కండల కోడి c/o ‘పాతబస్తీ | Hyderabad Cock For Sankranti Races In AP | Sakshi
Sakshi News home page

కండల కోడి c/o ‘పాతబస్తీ’

Published Mon, Jan 11 2021 5:06 AM | Last Updated on Mon, Jan 11 2021 5:19 AM

Hyderabad Cock For Sankranti Races In AP - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది పిండివంటలతోపాటు కోడి పందేలు.. ఇందుకోసం అవసరమయ్యే మేలు జాతి కోళ్లను హైదరాబాద్‌లోనూ పెంచుతున్నారు. పాతబస్తీలో పెంచే కోళ్లకు భలే డిమాండ్‌ ఉంది. సంక్రాంతికి 3–4 నెలల ముందు నుంచే ఇక్కడ పందెం కోళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. పాతబస్తీ పందెం కోళ్లు, వాటికి ఇచ్చే ఆహారం, పందేల కోసం ఇచ్చే శిక్షణపై సాక్షి ప్రత్యేక కథనం... 

జీవనశైలి ప్రత్యేకం... 
పందెం కోళ్ల పెంపకం, వాటి జీవనశైలి సాధారణ కోళ్లతో పోలిస్తే ప్రత్యేకంగా ఉంటుంది. వాటి ఎంపిక దగ్గర నుంచి ఆహారం, శిక్షణ వరకు అన్నీ విభిన్నంగా సాగుతాయి. పుంజులను బలంగా తయారు చేయడం కోసం వాటికి పౌష్టిక ఆహారం పెడతారు. ప్రత్యేక శిక్షణ ఇస్తారు. నాలుగు నెలల కాలాన్ని వారాలుగా విభజించి పుంజులను బలంగా తయారు చేస్తారు. పందెం కోళ్ల ఆహార జాగ్రత్తలు చూస్తే కళ్లు తిరుగుతాయి. వెజ్, నాన్‌వెజ్‌ ఐటమ్స్‌తో కూడిన బలవర్ధకమైన ఆహారం అందిస్తారు. 

కఠోర శిక్షణ... 
పండుగ నెల రోజుల ముందు నుంచి పందెం కోళ్లకు అసలైన ట్రైనింగ్‌ మొదలవుతుంది. ఉదయాన్నే వాటికి మౌత్‌ వాష్‌ చేయిస్తారు. పుంజుల గొంతులో ఏమైనా మలినాలుంటే వాటిని తొలగిస్తారు. ట్రైనర్‌ తన నోట్లో నీళ్లు పోసుకొని కోళ్ల ముఖంపై స్ప్రే చేస్తాడు. ఈ ప్రక్రియను కల్లె కొట్టడం అంటారు. పుంజు కండరాలు బిగుతుగా ఉండేందుకు వాకింగ్‌ చేయిస్తారు. అటూఇటూ పరుగెత్తిస్తారు. ఆ తర్వాత వేడి నీళ్లు, ప్రత్యేక షాంపూతో స్నానం చేయిస్తారు. రెండు గంటల తర్వాత మళ్లీ ట్రైనింగ్‌ మొదలవుతుంది. ఈసారి ఒక పుంజును మరో దానితో పోటీకి దింపుతారు. కొద్దిసేపు ఫైటింగ్‌ తర్వాత వాటికి స్పెషల్‌ మసాజ్‌ ఉంటుంది. అట్ల పెనంపై గుడ్డును వేడిచేసి బాదం, నిమ్మ నూనెతో మసాజ్‌ చేస్తారు. పెంపకందారులు వాటికి ప్రత్యేకంగా ప్రతిరోజూ పండుగ భోజనమే పెడతారు. ఒక్కో కోడిపై నెలకు రూ. 5 వేల నుంచి 6 వేల వరకు ఖర్చు అవుతుంది. పందెం కోళ్ల ధరలు రూ. వేలల్లో ఉంటాయి. అసీల్‌ రకం కోళ్ల ధర రూ. 50 వేల నుంచి 75 వేల వరకు ఉంటుంది. కొన్ని రకాల కోళ్లు రూ. లక్షపైన కూడా పలుకు తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పుంజుల పెంపకం ఓ యజ్ఞంలా సాగుతుంది. కోళ్లను నిర్వాహకులు కంటికి రెప్పలా చూసుకుంటారు. 

పందెం కోళ్ల మెనూ ఇలా.. 
► ఉదయం ఎండు ఖర్జూరం కిస్మిస్, మేకపాలు 
► మూడు గంటలకోసారి జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా మిశ్రమం 
► బియ్యం, రాగులు, మినప్పప్పు, శనగపప్పు, గోధుమ మిశ్రమం.. మధ్యాహ్నం మటన్‌ కైమా, సాయంత్రం స్నాక్స్‌గా జొన్నలు, కోడిగుడ్లు

కోడిపుంజుల కసరత్తులు ఇవీ..
► కండరాల బిగుతుకు రోజూ మార్నింగ్‌ వాక్‌ 
► తిన్నది ఒంటికి పట్టేవిధంగా అటుఇటు పరుగెత్తించడం. చెరువులో ఈత కొట్టించడం
► వేడి నీళ్లు, స్పెషల్‌ షాంపూతో స్నానం 
► అట్ల పెనంపై గుడ్డును వేడిచేసి బాదం, నిమ్మ నూనెతో మసాజ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement