Chicken racing
-
కోడి పందేల స్థావరంపై దాడి.. 14 మందిని అరెస్ట్
వాజేడు: లక్షీపురం, గెర్రగూడెం గ్రామాల శివారులోని ఊర చెరువు వద్ద కోడి పందేల స్థావరంపై వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్ ఆధ్వర్యంలో సోమవారం పోలీసులు దాడులు నిర్వహించారు.పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా కొంతమంది కోడి పందేలు ఆడుతూ పోలీసులను చూసి పారిపోయారు. పారి పోతున్న వారిని వెంబడించి పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు.ఈ దాడిలో 14 మందిని అదుపులోకి తీసుకోగా.. వారి నుంచి 5 కోడి పుంజులు, 4 కోడి కత్తులు, రూ.28,900 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై హరీశ్ తెలిపారు. -
సిటీ శివార్లలో కొక్కొరో.. కో!
నగరంలో 20-ట్వంటీ మ్యాచ్‌లను తలపిస్తున్న కోడిపందేలు ఏటా 30 కోట్లకు పైగానే చేతులు మారుతున్న వైనం ఫాంహౌస్‌లు, అపార్టమెంట్ సెల్లార్లు, గుట్టలే అడ్డాలు ఆదివారం వచ్చిందంటే హైదరాబాద్ నగరంలో కోడి కూతకు కోట్లు చేతులు మారుతున్నాయి. సంక్రాంతి సమయంలో గోదావరి జిల్లాల్లో ఐపిఎల్, వన్డే మ్యాచ్‌ల మాదిరిగా పందేలు జరుగుతుంటే హైదరాబాద్ నగరంలో ఆదివారం కోడిపందేలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌ల మాదిరిగా ఆడేస్తున్నారు. పందెం వేసేవారికన్నా...చూసేవారి బెట్టింగులు లక్షల్లో ఉంటున్నాయి. మామూలు రోజుల్లో కూడా నగరంలో జరుగుతున్న కోడిపందేల ఖరీదు ఏడాదికి 33 కోట్లు. సాక్షి సిటీ ప్లస్ ప్రతినిధి, హైదరాబాద్ ఆదివారం వచ్చిందంటే...చాలు హైదరాబాద్‌లో ఓ పది ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. అపార్టు మెంట్లు, ఫాంహౌజ్‌లు, కంపెనీల కాంపౌండ్లు... కోడిపందేలకు అడ్డాలుగా తయారయ్యాయి. కొంపల్లి, బాచుపల్లి, కూకట్పల్లి, నిజాంపేట, మియాపూర్, చందానగర్, పఠాన్‌చెరువు, బీహెచ్ ఈఎల్, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో ఈ పందేలు జరుగు తున్నాయి. నాలుగు అపార్టుమెంట్ల మధ్యలో ఓ పది గజాల స్థలముంటే చాలు.. కోడి పందేలకు ఏర్పాట్లు చేసేస్తున్నారు. ఒక్క ఫోన్కాలతో జూదగాళ్లు పందెం ప్రాంతా నికి చేరుకో వడం, పందెం లెక్కలు చెప్పుకోవడం, పందేనికి కోళ్లను వదల డం, నిమిషాల్లో పందెం పూర్తయిపోవడం. అంతే గప్‌చుప్‌గా ఎవరిళ్లకు వారు వెళ్లిపోవడం. ఈ తతంగమంతా అపార్ట్మెంట్ వాచ్మెన్ చేతులమీదుగా నడుస్తోంది. ఈ పందేలను నమ్ము కుని బెట్టింగ్ వ్యాపారం చేసేవారికి వాచ్మెన్లు బినామీలుగా పనిచేస్తున్నారు. ‘‘ఈ పందేలు..పేద జీవితాలను పాములా కాటేస్తున్నాయి’’ ఏదో కూలీ చేసుకుని బతుకుదామని వచ్చామండీ. ఊళ్లో ఉంటే ఇలాగే పందేలు, పత్తాలు అంటూ బతుకు నాశనమవు తుందని ఇక్కడికొచ్చాం. ఇక్కడ అంతకంటే గొప్పగా జూదాలు ఆడే అవకాశముందని వచ్చాక తెలిసింది’’ అంటూ ప్రగతినగర్‌లోని ఒక అపార్టు మెంట్ వాచ్మెన్ భార్య పందెం వల్ల పడుతున్న కష్టాలను చెప్పుకొచ్చింది. కత్తులు...ఎత్తులు కోడి పందేలు వేసే ప్రాంతాలకు అందరికంటే ముందుగా చేరేది కత్తులు కట్టేవారు. పందెం కోళ్లకు పదునైన కత్తులు కట్టి వందలు సంపాదించేవారు నగరంలో పదులసంఖ్యలో ఉన్నారు. వీరు ఒకపక్క కత్తుల సేల్స్ చేస్తూనే మరోపక్క పందెం రాయళ్ల నెట్వర్క్ని పెంచుతున్నారు. హైదరాబాద్‌లో పందెం కోళ్లకు బార్కాస్ ప్రాంతం చాలా ఫేమస్. సంక్రాంతి సమయంలో ఇక్కడ చాలాకోళ్లు అమ్ముడుపోతాయి. కాని మామూలురోజుల్లో ఇక్కడ జరుగుతున్న పందేలకు కోళ్లన్నీ గోదావరి జిల్లాల నుంచే వస్తున్నాయి. అక్కడి నుంచి పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ పెంచుతున్నారు. ఎర్రగట్ట నాటుకోడి దుకాణాల్లో కూడా పందెం కోళ్లు దొరుకుతున్నాయి. ఇవి కాకుండా శివారుల్లో ఉన్న తోటల్లో పందెంకోళ్లను పెద్ద సంఖ్యలో పెంచుతున్నారు. వీరి పెంపకం, పందేలు వేయడం వంటి పనులన్నీ పేదలే చేస్తున్నారు. ముఖ్యంగా రోజు కూలీల చేతులమీదనే నడుస్తున్నాయి. అయితే వీరంతా పెద్దస్థాయి బెట్టింగ్బాబులకు బినామీలు. ఆదివారం వేసే పెద్ద పందేలు కాకుండా... మిగతారోజుల్లో ఈ కూలీలు రెండు వేలకు, మూడు వేలకు పందేలు వేసుకుని జేబులు గుల్ల చేసుకుంటున్నారు. రైడింగ్ వేళ... రెండు వారాలక్రితం నిజాంపేట పరిధిలో కోడిపందెం జరుగుతుందని తెలిసి పోలీసులు రైడింగ్ చేశారు. పోలీసులు వస్తున్నారని తెలిసి...అందరూ చుట్టుపక్కల అపార్టుమెంట్లలోకి వెళ్లి దాక్కున్నారు. పోలీసులు కష్టపడి ఒకర్నో ఇద్దర్నో పట్టుకున్నారు. వాళ్లని తిరిగి ఇళ్లకు తీసుకురాడానికి పోలీసులకు గట్టిగానే ముట్టజెప్పామని పందెంలో పాల్గొన్నవారు బాహాటంగానే చెప్పడం గమనార్హం. కూకట్పల్లి ప్రాంతంలో విధిగా పందెంలో పాల్గొనే ఓ కూలీని పలకరిస్తే పోలీసుల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాడు. ‘‘మేం వేసే పందేల గురించి పోలీసులకు తెలియకపోవడం ఏంటండీ...చాలావరకూ మేం ఎప్పటికప్పుడు పందేల ప్రదేశాలను మార్చేస్తుంటాం. ఎంత మార్చినా...నెలకో...రెండు నెలలకో దొరికిపోతుంటాం. చేసేదేముంది...వారి వాటా వారికిచ్చి బయటపడతాం’’ అని అంటాడు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకురాగా అటువంటి పందేలేమీ జరగడం లేదన్నారు. మియాపూర్... ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు.. మియాపూర్ పరిధిలోని ఒక అపార్టుమెంటు సెల్లార్లో ఉన్నట్టుండి జనం పోగయ్యారు. ఓ పది బైక్‌లు, రెండు కార్లు గేటు ముందు ఆగాయి. ఒకబ్బాయి బ్యాగులో నుంచి కోడిని కింద వదిలాడు. రెండో కోడి అప్పటికే సిద్దంగా ఉందక్కడ. కత్తులు కట్టేవాడు...తన పని మొదలుపెట్టాడు. అంతే ఒకటి...రెండూ అంటూ పందెం వెలను వేలల్లో పాడుతూ కోళ్లను కింద వదిలారు. ఒకటి రెండు నిమిషాల్లో పందెం వేడుక ముగిసిపోయింది. వీక్షకుల బెట్టింగ్‌లు కూడా పూర్తయి పోయాయి. అదే నిమిషంలో కోళ్ల వేలం కూడా చేసేశారు. ఎవరి కోడిని వారు బ్యాగులో వేసుకుని బయలుదేరిపోయారు. అక్కడ జరి గిన బెట్టింగ్ ఖరీదు రెండు లక్షలు. గుట్టు చప్పుడు కాకుండా అపార్ట్మెంట్ పరిసరాల్లో కోడిపందేలు వేస్తున్న తీరు ఇది. ప్రగతినగర్ ఆదివారం ఉదయం పది గంటలకు... ప్రగతినగర్ గుట్ట దేనికి ఫేమస్ అంటే కోడి పందేలకని అక్కడ ఎవరిని అడిగినా చెబు తారు. ఆదివారం వచ్చిందంటే... తక్కువలో తక్కువ పది పందేల వరకూ జరుగుతాయి. చేతి సంచుల్లో కోడిపుంజులను వేసుకుని గుంపులుగా గుట్ట ఎక్కేస్తారు. అప్పటికే అక్కడ బెట్టింగ్‌రాయుళ్లు రెడీగా ఉంటారు. అక్కడ కూడా గుట్ట ఎక్కి దిగేలోపు పందెం పనులు ముగించేస్తారు. ఆ రోజు అక్కడ జరిగిన బెట్టింగ్..మూడున్నర లక్షలు. కొంపల్లి ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు..కొంపల్లి ప్రాంతంలో ఒక ఫాంహౌస్‌లో పందేనికి ఏర్పాట్లు చేసుకున్నారు. పందెం వేసేది ఆ చుట్టుపక్కల కంపెనీల్లో పనిచేసుకునే కూలీలు. వీక్షకులు మాత్రం బాగా డబ్బున్నవారు. ఓ పది కార్లు, ఐదారు మోటారుబైకుల్లో జనం వచ్చారు. పందెం మొదలవ్వక ముందే... బెట్టింగ్ రాయుళ్లు గ్రూపులుగా విడిపోయారు. కోళ్లను వదల గానే పాట పదివేల నుంచి మొదలుపెట్టారు. క్షణాల్లో నాలుగు లక్షలకు వెళ్లిపోయింది. పందెం ముగియగానే డబ్బులు బయటికి తీసారు. పంపకాలు పూర్తయ్యాయి. బెట్టింగ్ ఖరీదు ఐదు లక్షలు. వాట్ నెక్ట్స్ అనగానే ఓ ఇద్దరు పేక పెట్టెలు తెరిచారు. -
ఏసీబీ వలలో ఎస్ఐ
కోడిపందేల నిర్వహణకు రూ.25 వేలకు డీల్ రెండో విడత రూ.10 వేలు తీసుకుంటుండగా దాడి ఆగిరిపల్లి, న్యూస్‌లైన్ : ఆగిరిపల్లి పోలీస్‌స్టేషన్ ఎస్ఐ తాటిపాక చంద్రశేఖర్ సోమవారం ఏసీబీ వలలో చిక్కారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని కలటూరుకు చెందిన జాలిపర్తి ఎస్.రామకృష్ణ సంక్రాంతి పండగకు కోడిపందేలు నిర్వహించుకోవడానికి ఎటువంటి కేసులూ లేకుండా అనుమతులు ఇవ్వాల్సిందిగా ఎస్ఐని అడిగారు. రూ.25 వేలు ఇస్తే కేసులు పెట్టకుండా వదిలేస్తానని ఎస్ఐ డిమాండ్ చేశారు. ఈ నెల 14న రామకృష్ణ చివరకు రూ.10 వేల నగదు ఎస్ఐకి ఇచ్చారు. రామకృష్ణ బృందం కోడిపందేలను 14, 15 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించారు. ఈ క్రమంలో 19న ఎస్ఐ రామకృష్ణను పిలిపించి నువ్వు పెద్దఎత్తున కోడిపందేలు నిర్వహించావు.. మరో రూ.15 వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. నగదు ఇవ్వని పక్షంలో మీ గ్రామానికి చెందిన వారిపై కేసులు ఎలా పెట్టానో నీ మీద అలా కేసులు పెడతానంటూ బెదిరించారు. అదేరోజు సాయంత్రం రామకృష్ణ విజయవాడ ఏసీబీ అధికారులకు ఉప్పందించారు. ఈ నేపథ్యంలో ఎస్ఐకి, రామకృష్ణకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను ఏసీబీ అధికారులు పరిశీలించారు. అనంతరం సోమవారం సాయంత్రం ఆరు గంటలకు పోలీస్‌స్టేషన్ ఆవరణలో రామకృష్ణ రూ.10 వేల నగదు ఇవ్వగా దాడి చేసి పట్టుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ ఆర్.విజయ్‌పాల్ తెలిపారు. రాజమండ్రిలోని ఎస్ఐ నివాసంలో కూడా అక్రమ ఆదాయంపై తనిఖీలు నిర్వహించనున్నట్లు విలేకర్లకు తెలిపారు. ఏ ప్రభుత్వాధికారైనా లంచానికి డిమాండ్ చేస్తే 9440446164, 9440446169, 9440446133, 9440446167 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఏసీబీ డీఎస్పీ సూచించారు. -
‘పుంజు’కుంటున్న పందేలు!
గోదావరి జిల్లాల్లో భారీ స్థాయిలో కోడి పందేలకు రంగం సిద్ధం చేతులు మారనున్న రూ.300 కోట్లు పోలీసు అధికారుల హెచ్చరికలు బేఖాతరు చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు సాక్షి ప్రతినిధి, కాకినాడ: ముగ్గులద్దుకున్న ముంగిళ్లు.. అందులో కొలువుదీరిన గొబ్బిళ్లు.. భోగి మంటలు.. గంగిరెద్దు విన్యాసాలు.. కొత్త అల్లుళ్ల సందళ్లు.. సంక్రాంతి అంటే ఇంతే కాదు.. గోదావరి జిల్లాల్లో కోడి పందేలు కూడా! ఎప్పట్లాగే ఈసారి కూడా పందెం బరులు సిద్ధమవుతున్నాయి. కోట్ల రూపాయలు కుమ్మరించేందుకు పందెంరాయుళ్లూ రెడీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార, విపక్షాలకు చెందిన నాయకులు ఈ పందేలపై ప్రత్యేక దృష్టి సారించారు. ‘‘మీ వెనుక మేమున్నాం.. ఏర్పాట్లు చేసుకోండి’’ అంటూ నేతలు ఇస్తున్న భరోసాతో పందేల నిర్వాహకులు ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రూ.300 కోట్ల మేర పందేలు జరుగుతాయని అంచనా. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే రూ.200 కోట్లు చేతులు మారుతాయంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం నుంచి సుమారు 400 పందెం కోళ్లను భీమవరం పరిసర ప్రాంతాలకు తీసుకుపోయి సాధన చేయిస్తున్నట్టు సమాచారం. ఈ పందేలను చూసేందుకు సామాన్యుల నుంచి రాజకీయ, సినీ ప్రముఖులు, బడా వ్యాపారవేత్తలు పెద్దఎత్తున తరలిరానున్నారు. నర్సాపురం ఎంపీ, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు స్వగ్రామమైన ఆకివీడు మండలం ఐ.భీమవరంలో పందేలు కోట్లలో జరుగుతాయి. పండుగ మూడ్రోజులు ఈ ఒక్క గ్రామంలోనే సుమారు రూ.70 కోట్లు చేతులు మారతాయని అంచనా. తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం గోడి, ఐ.పోలవరం మండలం కేశనకుర్రు, ఆత్రేయపురం, మెట్ట ప్రాంతంలోని జగ్గంపేట, కిర్లంపూడి ప్రాంతాల్లో కూడా కోట్లలో పందేలు జరుగుతాయి. పశ్చిమ గోదావరిలో భీమవరం పరిసర ప్రాంతాలతో పాటు నర్సాపురం, పాలకొల్లు తదితర ప్రాంతాల్లో 30 నుంచి 40 చోట్ల, తూర్పుగోదావరిలో కోనసీమతో పాటు మెట్టలోని జగ్గంపేట తదితర ప్రాంతాల్లో 30 చోట్ల పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పందేల కోసం రానున్న రాజకీయ, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు భీమవరం, అమలాపురం పరిసర ప్రాంతాల్లో నాలుగు నెలల క్రితమే హోటళ్లలో గదులను బుక్ చేసుకున్నారు. పోలీసులది ప్రేక్షక పాత్రేనా? పందేలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమవుతున్నారు. ఏలూరు రేంజి డీ ఐజీ విక్రమ్మాన్సింగ్ పందేలకు అడ్డుకట్ట వేస్తామని హెచ్చరించినా.. బరులు ఎప్పట్లాగే సిద్ధమవుతుండడం గమనార్హం. 2 నిమిషాల పందేనికి నాలుగేళ్ల రాజభోగం.. పందేల్లో ప్రధానంగా డేగ, నెమలి, కాకి, నెమలి కాకి, పర్ల వంటి 28 రకాల జాతుల కోళ్లకు డిమాండ్ ఎక్కువ. పుంజును బట్టి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ధరలున్నాయి. రెండు నిమిషాలపాటు పందెంలో పోరాడే కోడిపుంజుకు నాలుగేళ్లపాటు రాజభోగాలు కల్పిస్తారు. సంక్రాంతికి ఆరు నెలల ముందు నుంచే వీటికి సైనికుల మాదిరి కఠిన శిక్షణనిస్తారు. పండుగకు నెలరోజుల ముందు వరకు కోడిగుడ్లు, చోళ్లు, వడ్లు మాత్రమే ఆహారంగా అందిస్తారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా బాదంపప్పు, జీడిపప్పు, గంట్లు, ధాన్యం మిశ్రమాల ఆహారాన్ని పెడతారు. మటన్ ఖైమాను గానుగ నూనెలో వేయించి అందిస్తారు. పౌరుషాన్ని పెంచేందుకు ఉల్లి రసాన్ని పట్టిస్తారు. కొంతమంది తొండమాంసాన్ని సైతం ఆహారంగా పెడతారు.ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తారు. ఈత కొట్టించడంతోపాటు నాలుగు రోజులకోసారి వేడినీళ్లతో స్నానం చేయిస్తారు. కోళ్లకు తర్ఫీదునిచ్చేందుకు ప్రత్యేక శిక్షకులను ఏర్పాటు చేస్తారు. వీరికి నెలకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు జీతాలు ఉంటాయి. -
పాతబస్తీలో పందెంకోళ్ల కూత !
సంక్రాంతి సందర్భంగా సీమాంధ్రలో జోరుగా సాగే కోడి పందేలతో హైదరాబాద్‌లోని పాతబస్తీకి సంబంధం ఏముంటుంది? కండలు తిరిగిన దేహంతో కనిపించే పహిల్వానులకు, రోషంగా పోరాడే కోడి పుంజులతో సంబంధం ఏమిటి? ఉంది మరి... కత్తులు ఝుళిపిస్తూ కలబడే కోడిపుంజులకు తర్ఫీదునిచ్చేది మన పహిల్వానులే! హైదరాబాద్, న్యూస్‌లైన్: సంక్రాంతి వచ్చిం దంటే చాలు పాతబస్తీలోని బార్కాస్ పరిసరాలలో గాలిపటాల సందడితోపాటు కోడిపుంజుల కూతలు కూడా వినిపిస్తుంటాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్వహించే కోళ్ల పందాలకు రాష్ట్రవ్యాప్తంగా పేరుంది. వీటితో హైదరాబాద్ పాతబస్తీకి విడదీయరాని అనుబంధం ఉంది. కోట్ల రూపాయలు వెచ్చించి పోటీలకు కాలు దువ్వే పందెంరాయుళ్ల పంట పండించే కోడిపుంజులు పాతబస్తీ నుంచి ఎగుమతి కావడం విశేషం. పరువు, ప్రతిష్టలే లక్ష్యంగా రంగంలోకి దిగేవారు కదనరంగంలోకి దూకి విజేతలుగా నిలిచే పాతబస్తీ కోడిపుంజుల కోసం లక్షలాది రూపాయలు వెచ్చించడం గమనార్హం. ఒక్కో కోడిపుంజు రూ.లక్షకు పైనే..! కోస్తాంధ్ర, రాయలసీమల్లో సంక్రాంతిని పురస్కరించుకుని జరిగే కోడి పందాల కోసం పందెం రాయుళ్లు బార్కాస్‌లోని పహిల్వాన్ల వద్దకు వచ్చి వాలిపోతారు. వీరి వద్ద శిక్షణ పొందిన కోడిపుంజును తీసుకెళితే పందెంలో నెగ్గుతామనే నమ్మకమే ఇక్కడకు రప్పిస్తోంది. బార్కాస్‌లో ఒక్కో కోడిపుంజు ధర లక్ష రూపాయల వరకు పలకడం విశేషం. అలాగని పహిల్వానులు కోళ్ల వ్యాపారం చేస్తారనుకుంటే పొరపాటే. ఎంతో దగ్గరి వ్యక్తులకు మాత్రమే ఏడాదికి పరిమిత సంఖ్యలో కోడి పుంజులను విక్రయిస్తుంటారు. వీటి కోసం షెడ్డు ఏర్పాటు చేసి ప్రత్యేక ఎన్క్లోజర్లలో పందెం పుంజు లను పెంచి పోషిస్తున్నారు. రెండేళ్ల వయసున్న కోడి పుంజులనే పందానికి వినియోగిస్తారు. రెండు పూటలా మసాజ్ పాతబస్తీలో పహిల్వాన్లు తాము పెంచే పుంజులకు విటమిన్లతో కూడిన ఆహారాన్ని అంది స్తారు. బాదం, పిస్తా, ఆక్రూట్, ఖీమా, ఉడికించిన గుడ్డు(తెలుపు భాగం) ఆహారంగా ఇస్తారు. ప్రత్యేక ఆహారంతోపాటు కదనరంగంలో విజేతగా నిలిచేలా అన్ని రకాల తర్ఫీదునిస్తారు. ముఖ్యంగా నైపుణ్యం కలిగిన శిక్షకులతో రెండు పూటలా మసాజ్‌లు చేయిస్తారు. చురుగ్గా పరిగెత్తడం సాధన చేయిస్తారు. బార్కాస్, కొత్తపేట, ఎర్రకుంట తదితర ప్రాంతాల్లోని కొందరు పహిల్వాన్ల వద్ద మాత్రమే ఇలాంటి కోడిపుంజులున్నాయి. వీటికి అనారోగ్యం దరి చేరకుండా ప్రత్యేక శ్ర ద్ధ తీసుకుంటారు. ప్రత్యేక ఎన్క్లోజర్ల మాదిరిగా చిన్నచిన్న గూళ్లను ఏర్పాటు చేసి మినీ జూపార్కును తలపించేలా మూగజీవాల పెంపకంలో పహిల్వాన్ల కుటుంబాలు నిమగ్నమయ్యాయి. ఇంత శ్రద్ధగా పహిల్వాన్లు పెంచే పందెం కోళ్లు తమ సత్తా చూపి వారికి పేరు తేకుండా ఎలా ఉంటాయి? కోడి పందాలు, బెట్టింగ్‌లపై తీసుకున్న చర్యలేంటి? సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, బెట్టింగ్‌లు నిర్వహించకుండా జంతుహింస నిరోధక చట్టాలను సమర్ధవంతంగా అమలు చేయాలని తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల ఎస్పీలను లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి శుక్రవారం ఆదేశించారు. ఈనెల 27 లోగా నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కోడిపందాలు, బెట్టింగ్‌లు బహిరంగంగా జరుగుతున్నా పోలీసులు చర్యలు చేపట్టడం లేదంటూ హైకోర్టు న్యాయవాది జి.రోనాల్డ్‌రాజ్, పీడీ రాయులు దాఖలు చేసిన పిటిషన్‌ను లోకాయుక్త విచారణకు స్వీకరించి ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పందేల ద్వారా ఏటా రూ.300 కోట్లు చేతులు మారుతున్నాయని, మీడియా ప్రత్యక్షంగా చూపుతున్నా పోలీసులు స్పందించడం లేదని పిటిషనర్లు తెలిపారు.