో నిర్వహణకు ప్రత్యేక సెట్టింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనేందుకు విదేశీయులతోపాటు దేశంలోని పలు మెట్రో నగరాలకు చెందిన జూదరులు అతిథులుగా వచ్చినట్టు తెలిసింది. ఒక్క సోమవారం నాడే ఈ ఆటలో సుమారు రూ.60 కోట్లు చేతులు మారినట్టు సమాచారం.
టీడీపీ నేతల కనుసన్నల్లో..
- పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం కొప్పాకలో ఎమ్మెల్యే చింతమనేని, ఉండి నియోజకవర్గంలో కనుమూరు రఘురామకృష్ణంరాజు ప్రారంభించారు.
- కాళ్ళ మండలం సీసలిలో ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు పందేలు ప్రారంభించారు.
- పాలకొల్లు మండలం పూలపల్లిలో ఏఎంసీ చైర్మన్ గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు నేతృత్వంలోనూ, ఏఎంసీ మాజీ చైర్మన్ చెరుకూరి పండురాజు ఆధ్వర్యంలోనూ కోడిపందేలు జరిగాయి.
- కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ దగ్గరుండి మరీ నిర్వహించారు.
- గుంటూరు జిల్లా తెనాలి వద్ద స్థానిక ఎస్‌ఐ కోడి పందేల టెంట్లను తొలగించడంతో టీడీపీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ స్వయంగా అక్కడకు వెళ్లి పందేలు దగ్గరుండి మరీ నిర్వహించారు.
పందేలకు తెలంగాణ ప్రముఖులు
ఏటా రాష్ట్రంలో జరిగే కోడి పందేలను తిలకించేందుకు తెలంగాణ నుంచి వచ్చే ప్రజాప్రతినిధులు ఈసారీ పలువురు వచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, ఏలూరులో నిర్వహించిన కోడి పందేలకు హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, కూకట్‌పల్లి ఎమ్మెల్యే ఎం.కృష్ణారావులు హాజరు కాగా.. కృష్ణాజిల్లా కొత్తూరులో పందేలకు ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రకాష్‌గౌడ్, నాగేశ్వరరావులతోపాటు సినీనటులు శివారెడ్డి, జబర్దస్త్ నటులు వేణు, రాకేష్ తదితరులు హాజరయ్యారు.
నాలుగు జిల్లాల్లో 700కు పైగా బరులు
ఉభయ గోదావరి జిల్లాల్లో సోమవారం 600 వరకు బరుల్లో పందేలు జరిగినట్లు సమాచారం. అలాగే, కృష్ణాలో ఈసారి రికార్డు స్థాయిలో 210కి పైగా బరుల్లో నిర్వహించారు. విజయవాడ భవానీపురంలో జరుగుతున్న కోడి పందేలను పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. కత్తులు కట్టకుండా డింకీ పందేలు నిర్వహించుకోవచ్చని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. గుంటూరు జిల్లాలోను దాదాపు 150 బరుల్లో పందేలు జరిగాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోను కొనసాగాయి. కాగా, మొదటి రోజే కోడి పందేలు, జూదాల్లో సుమారు రూ.350 కోట్లకు పైగా చేతులు మారినట్లు అంచనా.
జిల్లాల్లో జోరుగా..
నిన్నటి వరకూ ఉక్కుపాదం మోపిన పోలీసులు.. వాటిని చూసీచూడనట్లు ఉండాలని సర్కారు నుంచి లోపాయికారిగా వచ్చిన సంకేతాలతో సోమవారం సైలెంట్ అయిపోయారు. దీంతో కోడి పందేల నిర్వాహకులు చెలరేగిపోయారు.
- పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల చేతుల మీదుగా కోడిపందేలు ప్రారంభమయ్యాయి. వీటిని చూసేందుకు భారీ స్క్రీన్‌లు ఏర్పాటుచేశారు. రాత్రి వేళల్లోనూ పందేలు సాగించడానికి చాలా బరుల్లో ఫ్లడ్‌లైట్లు ఏర్పాటుచేశారు. లక్ష్యణేశ్వరంలో యాంకర్ శ్రీముఖి, జబర్దస్త్ నటులతో ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. మొగల్తూరులో సాక్షాత్తు తహసీల్దార్ కార్యాలయం పక్కనే బరి ఏర్పాటుచేశారు. ఈ జిల్లాలో తొలిరోజు రూ.120కోట్లకు పైగా పందేలు జరిగినట్లు సమాచారం.
- ‘తూర్పు’లో గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పందేల సంఖ్య రెట్టింపయింది. సోమవారం ఒక్క రోజే జిల్లావ్యాప్తంగా రూ.100 కోట్ల మేర పందేలు జరిగాయని అంచనా. మంగళ, బుధవారాలు సంక్రాంతి, కనుమ రోజున పందేలు ఎక్కువుగా జరగనున్నట్టు అంచనా. జిల్లాలో సుమారు 400కు పైగా బరిలు వెలిశాయి. సాక్షాత్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న పెద్దాపురం, సొంత నియోజకవర్గం అమలాపురాల్లోనే పందేలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి.
- కృష్ణా జిల్లాలో కంకిపాడు, బాపులపాడు, ముసునూరు, కైకలూరు, జగ్గయ్యపేట, మచిలీపట్నం, గుడివాడ మండలాల్లో రూ.70–80 కోట్ల మేర కోడిపందేలు జరిగాయి. కంకిపాడు మండలం ఈడుపుగల్లులో పందేలు హోరెత్తాయి. ఇక్కడ ఒక్కచోటే రూ.15 కోట్ల మేర పందేలు జరిగినట్లు తెలుస్తోంది.
- గుంటూరు జిల్లాలోనూ అనేక ప్రాంతాల్లో కోడిపందేల బరులు ఏర్పాటు చేశారు. రేపల్లె నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో కోడి పందేలు నిర్వహించారు.
- విశాఖపట్నం జిల్లాలో సోమవారం అక్కడక్కడ జరిగాయి. మంగళ, బుధవారాల్లో విస్తృతంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. జిల్లాల్లోని పాయకరావుపేట, నర్సీపట్నం, యలమంచిలి, అనకాపల్లి, చోడవరం, భీమిలి, గాజువాక నియోజకవర్గాల్లో ఏటా కోడి పందేలు నిర్వహిస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment