
సిటీ శివార్లలో కొక్కొరో.. కో!
నగరంలో 20-ట్వంటీ మ్యాచ్‌లను తలపిస్తున్న కోడిపందేలు
ఏటా 30 కోట్లకు పైగానే చేతులు మారుతున్న వైనం
ఫాంహౌస్‌లు, అపార్‌టమెంట్ సెల్లార్‌లు, గుట్టలే అడ్డాలు
ఆదివారం వచ్చిందంటే హైదరాబాద్ నగరంలో కోడి కూతకు కోట్లు చేతులు మారుతున్నాయి. సంక్రాంతి సమయంలో గోదావరి జిల్లాల్లో ఐపిఎల్, వన్డే మ్యాచ్‌ల మాదిరిగా పందేలు జరుగుతుంటే హైదరాబాద్ నగరంలో ఆదివారం కోడిపందేలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌ల మాదిరిగా ఆడేస్తున్నారు. పందెం వేసేవారికన్నా...చూసేవారి బెట్టింగులు లక్షల్లో ఉంటున్నాయి. మామూలు రోజుల్లో కూడా నగరంలో జరుగుతున్న కోడిపందేల ఖరీదు ఏడాదికి 33 కోట్లు.
సాక్షి సిటీ ప్లస్ ప్రతినిధి, హైదరాబాద్
ఆదివారం వచ్చిందంటే...చాలు హైదరాబాద్‌లో ఓ పది ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. అపార్టు మెంట్లు, ఫాంహౌజ్‌లు, కంపెనీల కాంపౌండ్లు... కోడిపందేలకు అడ్డాలుగా తయారయ్యాయి. కొంపల్లి, బాచుపల్లి, కూకట్‌పల్లి, నిజాంపేట, మియాపూర్, చందానగర్, పఠాన్‌చెరువు, బీహెచ్ ఈఎల్, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో ఈ పందేలు జరుగు తున్నాయి. నాలుగు అపార్టుమెంట్ల మధ్యలో ఓ పది గజాల స్థలముంటే చాలు.. కోడి పందేలకు ఏర్పాట్లు చేసేస్తున్నారు. ఒక్క ఫోన్‌కాలతో జూదగాళ్లు పందెం ప్రాంతా నికి చేరుకో వడం, పందెం లెక్కలు చెప్పుకోవడం, పందేనికి కోళ్లను వదల డం, నిమిషాల్లో పందెం పూర్తయిపోవడం. అంతే గప్‌చుప్‌గా ఎవరిళ్లకు వారు వెళ్లిపోవడం. ఈ తతంగమంతా అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ చేతులమీదుగా నడుస్తోంది. ఈ పందేలను నమ్ము కుని బెట్టింగ్ వ్యాపారం చేసేవారికి వాచ్‌మెన్‌లు బినామీలుగా పనిచేస్తున్నారు. ‘‘ఈ పందేలు..పేద జీవితాలను పాములా కాటేస్తున్నాయి’’ ఏదో కూలీ చేసుకుని బతుకుదామని వచ్చామండీ. ఊళ్లో ఉంటే ఇలాగే పందేలు, పత్తాలు అంటూ బతుకు నాశనమవు తుందని ఇక్కడికొచ్చాం. ఇక్కడ అంతకంటే గొప్పగా జూదాలు ఆడే అవకాశముందని వచ్చాక తెలిసింది’’ అంటూ ప్రగతినగర్‌లోని ఒక అపార్టు మెంట్ వాచ్‌మెన్ భార్య పందెం వల్ల పడుతున్న కష్టాలను చెప్పుకొచ్చింది.
కత్తులు...ఎత్తులు
కోడి పందేలు వేసే ప్రాంతాలకు అందరికంటే ముందుగా చేరేది కత్తులు కట్టేవారు. పందెం కోళ్లకు పదునైన కత్తులు కట్టి వందలు సంపాదించేవారు నగరంలో పదులసంఖ్యలో ఉన్నారు. వీరు ఒకపక్క కత్తుల సేల్స్ చేస్తూనే మరోపక్క పందెం రాయళ్ల నెట్‌వర్క్‌ని పెంచుతున్నారు. హైదరాబాద్‌లో పందెం కోళ్లకు బార్కాస్ ప్రాంతం చాలా ఫేమస్. సంక్రాంతి సమయంలో ఇక్కడ చాలాకోళ్లు అమ్ముడుపోతాయి. కాని మామూలురోజుల్లో ఇక్కడ జరుగుతున్న పందేలకు కోళ్లన్నీ గోదావరి జిల్లాల నుంచే వస్తున్నాయి. అక్కడి నుంచి పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ పెంచుతున్నారు. ఎర్రగట్ట నాటుకోడి దుకాణాల్లో కూడా పందెం కోళ్లు దొరుకుతున్నాయి. ఇవి కాకుండా శివారుల్లో ఉన్న తోటల్లో పందెంకోళ్లను పెద్ద సంఖ్యలో పెంచుతున్నారు. వీరి పెంపకం, పందేలు వేయడం వంటి పనులన్నీ పేదలే చేస్తున్నారు. ముఖ్యంగా రోజు కూలీల చేతులమీదనే నడుస్తున్నాయి. అయితే వీరంతా పెద్దస్థాయి బెట్టింగ్‌బాబులకు బినామీలు. ఆదివారం వేసే పెద్ద పందేలు కాకుండా... మిగతారోజుల్లో ఈ కూలీలు రెండు వేలకు, మూడు వేలకు పందేలు వేసుకుని జేబులు గుల్ల చేసుకుంటున్నారు.
రైడింగ్ వేళ...
రెండు వారాలక్రితం నిజాంపేట పరిధిలో కోడిపందెం జరుగుతుందని తెలిసి పోలీసులు రైడింగ్ చేశారు. పోలీసులు వస్తున్నారని తెలిసి...అందరూ చుట్టుపక్కల అపార్టుమెంట్లలోకి వెళ్లి దాక్కున్నారు. పోలీసులు కష్టపడి ఒకర్నో ఇద్దర్నో పట్టుకున్నారు. వాళ్లని తిరిగి ఇళ్లకు తీసుకురాడానికి పోలీసులకు గట్టిగానే ముట్టజెప్పామని పందెంలో పాల్గొన్నవారు బాహాటంగానే చెప్పడం గమనార్హం. కూకట్‌పల్లి ప్రాంతంలో విధిగా పందెంలో పాల్గొనే ఓ కూలీని పలకరిస్తే పోలీసుల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాడు. ‘‘మేం వేసే పందేల గురించి పోలీసులకు తెలియకపోవడం ఏంటండీ...చాలావరకూ మేం ఎప్పటికప్పుడు పందేల ప్రదేశాలను మార్చేస్తుంటాం. ఎంత మార్చినా...నెలకో...రెండు నెలలకో దొరికిపోతుంటాం. చేసేదేముంది...వారి వాటా వారికిచ్చి బయటపడతాం’’ అని అంటాడు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకురాగా అటువంటి పందేలేమీ జరగడం లేదన్నారు.
మియాపూర్...
ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు.. మియాపూర్ పరిధిలోని ఒక అపార్టుమెంటు సెల్లార్‌లో ఉన్నట్టుండి జనం పోగయ్యారు.
ఓ పది బైక్‌లు, రెండు కార్లు గేటు ముందు ఆగాయి. ఒకబ్బాయి బ్యాగులో నుంచి కోడిని కింద వదిలాడు. రెండో కోడి అప్పటికే సిద్దంగా ఉందక్కడ. కత్తులు కట్టేవాడు...తన పని మొదలుపెట్టాడు. అంతే ఒకటి...రెండూ అంటూ పందెం వెలను వేలల్లో పాడుతూ కోళ్లను కింద వదిలారు. ఒకటి రెండు నిమిషాల్లో పందెం వేడుక ముగిసిపోయింది. వీక్షకుల బెట్టింగ్‌లు కూడా పూర్తయి పోయాయి. అదే నిమిషంలో కోళ్ల వేలం కూడా చేసేశారు. ఎవరి కోడిని వారు బ్యాగులో వేసుకుని బయలుదేరిపోయారు. అక్కడ జరి గిన బెట్టింగ్ ఖరీదు రెండు లక్షలు. గుట్టు చప్పుడు కాకుండా అపార్ట్‌మెంట్ పరిసరాల్లో కోడిపందేలు వేస్తున్న తీరు ఇది.
ప్రగతినగర్
ఆదివారం ఉదయం పది గంటలకు... ప్రగతినగర్ గుట్ట దేనికి ఫేమస్ అంటే కోడి పందేలకని అక్కడ ఎవరిని అడిగినా చెబు తారు. ఆదివారం వచ్చిందంటే... తక్కువలో తక్కువ పది పందేల వరకూ జరుగుతాయి. చేతి సంచుల్లో కోడిపుంజులను వేసుకుని గుంపులుగా గుట్ట ఎక్కేస్తారు. అప్పటికే అక్కడ బెట్టింగ్‌రాయుళ్లు రెడీగా ఉంటారు. అక్కడ కూడా గుట్ట ఎక్కి దిగేలోపు పందెం పనులు ముగించేస్తారు. ఆ రోజు అక్కడ జరిగిన బెట్టింగ్..మూడున్నర లక్షలు.
కొంపల్లి
ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు..కొంపల్లి ప్రాంతంలో ఒక ఫాంహౌస్‌లో పందేనికి ఏర్పాట్లు చేసుకున్నారు. పందెం వేసేది ఆ చుట్టుపక్కల కంపెనీల్లో పనిచేసుకునే కూలీలు. వీక్షకులు మాత్రం బాగా డబ్బున్నవారు. ఓ పది కార్లు, ఐదారు మోటారుబైకుల్లో జనం వచ్చారు. పందెం మొదలవ్వక ముందే... బెట్టింగ్ రాయుళ్లు గ్రూపులుగా విడిపోయారు. కోళ్లను వదల గానే పాట పదివేల నుంచి మొదలుపెట్టారు. క్షణాల్లో నాలుగు లక్షలకు వెళ్లిపోయింది. పందెం ముగియగానే డబ్బులు బయటికి తీసారు. పంపకాలు పూర్తయ్యాయి. బెట్టింగ్ ఖరీదు ఐదు లక్షలు. వాట్ నెక్ట్స్ అనగానే ఓ ఇద్దరు పేక పెట్టెలు తెరిచారు.