పాతబస్తీలో పందెంకోళ్ల కూత ! | Chicken racing in old city | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో పందెంకోళ్ల కూత !

Published Sat, Jan 11 2014 4:27 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM

పాతబస్తీలో పందెంకోళ్ల కూత !

పాతబస్తీలో పందెంకోళ్ల కూత !

సంక్రాంతి సందర్భంగా సీమాంధ్రలో జోరుగా సాగే కోడి పందేలతో హైదరాబాద్‌లోని పాతబస్తీకి సంబంధం ఏముంటుంది? కండలు తిరిగిన దేహంతో కనిపించే పహిల్వానులకు, రోషంగా పోరాడే కోడి పుంజులతో సంబంధం ఏమిటి? ఉంది మరి... కత్తులు ఝుళిపిస్తూ కలబడే కోడిపుంజులకు తర్ఫీదునిచ్చేది మన పహిల్వానులే!
 
 హైదరాబాద్, న్యూస్‌లైన్: సంక్రాంతి వచ్చిం దంటే చాలు పాతబస్తీలోని బార్కాస్ పరిసరాలలో గాలిపటాల సందడితోపాటు కోడిపుంజుల కూతలు కూడా వినిపిస్తుంటాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్వహించే కోళ్ల పందాలకు రాష్ట్రవ్యాప్తంగా పేరుంది. వీటితో హైదరాబాద్ పాతబస్తీకి విడదీయరాని అనుబంధం ఉంది. కోట్ల రూపాయలు వెచ్చించి పోటీలకు కాలు దువ్వే పందెంరాయుళ్ల పంట పండించే కోడిపుంజులు పాతబస్తీ నుంచి ఎగుమతి కావడం విశేషం. పరువు, ప్రతిష్టలే లక్ష్యంగా రంగంలోకి దిగేవారు కదనరంగంలోకి దూకి విజేతలుగా నిలిచే పాతబస్తీ కోడిపుంజుల కోసం లక్షలాది రూపాయలు వెచ్చించడం గమనార్హం.
 
 ఒక్కో కోడిపుంజు రూ.లక్షకు పైనే..!
 కోస్తాంధ్ర, రాయలసీమల్లో సంక్రాంతిని పురస్కరించుకుని జరిగే కోడి పందాల కోసం పందెం రాయుళ్లు బార్కాస్‌లోని పహిల్వాన్ల వద్దకు వచ్చి వాలిపోతారు. వీరి వద్ద శిక్షణ పొందిన కోడిపుంజును తీసుకెళితే పందెంలో నెగ్గుతామనే నమ్మకమే ఇక్కడకు రప్పిస్తోంది. బార్కాస్‌లో ఒక్కో కోడిపుంజు ధర లక్ష రూపాయల వరకు పలకడం విశేషం. అలాగని పహిల్వానులు కోళ్ల వ్యాపారం చేస్తారనుకుంటే పొరపాటే. ఎంతో దగ్గరి వ్యక్తులకు మాత్రమే ఏడాదికి పరిమిత సంఖ్యలో కోడి పుంజులను విక్రయిస్తుంటారు. వీటి కోసం షెడ్డు ఏర్పాటు చేసి  ప్రత్యేక ఎన్‌క్లోజర్లలో పందెం పుంజు లను పెంచి పోషిస్తున్నారు. రెండేళ్ల వయసున్న కోడి పుంజులనే పందానికి వినియోగిస్తారు.
 
 రెండు పూటలా మసాజ్
 పాతబస్తీలో పహిల్వాన్లు తాము పెంచే పుంజులకు విటమిన్లతో కూడిన ఆహారాన్ని అంది స్తారు. బాదం, పిస్తా, ఆక్రూట్, ఖీమా, ఉడికించిన గుడ్డు(తెలుపు భాగం) ఆహారంగా ఇస్తారు. ప్రత్యేక ఆహారంతోపాటు కదనరంగంలో విజేతగా నిలిచేలా అన్ని రకాల తర్ఫీదునిస్తారు. ముఖ్యంగా  నైపుణ్యం కలిగిన శిక్షకులతో రెండు పూటలా మసాజ్‌లు చేయిస్తారు. చురుగ్గా పరిగెత్తడం సాధన చేయిస్తారు. బార్కాస్, కొత్తపేట, ఎర్రకుంట తదితర ప్రాంతాల్లోని కొందరు పహిల్వాన్ల వద్ద మాత్రమే ఇలాంటి కోడిపుంజులున్నాయి. వీటికి అనారోగ్యం దరి చేరకుండా ప్రత్యేక శ్ర ద్ధ తీసుకుంటారు. ప్రత్యేక ఎన్‌క్లోజర్ల మాదిరిగా చిన్నచిన్న గూళ్లను ఏర్పాటు చేసి మినీ జూపార్కును తలపించేలా మూగజీవాల పెంపకంలో పహిల్వాన్ల కుటుంబాలు నిమగ్నమయ్యాయి. ఇంత శ్రద్ధగా పహిల్వాన్లు పెంచే పందెం కోళ్లు తమ సత్తా చూపి వారికి పేరు తేకుండా ఎలా ఉంటాయి?
 
 
 కోడి పందాలు, బెట్టింగ్‌లపై తీసుకున్న చర్యలేంటి?
 సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, బెట్టింగ్‌లు నిర్వహించకుండా జంతుహింస నిరోధక చట్టాలను సమర్ధవంతంగా అమలు చేయాలని తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల ఎస్పీలను లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి శుక్రవారం ఆదేశించారు. ఈనెల 27 లోగా నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కోడిపందాలు, బెట్టింగ్‌లు బహిరంగంగా జరుగుతున్నా పోలీసులు చర్యలు చేపట్టడం లేదంటూ హైకోర్టు న్యాయవాది జి.రోనాల్డ్‌రాజ్, పీడీ రాయులు దాఖలు చేసిన పిటిషన్‌ను లోకాయుక్త విచారణకు స్వీకరించి ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పందేల ద్వారా ఏటా రూ.300 కోట్లు చేతులు మారుతున్నాయని, మీడియా ప్రత్యక్షంగా చూపుతున్నా పోలీసులు స్పందించడం లేదని పిటిషనర్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement