సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/పటాన్‌చెరు/పటాన్‌చెరు టౌన్: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు మండలం చిన్నకంజర్ల శివారులోని ఓ ఫాంహౌస్‌లో కోడిపందేల ఉదంతంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కోడిపందేల స్థావరంపై బుధవారం రాత్రి పటాన్‌చెరువు పోలీసులు దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. అయితే.. పందేల ప్రధాన నిర్వాహకుడైన టీడీపీ నేత, ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పోలీసుల కళ్లుగప్పి పరారవడంతో ఆయన కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
పందెం నిర్వహణకు చింతమనేనే ప్రధాన సూత్రధారి అని దర్యాప్తులో తేలడంతో ఆయన్ను ఏ1 నిందితుడిగా చేర్చామని, ఆయనతోపాటు పరారీలో ఉన్న మరో 40 మందిని పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటుచేశామని పటాన్‌చెరువు డీఎస్పీ భీంరెడ్డి తెలిపారు. చింతమనేని తన ఫోన్‌ను స్వీచ్చాఫ్ చేసుకున్నారని చెప్పారు. అయితే, పోలీసులు దాడులు నిర్వహించిన కోళ్ల పందేల స్థావరంలో తాను లేనంటూ చింతమనేని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై డీఎస్పీ స్పందించారు.
ఆయన కోడి పందేలు ఆడిస్తున్నట్లు వీడియోలు ఉన్నాయని, అవసరం వచ్చినప్పుడు సాంకేతిక ఆధారాలను విడుదల చేస్తామన్నారు. అయితే, చింతమనేని బుధవారం కోడి పందేల్లో పాల్గొన్న ఓ వీడియో ‘సాక్షి’కి చిక్కింది. పోలీసుల దాడి సమయంలో ఆయన అక్కడి నుంచి పారిపోతున్నట్లుగా అందులో స్పష్టంగా కనిపించింది. మరోవైపు.. ఇదే స్థావరంలో రేవ్ పార్టీలు కూడా జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
స్థాయిని బట్టి బరుల ఏర్పాటు
కోడిపందేల్లో పాల్గొనే వారిని చింతమనేని వాట్సాప్‌లో లొకేషన్ షేర్ చేస్తూ రప్పిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. చింతమనేని తొలుత సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కోహీర్ శివారులోని కుంచారంలో కోళ్ల పందేలు ఆడి తిరిగి అక్కడి నుంచి చిన్నకంజర్లలోని మామిడి తోటలో పందేలు ఆడేందుకు వచ్చారని పోలీసులు తెలిపారు. ముందుగా 20 మందితో పందేలు మొదలవగా వాట్సాప్ గ్రూప్‌లో చింతమనేని లోకేషన్ షేర్ చేయడంతో ఆ సంఖ్య 70కి చేరిందన్నారు.
గతంలో సినీ పరిశ్రమలో పనిచేసిన బర్ల శ్రీను అనే వ్యక్తి కూడా పందేల నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ స్థావరంలో రూ.500 పందెం కాసేవారికి ఒక బరి, రూ. వెయ్యి కాసేవారికి మరొకటి, రూ.2 వేలు కాసే వారికి మరొకటి.. ఇలా స్థాయిని బట్టి బరులను ఏర్పాటుచేశారు. పోలీసులు దాడులు నిర్వహించిన చోట గుట్టలకొద్దీ ఖాళీ మద్యం సీసాలు దర్శనమిచ్చాయి. సీజ్ చేసిన వాహనాల్లోనూ ఇవి లభించాయి.
పట్టుబడిన 21 మంది వీరే..
ఈ కేసులో పట్టుబడిన నిందితులు హైదరాబాద్‌తోపాటు ఏలూరు, కృష్ణాజిల్లా, రాజమండ్రి, విజయవాడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నిందితులైన అక్కినేని సతీశ్, శ్రీనివాస్‌రావు, చేతేశ్వర్‌రావు, శ్రీరామకృష్ణ, బాలస్వామి, లింగాల నాగేశ్వర్‌రావు, రవడి శ్రీను, రవీంద్ర చంద్రశేఖర్, నాగబాబు, నాగశేషు, సూర్యనారాయణరావు, వంశీ, షణ్ముఖ్‌సాయి, నిఖిల్, గంటా శ్రీనివాసరావు, పార్స శ్రీనివాసరావు, బొడపాటి నాగేశ్వరరావు, ముల్లపుడి నర్సన్న, సత్యనారాయణ రాజు, నర్ర సాంబశివరావు, ప్రకాశ్‌లను రిమాండ్‌కు తరలించారు.
ఇక్కడే రేవ్ పార్టీలు కూడా?
చింతమనేని ప్రభాకర్ సంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న కోళ్ల పందేల స్థావరంలో రేవ్ పార్టీలు కూడా జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీకెండ్‌లో హైదరాబాద్‌కు చెందిన పలువురు యువతీ యువకులను తీసుకొచ్చి ఇక్కడ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఈ కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment