gamblers
-
పేకాటపై వార్తలు, జర్నలిస్టుపై దాడి
దిస్పూర్: రాష్ట్రంలో పేకాట శిబిరాలు పెరిగిపోతున్నాయని వార్తలు రాసిన ఓ జర్నలిస్టుపై జూదగాళ్లు మూకుమ్మడి దాడి చేశారు. విద్యుత్ స్తంభానికి కట్టేసి చిత్రవధ చేశారు. ఈ సంఘటన గువాహటికి పశ్చిమాన 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీర్జాలో జరిగింది. ప్రముఖ అస్సామీ దినపత్రిక ప్రతీదిన్‌లో రిపోర్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కరుప్ జిల్లాకు చెందిన మిలన్ మహంత అనే జర్నలిస్ట్ గ్రామీణ ప్రాంతాల్లో పేకాటపై వరుస కథనాలు రాశారు. దీంతో కక్ష్య పెంచుకున్న ఐదుగురు జూదగాళ్లు రిపోర్టర్‌పై ఈ చర్యకు పాల్పడ్డారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జర్నలిస్టు మిలన్ మహంత్ మెడ, తల, చెవుల మీద గాయాలవగా.. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడిన నిందితులపై బారి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశామని మిగతావాళ్లు కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
చీరాల పట్టణంలో విచ్చల విడిగా జూదం
ప్రకాశం, చీరాల రూరల్: భౌతికదూరం పాటించి కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేయాలని ప్రచార మాధ్యమాల్లో ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తున్నా... సమావేశాలు పెట్టి పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా... కొందరు యువకులు అధికారుల సూచనలను ఏ మాత్రం లెక్క చేయడం లేదు. ఇష్టాను రీతిగా వ్యవహరిస్తూ కనీసం ముఖానికి మాస్కు కూడా ధరించకుండా వైరస్‌ను వ్యాప్తి చెందే విధంగా ఎక్కడ పడితే అక్కడ జూదాలు ఆడుతున్నారు. పోలీసులు దాడులు నిర్వహిస్తూనే ఉన్నప్పటికీ జూదరులు ఏదో ఒకచోట ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. మరికొందరు భౌతిక దూరం పాటించకుండా ద్విచక్ర వాహనాపై డబుల్స్, త్రిబుల్స్ రైడ్స్ చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. చీరాలలో జూద స్థావరాలు.. చీరాల వన్‌టౌన్ పరిధిలో దండుబాట, విఠల్ నగర్, ప్రకాశ్ నగర్, జయశంకర్ నగర్, ఉజిలిపేట, పాలేటి నగర్, జవహర్ నగర్, హరిప్రసాద్ నగర్, శ్రీరాంనగర్, కొత్తపాలెం వంటి ప్రాంతాలు, టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో జాన్‌పేట, జయంతిపేట, మరియమ్మ పేట, ఐక్యనగర్, విజయ నగర్ కాలనీ, రామ్‌నగర్, శాంతి నగర్, గాంధీ నగర్, ఆనంద పేట, శృంగారపేట, హారిస్ పేట, హయ్యర్‌పేట, థామస్ పేట, గంజిపాలెం, గొల్లపాలెం వంటి ప్రాంతాల్లో కొందరు యువకులు పేకాట, చింత పిక్కలాట, హౌసీ వంటి ఆటలాడుతున్నారు. కనీస జాగ్రత్తలూ లేవు.. ప్రభుత్వం లాక్డౌన్లో కొన్ని సడలింపులు ఇవ్వడంతో ఇప్పటిదాకా ఇళ్లకే పరిమితమైన యువకులు జూలు విదిల్చారు. ఆకతాయిలు వివిధ రకాల జూదాలపై దృష్టి సారించారు. ఎవరికి తోచిన విధంగా వారు కనీసం మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా చేరి ఆటలాడుతూ స్థానికులకు భయాందోళనలు కలిగిస్తున్నారు. బుధవారం స్థానిక వైకుంఠపురం, విఠల్ నగర్, ప్రకాష్ నగర్లలో కనీస జాగ్రత్తలు పాటించకుండా ఆటలాడుతున్న వారిని గమనించిన సాక్షి ఫోటోలు తీస్తుండగా ఆ యువకులు ముఖాలకు చేతులు అడ్డుపెడుతూ కాలికి బుద్ధి చెప్పారు. పోలీసులు గస్తీలు ముమ్మరం చేసి జూదాలను అరికట్టాలని స్థానికులు పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నారు. -
చర్చనీయాంశంగా ‘పచ్చ’పోలీసు
క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పోలీసు శాఖలో ఓ ఇంటి దొంగ పెత్తనం మితిమీరింది. జిల్లా పోలీసు బాస్ తనదైన శైలిలో అరాచక శక్తుల ఆటకట్టించే ప్రయత్నం చేస్తున్నా.. ఆ ప్రణాళిక సమాచారం దాడులకు ముందే నేరగాళ్లకు చేరిపోతోంది. గత ఎన్నికల సమయంలోనూ ఈ ‘పచ్చ’ పోలీసు ఏకపక్షంగా వ్యవహరించిన తీరు ఆ శాఖలో చర్చనీయాంశమైంది. ఇప్పటికీ ఆయన పంథా ఇలాగే కొనసాగుతోంది. మామూళ్ల మత్తులో అక్రమార్కుల పట్ల ఆయన చూపుతున్న ‘విశ్వాసం’ పోలీసు శాఖ పరువును బజారున పడేస్తోంది. –సాక్షి ప్రతినిధి, అనంతపురం సాక్షి, తాడిపత్రి(అనంతపురం) : నియోజకవర్గంలోని మట్కా డాన్ రషీద్‌తో పాటు క్రికెట్ బుకీలు దాడుల కంటే ముందుగానే అక్కడి నుంచి తప్పించుకుపోయారు. ప్రస్తుతం సదరు మట్కాడాన్ ఏకంగా గోవాలో మకాం వేశారు. పోలీసు శాఖ ఎంతో గోప్యంగా దాడులకు ప్లాన్ చేస్తున్నా.. సమాచారం అసాంఘిక శక్తులకు ముందుగానే చేరిపోతోంది. ఈ వ్యవహారంలో ఓ పోలీసు అధికారి హస్తం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. మట్కా డాన్లు.. క్రికెట్ బుకీలు.. అసాంఘిక శక్తులకు ఆయనో సమాచార కేంద్రం. పోలీసు శాఖ ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరిపై దాడులు చేస్తుందో ముందుగానే తెలుసుకోవడం, సంబంధిత వ్యక్తులకు చేరవేసి తన పబ్బం గడుపుకోవడం గత కొంతకాలంగా జరిగిపోతోంది. మట్కా.. పేకాట.. బెట్టింగ్.. ఇతరత్రాలను సమూలంగా అరికట్టేందుకు జిల్లా పోలీసు బాస్ వాటి మూలాల్లోకి వెళుతున్నా, ప్రధాన నిర్వాహకులు చిక్కినట్లే చిక్కి తప్పించుకుపోతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం వెనుక సొంత శాఖలోనే ఓ లీకు వీరుడు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా టీడీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి మరీ దాడుల సమాచారం చేరవేస్తున్నట్లు సమాచారం. ఫలితంగా.. తాడిపత్రి నియోజకవర్గంలోని మట్కా డాన్ రషీద్‌తో పాటు క్రికెట్ బుకీలు పోలీసులకు చిక్కకుండా తప్పించుకోగలిగారని పోలీసు శాఖలోనే చర్చ జరుగుతోంది. గతంలో జిల్లావ్యాప్తంగా ఉన్న మట్కాడాన్లతో పాటు క్రికెట్ బుకీలు, గ్యాంబ్లర్ల భరతం పట్టేందుకు జిల్లా ఎస్పీ సత్యయేసు బాబు సిద్ధమయ్యారు. ఆ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న మట్కాడాన్లు, క్రికెట్‌బుకీల జాబితాను పోలీసు ఉన్నతాధికారులు సిద్ధం చేశారు. జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్‌లోని కీలకమైన అధికారులకు మాత్రమే ఈ సమాచారం ఉంది. సదరు వ్యక్తులు ఎక్కడెక్కడ ఉన్నారు? ఏ విధంగా పట్టుకోవాలనే పక్కా ప్లాన్‌ను కూడా అధికారులు వేసుకున్నారు. సిద్ధం చేసిన జాబితాలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే అనుచరులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సదరు సమాచారాన్ని పోలీసు శాఖలోని ఓ లీకు వీరుడు నేరుగా ఆ మాజీ ఎమ్మెల్యేకే ఫోన్ చేసి చేరవేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందువల్లే అక్రమార్కులు తప్పించుకున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం. పలు ఫిర్యాదులు.. వాస్తవానికి ముందస్తుగా సమాచారాన్ని లీకు చేసిన ఆరోపణలను ప్రధానంగా ఒక పోలీసు అధికారి ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా సదరు పోలీసు అధికారిపై గతంలోనే అనేక ఫిర్యాదులు ఉన్నాయి. అప్పట్లో పూర్తిగా అధికారపార్టీకి తొత్తుగా వ్యవహరించారని కూడా తెలుస్తోంది. ఎన్నికల సమయంలో కూడా అధికార పార్టీ కార్యకర్తగా వ్యవహరించి ప్రతీ సమాచారాన్ని చేరవేయడమే కాకుండా.. పార్టీ మారేందుకు ఎవరెవరు సిద్ధమవుతున్నారు? వారిని జారుకోకుండా చూసుకోవాలని కూడా సూచనలు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సదరు పోలీసు అధికారిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇలా పట్టుబడకుండా ఉన్న మట్కాడాన్ ప్రధానంగా గోవాలో మకాం వేయడంతో పాటు అప్పుడప్పుడూ తాడిపత్రికి కూడా వచ్చిపోతున్నారనే సమాచారం కూడా పోలీసుల వద్ద ఉంది. అయినప్పటికీ పట్టుకునేందుకు ప్రయత్నించకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
పోలీసులకు సవాల్ విసిరిన పేకాట రాయుళ్లు..
మా భర్తలు ఉదయాన్నే పని ఉందని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. ఎప్పుడో అర్ధరాత్రి వస్తున్నారు. 24 గంటలూ క్లబ్బుల్లోనే ఉండి మద్యం సేవిస్తూ.. పేకాటలోనే నిమగ్నమవుతున్నారు. ఉన్న ఆస్తులను తగలేస్తున్నారు. ఇంటి వ్యవహారాలు అసలు పట్టించుకోవడం లేదు. అత్యవసరమై ఫోన్ చేసినా స్పందించడం లేదు. పేకాట స్థావరాలను మూయించండి. – ఇదీ ఇటీవల కొందరు మహిళలు జిల్లా పోలీసు అధికారులకు ఫోన్ చేసి వెళ్లబోసుకున్న గోడు సాక్షి, పాలకొల్లు సెంట్రల్/భీమవరం: క్లబ్‌లు, టౌన్హాళ్లలోని పేకాట స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో జూదరులు రూటుమార్చారు. పేరొందిన హోటళ్లు, ధనికులు నివాసముండే ప్రాంతాలను ఎంచుకుని జోరుగా పేకాట శిబిరాలు సాగిస్తున్నారు. పోలీసులకే సవాల్ విసురుతున్నారు. జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, జంగారెడ్డిగూడెం, నల్లజర్ల తదితర ప్రాంతాల్లో యూత్‌క్లబ్‌లు, కాస్మోక్లబ్లు, టౌన్‌హాళ్లు ఉన్నాయి. వీటిలో ఎంతోకాలంగా పేకాట ఆడడం సహజంగా మారిపోయింది. ఎస్పీగా నవదీప్‌సింగ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో క్లబ్‌లపై దృష్టిసారించారు. దీంతో ఉద్యోగ విరమణ చేసిన వారు, కొంతమంది రాజకీయ నాయకులు, ధనికులు పెద్ద మొత్తంలో పేకాట ఆడే క్లబ్‌లు కొన్ని నెలలుగా దాదాపు మూతపడ్డాయి. పోలీసులు నిత్యం దాడులు చేస్తూ పేకాటను దాదాపుగా అరికట్టారనే చెప్పాలి. అయితే పేకాట ఆడడమే నిత్యకృత్యంగా మారిన వారు దానిని మానలేక కొత్తకొత్త స్థావరాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నారు. కొంతకాలం పొరుగు రాష్ట్రాలకు వెళ్లినా.. పోలీసుల దాడులతో బెంబేలెత్తిన జూదరులు కొంతకాలం యానాం, ఖమ్మం, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లి పేకాట ఆడినా.. ఇటీవల మళ్లీ రూటు మార్చి జిల్లాలోని పట్టణాల్లోనే ప్రత్యేక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. భీమవరం పట్టణంలో పేరొందిన హోటళ్లు, లాడ్జిల్లోనే పెద్ద ఎత్తున జూదం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ హోటళ్లలో అయితే పోలీసు దాడులుండవనే భావనతోనే వీటిని ఎంచుకున్నట్టు సమాచారం. ఈ సమాచారం మేరకు ఇటీవల భీమవరంలోని పలు హోటళ్లల్లో పోలీసులు దాడులు చేసి నిందితులను అరెస్టు చేసి వారినుంచి పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంకా అనేక చోట్ల పేకాట స్థావరాలు నడుస్తున్నాయని తెలుస్తోంది. అలాగే ధనికులు నివాసం ఉండే ప్రాంతాల్లోని ఖాళీగా ఉన్న విశాలమైన గృహాలను ఆఫీసు కార్యకలపాలంటూ అద్దెకు తీసుకుని వాటిలో గుట్టుచప్పుడు కాకుండా పేకాడుతున్నట్టు సమాచారం. పట్టుబడుతున్నది యువకులే! పోలీసుల దాడుల్లో పట్టుబడుతున్నది అధికంగా యువకులేనని పోలీసులు చెబుతున్నారు. బడాబాబులూ పట్టుబడుతున్నా.. వారిని పోలీసులు తప్పిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది పోలీసు సిబ్బంది జూదరులకు సహకరిస్తూ దాడుల్లో జరిగే అవకాశం ఉంటే ముందుగా వారికి ఫోన్ ద్వారా సమాచారం అందిస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. పోలీసు శాఖ మరింత పకడ్బందీగా ముందుకెళ్తే పేకాటను పూర్తిగా అరికట్టవచ్చని, అయితే స్థానిక పోలీసు సిబ్బందితో కాకుండా పొరుగు స్టేషన్ల సిబ్బందితో దాడులు చేయిస్తే ప్రయోజనం ఉంటుందనే వాదన వినబడుతోంది. పాలకొల్లులో పోలీసులకే సవాల్! పాలకొల్లు టౌన్ హాలులో మంగళవారం పోలీసులు దాడి చేసి 16 మంది జూదరులను అరెస్ట్ చేశారు. గతంలో చాలాసార్లు హెచ్చరికలు జారీ చేసినా క్లబ్ సభ్యులు వినకపోవడంతో ఆఖరికి పోలీసులు దాడులు చేసినట్టు తెలుస్తోంది. దాడి చేసిన సమయంలో కొందరు జూదరులు గోడ దూకి పారిపోయారు. కొందరు పోలీసులను చూసినా కోతాట ఆడుతూనే ఉన్నారు. క్లబ్ సభ్యులు కొందరు తమకు కోర్టు అనుమతి ఉంది.. ఆడే దమ్ముంది.. మీకు ఆపే దమ్ముంటే ఆపుకోవచ్చని పోలీసులకు సవాల్ విసిరినట్టు సమాచారం. ఈ విషయం ఎస్పీ నవదీప్‌సింగ్ దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్ అయ్యారు. టౌన్ హాలు వద్ద బుధవారం కూడా భారీగా పోలీసులను మోహరించారు. బుధవారం సాయంత్రం కొందరు సభ్యులు టౌన్‌హాల్ వద్దకు కార్లలో రావడంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేకించి కార్లలో ఇక్కడకు ఎందుకు వచ్చారో తెలుసుకుంటామని, వారు సరైన వివరాలు ఇస్తే వారి అడ్రస్‌లు తీసుకుని విడుదల చేస్తామని సీఐ ఆంజనేయులు తెలిపారు. కాయిన్లతో ఆట జిల్లాలోని క్లబ్బుల్లో నగదు ప్రత్యక్షంగా టేబుల్‌పై పెట్టకుండా అక్కడ ఉండే కౌంటర్లలో నగదు చెల్లించి దానికి సరిపడా కాయిన్లు తీసుకుంటారు. వాటితోనే ఆట కొనసాగిస్తారు. -
పోలీసుల నుంచి పారిపోతూ..
లక్నో: పోలీసుల నుంచి పారిపోతూ ఓ యువకుడు ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతిచెందాడు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం చిత్రాకోట్ జిల్లాలో గురువారం జరిగింది. పేకాటాడుతున్న శిబిరంపై పోలీసులు ఒక్కసారిగా దాడి చేయడంతో భయంతో యువకులు పరిగెత్తారు. ఇందులో భోలా(19) అనే యువకుడు గందరగోళంలో పక్కనున్న బావిలో పడిపోయాడు. బాధితుడిని బావిలో నుంచి తీసి స్థానిక ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. భోలా శరీరంపై గాయాలు ఉన్నాయని, అతన్ని తోటి స్నేహితులే బాగా కొట్టారని బోలా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మట్కా కనికట్టు.. బతుకు తాకట్టు
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం గ్రామానికి చెందిన ఐజయ్య (పేరు మార్చాం) మట్కా జూదానికి బానిసయ్యాడు. జహీరాబాద్‌లోని ఓ హోటల్లో సర్వర్‌గా పనిచేస్తూ.. వచ్చిన డబ్బంతా ‘మెయిన్ ముంబై’ మట్కాలో పెట్టాడు. అడ్డగోలు వడ్డీకి అప్పులు చేసి కూడా పందేలు కాశాడు. కానీ ఇప్పటివరకు రూపాయి గెలుచుకున్నది లేదు. చివరికి ఉన్న రెండెకరాల పొలం అమ్ముకున్నాడు. ... వీరే కాదు.. తెలంగాణ పల్లెల్లో వేలకొద్దీ కుటుంబాలు మట్కా జూదానికి చిన్నాభిన్నమవుతున్నాయి. చెమటోడ్చి సంపాదించిన నాలుగు రాళ్లను మాయదారి మట్కానే మింగేస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటకల సరిహద్దు జిల్లాల్లో ఈ జూదం జోరుగా సాగుతోంది. మన రాష్ట్రంలో మట్కాపై నిషేధం ఉన్నా... ఆ రెండు రాష్ట్రాల్లో దానికి చట్టబద్ధత ఉంది. దీంతో ఇక్కడివారు సరిహద్దులు దాటివెళ్లి మరీ పందేల్లో పాల్గొంటున్నారు. కొందరు ఇక్కడి నుంచే ఫోన్ల ద్వారా పందేలు కాస్తున్నారు. దీనిపై ‘సాక్షి’ బృందం క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. మహారాష్ట్రలో మట్కాకు అడ్డా అయిన ‘ఉమ్మర్గ’ పట్టణానికి వెళ్లి పరిశీలించింది. ఈ సందర్భంగా ఎన్నో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. అక్కడ మట్కా ఆడుతున్న వారిలో తెలుగువారే ఏకంగా 80 శాతం వరకు ఉండడం గమనార్హం. – వర్ధెల్లి వెంకటేశ్వర్లు, సాక్షి ప్రతినిధి తెల్ల బట్టలు.. మాసిన గడ్డంతో ఉన్న ఈ పెద్దాయన జీవితమంతా జూదంతోనే పండిపోయింది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌కు చెందిన ఆయన.. భార్య పుట్టింటి నుంచి తెచ్చిన బంగారు నగలు, వారసత్వంగా వచ్చిన మూడెకరాల భూమిని మట్కాకే తగలేశాడు. చివరికి కుటుంబ సభ్యులను కూడా వదిలేసి వచ్చి మట్కాకు కేంద్రమైన ఉమ్మర్గ (మహారాష్ట్ర)లో మకాం పెట్టాడు. వారానికి రూ.రెండున్నర వేల జీతంతో మట్కా చీటీలు రాసే పని చేస్తున్నాడు. లక్షన్నర మందికిపైగా.. మట్కా జూదం కేవలం సరిహద్దు జిల్లాల్లోనే కాకుండా ఇటీవల ఉమ్మడి వరంగల్, హైదరాబాద్, ఖమ్మం జిల్లాలకు కూడా విస్తరించింది. రాష్ట్రం నుంచి రోజుకు సగటున 1.5 లక్షల మంది మట్కా పందేలు కాస్తున్నట్లు అంచనా. ఇందులో 50 వేల మంది వరకు సరిహద్దులు దాటి మహారాష్ట్ర పట్టణాల్లో ప్రత్యక్షంగా జూదంలో పాల్గొంటున్నట్లు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేకాటపై ఉక్కుపాదం మోపిన నేపథ్యంలో..జూదరులు మట్కా వైపు దృష్టి సారించినట్లు చెబుతున్నారు. అక్కడ చట్టబద్ధమే.. మహారాష్ట్రలో మట్కాకు చట్టబద్ధత ఉంది. మెయిన్ ముంబై, రాజధాని నైట్, న్యూముంబై దబ్రా, సెంట్రల్ ముంబై, శుభలక్ష్మి, న్యూవర్లీ, రాజధానిడే, కల్యాణి.. ఇలా రకరకాల పేర్లలో వందకుపైగా మట్కా కంపెనీలు జూదం నిర్వహిస్తున్నాయి. అన్నీ కూడా నిరుపేదలు, దినసరి కూలీలు, మధ్యతరగతి వారు టార్గెట్‌గా నడుస్తున్నవే. ఇందులో రోహణ్ ఖత్రీ అనే వ్యక్తి నడిపిస్తున్న మెయిన్ ముంబై, కల్యాణ్ మట్కా కంపెనీలకు 75 శాతం మార్కెట్ వాటా ఉంది. ఈ రెండు ఆటలను కూడా అంతా పనులు ముగించుకొని ఇంటికొచ్చే వేళల్లో నిర్వహిస్తుంటారు. దీంతో వ్యాపారులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, యువత కూడా మట్కా ఆడుతున్నారు. అంకెలు, సంఖ్యల మాయాజాలం! మెయిన్ ముంబై, కల్యాణ్ కంపెనీలు రోజుకు ఒక ఆట నిర్వహిస్తాయి. 00 నుంచి 999 వరకు సంఖ్యల ఆధారంగా ఈ జూదం నడుస్తుంది. ఒక్కో ఆటలో ప్యానల్, సింగిల్, జోడీ, డబుల్ ప్యానల్ అనే విభాగాలు ఉంటాయి. ప్యానల్‌ను కూడగా వచ్చిన చివరి సంఖ్యను సింగిల్ అని పిలుస్తారు. ఆట ఓపెన్ కాకముందు ప్యానల్‌కు పందెం కాస్తే విజేతలకు ప్రతి రూ.10కి రూ.1,400 ఇస్తారు. డబుల్ ప్యానల్ గెలిస్తే రూ.2,400, సింగిల్ నంబర్ గెలిస్తే రూ.95, జోడీ గెలిస్తే రూ.950 చొప్పున చెల్లిస్తారు. చాలా మంది జోడీ నంబర్ మీద పందెం కాస్తుంటారు. ఆట ఓపెన్ అయిన రెండు గంటల్లో ముగుస్తుంది. ఒక్కో ఆటలో 6 లక్షల నుంచి 10 లక్షల మంది వరకు పాల్గొంటారని మట్కా కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచే.. ఆదిలాబాద్ జిల్లా జైనథ్, బేల మండలాలు, ఖానాపూర్, జిన్నింగ్ ఏరియాల్లో, ఖుర్షిద్‌నగర్, ఆదిలాబాద్‌లోని తాంసి బస్టాండ్, సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్, న్యాల్కల్ మండలం రాజోల్, సంగారెడ్డి పట్టణం, నారాయణఖేడ్, సమీప గ్రామాలు, కామారెడ్డి జిల్లాలోని పిట్లం, బిచ్కుంద, మహబూబ్‌నగర్ జిల్లాలోని కృష్ణా్ణ, మన్ననూరు, ఆత్మకూరు, నారాయణపేట మండలాల్లో మట్కా జూదం సాగుతున్నట్లుగా పోలీసుల వద్ద సమాచారం ఉంది. ఇక హైదరాబాద్, వరంగల్‌తో సహా అన్ని నగర, పట్టణ ప్రాంతాల్లో ఆన్లైన్ పందేలు ఎక్కువగా సాగుతున్నాయి. మొత్తంగా రోజుకు రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు చేతులు మారుతున్నట్లు అంచనా. టెక్నాలజీతో విస్తృతమై.. ఒకప్పుడు కోడి పందాల తరహాలో ఒకచోట గుంపులుగా చేరి చీటీలపై నంబర్లతో సాగిన మట్కా దందా... సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో బాగా విస్తృతమైంది. మొబైల్ ఫోన్లో యాప్‌లు, ఎస్సెమ్మెస్‌ల స్థాయికి చేరింది. ఎక్కడున్నా, ఎక్కడి నుంచైనా మట్కా ఆడేలా వీలు ఏర్పడింది. ఇక తెలంగాణలో ప్రభుత్వం పేకాటపై ఉక్కుపాదం మోపడంతో జూదం ఆడేవాళ్లు మట్కావైపు మళ్లారు. పేకాట క్లబ్బులు నిర్వహించడంలో అనుభవమున్న వారు మట్కా ఏజెంట్లుగా మారిపోయారు. పందెం రాయుళ్ల నుంచి రూ.2 వేలు రుసుము తీసుకుని ఏడాది పాటు సభ్యత్వం ఇస్తున్నారు. పందెం డబ్బు చెల్లించడం కోసం బ్యాంకు ఖాతా నంబర్ ఇచ్చి, గెలిస్తే బహుమతి డబ్బు ఇవ్వడం కోసం జూదరుల ఖాతా నంబర్లు తీసుకుంటున్నారు. పందెం కాయాలనుకుంటే.. నిర్వాహకుల ఖాతాలో డబ్బులు వేసి, ఫోన్ చేసి ‘మట్కా’ ఓపెనింగ్ నంబరో, ప్యానల్ నంబరో, జోడీ నంబరో చెబితే నోట్ చేసుకుంటారు. గెలిస్తే పందెం కాసినవాళ్ల బ్యాంకు ఖాతాలో నేరుగా డబ్బులు జమ చేస్తారు. పందెం కాయడం సులువుగా మారిపోవడంతో మట్కా మెల్లమెల్లగా విస్తరిస్తోంది. తెలంగాణలో కార్మికుల నుంచి కాంట్రాక్టర్ల వరకు చాలా మంది దీని మాయలో పడిపోతున్నారు. రాష్ట్రం నుంచి లక్ష మందికిపైగా సభ్యత్వం తీసుకున్నట్లు మహారాష్ట్రలోని ఉమ్మర్గలో ఉన్న మట్కా నిర్వాహకులు చెబుతుండడం గమనార్హం. ఊరూరికీ ఏజెంట్ల వ్యవస్థ ముంబై మాఫియా కనుసన్నల్లో నడిచే మట్కా జూదం ఏజెంట్ల వ్యవస్థ మీద ఆధారపడి కొనసాగుతోంది. ప్రతి పట్టణంతో ఇద్దరు ముగ్గురు ఏజెంట్లను నియమించుకుని.. వారు సేకరించే పందెం సొమ్ము నుంచి 10 శాతం కమీషన్‌గా ఇస్తున్నారు. ఈ ఏజెంట్ల మీద పర్యవేక్షణకు మునీంలు, వారిపై పట్వారీలు.. అలా అధినేత వరకు ఉంటారు. వారికి వేర్వేరుగా కమీషన్లు ఉంటాయి. 1 రాష్ట్రం నుంచి మొదలై.. మట్కా జూదం జరుగుతున్న తీరును గుర్తించడం కోసం ‘సాక్షి’ బృందం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నుంచి మహారాష్ట్రలోని ఉమ్మర్గ పట్టణం వరకు క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. ముందుగా జహీరాబాద్‌లో ఒక ఏజెంట్‌ను కలవగా.. ఆ సమయంలో న్యాల్కల్ మండలం రాజోల్లో జోరుగా పందేలు సాగుతాయని వెల్లడించాడు. కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఆ గ్రామానికి వెళుతుండగా పొలిమేరల్లోనే పందాల గుంపు కనిపించింది. అటువైపు వెళ్లేసరికి పందెం రాయుళ్లు, నిర్వాహకులు అడవిలోకి వెళ్లిపోయారు. అక్కడ జెరప్ప అనే వ్యక్తి, అతని అనుచరులు కలసి మట్కా జూదం నిర్వహిస్తుంటారని.. ప్రతి రోజూ మూడు నాలుగు వందల మంది పందేలు కాస్తుంటారని స్థానికుడొకరు వెల్లడించారు. 2 ఉమ్మర్గ.. పందాలకు అడ్డా అనంతరం ‘సాక్షి’ బృందం మహారాష్ట్రలోని ఉమ్మర్గ పట్టణానికి వెళ్లి పరిశీలించింది. ఈ పట్టణం మట్కాకు ముంబై తర్వాత రెండో రాజధానిగా అభివర్ణిస్తుంటారు. రాష్ట్రం నుంచి చాలా మంది ప్రత్యక్షంగా మట్కా పందేలు కాయడం కోసం ఉమ్మర్గకు వెళుతుంటారు. ఉమ్మర్గ పట్టణం, సమీప గ్రామాల్లో కలిపి 150 వరకు లాడ్జీలు ఉండగా... ఇందులో పది పదిహేను మాత్రమే సాధారణ లాడ్జీలు. మిగతావన్నీ బెట్టింగ్ అడ్డాలే. వాటిల్లోకి ఉచితంగా వెళ్లవచ్చు. డబ్బులు తీసుకుని భోజనం, మద్యం కూడా సమకూర్చుతారు. అసలు ఈ పట్టణ జనాభాలో 40 శాతం మంది మట్కా ఏజెంట్లేనని, సుమారు 1,000 మంది ఏజెంట్లు ఉంటారని స్థానికులు చెప్పారు. ఇక్కడి లాడ్జీల్లో చాలా వరకు తెలంగాణ జిల్లాల నుంచి వచ్చేవారే ఉంటారని వెల్లడించారు. ‘సాక్షి’ బృందం ఓ స్థానిక సహాయకుడిని తోడు తీసుకుని పందేలు కాసే ఓ లాడ్జీలోకి వెళ్లింది. అందులో పది పన్నెండు చిన్న గదులు ఉండగా.. అంతా పందెం రాయుళ్లతో కిక్కిరిసి ఉన్నాయి. వారిలో 80 శాతం మంది తెలుగు వారే కనిపించారు. 20–30 మందితో మాట్లాడగా.. వారంతా హైదరాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి వచ్చినట్టు చెప్పారు. రూ. 50 నుంచి రూ. 500 వరకు పందేలు కాస్తున్నారు. 3 పందెం కోసమంటూ వెళ్లి.. తర్వాత ఉమ్మర్గ పట్టణంలోని మహాదేవుని రోడ్డు ప్రాంతంలో ఉన్న మూడంతస్తుల మరో లాడ్జిలోకి పరిశీలన బృందం వెళ్లింది. అక్కడ దాదాపు 30 గదులు ఉండగా.. అన్నింటిలోనూ తెలుగు వాళ్లు కనిపించారు. రిటైర్డ్ ఉద్యోగుల నుంచి వ్యాపారులు, కూలీల వరకు అందరూ వారిలో ఉండడం గమనార్హం. ఒక్కసారి ఇక్కడికి వస్తే వారం రోజుల వరకు ఉంటారని గదులు శుభ్రం చేసే వ్యక్తి వెల్లడించాడు. ‘సాక్షి’ బృందం కూడా పందెం ఆడటానికంటూ ఆ లాడ్జిలోని ఒక గదిలోకి వెళ్లి పరిస్థితిని పరిశీలించింది. వారికి నమ్మకం కలిగించడానికి రూ.100, రూ.50 పందేలు కూడా కాసింది. ఫలితం వచ్చే సమయం దాకా అక్కడున్నవారితో మాటలు కలిపి.. వివరాలు సేకరించింది. 4 మట్కా చీటీలు రాసేది తెలుగువాళ్లే.. ఆ లాడ్జి నిర్వహించే ఏజెంట్ వద్ద క్లర్కుగా పనిచేసే వ్యక్తిని ‘సాక్షి’ బృందం పలకరించగా.. అతను తన పేరు ‘ఎన్.రాజ్’ అని చెప్పాడు. ఉమ్మర్గ, పర్భణి, ధర్మపురి, నాందేడ్ తదితర ప్రాంతాల్లోని మట్కా కేంద్రాలకు తెలుగు వారే ఎక్కువగా వస్తారని వెల్లడించాడు. అందువల్ల కచ్చితంగా తెలుగు వచ్చిన వారినే ఏజెంటుగా, చీటీలు రాసే క్లర్కుగా తీసుకుంటారని చెప్పాడు. క్లర్కుకు వారానికి రూ. 2.5 వేలు జీతంగా ఇచ్చి భోజనం పెడతారని తెలిపాడు. ఫోన్ ద్వారా పందేలు కాయవచ్చని చెబుతూ.. ఆ ఫోన్ నంబర్లు కూడా రాసి ఇచ్చాడు. బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయాలని.. గెలిస్తే తాము కూడా ఖాతాలో జమ చేస్తామని చెప్పాడు. 5 పెద్ద ఏజెంట్‌పై ఆరా.. మట్కా కంపెనీల్లో నంబర్‌వన్ అయిన ‘మెయిన్ ముంబై’లో భారీగా పందెం కాస్తామని, ఆ స్థాయి ఏజెంట్ ఎవరని సాక్షి బృందం ఆరా తీసింది. దాంతో ఓ మధ్యవర్తి రూ.300 తీసుకుని.. పెద్ద ఏజెంట్ నిర్వహించే లాడ్జికి తీసుకెళ్లాడు. ఆ ఏజెంట్ పేరు రతన్ భాయ్ అని చెప్పాడు. బృందం ఆయనను కలవగా.. తెలుగువారని తెలుసుకుని మర్యాదగా ప్రవర్తించారు. భారీగా పందెం కాస్తామంటే ఐదు నుంచి 10 నంబర్ల మీద పెడితే మంచిదని సలహా కూడా ఇచ్చాడు. బ్యాంకులో డబ్బు వేసి.. ఫోన్‌కాల్, ఎస్సెమ్మెస్ ద్వారానైనా మట్కా స్లాట్ బుక్ చేసుకోవచ్చని చెప్పాడు. ఫోన్ నంబర్లు ఇచ్చాడు. ఆ నంబర్లకు కాల్ చేస్తే.. బ్యాంకు ఖాతాల నంబర్లు ఎస్సెమ్మెస్ చేస్తానన్నాడు. దీంతో పని ముగిసిన బృందం.. సరేనంటూ అక్కడి నుంచి తిరిగి వచ్చేసింది. -
20 మంది జూదరుల అరెస్ట్..
గుంతకల్లు రూరల్: కదిరిపల్లి సమీపంలోని పేకాట స్థావరంపై గుంతకల్లు రూరల్ ఎస్ఐ బాబాజాన్ తన సిబ్బందితో కలిసి బుధవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. 20 మంది జూదరులను అదుపులోకి తీసుకుని, వారినుంచి 14 సెల్ఫోన్లు, 7 బైక్‌లు, రూ. 2 లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అడపాదడపా జూదరులు పట్టుపడుతున్నప్పటికీ, ఇంత భారీ ఎత్తున గ్యాంబ్లింగ్ జరుగుతూ పట్టుపడటం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో నిఘా మరింత పెంచుతామని ఎస్ఐ తెలిపారు. -
అంగట్లో సాగుతోన్న పేకాట !
యథేచ్ఛగా విస్తరిస్తోన్న మట్కా కరువైన పోలీసుల నిఘా బాన్సువాడ: మూడు రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉన్న బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో పేకాట బహిరంగంగా కొనసాగుతోంది. కొందరు దళారులు ప్రత్యేకం దృష్టిపెట్టి, పేకాడేందుకు రైతులు, వ్యాపారులను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. నెల రోజులుగా బాన్సువాడలోని వారాంతపు సంతలో కొందరు వ్యక్తులు వినూత్న రీతిలో పేకాటను సాగిస్తున్నారు. హీరో, హీరోయిన్ల ఫొటోలను ప్రదర్శించి, హీరోకు సింగిల్, హీరోయిన్‌కు డబుల్ డబ్బులు ఇస్తామంటూ ప్రచారం చేస్తున్నారు. హీరోయిన్ ఫొటోపై రూ.100 పెడితే రూ.300 ఇస్తామని, హీరో ఫొటోపై రూ.100 పెడితే రూ.200 ఇస్తామని చెబుతూ పేకాడిస్తున్నారు. హీరోయిన్ ఫొటోపై డబ్బులు పెడితే, పత్తాలను తీస్తారు. ఆ పత్తాల్లో సదరు హీరోయిన్ ఫోటో ఉంటే, పెట్టిన వ్యక్తికి రెండింతలు డబ్బులు ఇస్తారు. ఇలా వందలాది మంది ఈ పేకాట ఆడుతూ తమ డబ్బులను కోల్పోతున్నారు. ప్రతీ సంతలో ఈ ఆటపై రూ.2 నుంచి రూ.5లక్షల వరకు కోల్పోతున్నారని తెలిసింది. బాన్సువాడ, పిట్లం, బిచ్కుంద, మద్నూర్, జుక్కల్ వారాంతపు సంతల్లో ఈ పేకాట కొనసాగుతోంది. బహిరంగంగా పేకాడుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాన్సువాడ, బిచ్కుంద సర్కిళ్లలో.. కొన్ని రోజులుగా బాన్సువాడ ప్రాంతంలో పేకాట జోరుగా సాగుతోంది. పేకాడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీస్ యంత్రాంగం హెచ్చరించినా, బాన్సువాడ, బిచ్కుంద సర్కిళ్లలో జోరుగా పేకాట ఆడుతున్నట్లు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల్లో పేకాడుతున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ దాడులు చేయకుండా వదిలేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు పట్టించుకోకపోవడంతోనే పేకాట యథేచ్ఛగా కొసాగినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. పలుచోట్ల పోలీసుల దాడులు.. గతంలో బాన్సువాడ పట్టణంలో ఓ మహిళ నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. అలాగే తాడ్కోల్ రోడ్డుపైన పేకాట స్థావరంపై దాడి చేసి సుమారు రూ.3 లక్షల వరకు స్వాధీనం చేసుకున్నారు. అయినా పేకాటరాయుళ్లలో మార్పు రావడం లేదు. వర్ని, బీర్కూర్, కోటగిరి, బాన్సువాడ ప్రాంతాల్లో కొందరు పలుకుబడి కలిగిన వ్యక్తులు పేకాట ఆడిస్తున్నట్లు ప్రచారం ఉంది. బాన్సువాడ శివారులోని తాడ్కోల్, బోర్లం, ఇస్లాంపుర, రాజారాం దుబ్బ ప్రాంతాల్లో నిరంతరం పేకాట ఆడుతున్నారు. వీరు ప్రత్యేకంగా శిబిరాలను ఏర్పాటు చేసుకొని పేకాడుతుండగా, పోలీసులు రాకుండా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది. గతేడాది క్రితం పేకాట జోరుగా సాగగా, లక్షలాది రూపాయలు చేతులు మారాయి. రాజకీయ పలుకుబడితో.. గతంలో బీర్కూర్ మండలంలో పేకాట ఆడుతున్నవారిపై ఎస్పీ ప్రత్యేకంగా దాడులు నిర్వహించి పేకాటకు పూర్తిగా అడ్డుకున్నారు. అయితే ప్రస్తుతం మళ్లీ పేకాట ఆడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. రాజకీయ పలుకుబడితో పేకాటను కొనసాగిస్తున్నారు. మరోవైపు బిచ్కుంద సర్కిల్ పరిధిలోనూ పేకాట ఆడుతున్న వారు అధికంగా ఉన్నారని తెలిసింది. వీరు ఎక్కువగా పొలాల్లో ఆడుతున్నట్లు సమాచారం. దెగ్లూర్ నుంచి వచ్చి.. మట్కా నంబర్లు తెచ్చి.. సరిహద్దు మండలాల్లో మట్కా కూడా విస్తరిస్తోంది. మహారాష్ట్రలోని దెగ్లూర్ నుంచి పలువురు ఏజెంట్లు వచ్చి మట్కా నంబర్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మట్కా నిర్వాహకులు కొందరు ఏజెంట్లను నియమించి బాన్సువాడ ప్రాంతానికి పంపుతున్నారు. వీరు మట్కా నంబర్లను విక్రయించి, సెల్ఫోన్లపై నంబర్లును వెల్లడిస్తూ మట్కాను విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత యాసంగి సీజన్లో రైతులకు డబ్బులు రావడంతో వారిని లక్ష్యంగా చేసుకుని కొందరు మట్కాను కొనసాగిస్తున్నట్లు సమాచారం. సమాచారం అందిస్తే చర్యలు పేకాట, మట్కా నిర్వాహకుల పై చర్యలు తప్పవు. ఎవరికైనా సమాచారం లభిస్తే వెంటనే పోలీసులకు చేరవేయాలి. దాడులు చేసి పట్టుకుంటాం. పేకాట, మట్కాపై ఉపేక్షించేది లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం. – నర్సింహారావు, డీఎస్పీ, బాన్సువాడ -
నంద్యాలలో పేకాట రాయుళ్లు అరెస్ట్
-
పేకాటలో కొట్లాట.. ఒకరి మృతి
హైదరాబాద్: పేకాట సందర్భంగా తలెత్తిన తగాదా ఒకరి మరణానికి కారణమైంది. బొల్లారం బొమ్మనకుంటలో సోమవారం రాత్రి కొందరు వ్యక్తులు పేకాట ఆడారు. ఈ సందర్భంగా ఏర్పడిన విభేదాలతో వారు కొట్టుకున్నారు. తీవ్రంగా గాయపడిన జగద్గిరిగుట్టకు చెందిన శ్రీనివాసాచారి(40) అక్కడికక్కడే చనిపోయాడు. ఇందుకు సంబంధించి ఒక వ్యక్తి మంగళవారం ఉదయం బొల్లారం పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
ఆకస్మిక దాడులు.. 6.5 కోట్ల నగదు పట్టివేత
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీగా హవాలా సొత్తును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని చాందినీ చౌక్ ప్రాంతంలో డీఆర్ఐ అధికారులు ఆదివారం రాత్రి దాడులు నిర్వహించి పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దాంతో పాటు వారి వద్ద నుంచి రూ.6.5 కోట్ల నగదుతో పాటు 21 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు.. హవాలా నిర్వహించి మోసాలకు పాల్పడుతున్న స్థావరాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు ఓ అధికారి తెలిపారు. హవాలా గ్యాంగులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. -
పోలీసులు దాడి: 21 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని సీవీఎన్ క్లబ్‌లోని పేకాట శిబిరంపై గురువారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేశారు. పేకాట నిర్వాహకుడి అశోక్‌తోపాటు 21 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ దాడికి ఏఎస్పీ నేతృత్వం వహించారు. -
8 మంది పేకాట రాయుళ్ల అరెస్టు
హైదరాబాద్: అంబర్‌పేట పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేసి, 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం గోల్నాకలోని పెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో కొందరు పేకాడుతున్నారన్న సమాచారం మేరకు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాడుతున్న 8మందిని అదుపులోకి తీసుకోవటంతో పాటు వారి నుంచి 7 సెల్ఫోన్లు రూ. 33,250 స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేశారు. -
16 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
గుంటూరు : నగరంలోని శ్రీనగర్‌లో పేకాటస్థావరంపై శనివారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 16 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. లక్షా 16 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
10 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
హైదరాబాద్ : నగరంలోని చైతన్యపూరిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాడుతున్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.36,210 నగదుతోపాటు ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చైతన్యపురిలోని ఓ ఇంట్లో యువకులు పేకాట ఆడుతున్నారని ఆగంతకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సదరు ఇంటిపై దాడి చేసి పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. -
పేకాటరాయుళ్లు అరెస్ట్: భారీగా నగదు స్వాధీనం
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం బొల్లకడియంలో14 మంది పేకాటరాయుళ్లను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 5.5 లక్షల నగదు, 13 సెల్ ఫోన్లతోపాటు 5 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ... దర్యాప్తు చేస్తున్నారు. -
పేకాటరాయుళ్లు అరెస్ట్: నగదు స్వాధీనం
చిత్తూర్తు : చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బోయకొండ గ్రామంలో 20 మంది పేకాటరాయుళ్లను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 2.6 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే 17 సెల్ ఫోన్లుతోపాటు 5 కార్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పేకాట స్థావరంపై దాడి.. ఐదుగురి అరెస్ట్
రాజాపేట: నల్లగొండ జిల్లా రాజాపేట మండలం నమిల గ్రామంలో ఓ పేకాట స్థావరంపై ఆదివారం అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాడ ఆడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 30 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ వీరయ్య తెలిపారు. -
పేకాటరాయుళ్లు అరెస్ట్: నగదు స్వాధీనం
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పాలకొండ బెల్లంకి వీధిలో పేకాటస్థావరంపై పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఈ సందర్భంగా 10 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 30 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పేకాటరాయుళ్లు అరెస్ట్ : రూ. 25 వేలు స్వాధీనం
ఒంగోలు : ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని పేకాట స్థావరంపై పోలీసులు గురువారం దాడి చేశారు. ఈ సందర్భంగా నలుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 25 వేల నగదు పోలీసులు స్వాధీనం చేసుకుని.... సీజ్ చేశారు. వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించి.. వారిపై కేసు నమోదు చేశారు. -
పేకాటరాయుళ్లు అరెస్ట్: నగదు స్వాధీనం
మెదక్ : మెదక్ జిల్లా గజ్వేల్ మండలం గిరిపల్లిలో బుధవారం పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. నలుగురు పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 56 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పేకాట స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి
హైదరాబాద్‌సిటీ: కందుకూరు పరిధిలో పేకాట స్థావరంపై ఆదివారం పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. అందిన సమాచారం మేరకు పోలీసులు పేకాటాడుతున్న ఏడుగురి అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ.35 వేల నగదు, 7 సెల్ఫోన్లు, రెండు సెట్ల కార్డులు, 3 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నంద్యాలలో పేకాటరాయుళ్లు అరెస్ట్
కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాలలోని మహానందీశ్వర ఆలయ సమీపంలో పేకాడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 32 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉప్పల్‌లో పోలీసుల తనిఖీలు
హైదరాబాద్: నగరంలోని ఉప్పల్‌లో పేకాట స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. గురువారం తనిఖీలు చేపట్టిన పోలీసులు 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ. 80 వేల నగదు, 16 సెల్ఫోన్లు స్వాధీనం చేసున్నారు. కేసు నమోదు చేసి నిందితులను ఉప్పల్ స్టేషన్‌కు తరలించారు. -
మూసపేటలో 12 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
హైదరాబాద్ : కూకట్పల్లి సమీపంలోని మూసపేటలో బుధవారం పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. 12 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 81 వేల నగదుతోపాటు తొమ్మిది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.